"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

26 అక్టోబర్, 2022

ఆచార్య దార్ల ఆత్మకథ ( నెమలికన్నులు) 14వ భాగం

''పప్పుసార్''



ఆరో తరగతి చదువుకోవడానికి ఎలాగోలా నన్ను మా వాళ్ళు కాట్రేనికోన హైస్కూల్ లో చేర్చారు.కానీ,‌ స్కూల్ కి వెళ్ళాలంటే  ప్రతి రోజూ ఏడు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి. మరలా ఏడు కిలోమీటర్లు నడుచుకుంటూ ఇంటికి రావాలి. 

మొదట్లో ఏదోలా వెళ్ళి వచ్చేసేవాణ్ణి. ఒక్కొక్క మైలురాయినీ దాటేస్తున్నానులే అనుకొంటుండేవాణ్ణి.నడవలేనప్పుడు నన్ను నేనే ఓదార్చుకొంటూ, నన్ను నేనే ఉత్సాహ పర్చుకొంటూ రోడ్డు ప్రక్కన కనిపించే మైలు రాళ్ళు లెక్కపెట్టుకొంటూ వెళ్ళి వస్తుండేవాణ్ణి. మధ్యలో అంటే గొరగనమూడి దాటి, సావరం వెళ్ళేసరికి నాతోపాటు మరికొంతమంది నడిచి వెళ్ళేవాళ్ళు కలిసేవారు. కొన్నాళ్ళకు వాళ్ళతో పరిచయం ఏర్పడ్డం వల్ల అక్కడికెళ్ళేసరికి నడక పెద్దబారమనిపించేదికాదు.

ఉదయం పదిగంటలకు స్కూల్ ప్రారంభమవుతుంది. ఆలస్యమైతే రానివ్వరు. టైమ్ టేబుల్ ప్రకారం ఫస్ట్ పిరియడ్ లెక్కలు గానీ ఇంగ్లీష్ గానీ ఉండేది. లెక్కలు చెప్పే మాస్టార్లు ఇద్దరు ఉండేవారు.ఒకాయన పేరు రాజుగారు. ఆయన అయినాపురం నుండి వచ్చేవారు. ఇంకొకరు సాంబశివరావు గారు. ఆయన కాట్రేనికోనలోనే ఉండేవారు. ఆయన లెక్కలుతో పాటు ఇంగ్లీష్ కూడా చెప్పేవారు.

 ఇద్దరూ కోపిస్టులే. కానీ, సాంబశివరావుగారి కొన్ని మాటలు నాకు ఎంతగానో నచ్చేవి. వాటిని వెంటనే ఆచరణలో పెట్టే వాణ్ణి కూడా! ఆయన మమ్మల్ని ప్రతిరోజూ టెక్టు బుక్ తీసుకొని రావాలనేవారు. ఎవరైనా తమ తల్లిదండ్రులు కొనివ్వలేదంటే, ఒకపూట అన్నం తినడం మానేయమనేవారు. ''రెండు మూడు రోజులకు మీరు భోజనం మానేయడం వల్ల వచ్చే డబ్బులతో పుస్తకం కొనివ్వమని'' అడగమనేవారు.

 నేను మా ఇంట్లో ఒకసారి అలాగే చెప్పాను. మా అమ్మానాన్న ఒకరినొకరు చూసుకొని, 'సరేలే రేపుకొనుక్కొస్తా'మని చెప్పారు. అప్పుడు 

''నాకు పుస్తకం కొనడానికి ఈవేళ నుండీ ఒకపూట తినడం మానేస్తాను. ఎన్నిరోజులు మానేస్తే నాపుస్తకాలన్నీ వస్తాయి?'' అని అడిగాను. 

'' నువ్వేమీ మానక్కర్లేదు…మేముకొంటాంలే'' అన్నారు. 

ఆ మాటలు నాకెంతో సంతోషాన్ని కలిగించాయి. ఆ రాత్రి కలలో కూడా ఆ కొత్త పుస్తకాలతో బడిలో కి వెళ్ళినట్లే వచ్చింది. 

అలా ఆయన మాట నా మనసులో బాగా ముద్రపడిపోయింది. తర్వాత ఆ పద్ధతిలోనే యూనివర్సిటీ కొచ్చిన తర్వాత కూడా నేను ఎన్నో కొనుక్కోగలిగాను. ఒక పూట టిఫిన్, మరోపూట భోజనం…ఇలా మానేస్తూ నేను అనేక పుస్తకాలు, పెన్నులు కొనుక్కున్నాను. వాటితో పాటు అనేక బట్టలు కూడా కొనుక్కోగలిగాను. 

ప్రాథమిక పాఠశాలలో త్రినాథరావుగారు మాకు చెప్పేటప్పుడు లెక్కలంటే ఎంతో ఇష్టంగా ఉండేది. హైస్కూల్లో చేరిన తర్వాత మాత్రం లెక్కల కంటే, ఆ మాస్టార్లు తిట్టే తిట్లే ఎక్కువగా గుర్తుండేవి.ఒక్కోసారి ఐదు నిమిషాలు ఆలస్యమైనా క్లాసుకి వెళ్ళాలనిపించేదికాదు. రకరకాలుగా తిట్టేవారు.కథలు చెప్పొద్దని కొట్టేవారు కూడా! 

రాజుగారు ఒకరోజు, బహుశా అది ఆయన తొలిక్లాసు అనుకుంటాను.ఆ క్లాసులో మీరేమేమి అవ్వాలనుకుంటున్నారని మిమ్మల్ని అందరినీ అడిగారు. పోలీసులని, ఉపాధ్యాయులనీ, కలెక్టర్, డాక్టర్…ఇలా  మా క్లాస్మేట్స్ తలోమాటా చెప్పారు. 

నన్ను కూడా అడిగారు. 

నేను ప్రొఫెసర్ అవ్వాలనుకుంటున్నానని చెప్పాను. ఆయన పెద్దగా వికటాట్టహాసం చేస్తూ ఒక నవ్వు నవ్వారు. 

నేనేమైనా తప్పుచెప్పానేమో అనుకొంటూ, నేనేమి చెప్పానో మళ్ళీ గుర్తు చేసుకున్నాను. మా పెద్దన్నయ్య నన్ను అలా అవ్వాలని చెప్పేవాడు.

 నాకు ప్రొఫెసర్ అంటే ఏమిటో తెలియదు. అదే పెద్ద మాస్టారు ఉద్యోగం అని అన్నయ్య పదేపదే చెప్పిన మాట మాత్రం గుర్తు. 

మరి మాస్టారెందుకలా నవ్వారని పంచాయతీ వాళ్ళు మా ఊరుకి వేసిన కరెంట్ స్తంభాలకు ఉండే వోల్టేజీ బల్బ్ లా నా ముఖం మాడిపోయినట్లయ్యింది.

 మా క్లాస్మేట్స్ కి ఏమర్ధమైయ్యిందో వాళ్ళు కూడా నన్ను చూసి నవ్వారు. 

ఆ రోజు నుండీ హాజరు వేసేటప్పుడు మాస్టారు నన్ను పిలిచేటప్పుడు'పప్పుసార్'' అనేవారు వెటకారంగా. 

 నేను అనవసరంగా అలా చెప్పానేమో, నేను కూడా ఏదో వాళ్ళంతా చెప్పినట్లు చెప్పేస్తే ఈ అవమానం ఉండకపోవునేమో అనుకునే వాణ్ణి. 

నేను బాధపడుతుంటే మా క్లాస్మేట్ మోకా అప్పాజీ నన్ను ఓదార్చాడు. తర్వాత మరికొంతమంది నన్ను దగ్గరకు తీసుకున్నారు. మా క్లాస్మేట్స్ లో చాలా మందిని వాళ్ళపేర్లనూ వంకరగా పిలవడం, హోం వర్క్ లెక్కలు చెయ్యకపోతే కొట్టడం లాంటివాటి వల్ల ఆ మాస్టారంటే కోపంగా ఉండేవారు. అయినా ఆయన్ని చూస్తే అందరికీ భయం భయంగా ఉండేది. 

నాకైతే ఆ లెక్కలు సబ్జెక్టు తీసేస్తే బాగుండేదనిపించేది. 

ప్రతి రోజూ స్కూల్ కి బయలు దేరిన దగ్గరనుండి వెళ్ళేవరకూ ఆ లెక్కల మాస్టార్లే గుర్తొచ్చేవారు. అలాంటప్పుడు ఒక్కోసారి 

ఆకాశంలో ఎగిరే పక్షుల్ని చూస్తూ, నాకు కూడా రెక్కలుంటే బావుణ్ణనుకునేవాణ్ణి.   ఆ మాస్టార్ల తిట్టులు తప్పేవనుకునేవాణ్ణి. అంతలోనే తెలుగు మాస్టారు శ్రీకంఠం లక్ణ్మణమూర్తిగారి కమ్మని పద్యం గుర్తొచ్చేది.

ఆతుకూరి లక్ష్మణరావు గారి ప్రోత్సాహం కొత్త ఉత్సాహాన్నిచ్చేది. అయినా అప్పుడప్పుడూ మళ్ళీ

నాకు కూడా మా పంచాయితీ పరిధిలోనే సీటు దొరికితే నాకిన్ని కష్టాలు వచ్చేవి కాదు కదా…

సీటు నాకే ఎందుకు దొరకలేదనిపించేది. 

నాతో చదివిన మా ఊళ్ళోని మిగతావాళ్ళందరికీ దొరికి నాకే సీటెందుకు దొరకలేదనే ప్రశ్న నేను నడవలేనప్పుడల్లా నాకనిపించేది. 

నా ఆశల్ని మొగ్గలోనే తుంచేయాలని  వాళ్ళు ప్రయత్నించారు.

నా ఆశల్ని ఆకాశమంత ఎత్తు ఎగరేయాలని నేను 

కొట్టిన బంతిలా పైపైకి  ప్రయత్నించాను.

వాళ్ళు నన్ను ముళ్ళపొదల్లోకి విసిరేశామనుకున్నారు

పూలమొక్కల్లో ఓ పూలమొక్కనై గుభాళించాను.


(సశేషం)

  • ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు

తెలుగు శాఖ అధ్యక్షులు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, హైదరాబాద్

ఫోన్: 9182685231



భూమి పుత్ర దినపత్రిక, 26.10.2022 సౌజన్యంతో 



కామెంట్‌లు లేవు: