"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

18 September, 2022

ఆచార్య దార్ల ఇంటర్వ్యూ.. భూమి పుత్ర 18.9.2022

 తెలుగు భాషా సాహిత్యాల భవిష్యత్తు అంతా ప్రభుత్వ విధానాలతోనే ముడిపడి ఉంది.

  • హెచ్సీయు తెలుగుశాఖ అధ్యక్షుడు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వ్యాఖ్య


తెలుగు శాఖ అధ్యక్షులుగా పదవీ బాధ్యతలు స్వీకరించి ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గార్కి ఏడాది పూర్తయిన సందర్భంగా భూమిపుత్ర తెలుగు దినపత్రిక సంపాదకులు శ్రీ సాకే శ్రీహరి మూర్తి గారు చేసిన  ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు. 

తెలుగు మాతృ భాషగా ఉన్న రెండు రాష్ట్రాల్లోని విద్యార్థులకు ఎం.ఏ., పిహెచ్.డి. పోస్ట్ డాక్టోరల్ పరిశోధనలు చేయడానికి హైదరాబాద్ లో ఉన్న ఒక ఏకైక  సెంట్రల్ యూనివర్సిటీ పేరు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. దీంట్లో  ఎంతోమంది ప్రసిద్ధి చెందిన ఆచార్య కొత్తపల్లి వీరభద్రరావు, ఆచార్య కే.కే రంగనాథాచార్యులు, ఆచార్య  జీ.వి. సుబ్రహ్మణ్యం, ఆచార్య రవ్వా శ్రీహరి, ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య, ఆచార్య పరిమి రామ నరసింహం, ఆచార్య బేతవోలు రామబ్రహ్మం, ఆచార్య ఎన్.ఎస్.రాజు, ఆచార్య ఎస్.శరత్ జ్యోత్స్నారాణి, ఆచార్య తుమ్మల రామకృష్ణ, ఆచార్య జి.అరుణకుమారి తదితరులెంతోమంది  తెలుగుశాఖ అధ్యక్షులుగా పనిచేశారు. ఇప్పుడు అదే శాఖలో చదువుకొని, అక్కడే అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉద్యోగంలో చేరి అంచెలంచెలుగా శాఖాధ్యక్షులుగా పదవీ బాధ్యతలు చేపట్టి విజయవంతంగా ఒక ఏడాది కాలాన్ని పూర్తి చేయడమే కాకుండా తన తండ్రి గారి పేరు మీద సెంట్రల్ యూనివర్సిటీ తో సహా మరికొన్ని విద్యాసంస్థల్లో మెమోరియల్ మెడల్ అందిస్తూ తెలుగు విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారితో భూమిపుత్ర మాట్లాడినప్పుడు అనేక విలువైన విషయాల్ని వివరించారు.

  •  కరోనా మహమ్మారి క్రమేపీ తగ్గుముఖం పడుతున్న సమయంలో ఒకవైపు ఆన్లైన్ లోనూ, మరొకవైపు ఆఫ్ లైన్ లోనూ పాఠాలు బోధించాల్సిన ఒక క్లిష్టమైన దశలో ఆయన శాఖాధ్యక్షులుగా పదవీ బాధ్యతలు స్వీకరించి, శాఖనెలా నడుపుకొచ్చారో వివరించారు. 

  • తగినంత నాన్ టీచింగ్ లేకపోయినా, కరోనా సమయంలో ప్రతిరోజూ ఆఫీసుకి వెళ్ళి విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా స్కాలర్ షిప్ లను, సెమిస్టర్ రిజిస్ట్రేషన్ సమస్యలను, పరీక్షలను  విజయవంతంగా నిర్వహించిన తీరునంతా వివరించారు. 

  • సివిల్ సర్వీసెస్ లో తెలుగు

  • ప్రస్తుతం సివిల్ సర్వీసెస్ లో  తెలుగు సాహిత్యాన్ని ఒక ఆప్షనల్ గా తీసుకుంటున్నవారి సమస్యలు, వాటి పరిష్కారాలకు వివిధ సూచనలు చేశారు. అత్యున్నత స్థాయిలో నిర్వహించే సివిల్ సర్వీస్ వంటి పరీక్షల పత్రాల రూపకల్పన, మూల్యాంకన, ఇంటర్వ్యూలను నిర్వహించడం వంటి వారిని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలని సూచించారు. ఎప్పుడు ఎవరు ప్రశ్నాపత్రాన్ని ఇస్తున్నారో అభ్యర్థులు ఒక అంచెనాకు రాకూడదు. అందువల్ల ఆ సంస్థలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. 

  • జాతీయ విద్యా విధానం- తెలుగు

  • 2020 నుండీ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జాతీయ విద్యా విధానం (National Education Policy - NEP) లో తెలుగు స్థితిగతులను తెలిపారు. సంప్రదాయ విద్యావిధానంలో అనేక మార్పులు తీసుకొస్తున్నారు. అయితే, ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థల్లో ఒకే రకమైన విద్యావిధానం ఉండాలి. పిల్లల్ని బడిలో చేర్చేదగ్గర నుండి సిలబస్ రూపకల్పన వరకూ వీటిలో ఏకరూపత సాధించాలి. వృత్తి పరమైన, విలువల ఆధారితంగా జాతీయ విద్యావిధానం రూపకల్పన జరిగినా, దాన్ని అమలులో జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఈ జాతీయ విద్యావిధానంలో కొన్ని లోపాలు సామాజికంగా కింది వర్గాలకు కొన్ని నష్టాలు కలిగించేవి కూడా ఉన్నాయి. వాటిని మేధావులు పున: పరిశీలన చేయాల్సిన అవసరం కూడా ఉందన్నారు. ఈ విద్యావిధానం పై వస్తున్న వ్యతిరేకత కేవలం భావజాల పరమైనదే కాకుండా, కొన్ని సామాజిక వర్గాలను విస్మరించే ప్రమాదాన్ని పసిగట్టిన వ్యతిరేకతలని గుర్తించాలన్నారు.

  • ఆంగ్లమాధ్యమాలు- తెలుగు పరిస్థితి

  • దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో తెలుగు పరిస్థితినీ, మాతృభాషలు అంతరించిపోతూ ఆంగ్ల భాష తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న ప్రస్తుత తరుణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను, చేయాల్సిన కర్తవ్యాన్నీ  విశ్లేషణాత్మకంగా వివరించారు. ప్రయివేటు విద్యాసంస్థల్లో ఉన్నత వర్గాలవారు చదువుతూ, వాళ్ళకి ఆంగ్ల విద్యావిధానం, ప్రభుత్వ విద్యాసంస్థల్లో మాతృభాషల పేరిట తెలుగు మాధ్యమాలు పెట్టినప్పుడు కొన్ని వర్గాలు తీవ్రంగానే వ్యతిరేకిస్తాయని, దాన్ని గుర్తించే స్థానిక ప్రభుత్వాలు ఆంగ్ల మాధ్యమాల్ని ప్రవేశపెడుతున్నాయనీ అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రభుత్వ సంస్థల్లో ఆంగ్ల మాధ్యమాల్ని ప్రవేశపెట్టడం సరైనదేనని ఆ విధానాల్ని సమర్థించారు. అయితే, ఇంగ్లీషుతో పాటు తెలుగు మాధ్యమాన్ని కూడా కొనసాగించాలన్నారు. అలాగే, సంస్కృతం లేకుండా తెలుగు మనజాలని పరిస్థితి ఉంది. కనుక, సంస్కృతం కూడా ఉండాలి. కానీ, తెలుగుని తొలగించి, దాని స్థానంలో సంస్కృతాన్ని ప్రవేశపెట్టడం మంచిది కాదన్నారు.

  • తెలుగు విద్యార్థులకున్న ఉపాథి అవకాశాలు

  • మారుతున్న ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల నేపథ్యంలో తెలుగు విద్యార్థులకున్న ఉపాథి అవకాశాలు, వారు భవిష్యత్తులో ఎదుర్కోబోతున్న సవాళ్ళను, వాటిని అధిగమించడానికున్న మార్గాల్ని చర్చించారు. మీడియాలో అనేకఅవకాశాలున్నాయన్నారు. దీనితో పాటు ప్రపంచీకరణ స్వభావం రీత్యా తమ ఆలోచనల్ని తమ మాతృభాషలోనే శక్తివంతంగా చెప్పగలిగే సృజనాత్మకతను సాధిస్తే, ఆంగ్లం, ఫ్రెంచ్ వంటి భాషలతో తెలుగు కూడా పోటీ పడే అవకాశం ఉంది. తెలుగు కి గూగుల్, మైక్రోసాఫ్ట్ చేస్తున్న సేవలు విస్మరించలేనివి. శాస్త్ర పరిభాష తెలుగులోకి వస్తే, అనువాదాల్లో కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోను తెలుగు మాట్లాడే వారే అధికం. కనుక, వారి భాషలోనే అన్ని ఉత్పత్తుల్నీ అందించే ప్రయత్నాలు జరిగితే దాని వల్ల కూడా అనేక ఉపాథి అవకాశాలు ఉంటాయి. తెలుగు పండిట్, తెలుగు లెక్చరర్స్ ఉద్యోగాలు అనేకం ఉన్నాయి. వాటిని ఎప్పటికప్పుడు నింపుతుండాలి. కోర్టులు కూడా తెలుగులో తీర్పులు వెల్లడించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు భాష అమలు కోసం సమర్థవంతంగానే కృషి చేస్తుందని వ్యాఖ్యానించారు. అయితే, ఇంగ్లీషు మీడియం పెట్టడం వల్ల కొంతమంది కావాలనే తెలుగుని విస్మరిస్తున్నారనే విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. 

  • విద్యావ్యవస్థ - ప్రభుత్వ, ప్రయివేటు విధానాలు:

  • రోజు రోజుకీ ప్రభుత్వాలు విద్యారంగాన్ని విస్మరిస్తూ, పోటీ వ్యవస్థగా ప్రయివేటు విద్యాసంస్థల్ని ప్రోత్సాహించడంలో గల ఆంతర్యాన్నీ వివరించారు. ప్రభుత్వ విద్యాసంస్థలన్నీ మానవవనరుల్ని అభివృద్ధిచేయడంలో విశేషమైన కృషి చేయాలి. వాటి ఫలితాలు వెంటనే కనిపించకపోవచ్చు. కానీ, సాహిత్యం, భాష, కళలు, సామాజికశాస్త్రాలు వంటి వాటిని ప్రభుత్వ విద్యాసంస్థలే కొనసాగించాలి. ప్రయివేటు విద్యాసంస్థలు విద్యను కూడా ఒక వ్యాపారంగా చూస్తాయి. సత్వర ఉపాథి అవకాశాల పైనే దృష్టి పెడతాయనీ, దాని వల్ల మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగాను, యాంత్రిక సంబంధాలుగాను మారిపోతాయని వ్యాఖ్యానించారు. ఇంజనీరింగ్, వైద్య రంగాలపై చూపిస్తున్న ఆసక్తిని ప్రయివేటు విద్యాసంస్థలు ఇతర శాఖలపై చూపించడం చాలా అరుదు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రయివేటు విద్యాసంస్థల్ని కూడా విలువల ఆధారిత విద్యను కొనసాగించేలా ఆదేశించాలి. కానీ, దురదృష్టమైన విషయం ఏమిటంటే, విద్యారంగంలో రాజకీయాలు ప్రవేశించాయి. పాలకులు, వారి బంధువులు ఇంజనీరింగ్, వైద్య విద్యాసంస్థల్ని నిర్వహిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఒకప్పుడు నిజాయితీగా జరిగేవి. నేడు ధనమయంగా ఎన్నికల వ్యవస్థమారిపోయింది. ఓటర్లను కూడా డబ్బుతో ప్రభావితం చేస్తున్నారు. అందువల్ల రాజకీయవేత్తలు లేదా పార్టీలు కూడా ప్రయివేటు విద్యాసంస్థల నుండి భారీ విరాళాల్ని తీసుకుంటున్నాయి. అందువల్ల విద్యారంగంలో ప్రయివేటు విద్యాసంస్థల యాజమాన్యాల విధానాలే ప్రభుత్వ విధానాలుగా ప్రకటితమవుతున్నాయనీ, ప్రభుత్వ సంస్థల్ని నిర్లక్ష్యం చేస్తున్నారనీ తీవ్రంగానే విమర్శలు వస్తున్నాయి. వీటిలో నిజం లేకపోలేదు. వైద్యరంగంలో సీట్లు పెంచుకోవడం వెనుకున్న రాజకీయాలు సామాన్యులకు కూడా అర్థమవుతున్నాయి. అదే ప్రభుత్వం అధీనంలో సీట్లు పెరుగుతున్నాయా? కొత్త వైద్యవిద్యాసంస్థలు ఏర్పడుతున్నాయా? ఇటువంటివన్నీ మన మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో జరుగుతూనే ఉంటాయి. ప్రయివేటు విద్యాసంస్థలతో పార్టీలకు, ప్రభుత్వంలో ఉన్న వారి బంధువులకు సంబంధం లేకుండా చూడగలిగితే ప్రభుత్వ విద్యాసంస్థలు బలోపేతం జరుగుతాయన్నారు. 

  • పురస్కారాలు- తెలుగు కవులు, రచయితలు

  • మరొకవైపు తెలుగు కవులు, రచయితలు వివిధ ప్రభుత్వ, ప్రయివేటు సంస్థల ద్వారా అందుకుంటున్న పురస్కారాల తీరు తెన్నుల్ని సమీక్షించారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో సరైన వాళ్ళకు గుర్తింపు లభించకపోవచ్చు. కొన్ని రాజకీయాలు ఈ రంగంలోనూ ప్రవేశించాయి. కులం, మతం, ప్రాంతం, లింగం వంటి విభాగాల్ని చూడాలి. కానీ దురదృష్టమేమిటంటే పొందిన వర్గాలే మళ్ళీమళ్ళీ ఆ పురస్కారాల్ని పొందుతుంటారు. వాళ్ళ బంధువులు, ఆశ్రితులు మాత్రమే వాటిని అందుకుంటున్నారనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయివేటు సంస్థలుకూడా ఈరంగంలో ప్రవేశించి తమ శక్తికొలదీ పురస్కారాల్ని, సత్కారాల్నీ చేస్తున్నాయి. జరగనివ్వండని అన్నారు.

  •  మాతృ భాషలు అంతరించి పోవడం- తెలుగు పరిస్థితి

  • ఒకవైపు మాతృభాషలు అంతరించిపోతున్నాయని ఐక్యరాజ్యసమితి మొత్తుకుంటున్నా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ మృతభాషగా ఉన్న సంస్కృత భాషను బ్రతికించేందుకు జరుగుతున్న చర్యల వెనుకున్న కారణాల్నీ పేర్కొన్నారు. సామాన్య ప్రజల్లో వ్యవహారంలో ఉన్న ఏ భాషా అంత సులభంగా, వేగంగా అంతరించదు. కానీ, ప్రభుత్వ చర్యల వల్ల కూడా క్రమేపీ మాతృభాషలు అంతరించిపోయే ప్రమాదం లో పడతాయన్నారు.

  • ఒకే బృందం తెలుగు పరీక్షల రూపకల్పన - తెలుగుకు అనర్థం

  • దేశవ్యాప్తంగా ఉన్న తెలుగు విద్యార్థులు యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ ( UGC) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF) పరీక్షల్లో రావాల్సిన మౌలికమైన మార్పుల్ని తెలియజేశారు. వీటిలో కూడా మౌలికంగా మార్పులు రావాలి. ఒకే బృందం వాళ్లు అనేక సంవత్సరాల పాటు సెలక్షన్స్ కి వెళ్ళడం, పరీక్ష పత్రాల్ని రూపొందించడం, మూల్యాంకనలు చేయడం సరైంది కాదన్నారు. 

  •  NTA పరీక్షలు- ప్రశ్నార్థకంగా మారిన స్వయంప్రతిపత్తి

  • దీనితో పాటు విశ్వవిద్యాలయాల స్వయంప్రతిపత్తిని ప్రశ్నార్థకం చేసేలా ప్రవేశ పరీక్షలు నిర్వహించడానికి మందుకొచ్చిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)లలో తెలుగు పరీక్షల నిర్వహణకు సంబంధించిన వివిధ అంశాలపై తన అభిప్రాయాల్ని స్పష్టం చేశారు.  ఈ ఏజెన్సీ ద్వారా కూడా జరుగుతున్నదీ సివిల్స్, రీసెర్చ్ ఫెలో షిఫ్ ల లో ఉన్న బృందాలే సర్వసాధారణంగా ఉంటున్నాయి. అయితే, మిగతా వాటికంటే దీనిలో కొంత శాస్త్రీయత ఉందన్నారు. కానీ, అన్నీ ఒకే సంస్థ ద్వారా జరగడం కొన్ని అనర్థాలకు దారితీస్తుందన్నారు. విశ్వవిద్యాలయాల స్వయంప్రతిపత్తికి ఇదొక ఆటంకంగాను, ప్రమాదకరంగాను పరిణమించే అవకాశం ఉందన్నారు. కేవలం ఆర్థిక అంశాలు మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం సరికాదన్నారు. స్థానిక సంస్కృతి, చరిత్ర వంటి విషయాలు ఈ సంస్థ ద్వారా విస్మరణకు గురయ్యే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించారు. విశ్వవిద్యాలయాల్లో నిరంతర పరిశోధనలు, మౌలికవిషయాలపై అభివృద్ధి జరగాలంటే స్వయంప్రతిపత్తిని పోగొట్టకూడదన్నారు. నిజమైన మానవ వనరుల అభివృద్ధి పరిశోధన సంస్థల వల్లనే జరుగుతుందన్నారు.

  • పరిశోధన పత్రికల ప్రచురణ బాధ్యత ప్రభుత్వానిదే:

  • ప్రస్తుతం తెలుగు భాషా సాహిత్యాల్ని ప్రచురిస్తున్న పత్రికలు, పరిశోధన పత్రికలు, వెబ్సైట్ తదితర అంశాలపై తన విలువైన అభిప్రాయాలను సోదాహరణంగా వివరించారు. కొన్ని పత్రికలు పరిశోధన వ్యాసాల్ని, సాధారణ వ్యాసాల్నీ ప్రచురిస్తున్నాయన్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో జరగనంత కృషి ప్రయివేటు సంస్థలు చేస్తున్నాయనీ, అయితే వీటి ద్వారా సమాజంలోని అన్ని అభిప్రాయాలూ వెలుగులోకి రావడం లేదన్నారు. కొన్ని వాదాలు, ధోరణులు, సిద్ధాంతాలకే అవకాశం ఉంటుందని కూడా వ్యాఖ్యానించారు. విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలు పత్రికల ప్రచురణలనుండి క్రమేపీ తప్పుకుంటున్నాయనీ, అది ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీస్తుందన్నారు.

  • తెలుగు పాఠ్యాంశాల రూపకల్పనలో రావాల్సిన మార్పులు

  • తెలుగు భాషా సాహిత్యాల బోధన తీరుతెన్నులను, రావాల్సిన మార్పులను, పాఠ్యాంశాల రూపకల్పన, తెలుగు సాహిత్య బోధనా దృక్పథంలో ఇతర శాస్త్రాల వలే జ్ఞానం, సమాజావసరాల కేంద్రంగా తెలుగు పాఠ్యాంశాల రూపకల్పన దృక్పథంలో రావాల్సిన మార్పులను వివరించారు. సంప్రదాయ బోధన పద్ధతులను అనుసరిస్తూనే ఎప్పటికప్పుడూ తెలుగు భాషాసాహిత్యాల ద్వారా కూడా విజ్ఞానాన్ని అందుకోవచ్చుననే అవగాహన కల్పించేలా బోధన, పాఠ్యాంశాలు ఉండాలన్నారు.

కరోనో సమయం, దాని తర్వాత పరిస్థితులను వివరించమన్నప్పుడు ఇలా చెప్పారు. 

 సుమారు మూడేళ్ల పాటు బూజుపట్టిపోయిన తరగతి గదుల్లోకి మళ్ళీ విద్యార్థుల్ని రప్పించి పాఠాలు చెప్పాల్సిన సమయం. అంతవరకూ ఆన్లైన్ లో తేమ ఇష్టం వచ్చినట్లు  పాఠాలు విన్న వారికీ, ఇంటి దగ్గర నుండే పరీక్షలు రాయడానికి అలవాటు పడ్డవారికి ప్రత్యేక్షంగా పాఠాలు చెప్పిస్తూ, పరీక్షలు నిర్వహించాలి. ఈ కరోనా వల్ల విద్యా సంవత్సరం కూడా చిందరవందరైపోయింది. 

ఎన్నడూ తమ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారమే విద్యాసంబంధిత విషయాలన్నీ సక్రమంగా జరిగిపోయేవి. కానీ, కరోనా వల్ల యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో అకాడమిక్ క్యాలెండర్ కూడా చిందరవందరగా మారిపోయింది. పరీక్షలు నిర్వహించకుండానే తర్వాతి తరగతిలోకి ప్రమోట్ చేయించటమో, డిగ్రీ ఇచ్చేయడమో చేద్దామనే నిర్ణయం ఒకసారి, మరలా ఆ సర్టిఫికెట్లకు విలువ ఉండకపోతే విద్యార్థులు నష్టపోతారని మరలా పునర్ నిర్ణయంతో  పరీక్షలు నిర్వహించాలని భావించారు. అయితే ఆ పరీక్షలు ఎప్పుడూ జరిగే సంప్రదాయ పద్ధతుల్లో నిర్వహించడానికి వీల్లేదు. విద్యార్థులు ఇంటిదగ్గర నుండే రాసి, వాటిని స్కాన్ చేసి ఈ మెయిల్ ద్వారా పంపాలి. వాటిని ఆ యా సబ్జెక్టులకు చెందిన అధ్యాపకులు ఆన్ లైన్ లోనే మూల్యాంకనం చేసి, ఆన్లైన్ ద్వారానే ఈ గవర్నెన్స్ పోర్టల్ లో నమోదు చేయాలి.

 ఒకసారేమే కేవలం ఇంటర్నల్ మాత్రమే పెట్టి వాటిని ఆధారం చేసి ఎండ్ సెమిస్టర్ ఫలితాలు నిర్థారించాలన్నారు. మరో సెమిస్టర్ లో ఇంటర్నల్ , ఎండ్ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించాలి. కానీ, మార్కుల విభజన విషయంలో ఒక ప్రత్యేక పద్ధతి ప్రకారం తగిన నిష్పత్తిలో పూర్తి చేయాలి. కరోనా సమయంలో కూడా ప్రత్యక్షంగా ఆఫీసుకి వచ్చి ఇవన్నీ శాఖాధ్యక్షులు పూర్తి చేయించాలి. వీటికి తోడు వివిధ స్కాలర్షిప్పుల దరఖాస్తులు, రెన్యువల్స్, విద్యార్థులకు సాంకేతిక సమస్యల వల్ల జరిగే పొరపాట్లు, వాటికి తగిన పరిష్కారాలు…ఇవన్నీ శాఖాధ్యక్షులు ప్రత్యక్షంగా ఆఫీసుకి వచ్చి, పరిశీలించి చెయ్యాలి. అలా కరోనా సమయంలో కూడా ప్రత్యక్షంగా ఆఫీసుకి వచ్చి పనిచేశాను.

ఫ్యాకల్టీ అందరికీ ల్యాప్ టాప్, కెమేరాలు:

కరోనా సమయంలో పాఠాలు చెప్పడానికి, రికార్డింగ్ చేసి స్టూడెంట్స్ కి ఇవచవడానికీ, ఫ్యాకల్టీ అందరికీ హైడెఫినిషన్ కెమేరాలు వారి కంప్యూటర్లకు అనుసంధానించేటట్లు ఆ ఎక్విప్ మెంటుని విశ్వవిద్యాలయం వారిచ్చేటట్లు ప్రయత్నం చేశాను. తర్వాత అందరికీ మరలా ల్యాప్ టాప్ లు ఇచ్చుటట్లు కూడా చేశాను. దీనివల్ల ఆన్ లైన్ లో పాఠాలు చెప్పడానికి ఎంతో అవకాశం కలిగింది. మా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వారు అన్ లిమిటెడ్ స్పేస్ వాడుకొనేట్లు, ఒకేసారి 250 మంది వరకూ ఆన్లైన్ లో పాఠాలు వినేటట్టు, రికార్డింగ్ చేసుకొనేట్లు గూగుల్ తో ఒప్పందం చేసుకున్నారు. అందు వల్ల ఫ్యాకల్టీ తమ పాఠాలన్నీ రికార్డు చేసుకోవడానికి వీలుగా ల్యాప్ టాప్స అందరికీ. వచ్చేటట్లు చేశాను. ఇలా వీటిని సాధించడంలో విశ్వవిద్యాలయంలోని అనేక శాఖల వారు చక్కగా సహకరించారు.

పూర్వ పరిపాలన అనుభవం తోడ్పాటు

ఇంతకుముందు శాఖాధ్యక్షులుగా ఉండడానికి ముందు డిప్యూటీ డీన్ గా స్టూడెంట్ వెల్ఫేర్ డిప్యూటీ డీన్ గా పనిచేయడం వల్ల విశ్వవిద్యాలయంలోని అన్ని శాఖల వారితో అనుబంధం ఏర్పడింది. అది ఇప్పడు తెలుగుశాఖ అభివృద్ధికి ఎంతగానో దోహదం చేసింది. 

తెలుగు శాఖలో సాంకేతికత- సమస్యల పరిష్కారం:

ఇదే పరిస్థితి ఇతర శాఖలకు చెందిన వాళ్ళూ ఎదుర్కొన్నప్పటికీ, కంప్యూటర్, ఇంటర్నెట్ పరిజ్ఞానం అంతంతమాత్రమే ఉండే‌ తెలుగు విద్యార్థులు, అధ్యాపకులకు మరింత ఎక్కువ. సెమిస్టర్ రెన్యువల్ కోసం అనుకొని  ఒక ఆప్షన్ నొక్కాల్సిన దానికి బదులుగా, తమ కోర్సు మానేస్తున్నామనీ, నో డ్యూస్ ఇవ్వండంటూ ఉండే ఆప్షన్ అనేకమంది నొక్కేసేవారు. మరలా వాళ్ళ అడ్మిషన్ క్యాన్సిల్ కాకుండా ఆఫీసు సిబ్బందితో కలిసి నానా ఇబ్బందులూ పడాల్సి వచ్చేది. 

అసలే అంతంత మాత్రంగానే ఉన్న నాన్ టీచింగ్ స్టాఫ్ కి రొటేషన్ ప్రకారం డ్యూటీలు వేసే వారు. ప్రతిరోజూ శాఖాధ్యక్షులు మాత్రం రావాలి. నాన్ టీచింగ్ స్టాఫ్ మాత్రం రొటేషన్ ప్రకారం వచ్చేవారు. దీనికి తోడు తెలుగు శాఖ లో రెగ్యులర్ ఆఫీస్ అసిస్టెంట్ లేడు. కాంట్రాక్టు సిబ్బందిలో ఒకర్నిచ్చారు. ఆయన్ని డేటా ఎంట్రీ ఆపరేటర్ ( డిఇవో) అంటారు. ఆయన ఇంజనీరింగ్ సెక్షన్ నుండి అప్పుడే తెలుగు శాఖకు బదిలీపై వచ్చాడు. అకాడమిక్ వర్క్ విషయంలో అంతా అయోమయం. నాన్ టీచింగ్ లో మరొకరు అటెండరు. వీళ్ళిద్దరికి మరలా రొటేషన్ డ్యూటీ. ప్రతిరోజూ వచ్చి శాఖాధ్యక్షులు మాత్రం అన్నీ చేసుకోవాలి. అలాగే అందరి అధ్యాపకుల సహకారం, సమన్వయంతో ఇంతవరకూ బాగానే నడుపుకొస్తున్నాన’’ని అన్నారు.

హైదరాబాదు విశ్వవిద్యాలయంలో చదివిన వారు దేశవ్యాప్తంగా ఎలా విస్తరించారో చెప్తూ ఇలా వివరించారు.


‘‘తొంబై తొమ్మిది శాతం అక్షరాస్యులుగా తొలితరానికి చెందినవారే ఈ విశ్వవిద్యాలయంలో చేరుతున్నారు. అంతే  కాకుండా వాళ్ళంతా గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులే కావడం విశేషం. అయినప్పటికీ తమ కుటుంబాలకీ, తమ ఊరుకీ, తమ రాష్ట్రాలకు, తమ దేశానికి పేరు తెచ్చేలా తమ ప్రతిభాపాటవాల్ని ప్రదర్శిస్తారు. అలాంటి చక్కని వాతావరణం ఈ విశ్వవిద్యాలయంలో ఉంది. ఇక్కడ తెలుగు శాఖలో చదివిన వారు  ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశ వ్యాప్తంగా అనేక శాఖల్లో పనిచేస్తున్నారు. అనేక కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకులుగా, శాఖాధ్యక్షులుగా కూడా పనిచేస్తున్నారు. దేశంలో ని తెలుగు ఉన్న అన్ని సంస్థల్లో నూ ఇంచుమించు అన్ని చోట్లా మా విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థులు పరిశోధనలు చేస్తున్నారు. ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాలకు ప్రక్కనే ఉన్న యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్, మదురై కామరాజ్ విశ్వవిద్యాలయం లలో తెలుగు శాఖ అధ్యక్షులు ఇక్కడ చదువుకున్న వాళ్ళే. ఢిల్లీ విశ్వవిద్యాలయం, పాండిచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలో భాగమైన యానాంలో కూడా ఇక్కడ చదివి వెళ్ళిన వారున్నారు. నేడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు శాఖల్లో కనీసం ఒక్కరైనా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో చదివిన వారుంటారంటే అతిశయోక్తి కాదు. 

-సాకే శ్రీహరి మూర్తి, సి.ఎం.డి.భూమి పుత్ర దినపత్రిక, అనంతపురం


No comments: