వ్యావహారిక ఉద్యమం ద్వారా తెలుగు భాషను సామాన్యులు దగ్గరకు కూడా తీసుకువెళ్లడంలోను గిడుగు రామమూర్తి పంతులు గారి సేవలు మరువలేనివని హెచ్ సియు తెలుగు శాఖపూర్వ అధ్యక్షులు ఆచార్య నడుపల్లి శ్రీరామ రాజు అన్నారు. ప్రతి ఏడాది గిడుగు రామ్మూర్తి పంతులు గారి జన్మదినమైన ఆగస్టు 29వ తేదీన తెలుగు భాషా దినోత్సవం గా జరుపుకుంటున్న నేపథ్యంలో మంగళవారం (30.8.2022) తెలుగు శాఖ, మానవీయ శాస్త్రాల విభాగం, హైదరాబాద్ విశ్వవిద్యాలయం వారు ' నేటి తెలుగు స్థితి-మనకర్తవ్యం' అనే అంశంపై ప్రత్యేక ప్రసంగాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించి, మన మాతృభాషతో ముడిపడిన మన సంస్కృతిని కాపాడుకోవాలంటే మనం తెలుగు భాషను కాపాడుకోవాలని, గిడుగు వారు తెలుగు భాషాభివృద్ధికి ఎంతో కృషి చేశారని దాన్ని మనం మరింత ముందుకు తీసుకొని వెళ్ళాల్సిన అవసరం ఉందని అన్నారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆచార్య నడిపల్లి శ్రీరామరాజు మాట్లాడుతూ గిడుగు రామ్మూర్తి గారి వ్యవహారిక ఉద్యమాన్నీ, తెలుగు, సవర భాషల కోసం ఆయన చేసిన కృషిని సవివరంగా వివరించారు. నేడు తెలుగు భాషను కాపాడుకోవడం అనేది కేవలం ఒక భాషోధ్యమమే కాకుండా అది ఒక సామాజిక ఉద్యమంగా మారిందని, అందువల్ల అందరూ ఈ ఉద్యమంలో పాలుపంచుకొని తెలుగు భాష అస్తిత్వాన్ని కాపాడుకోవాలన్నారు. బడుగుల కోసం తెలుగు భాష ఉపయోగపడేలా ఉద్యమాలు చేసిన మహానుభావుడు గిడుగు వేంకటరామమూర్తిగారని, ఆయన జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం ద్వారా తెలుగు భాషాభివృద్ధికి కృషిచేయవచ్చునని, ఆ విధంగా ఆయన జయంతిని తెలుగు భాషాదినోత్సవంగా జరుపుకోవడం వెనుక తాను, తనతో కలిసి పనిచేసిన తెలుగు భాషా సమాఖ్య సభ్యులు ఆచార్య చేకూరి రామారావుగారు, ఇతర సభ్యుల కృషిని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. మన భాషను కాపాడుకోవడమంటే దానితో ముడిపడిన సంస్కృతిని కూడా కాపాడుకోవడమేనని ఆయన వ్యాఖ్యానించారు. ప్రపంచీకరణ ఫలితంగా తెలుగు భాష అన్య భాషా పదజాలంతో నిండిపోతుందని, ఈ స్థితిలో తెలుగు భాషను కాపాడుకోవడానికి మనం కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వాటిని సోదాహరణంగా వివరించారు. ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేసిన సమన్వయకర్త డాక్టర్ డి. విజయ కుమారి మాట్లాడుతూ తెలుగు భాషా దినోత్సవం జరుపుకోవడం అంటే సమకాలీన సమాజంలో మన భాష స్థితిగతులను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవడమేనని అన్నారు. ఆత్మీయ అతిథిగా పాల్గొన్న భూమిపుత్ర సంపాదకులు అనంతపురం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు శ్రీ సాకే శ్రీహరి మూర్తి మాట్లాడుతూ తెలుగు భాషాభివృద్ధికి గిడుగు రామ్మూర్తి పంతులు చేసిన సేవ ను కొనియాడారు.ఆంగ్ల భాష నేర్చుకోవడం ద్వారానే ఉద్యోగావకాశాలు వస్తాయనేది ఒక అపోహేననీ, మన మాతృ భాష ద్వారా నే సృజనాత్మక శక్తి పెంపొందుతుందని ఆయన అన్నారు. ప్రభుత్వం తెలుగుభాషను నిర్లక్ష్యం చేస్తుండటం విచారకరమన్నారు. ఈ కార్యక్రమంలో ఆచార్య పిల్లలమర్రి రాములు, ఆచార్య జి.అరుణ కుమారి, ఆచార్య ఎం గోనా నాయక్, డాక్టర్ భూక్య తిరుపతి, డాక్టర్ బి. భుజంగ రెడ్డి, విద్యార్థినీ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తన డిపార్ట్మెంటుకి మరలా తాను రావడం తన కుటుంబసభ్యులతో కలిసినంత సంతోషంగా ఉందనీ, తమ విద్యార్థులు, మిత్రులు తెలుగు డిపార్ట్మెంటులో అధ్యాపకులుగా ఉండడాన్ని చూసి తనకెంతో సంతోషంగా ఉందనీ, ఈ కార్యక్రమానికి తనని పిలిచినందుకు తనకెంతో సంతోషంగా ఉందంటూ ఆచార్య నడుపల్లి శ్రీరామరాజుగారు ఉద్విగ్నతకు గురయ్యారు. అందర్నీ పేరుపేరునా పిలుస్తూ ఆత్మీయంగా మాట్లాడారు. ప్రత్యేక ప్రసంగం చేయడానికి ముందు తెలుగుశాఖలోని సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు కలిసి ఆచార్య నడుపల్లి శ్రీరామరాజుగార్ని ఘనంగా సత్కరించారు. ఆచార్య రాజుగారి పాండిత్యాన్నీ, పుస్తకాల్నీ, పరిశోధనలనూ, వారు సమాజానికి చేసిన కృషినీ, మరీ ముఖ్యంగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదు పరిసరప్రాంతాల్లో ఆయన నిర్వహించిన అక్షరాస్యతా కార్యక్రమాన్ని అందరూ గుర్తుచేసుకున్నారు. ఆయన అధ్యాపకులుగా పనిచేసేటప్పుడు ఆయన నిర్వహించిన తెలుగు భాషా చైతన్యానికి ఆయన చేసని అనేక కార్యక్రమాల్ని కూడా గుర్తుచేసుకున్నారు. తనకు జరిగిన సన్మానానికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఈకార్యక్రమంలో నాల్గవ సెమిస్టర్ విద్యార్థినీ విద్యార్థులు అందరూ పాల్గొన్నారు. తెలుగుశాఖ సమావేశమందిరం అంతా తెలుగు విద్యార్థులతో నిండిపోయింది. మొదటి సెమిస్టర్ విద్యార్థులు కూడా వచ్చిన తర్వాత మాలావత్ పూర్ణ, ఆనంద్ లను పిలిచి తెలుగుశాఖ ఆద్వర్యంలో యూనివర్సిటి వైస్ ఛాన్సలర్ చేతుల మీదుగా ఘనంగా సన్మానం చేస్తామని తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించిన డా.డి.విజయకుమారిగారు వందన సమర్పణ చేశారు.




.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)


.jpeg)
.jpeg)
.jpeg)



కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి