"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

28 September, 2022

ఆచార్య దార్ల ఆత్మకథ (నెమలి కన్నులు) 10 వ భాగం

 


ఆచార్య దార్ల ఆత్మకథ (నెమలి కన్నులు) 10 వ భాగం 

భూమిపుత్ర దినపత్రిక, 28.9.2022 సౌజన్యంతో


''కంటికి కనిపించేదే నిజమనుకోకు''

  

ఆ యేడాది జెండా పండుగ నాగుండెల్లో బాకులు గుచ్చినట్లనిపిచింది.

 ప్రతి సాయంత్రం  తాను  పడుకోవడానికి ఆ మేఘాల్ని కప్పుకున్నట్లనిపించే సూర్యుడు ఆరోజు నాకు  కందిన ముఖంతో, కోపంతో,  కళ్ళలో ఎర్రని కాంతిపుంజాల్ని వెదజల్లుతూ అస్తమించినట్లనిపించింది.

 క్లాస్ లీడర్లంతా ముందు నిలబడినట్లే ఆరోజు నేనూ నిలబడ్డాను. 

కానీ నన్నెందుకు వెనెక్కి వెళ్ళమన్నారు? 

నా బట్టలు బాగాలేదా?

 నేనేమైనా స్నానం చెయ్యలేదా? 

నేనేమైనా తల దువ్వుకోలేదా?

 నాకేమైనా మాట్లాడ్డం చేతకాలేదా? 

నా కేమైనా నత్తి ఉందా? 

నా కేమైనా అవయవాల లోపముందా?

 ఇలాంటి ప్రశ్నలెన్నో  వేగంగా దూసుకొస్తూ బాణాల్లా నాకు గుచ్చుకుంటున్నట్లనిపించింది. 

జరిగిన విషయాన్ని ఎవరికి చెప్పుకోవాలి? 

అమ్మకి చెప్తే, పెద్ద పెద్ద కేకలేసుకొంటూ మాస్టర్లను తిట్టేస్తుందేమో…

అలా కాకపోతే ..

నాకొడుకునెందుకలా వెనెక్కి నెట్టేశారని అడుగుతుందేమో….

నాకొడుకుని అలా అవమానించారేమిటని ఏడ్చేస్తుందేమో…

నాలో నేనే ప్రశ్నలూ సమాధానాలయ్యాను.

చివరికో నిర్ణయానికొచ్చాను

 నాన్నకి చెబుదామనుకొన్నాను.

 ఆరోజు జరిగినదంతా వివరించాను. 

  ''నువ్వేమైనా అల్లరి చేశావా? '' అని అడిగాడు నాన్న. లేదన్నాను. 

'' నువ్వు జెండా సరిగ్గానే పట్టుకున్నావా?''

'' పట్టుకున్నాను. బాగానే పాడాను'' 

''అయితే నేను అడుగుతాను లే'' అన్నాడు. 

ఆ మాట నాకెంతో ధైర్యాన్నిచ్చింది. 

ఒక కొత్త ఉత్సాహమేదో వచ్చినట్లు 

నా కళ్ళ నిండా కొత్త వెలుగులు విరజిమ్మాయిత్య్ర. ఎక్కడలేని ఆనందంతో గంతులేయాలనిపించింది.

పిల్లలకు నాన్నెపుడూ ఒక ఆత్మవిశ్వాసమే. 

నాన్నెపుడూ కొండంత అండగా ఉనైనాడనే ధైర్యమే.

చిన్నప్పుడు నాన్న చేతులతో పట్టుకొన్నాడంటే చాలు చుట్టూ బొంగరంలా చిన్న పిల్లలు తిరుగుతుంటారు.  చేతులు వదిలేసి సరదాగా కిలకిలనవ్వుతూ కిందికీ, ప్రక్కకీ ఒరిగిపోతుంటారు.

 నాన్న 'అరే పడిపోతావురా' అంటున్నా వినరు. ఇంకా రెచ్చిపోయి ఆడుతుంటారు. పడిపోకుండా రెండు చేతులతో పట్టుకుంటుంటాడనే నమ్మకం. ఇంకా ఉత్సాహంగా నవ్వుతూ కావాలనే కిందికి పడిపోయినట్లు ఆ పిల్లలు జారిపోతుంటారు. 

పసిపిల్లలకు అదంతా వాళ్ళ నాన్న ఉన్నాడనే‌ నమ్మకం. తమకేమీ కాదనే ఆత్మవిశ్వాసం. 

అది పైకి చెప్పలేకపోవచ్చు.కానీ వాళ్ళ గుండెల్లో అదే కొండంత ధైర్యం. 

అలాంటి ధైర్యమే నాకు కూడా ఆనాడు వచ్చిందనుకుంటాను. 

ఇక అలా ఎందుకు వెనక్కి వెళ్ళమన్నారో 

నాన్న అడుగుతాడులే అనుకొన్నాను.

మామూలుగానే మర్నాడు బడిలో కి వెళ్ళిపోయాను. కానీ, ఆ రోజు క్లాసు లీడర్ గా నేనేమీ పట్టించుకోలేదు. అయితే, అంతకుముందు రోజు ఏమీ జరగనట్లే మాస్టారు నన్ను పిలిచి పాఠం ఒప్పజెప్పుకొన్నారు. 

నా పాఠాన్ని ఒప్పజెప్పేశాను.

 క్లాస్ లో అందరి పాఠాలు ఒప్పజెప్పించుకోమన్నారు. ఎప్పటిలాగే ఎవరైనా పాఠాల్ని కొన్ని తప్పులతో ఒప్పజెబితే స్కూల్ బయిట నిలబెట్టి చదివించాలి. అన్నీ తప్పులు చెబితే వంగోబెట్టి చదివించాలి. 

చాలా మంది అలా రోజూ నవ్వుతూ వంగొని చదివేవాల్సి వచ్చేది.

 ఆ రోజు కూడా రోజూలాగే చదవని వాళ్ళని వంగోబెట్టాను. నేనే వాళ్ళకి పాఠాల్ని చదివి నేర్పించేవాణ్ణి. 

మర్నాడు మా తరగతికి చెందిన ఒకమ్మాయి వాళ్ళ నాన్నగారు మా స్కూల్ కి వచ్చారు. '' మా అమ్మాయికి జ్వరం వచ్చిందని చెప్పినా వినకుండా ఎండలో వంగోబెట్టి ఎవరో అబ్బాయి చదివించాడట…నిజమేనా? '' అని అడిగారు. 

వాళ్ళమ్మాయి మా క్లాస్మేట్. ఆయన అప్పటికే గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు. వాళ్ళ పేర్లు నాకింకా గుర్తున్నాయి. ఆ అమ్మాయి పేరు కూడా మర్చిపోలేదు. కానీ ఇక్కడ రాయట్లేదు.

ఆ పిల్లనీ, వాళ్ళ తండ్రినీ చూసి నేను చాలా భయపడ్డాను. నన్ను కొడతారేమోనని ఏడుపొచ్చేస్తుంది. 

నా గురించి కూడా మానాన్న ఇలాగే అడగడానికొస్తే బాగుండును కదా అనిపించింది. మాస్టారేమంటారో…గుండెల్లో గుబులు గుబులుగా ఉంది. కుందేలు పిల్లలా చెవుల్ని చాచి, బెదురుతున్న కళ్ళతో తనని వేటాడ్డానికొచ్చిన వాళ్ళను చూస్తున్నట్లుంది నాపరిస్థితి. '' మీ అమ్మాయికి నిజంగా జ్వరం వస్తే నాకు గానీ, ఆ అబ్బాయికి గానీ చెప్పాలి కదండీ…ఏమ్మా…చెప్పావా?'' అని ఆ అమ్మాయి వైపు చూస్తూ అడిగారు హెడ్మాస్టర్. 

ఆయనే అంతకు ముందు రోజు నన్ను వెనుకకు వెళ్ళి నిలబడమని చెప్పింది కూడా.

''లేదు'' అన్నట్లు తల అటూ ఇటూ తిప్పింది. 

''అయినా పిల్లల్ని పాఠాల్ని ఒప్పజెప్పించుకోమనడ మేమిటండీ'' అని ఆ పేరెంట్ హెడ్మాస్టర్ ని నిలదీసినట్లు, ఏదొకటి అడగాలన్నట్లు అడిగాడు. తర్వాత వాళ్ళేదేదో మాట్లాడుకున్నారు. 

ఇంక నాకా మాటలతో పనిలేదనుకున్నాను. వాళ్ళేమి మాట్లాడుతున్నారో నేను వినిపించుకోలేదు. 

నాకు మాత్రం ఆ సమయంలో నా నెత్తిమీద పడే పెద్ద పిడుగేదో తప్పిపోయినట్లు మాత్రం అనిపించింది. కానీ, హెడ్మాస్టర్ నన్నేమన్నా తిడతారో, కొడతారోనని నాకైతే మర్నాడు దాకా ఆ భయం పోలేదు. 

నాకెందుకో చదువంటే పిచ్చి. 

కనిపించిన కాగితమల్లా చదివేవాణ్ణి. 

ఏ పనిచేస్తున్నా , నా ధ్యాసంతా చదువుమీదే ఉండేది. అందువల్ల 

ఒకటి రెండు సార్లు చదివితే ఆ పాఠం నాకొచ్చేసేది. పాఠమెవరైనా ఒప్పజెప్పకపోతే, వాళ్ళకి నన్ను చూపించి మా హెడ్మాస్టర్ ఆ విద్యార్థుల్ని తిట్టేవారు. ''వీళ్ళమ్మా, నాన్నా మీలాగా ధనవంతులేమీకాదు. ఏరోజుకారోజు పని చేసుకొంటూనే చదివిస్తున్నారు. అయినా వీళ్ళు బాగా చదువుతున్నారు. మీకన్నీ ఉన్నా చదువుమాత్రం రావట్లేదు'' అని తిట్టేవారు. ఇంచు మించు ఈ భావానికి దగ్గరున్న మాటలే నన్ను చూపిస్తూ ఆ వచ్చిన పేరెంట్ తో హెడ్మాస్టర్ చెప్పడం నేను విన్నాను.  

ఆ తర్వాత కూడా  హెడ్మాస్టర్ నన్నేమీ అడగలేదు. నన్నేమీ అనలేదు. 

మా నాన్న బడిలో కొచ్చి ఆయన్ని అడగకపోయినా ఫర్వాలేదనిపించింది.

ఆ సాయంత్రమే మా నాన్న నాతో చెప్పాడు. తాను మాస్టార్లను అడిగాననీ, పొడుగ్గా ఉండడం వల్ల వెనక్కి వెళ్ళమన్నారట. అంతే తప్ప ''నిన్నేమీ తక్కువ చెయ్యడానికి కాదట'' అని !

ఏ కారణం లేకుండా నన్ను వెనక్కి వెళ్ళమనరనే ఒక నమ్మకంతో పాటు, ఆయన పట్ల ఏదో  గౌరవభావం కూడా పెరిగింది. 

అంతే కాదు, బాగా డబ్బున్న వాళ్ళకు చదువు రాదేమో అనుకొనే వాణ్ణి. బడిలోమేము  వేమన, నీతి శతకాల్లోని పద్యాలు పోటాపోటీగా చదివేవాళ్ళం. నాతో పోటీగా ఒక అమ్మాయి ఉండేది. వాళ్ళకు కిరాణా కొట్టు ఉండేది. సరుకులు అమ్మే వాళ్ళ నాన్నకి సహాయం చేస్తూనే, కొట్టులో కూర్చొని చదివేది. 

నేనేమో మా అమ్మకి వంటలో సాయం చేస్తూ, పొయ్యి దగ్గర కూర్చొని చదువుకొనేవాణ్ణి. అప్పుడప్పుడూ నేను సరుకులు తేవడానికి వెళ్ళేవాడిని. కాగితం మీద పద్యాల్ని రాసుకొని, జేబులో పెట్టుకొని టైమ్ ఉన్నప్పుడల్లా ఏరోజుది ఆరోజే కంఠస్థం పట్టేస్తే వాణ్ణి. ఒక్కోసారి నేను      'రేపటి పాఠం చదివేశాను తెలుసా!' అని, మళ్ళీ ఆమెకు చదివి వినిపించే వాణ్ణి. 

అంతే… వాళ్ళ నాన్న ఆ అమ్మాయిని చదువుకోమని చెప్పేవాడు. అలా నా పాఠాల్ని ఆ కిరాణా కొట్టు దగ్గర ఒప్పజెప్పడం వల్ల తనని వాళ్ళ నాన్న  సహాయం చేయమని అడగట్లేదని ఆమె నాకు థాంక్స్ చెప్పేది. 

మా క్లాసులో నాకంటే ముందున్న సీనియర్స్ అంతా అలా లీడర్షిప్ చేస్తుంటే, నాకు కూడా అలా చేయాలనిపించేది. దాన్ని సాధించాలంటే ఏం చెయ్యాలో జాగ్రత్తగా గమనించే వాణ్ణి. 

ముందు బాగా చదవాలి. 

అన్నింటిలోనూ చురుకుగా పాల్గొనాలి.

అందర్నీ ప్రేమగా కలుపుకుపోవాలి.

నేను ప్రేమతో ఉన్నా కొంతమంది మన ప్రేమను స్వీకరించడానికి సిద్ధంగా ఉండరు. 

అది అనేకసార్లు అనుభవంలోకి వచ్చేది. అయినా ఓ పిచ్చి నవ్వు నవ్వుకొని మళ్ళీ ఎప్పటిలాగే అందరితో ప్రేమగా ఉండేవాణ్ణి.

నాకు ప్రేమించడమే తెలుసు. 

క్లాస్ లీడర్ అయ్యాను. నాకు అనుభవంలోకి వచ్చిన రెండు, మూడు సంఘటనలు మాత్రం, లీడర్షిప్ కూడా కొన్ని సమస్యలు తెచ్చిపెడుతుందేమో అనిపించింది. అటుగా దూరంగా ఎవరో పాటపాడుకుంటూ వెళ్తున్నారు. 

 ''కంటికి కనిపించేదే నిజమనుకోకు

  కంటికి కనిపించని నిజముండునురా''

( సశేషం)

  • ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు

తెలుగు శాఖ అధ్యక్షులు, 

సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్

ఫోన్: 9182685231

  





No comments: