"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

12 అక్టోబర్, 2022

ఆచార్య దార్ల ఆత్మకథ ( నెమలికన్నులు) 12 వ భాగం

పేగుబంధం 

మాకు ఇంటర్వెల్ బెల్ కొట్టినప్పుడు కిలకిలమంటూ మా పిల్లలంతా పంజరంలోని చిలుకల్లా ఉరుక్కొంటూ బయటకొచ్చే వాళ్ళం. 

మాలో కొంతమందేమో ఆడుకొనే వారు. ఇంకొంతమందేమో బయట కానూరి వాళ్ళ మిఠాయి కొట్టువైపు వెళ్ళేవారు. 

అలా మా పిల్లల కళ్ళల్లో మెరుపులు మెరుస్తూ ఆడుకొంటుంటే,  బడి ఎదురుగానే ఉన్న ఒక ఇంటిలో ధనమ్మగారు కూడా గబగబా బయటకొచ్చి మమ్మల్నే చూస్తుండేవారు. ఆమె కళ్ళల్లో మమ్మల్ని చూసినప్పుడల్లా ఏదో కోల్పోయిన వెలితికొట్టొచ్చినట్లుకనబడేది.

మళ్ళీ బెల్లవగానే మేము క్లాసులోకి వెళ్ళిపోతుంటే ఆమె మాత్రం మమ్మల్నే చూస్తూ భారంగా లోపలికెళ్ళేది.

  ఆమెను అలా చూసినప్పుడల్లా నాకు మా అమ్మ చెప్పిన మాటలు గుర్తొస్తుండేవి. తెలియని వాళ్ళెవరైనా పిలిస్తే వెళ్ళొద్దనీ, పిల్లల్ని ఎత్తుకుపోయి అమ్మేస్తారని చెప్పిన మాటలు నా చెవుల్లో పదేపదే గింగర్లు తిరిగేవి. 

అందరూ బడిలోకి వెళ్ళేదాకా ఆమెనే చూస్తూ నేనూ లోనికెళ్ళిపోయేవాణ్ణి. కానీ, నా ఆలోచనంతా ఆమె అలా ఎందుకు చేస్తుంది? ఆమె ఎందుకలా చూస్తుంది? ఆమె నిజంగా పిల్లలన్ని ఎత్తుకొనిపోవడానికే చూస్తుందేమో!

 ఒకరోజు మా అమ్మకు చెప్పాను. ఆమె అలా ఎందుకు చేస్తుందని అడిగాను. 

భూమిపుత్ర దినపత్రిక, 12.10.2022 సౌజన్యంతో 

ఆమెకు పిల్లలు‌ లేరనీ, వాళ్ళాయన ఆమెను వదిలేశాడనో, చనిపోయాడనో చెప్పింది. 

ఆమె మహాపిసినారనీ, గయ్యాళనీ అందరూ చెప్పుకుంటారు. 

ఆమెకెవరూ బంధువులు కూడా లేరని కూడా అమ్మ చెప్పింది. 

ఆ మాటలు విన్న తర్వాత నాకెందుకో బాధనిపించింది. ఆ మర్నాడు ఇంటర్వెల్ సమయంలో ఓ తూనీగను పట్టుకొంటూ పట్టుకొంటూ వాళ్ళింటికెదురుగా వెళ్ళిపోయాను. 

నన్ను చూసి ఆ ధనమ్మగారు దగ్గరకు రమ్మని పిలిచారు. ఆ మాట నాచెవుల్లోకి చేరిందోలేదో నాకు ఒక్కసారి గుండెల్లో ఏదో గుబులనిపించింది. భయం భయంగా ఆమె వైపు చూస్తున్నాను. కానీ, అక్కడ నుండెలా పారిపోవాలని నాకళ్ళేమో పక్కదారులన్నీ వెతుకుతున్నాయి.ఇంతలోనే ''ఇటురమ్మన్నానా'' ఆ గర్జించినట్లనిపించిన ఆ గొంతు వినేసరికి నాకు తెలియకుండానే నాకాళ్ళు ఆమె దగ్గరకు నడిచివెళ్ళిపోయాయి. 

'' ఏమీలేదబ్బాయ్…నాకో వడ్డీ లెక్క చేసిపెట్టాలి. నీకేమైనా వచ్చాం?'' అని అడిగారామె నా కళ్ళల్లోకే చూస్తూ!'' 

''ఆ కొన్ని లెక్కలొచ్చండీ…కానీ,అన్నీరావు'' అన్నాను నెమ్మదిగా. 

ఎవరెవరికో ఐదువందలు, వెయ్యి రూపాయలు చొప్పున ఇచ్చారట.‌ ముందు ఆ‌ పేర్లన్నీ ఓ కాగితం మీద రాయించుకున్నారు. ఇంటర్వెల్ బెల్ మళ్ళీ కొట్టారు. గబగబా మళ్ళీ మాబడిలో కి వచ్చేశాను. 'అమ్మయ్య' అనుకొంటూ ఒక నిట్టూర్పు విడిచాడు.

ఇక ఆరోజు నుండీ ఆమె టైమున్నప్పుడల్లా నన్ను పిలిచి లెక్కలు రాయించుకొనేది. నేనెవరో ఆమెకు తెలుసు. మీనాన్నెంత మంచోడో… మిమ్మల్ని బాగా చదివిస్తున్నాడు…'' అంటూ ఇంట్లో నుంచి ఏదైనా తినడానికి తెచ్చేవారు. నాకు తినాలంటే భయమేసేది. ఆ సంగతిని గమనించి ''నేనేమీ మందుపెట్టెయ్యలేదురా...ఇదిగో నేను కూడా తింటున్నాను… చూడు'' అంటూ కొంచెం తాను కూడా తినేది. 

దానితో నాకు నమ్ముకమొచ్చి నేనూ తినేవాణ్ణి. 

నేను తింటున్నంతసేపూ ఆమె కళ్ళల్లో కొత్త కాంతులేవో కనిపించేవి. ''రోజూ రా…రా..లెక్కలు చెయ్యడానికే కాదులే…ఏవైనా తిని వెళ్దువుగానీ…'' అంటున్నప్పుడల్లా ఆమె ఎంతో ఉద్వేగంతో, సంతోషంగా కనిపించేది. 

ఆమెను చూసినప్పుడల్లా దేవుడామెకు పిల్లల్నెందు లేకుండా చేశాడోనని మనసంతా ఏదో బాధగా మూలుగుతున్నట్లనిపించేది. 

వాళ్ళింటి దగ్గర నుంచి నేను వచ్చేస్తుంటే ఆమె కళ్ళల్లో ఏవో అనురాగబంధాలేవో  నావైపే ప్రవహిస్తున్నట్లనిపించేది. 

అమ్మతనానికి కుల మతాలతో సంబంధమే ఉండదేమో!


మాకు హెడ్మాస్టర్ త్రినాథరావుగారు లెక్కలు చెప్పేవారు. ఆయన చెప్పేవిధానం మాకు బాగా నచ్చేదీ. ఎప్పుడన్నా చాక్ పీసులు లేవంటే మేము అప్పుడప్పుడూ దాచుకొనేవి తెచ్చి ఇచ్చి మరీ లెక్కలు చెప్పించుకొనేవాళ్ళం. 

నేను లెక్కలు రాయడాన్ని ఆ ధనమ్మగారు చాలా మందికి చెప్పేది. ఒకసారి ఆ లెక్కల్ని మా త్రినాథరావు మాస్టారు గారి దగ్గరికొచ్చి చూపించారు కూడా. ఆయన వాటిని చూసి నన్ను దగ్గరకు రమ్మని పిలిచి మెచ్చుకున్నారోసారి. ఇహ ఆ రోజు నా సంతోషానికి అవధుల్లేవంటే నమ్మండి.. అలాంటి సంతోషమే మా మేనత్త సత్తెమ్మ కు ఓ ఉత్తరం కార్డు వచ్చినప్పుడు నన్ను చదివి వినిపించమన్నప్పుడు పొందాను.. అది చదివిన తర్వాత నన్ను ముద్దులు పెట్టేసుకొని '' మా మేనల్లుడు ఉత్తరం చదివేస్తున్నాడు తెలుసా'' అని అక్కడున్న వాళ్ళకందరికీ ఎంతో సంతోషంగా చెప్పింది. 

ఆమెకు పిల్లలు లేరు. 

మా నాన్నకి ఆమె స్వయానా చెల్లెలు. మాకు నలుగురు మేనత్తలు ఉన్నారు. వాళ్ళందరినీ ఇంచుమించు మా ఊరులో మా పేటలోనే ఇద్దరినిచ్చి పెళ్ళి చేశారు.

మరొకరిని మా ఊరికి దగ్గరలోనే సోమిదేవరపాలెంలోనూ, ఇంకొకరిని నంగవరంలోనూ ఇచ్చి పెళ్ళి చేశారు. 

మిగతా వాళ్ళలో మా ఇంటికి పడమర వైపు మూడు ఇళ్ళ తర్వాత మా మేనత్త సత్తెమ్మనూ, మా ఇంటికి తూర్పు వైపు ఐదు ఇళ్ళ దూరంలో వెర్మమ్మ అత్తనూ  ఇచ్చి పెళ్ళి చేశారు. 

మా పెద్దమేనత్త సత్తెమ్మకు తప్ప మిగతావాళ్ళందరికీ పిల్లలు ఉన్నారు. మా ఇంట్లో ఏదైనా కార్యక్రమం జరిగితే వాళ్ళందరూ వచ్చేసేవారు. మా పేటలో ఉన్నవాళ్ళు కూడా ఇంచుమించు మాకు బంధువులే. 

మా మేనత్తలకు ఆడపిల్లలు, మగ పిల్లలు ఉండేవారు. మా వెర్రమ్మ అత్తకు ఇద్దరు మగపిల్లలు, ఒక ఆడపిల్ల. మా ఇళ్ళన్నీ దగ్గరే కావడం వల్ల వాళ్ళింటికి మేమూ, మా ఇంటికి వాళ్ళో వచ్చి ఆడుకుంటూ ఉండేవాళ్ళం. 

కానీ మా పెద్ద మేనత్త సత్తెమ్మకు పిల్లలు లేకపోవడంతో నాన్న చాలా బాధపడేవాడు. మా అందరిలో కంటే నన్నెందుకో ఆమె బాగా చూసుకొనేది. నన్ను వాళ్ళింటిలోనే పడుకోమనేది. అప్పుడప్పుడూ పడుకొనే వాణ్ణి కూడా. నన్ను మా మేనత్త ఒడిలోనే వేసుకొని నాకు అవి తెస్తామనీ, ఇవితెస్తానని చెప్పేది. మంచి మంచి బట్టలు తెస్తాననేది. 

సరే అనే వాణ్ణి. 

కానీ, మా కుటుంబం నుండి నన్నెరో దూరం చేస్తున్నట్లనిపించేది. మధ్య రాత్రిలో మా చెల్లినెవరో ఎత్తుకుపోతున్నారని ఏడ్చేవాణ్ణి. నేను అర్జెంటుగా మా చెల్లిని చూడాలని కూడా ఏడ్చేసేవాణ్ణి. అప్పుడది అర్ధరాత్రి పూటైనా సరే మళ్ళీ మా ఇంటికి తీసుకొచ్చి ఒప్పజెప్పి వెళ్ళేవారు. 

అంతే నాకెంతో సంతోషం… మా చెల్లి, తమ్ముడు…మేమంతా ఒకే దుప్పట్లో దూరి ఏవేవో కథలు చెప్పుకునే వాళ్ళం. నవ్వుకునే వాళ్ళు. గిచ్చుకునేవాళ్ళం…కొట్టుకునే వాళ్ళం… అదో ఆనందం.అదో అద్భుతమైన ప్రపంచం.

అందుకే  నేను వాళ్ళింటి లో పడుకోవాలంటే మా అమ్మనీ, నాన్ననీ, చెల్లినీ, తమ్ముణ్ణీ, అన్నయ్యవాళ్ళనీ వదిలేసి ఒంటరిగా పడుకోబుద్ధేసికాదు. 

కానీ, పిల్లలు లేని వాళ్ళను చూస్తేమాత్రం వాళ్ళింటిలోనే ఉండిపోతే బాగుంటుందేమో అనీ కూడా అనిపించేది.

 నేను క్రమేపీ మా మేనత్త ఇంట్లోకి అలవాటు అవుతున్నానిపించుకొని, మా అమ్మ నన్ను వాళ్ళింటికి వెళ్ళొద్దని చెప్పేది. నా గురించి మా అమ్మకూ, మా మేనత్తకూ ఎప్పుడూ ఏదొక విధంగా గొడవలైపోయేవి. ''నెమ్మదిగా నాకొడుకుని ఎరేసి నాకు దూరం చేద్దావనుకుంటున్నావేమో…అవేమీ సాగవు. నాకు ఐదుగురు పిల్లల్లో ఒక్కళ్ళు దూరమైనా నాకు ఐదుగురూ లేనట్టే అనిపిస్తుంది. నాకొడుక్కేమి మందు పెట్టేస్తున్నావో…నీ ఆటలే వీ సాగవు..'' అంటూ నన్ను సంకని వేసుకొని మా ఇంటికి తీసుకొచ్చేసేది మా అమ్మ.

 మా మేనత్త కూడా తగ్గేది కాదు. వాడు నా మేనల్లుడు. నా అన్నయ్యకొడుకు. నా అన్నయ్యే ఏమీ అనట్లేదు. నువ్వేంటి... నీదే అంతా హక్కు అన్నట్లు మాట్లాడుతున్నావ్'' అంటూ నన్ను లాక్కొనేది. 

వాళ్ళ గొడవలు నాకేమీ అర్ధమయ్యేవి కాదు. నాన్న కూడా మౌనంగా ఋషిలా చూస్తుండిపోయేవాడు. 

తల్లికాని తల్లి యశోధ దగ్గర పెరుగుతున్న చిన్ని కృష్ణుణ్ణి చూసి కన్న తల్లి దేవకీదేవి ఎలా ఫీలయ్యిందో తెలియదు కాని, మా అమ్మ మాత్రం నన్ను విడిచి ఉండలేకపోయిందనేది మాత్రం నిజం.

ఒకవైపు పేగు బంధం, మరొకవైపు పేగు బంధం కాలేకపోయిన వారి మానసిక సంఘర్షణను మాటల్లో చెప్పగలమా! 

(సశేషం)

  • ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు

తెలుగు శాఖ అధ్యక్షులు,

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, హైదరాబాద్

ఫోన్: 9182685231



కామెంట్‌లు లేవు: