"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

10 ఆగస్టు, 2022

ఆచార్య దార్ల ఆత్మకథ (నెమలి కన్నులు) - 6 వ భాగం భూమిపుత్ర దినపత్రిక, 10.8.2022 సౌజన్యంతో

 ఆ ముక్కకి ఆ రుచెలా వచ్చేదో…!


నాన్న ఇంతగా ఎందుకు కష్టపడేవాడు? కేవలం తన జానెడు పొట్ట కోటి కోసమేనా? కానే కాదు. మరెందు? ఒకసారి తెల్లవారు గట్లే తాటాకు కొట్టడానికో, కొబ్బరి దింపు తీయడానికో వెళ్ళేవాడు. భుజం మీద ఒక నిచ్చెన నడుముకి ఒక బల్ల ఉండేది.  ఆ బల్ల వెనుక రెండు కత్తులు కూడా ఉండేవి. అవి బల్లకు అమర్చిన ఒక తోలు అరలో పెడతారు..దానిలో రెండువైపులా రెండు కత్తులు పెట్టుకోవచ్చు. ఆ కత్తులు మంచి పదునుతో ఉండేవి. ఆ కత్తె పిడికి ఒక గుది పెట్టుకుంటారు. వాటితోపాటు రెండు నుండి మూడు అడుగుల పొడవుండే ఒక తునగాలు, నిచ్చెనకు కట్టిన నడుము ఎత్తు వరు ఉండే ఒక పొడవైన తాటాకు బుట్ట,. దానిలోనే వాయుకుడుం, కత్తి నూరుకోవడానికి మెత్తగా కొట్టిన చిన్న నెరుసు మూట. ఆ నెరుసుని కొట్టే పని నాకు లేదా మా చిన్నన్నయ్యకు ఉండేిది. ఒక రుబ్బురోలు లాంటిదానిలో దాన్ని కొట్టగా కొట్టగా మెత్తగా నెరుసు వస్తుంది. దానితో పదునుపెడితే కత్తి బాగా తెగుతుంది. నేను ఒక్కోసారి ముక్కలు కొట్టేసి, దాన్ని పిండి చేసేసేవాణ్ణి. త్వరగా అయిపోయేది. కానీ, సాయంత్రం నాన్న గుదిదెబ్బలు తినాల్సి వచ్చేది. ఆరోజు కత్తికి పదును పెట్టడానికి ఎంత ఇబ్బంది పడేవాడో. అందుకే నా వీపుమీద గుది నాట్యం చేసేది. నేనేమో అంతసమయం దానికి వృధాచేయడమెందుకని, రాయిని ముక్కలు చేసి, దాన్ని నూరేసేవాణ్ణి. 

 ఒకవేళ కల్లు గీయడానికి వెళితే ఒక కల్లుకుండ నడుము వెనుకవైపు  ఉండే ఇనుపకొక్కేనికి తగిలించుకునేవాడు.ఇలా నాన్న ప్రతిరోజు ఒక యుద్ధానికి వెళుతున్నట్లు సిద్ధమయ్యే వాడు.  

వాయుకుడం అంటే మినప పిండి, బియ్యపు పిండి కలిపి ఒక చేసే టిఫిన్. పొయ్యిమీద ఒక పాత్ర పెడతారు. దానిలో ముందు సగానికంటే తక్కువ లేదా ముప్పావు వంతు పాత్ర నిండేటట్లుగా నీళ్ళు పోస్తారు. దానిలో కొద్దిగా గడ్డి వేస్తారు. ఆ పాత్ర మూతకు కొద్ది వదులుగా ఒక కాటన్ గుడ్డ  కట్టి దానిపై రుబ్బిన మినప్పప్పు నూక కలిపిన పిండి వేస్తారు. ఆ పిండిలో బాగా కలిసిపోయేట్లుగా కొద్దిగా ఉప్పు కూడా వేస్తారు. పాత్రకు కట్టిన ఆ గుడ్డ పాత్రలో ఉన్న నీటిని తాకకుండా, మరీ మూతపెడితే పైకి వచ్చేయకుండా పిండి వేసి మూతపెట్టేస్తారు. తర్వాత కింద మంటపెడతారు. పాత్రలో వేసిన నీరు కరిగి ఆ వాయువు వల్ల కాసేపటికి అది ఉడికిపోతుంది. వాయువు ఆవిరితో ఉడుకుతుంది. కాబట్టే దానికి వాయు కుడుము అని పేరు. దీన్నే పల్లెటూరులో ఆయకుడుమని, ఆవిరి కుడుం అనీ పిలుస్తారు. దీనికి ఎలాంటి నూనె పదార్థాలు అవసరం లేదు. ఒక విధంగా మనం ఇడ్లీ ఎలాగైతే వండుంటామో, అలాగే దీన్ని కూడా వండుతారు. ఇడ్లీ పాత్ర బదులు ఒక లోతైన పాత్ర తీసుకుంటారు. వాయుకుడుము తయారు చేయాలనుకున్నపుడు ముందు రాత్రి నానబెట్టిన మినపప్పుని పొద్దున్నే రుబ్బురోలుమీద మెత్తగా రుబ్బుకోవాలి. దానిలో కొంచెం తినేసోడా, కొద్దిగా ఉప్పు వేసి కలిపి కాసేపు ఉంచాలి. ఆ తర్వాత దాన్ని పొయ్యిమీద పెట్టిన పాత్రలో వండుకోవడమే. అమ్మ తెల్లవారగట్లే లేచి పిండి రుబ్బి పొద్దు పొడవకుండానే నాన్నకి రెడీ చేసిపెట్టేది.

నాకు ఆ వాయుకుడుమంటే చాలా ఇష్టం. ఎంతో రుచిగా ఉంటుంది. అది కొద్దిగా తింటే చాలు చాలా సేపటి దాకా ఆకలి వేయదు. నాన్నకి దాన్నే ఇంచుమించు ప్రతిరోజూ కాకపోయినా వారానికి కనీసం మూడుసార్లైనా చేసి పెట్టేది. మాకు కూడా టిఫిన్ అదే పెట్టేది. ఒక వేళ పిండి సరిపోకపోతే మా నాన్నకు మాత్రమే పెట్టి, మమ్మల్ని చద్దన్నం తినమనేది. 

మేమైతే పొద్దున్నే వండిన వెంటనే  వేడిగా వాయుకుడుము తినేసేవాళ్ళం. నాన్న మాత్రం మాతోపాటు తినేవాడు కాదు. పోనీ, చద్దన్నం కూడా తినేవాడు కాదు. మాతోపాటు తినొచ్చు కదా …ఎందుకు తినట్లేదనుకునేవాణ్ణి. 

తర్వాత తెలిసింది …పొద్దున్నే తింటే చెట్లు ఎక్కడ కష్టం.  

అందుకనే ఆ ఖాళీ కడుపుతోనే దింపులు తీసేవాడు. పది, పదకొండు గంటల  ప్రాంతంలో కొద్దిగా వాయుకుడుము తినేవాడు. అంతకు ముందు కొద్దిగా టీ తాగే వాడు. నాన్న కొరుక్కొని తింటున్న ఆ వాయు కుడుములోనే  మళ్ళీ మాకు కూడా కొద్దిగా పెట్టేవాడు. 

పొద్దున్న అమ్మపెట్టిన దానికంటే అది రుచిగా అనిపించేది. 

నాన్న తింటూ తన చేతితో పెట్టే ఆ ముక్కలో ఆ రుచి ఎలా వచ్చేదో తెలీదు గానీ, దాని కోసమే నేను ఎదురు చూసేవాణ్ణి. ఆ ముక్క కోసమే నేను అప్పుడప్పుడూ నాన్న కూడా వెళ్ళేవాణ్ణి. అది తింటూ దీనికోసమే నేమో రోజూ బాబు కూడా మా కృష్ణ గాడు వెళ్తున్నాడనుకొనేవాణ్ణి. 

మాకెలా అలవాటైందో నాకు తెలియదు. మా నాన్నను మేమంతా బాబు అని పిలిచేవాళ్ళం. బహుశా బాపు నుండే బాబు వచ్చిందేమో. ఇప్పటికీ ఏదైనా గొడవ జరిగితే 'నీ బాబుతో చెప్పుకో' అనే మాట మన తెలుగు వాళ్ళ సొంతం. 

కృష్ణ అంటే మా తమ్ముడు. మేము నలుగురు అన్నదమ్ములమని ఇంతకు ముందే చెప్పాను కదా. నా తర్వాత వాడి పేరే రామకృష్ణ. మేమంతా కృష్ణ అనే పిలుస్తాం. తర్వాత స్కూల్లో రవికుమార్ గా మారిపోయింది. దీని వెనుకో పెద్ద కథే ఉంది. మా మగపిల్లల్లో చివరివాడు కృష్ణ. వీడంటే మా అమ్మా, నాన్నలకు ఎంతో ఇష్టం. మేమన్నా ఇష్టమే, కానీ మా నాన్నకు వీడంటే మహాప్రాణం. వీడినే బాగా ముద్దాడే వాడు. ఆ ముద్దు, గారాబంగా మారిపోయింది. దాంతో ఇంచుమించు ప్రతిరోజూ పొద్దున్నే నాన్న కూడా బయలుదేరే వాడు. వాడు స్కూల్లో గడపడం కంటే నాన్నతో నే ఎక్కువ గడిపేవాడంటే బాగుంటుందేమో…అది హైస్కూల్ చదువు వరకూ కొనసాగింది. ఎప్పుడన్నా బాగా అలసిపోయినప్పుడు నాన్న కొంచెం సారా తాగేవాడు. ఆ మత్తులో ‘‘ బాబా కృష్ణా… రారా… ఇదిగో నీకోసమే తెచ్చాను’’ అని ఏదొక స్వీటు పెట్టేవాడు. వాణ్ణి ఒళ్ళో కూర్చోపెట్టుకొని ఏవేవో కబుర్లు చెప్పేవాడు.

కొబ్బరికాయలు తీయడానికి వెళ్లేటప్పుడు గానీ తాటాకు కొట్టడానికి వెళ్ళినప్పుడు గానీ, నాన్న రూపం.12, ఒక్కోసారి రెండు గంటల వరకు ఏమీ తినేవాడు కాదు. తింటే మళ్ళీ చెట్లు ఎక్కడం చాలా కష్టం అనేవాడు. ఆవిధంగా రోజూ పొట్ట మాడ్చుకొనేవాడు. అలాంటప్పుడే కొద్దిగా సారా తాగేవాడు. అప్పుడు తాను పడుతున్న కష్టాల్ని ఏకరుపెట్టేవాడు. అప్పుడు నాన్న దగ్గరకు వెళ్ళాలంటే భయమేసేది. కానీ, నాన్న కష్టానికి మాత్రం ప్రాణం అల్లాడిపోయేది. 

అప్పుడప్పుడూ నాన్న నన్నూ, మా తమ్ముణ్ణీ చెరో భుజమ్మీద కూర్చోబెట్టుకొని సినిమాకి తీసుకెళ్ళేవాడు. చిన్నపిల్లలు వీళ్ళకి టికెట్స్ ఎందుకనేవాడు. 

ఇలాంటి పనులన్నీ మళ్ళీ మా చిన్నన్నయ్యకు వారసత్వంలా తీసుకున్నాడు. చదువుకోలేదు. నాన్న , చిన్నన్నయ్యా ఇద్దరూ కలిసి రాత్రీ పగలనక కూలికి వెళ్ళి పెంచిన కుమ్మనరాజుగారి కొబ్బరితోటల్ని చూసినప్పుడల్లా కొబ్బరి చెట్లకు బదులు నాకు వాళ్ళ కష్టమే కనబడుతుంది. మేము ఎదిగి, దూరంగా వచ్చి స్థిరపడి మంచి భోజనం చేసేటప్పుడల్లా వాళ్ళే గుర్తుకొస్తారు. నాకు తెలియకుండానే నా కళ్ళల్లో నీళ్ళు కారిపోతుంటాయి. అలాంటప్పుడిలా రాసుకున్నాను. 

వలస పక్షికిప్పుడేదో విరిగిన చప్పుడు

చెట్టునిండా పండ్లు

కొమ్మల్నీ, రెమ్మల్నీ అలముకున్న ఏకాకులు!


పండిన వెలితి

ఎంత తీయని బంధం

నోట్లో ఊరుతున్న కాకరకాయ రసం!


పొద్దున్నే భుజాన్నెక్కుతున్న సూర్యుడు

రైలు దిగినప్పుడు

వెన్నెలవుతాడు!


పాదలేపనాలు, అగ్నిహోత్రాలు మంత్ర మహిమలు

యంత్రభూతాలు, హిమాలయాలు, స్వర్గనరకాలు

ఏకదాటిగా కురిపించిన రసం

ఉక్కిరి బిక్కిరై చందమామ కౌగిళ్ళలో రసాభాసం!

తట్టుకోలేకపోతున్నాను

కాసేపు మట్టివాసనల్నీ, పైరుగాలినీ పీల్చాలి!

ఆవిగో నీటికయ్యల్లో ఎగిరిపడే చేదిపరిగలు

నాన్న విసిరిన పువ్వుల్లాంటి వలలో  పడే నీటిదండలు

ఆకాశమంత ఎత్తునుండే నాన్న అందించే ముంజికాయలు

పొలాల్లో పలకరిస్తున్న కందికాయలు..

పొలాల్లో పలకరిస్తున్న కందికాయలు..


" నమో వేంకటేశా… నమోతిరుమలేశా…"

టూరింగు టాకీసులో సినిమా మొదలవుతుంది

నాన్న భుజమ్మీద చంటిపిల్లాడినైపోవాలి

కానీ..అదిగో నాన్న వంట్లో మూలుగులన్నీ పీల్చేసి

చిన్నన్నయ్య జీవితాన్నంతా తాగేసి

కుమ్మనరాజు కొబ్బరితో ట దారికడ్డంగా రక్తం తాగే రాక్షసిలా…



నాన్న మీద ఆధారపడి ఐదుగురు పిల్లలు అమ్మ నాన్న భార్య వీళ్లంతా ఆధారపడి బ్రతకాలి. వాళ్ళకి కేవలం తిండి మాత్రమే సరిపోతుందా? మిగతావన్నీ సమకూర్చాలి. తిండి పెట్టాలి. బట్టలు కొనాలి. మిగతా అవసరాలు తీర్చాలి. 

మరొకవైపు మాకంటూ ఒక ఇల్లు లేదు. ఇల్లు కట్టుకోవడానికి స్థలం లేదు. అన్ని కొత్తగా నాన్న నుండే ప్రారంభం కావాలి. ఇంకొకవైపు పిల్లల్ని చదివించాలి. ఇవన్నీ సాధించాలంటే ఎంత కష్టపడాలి ఎన్ని మార్గాలు వెతకాలి అన్ని వెతికేవాడు. అన్ని పనులు చేసేవాడు. 


భూమిపుత్ర దినపత్రిక, 10.8.2022 సౌజన్యంతో

ఎన్ని పనులు చేసినా మా నాన్న తెచ్చిన డబ్బుల్ని జాగ్రత్త చెయ్యడంలో మా అమ్మ ఎంతో జాగ్రత్తపరురాలు. ఇంట్లోకి కావలసినవన్నీ చూస్తూనే, మా పేటలో ముందుగా మట్టిగోడలు, తర్వాత ఇటుకలతో ఇల్లు కట్టారు. మొట్టమొదటి సారిగా మాఇంట్లోనే కరెంటు వేయించారు. మొట్టమొదటి సారిగా సైకిల్ కొన్నారు.మొట్టమొదటి సారిగా మోటారు సైకిల్ కొన్నారు.మొట్టమొదటిసారిగా టెలీఫోనో పెట్టించారు. అమ్మకి నాన్న బంగారం కూడా కొనేవాడు. కాసుల పేరు, చెవులకు దిద్దులు, కాళ్లకు వెండి కడియాలు ఇలా చాలా చేయించాడు. మాకు మంచి బట్టలు కొనేవాడు. ఆ కష్టం ఫలితంగానే కొంత వ్యవసాయ భూమిని కూడా కొన్నారు. అయితే, దానికి రిజిస్ట్రేషన్ అవసరం లేదనీ, ఆ మాత్రం నమ్మకం లేకపోతే ఎలా అని పెద్దమనుషులు నమ్మించారు. నాన్న నమ్మేశాడు. కానీ, అమ్మ ఊరుకోలేదు. అలా కుదరదు. రిజిస్ట్రేషన్ చెయ్యించాల్సిందేనని పట్టుపట్టగా పదేళ్ళ తర్వాత రిజిష్ష్రేషన్ కోసం భూమి కొన్నవాళ్ళని అడిగితే చాలా ఇబ్బందులకు గురిచేశారు. మరలా భూమికి అదనంగా డబ్బు ఇవ్వాలన్నారు. అప్పుడు మా అమ్మ ఎందుకలా రిజిష్ట్రేషన్ చేయించుకోమని చెపిందో అర్థమై, అమ్మ మాటకు మరింత విలువ పెరిగింది. 

(సశేషం) 

- ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, తెలుగు శాఖ అధ్యక్షులు, స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్, యూనివ

ర్సిటి ఆఫ్ హైదరాబాద్, హైదరాబాద్ -500 046

1 కామెంట్‌:

Dr.Suresh చెప్పారు...

స్పూర్తి వంతం మీ జీవిత౦. అక్షరాలలో అందం ఆనందం మాత్రమే కాదు బతుకు కూడా ఉంటుంది అని మీ ఈ రచన మరోసారి తెలుపుతుంది.
@ డా. తన్నీరు సురేశ్