ఆచార్య దార్ల ఆత్మకథ (నెమలి కన్నులు) - 4 వ భాగం (భూమిపుత్ర దినపత్రిక, 27.8.2022 సౌజన్యంతో)
యుద్ధాలు చేసిన రాజులకంటే గొప్పోడివే నాన్నా....
కత్తి పదును తెలియడానికి
కత్తిని నూరి
నీకు నువ్వే
ఇతరుల గాయం చేయకుండా
దాని పదున్ని చేత్తో చూసేవాడివే
చాలా గమ్మత్తుగా ఉందిది నాన్నా...
రోజూ చేసేవాడివలా... రోజులో చాలాసార్లు చేసేవాడివలా....
రాజులైతే ఒకసారో రెండుసార్లూ యుద్ధం చేసి
కత్తి పదును చూస్తారేమో
. నువ్వు మాత్రం
కొబ్బరికాయలు కొట్టినప్పుడూ తాటాకుల కోసేటప్పుడూ...
ఆ కత్తికి వదనెట్టి చూస్తుండాల్సిందేగా..
మా కోనసీమలో ఎటుచూసినా పచ్చని పొలాలు కనిపించినా, అవి మాలాంటి వాళ్ళవి కాదు. మా చుట్టూ కొబ్బరి తోటలున్నా మాకు ఒక్క కొబ్బరికాయ మీదా హక్కులేదు. మా చుట్టూ రకరకాల పండ్ల తోటలున్నా మాకు అవన్నీ అందని ద్రాక్షలే. ఎప్పుడన్నా ఎవరన్నా దళితుడు ఆ తోటలో పడిన ఒక కొబ్బరికాయ తీసుకున్నా, ఒక జామపండో, నారింజ పండో, పనసండో, బొప్పాయి పండో... దేనిమీదన్నా ఆశపడినా వాళ్ళ వీపుల మీద ఆ పొలం గల యజమానుల కర్రలు నాట్యం చేసేవి. ఒక వేళ అంత దూరం రాకపోతే చెవులు చిట్లు పడేలా, అవమానంతో నిలువునా చావాలనిపించేలా బూతుల పంచాంగాన్ని వినాల్సి వచ్చేది. చుట్టూ సముద్రం ఉన్నా గొంతు తడుపుకోవడానికి గుక్కెడు నీళ్ళు కరువన్నట్లే ఉండేది దళితులకు కోనసీమలోని ప్రకృతి ప్రసాదించే ఫలసంపదంతా. అలా మా దళితులకు భూములుండేవి కాదు. నూటికో కోటికో అన్నట్లు ఒకరికో ఇద్దరికో కొంత పొలం ఉండేది. సాధారణంగా దళితులంతా ఆ పొలాల్లో పనిచేసేవారు. కొంతమంది మాత్రం దింపులు తీసేవారు. అంటే ఈ ప్రాంతంలో కొబ్బరి తోటలు ఎక్కువగా ఉండడం వల్ల దళితులు కూడా కొబ్బరి చెట్లు ఎక్కి కాయలు కోసే పనిచేసేవారు. దానితో పాటు తాడిచెట్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. అందువల్ల కల్లు గీసేవారు. దళితులు కల్లు గీయకూడదనే నిబంధన నాకు ఊహ తెలిసే నాటికే పోయిందనుకుంటాను. అందుకే మా దళితుల్లో కూడా కొంతమంది కొబ్బరి కాయలు దింపులు తీయడం, తాటాకు కొట్టడం, కల్లు గీయడం వంటి పనులు చేసేవారు. దళితుల దగ్గర కూడా కల్లు తాగడానికి ఇతర కులాలవాళ్ళు వచ్చేవారు. మా తాత పేరు వీరాస్వామి. మా తాత కూడా కల్లుగీసేవాడు. దింపుకార్మికుడిగా పనిచేసేవాడు. అదే మా వంశపారంపర్య వృత్తిగా మా నాన్న, ఆ తర్వాత మా చిన్న అన్నయ్య వరకూ కొనసాగింది. మేము నలుగురు అన్నదమ్ములం. చివరిలోఒక చెల్లి. మమ్మల్ని అందర్నీ చదివించాలని మా నాన్న, అమ్మా అనుకునేవారు. కానీ, అంతా చదువుకుంటే కుటుంబం గడవడమెలాగనుకున్నాడో, తనకే చదువంటే ఇష్టం లేదో గానీ, మా చిన్నన్నయ్య మాత్రం ఒకటవ తరగతి తర్వాత బడికి శాశ్వతంగా శెలవు పెట్టేశాడు. మా నాన్న చేసే వృత్తినే వంశపారంపర్యంగా తాను అందుకున్నాడు. మా పెద్దన్నయ్య సామ్యూల్ రాజు ని ఎంతో గారాబంగా పెంచేవారు. మాకు దూరపు బంధువు ఫాస్టర్ భక్తానందం గారు మా ఇంటికి దగ్గరలోనే ఒక చర్చి నిర్వహించేవారు. ఆ విధంగా మా ఇంటికి కూడా తరచుగా వచ్చేవారు. వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసి వెళ్ళేవారు. తొలికాన్పులో అమ్మ చాలా భయపడిందట. ఆసుపత్రిలో చేర్చారట. చాలా ప్రమాదం తప్పిందట. అప్పుడు ఫాస్టరు గారు ప్రార్థన చేయడం వల్ల ప్రసవ సమయంలో జరిగిన ఇబ్బందులన్నీ గట్టెక్కిందని, ఫాస్టర్ గారి ప్రార్థనలు ఫలించాయని , ఆ సందర్భంలో ఫాస్టరు గారు ప్రార్థనలు చేయడం వల్లనే ఇద్దరూ ప్రాణాలతో బయటపడ్డారని నమ్మారు. దాని ఫలితంగా పెద్దన్నయ్య పేరు సామ్యూల్ రాజు అయ్యింది. మా నాన్న ఇవేమీ పట్టించుకునేవాడు కాదు. మా అమ్మ కూడా దేనివల్లనో చర్చికి వెళ్ళేది కాదు. ఇంటిలో హిందూ దేవుళ్ళ ఫోటోలు... పూజలు, ఉపవాసాలు... ఏవేవో చేసేది. కొత్తలంకలో సత్యనారాయణ స్వామి దేవాలయానికి రెగ్యులర్ గా వెళ్ళేవారట. ఆ దేవుడు గొప్ప మాహాత్మ్యం గలవాడని నమ్మేవారు. రెండవసంతానం కూడా అబ్బాయే పుడతాడని కలవచ్చిందట. అందువల్ల చిన్న అన్నయ్య పేరు సత్యనారాయణ అని పెట్టారు. చిన్నన్నయ్యకు చదువంటే ఇష్టం లేదు. మూడవవాణ్ణి నేను. నేను కడుపులో ఉన్నప్పుడు ఆంబోతు రోజూ ఇంటిదగ్గరే నిలబడేదట. దానికి చేటలో కొంచెం ధాన్యం పోసి వెంకన్నబాబూ వెళ్ళు అనేవారట. నేను పుట్టడానికి ముందురోజు కూడా ఆంబోతు వచ్చి ధాన్యం తిన్న తర్వాత కూడా కదిల్లేదట. అప్పుడు మా అమ్మా, నాన్న కడుపులో ఉన్నవాడికి ‘నీ పేరే పెడతాం...వెళ్ళు’ అంటే గాని వెళ్ళలేదట. ఆ విధంగా నాపేరు వెంకటేశ్వరరావు అయ్యింది.
మా ముత్తాతలు ఏమి చేసేవారో నాకు తెలియదు. కానీ, మా బ్రాహ్మణ చెరువు మీదున్న మా వాళ్ళంతా మాత్రం వ్యవసాయ పనులు చేసే కూలీలుగాను, కొంతమంది పాలేర్లుగాను, మరికొంతమంది దింపు కార్మికులుగాను పనిచేసేవారు. చింతల మెరక దగ్గరున్న మాదిగలు మాత్రం చనిపోయిన పశువుల్ని తీసుకెళ్ళేవారు. చెప్పులు కుట్టేవారు. డప్పులు కొట్టేవారు. మా పేటలోని వాళ్ళు మాత్రం ఆ పని చేసేవారు కాదు. ఇప్పటికీ మా పేటలోని వాళ్ళంతా వ్యవసాయాధారిత పనుల మీదే బ్రతుకుతుంటారు. అంతేకాదు, మా కుల ధ్రువీకరణ పత్రాల్లో కూడా మాదిగ అని ఉండదు. జాంబవులు, అరుంధతీయులు అని ఉంటుంది. సాధారణంగా మాలల కులాన్ని ఆది ఆంధ్రగా రాసుకుంటారు. మాదిగల్లో కూడా కొంతమంది చైతన్యవంతులైనవాళ్ళు ఆది-ఆంధ్రులనే రాసుకున్నారు. ప్రత్యక్షంగా మా పేటవాళ్ళు ‘మాదిగ’ అని సర్టిఫికెట్స్ లో రాసుకోవడం నేను చూడలేదు. మాదిగహక్కుల దండోరా ఉద్యమం, దాని ఫలితంగా జరిగిన ఎస్సీ వర్గీకరణ తర్వాత జరిగిన రిజర్వేషన్ కేటాయింపుల వల్ల చాలామంది జాంబవులు, అరుంధతీయులు, ఆది-ఆంధ్రులు, ఇతర ఉప కులాల వారు మాదిగ, మాల అనే పేర్లతో కుల ధ్రువీకరణలు తీసుకోవడం ప్రారంభించారని తెలిసింది. కానీ చింతల మెరకలో ఉన్న మాదిగలు మాత్రం తమ ఎక్కువమంది కులధ్రువీకరణ పత్రాల్లో మొదటి నుండీ మాదిగ అనే అత్యధికులు రాయించుకునేవారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పడి, మాదిగ హక్కుల దండోరాగా ఏర్పడే వరకూ కోనసీమలో మాదిగల హక్కుల కోసం అరుంధతీయ సంఘాల పేరుతోనే కృషిచేశాయి. మాదిగల్లోని పేట మాదిగలు, చింతల మెరకలోని చాలామంది మాదిగలతో సంబంధ బాంధవ్యాలు, కలిసి భోజనాలు చేయడం వంటివి ఉండేవి కాదు. తర్వాత దండోరా ఉద్యమం వచ్చిన తర్వాత అందరూ కలిసి భోజనాలు చేస్తున్నారు. వివాహాలు చేసుకుంటున్నారు.
మా తాత ఎలా నేర్చుకున్నాడో గాని అప్పుడప్పుడూ బాగా వర్షం వచ్చినప్పుడు గానీ, రాత్రిపూట గానీ కొన్ని పుస్తకాలు చదివేవాడు. భారతం కథ చెప్పేవాడు, రామాయణం కథ చెప్పేవాడు, దీనితో పాటు కవ్వమ్మ, పేదరాసి పెద్దమ్మ, బాలనాగమ్మ కథలు పాడుతూ చదివేవాడు. మాతాతకు ఐదుగురు అన్నదమ్ములుండేవారు. వాళ్ళంతా పొలం పనులు చేస్తుండేవారు. పొలానికి కూలీల్ని తీసుకెళ్ళే మేస్త్రిగా కూడా కొంతమంది పనిచేసేవారట. నాకు ఊహ తెలిసేనాటికి ఒకరో ఇద్దరూ ఉన్నారు. వాళ్ళతో నేనేమి మాట్లాడేవాణ్ణో నాకు గుర్తులేదు. కానీ, మా తాత ‘‘ఈ చెరువుగట్టంతా మనవాళ్ళే ఉండేవార’ని చెప్పింది మాత్రం నాకింకా గుర్తుంది. తర్వాత కాలంలో మా తాతవాళ్ళ కుటుంబాలు ఇతర ఊళ్లకు కొంతమంది వెళ్ళిపోయారు. అందువల్ల తర్వాత కాలంలో మాకూ బంధువులే అవుతారనీ, కానీ మన ఇంటిపేరువాళ్ళు కాదనీ మా నాన్నమ్మ, అమ్మ చెప్పేవారు. మా నాన్న కొబ్బరి దింపులు తీసేవాడు. తాటాకులు కొట్టేవాడు. అవి లేనప్పుడు వ్యవసాయం పనులకు వెళ్ళేవాడు. వర్షం వస్తే పనులు ఉండవు. అందువల్ల మా ఇళ్లకు కొంచెం దగ్గరలోనే ఒక కమ్మర కొలుము ఉండేది. అక్కడకెళ్ళేవాడు. వాళ్ళు కాల్చి కత్తులు, గొడ్డళ్ళు రకరకాల ఇనుప పనిముట్టులు చేసేవారు. ఇనుముని బాగా కాల్చి సాగగొట్టాలి. అందుకని బలంగా పెద్ద సుత్తితో దానిపై కొట్టాలి. అలా కొట్టడానికి అక్కడికి వెళ్ళేవాడు. అలా చేసినందుకు కొంత డబ్బులిచ్చేవారు.
సాయంత్రం పూట వల పట్టుకొని వెళ్ళేవాడు. కాలువలో వలవేసి చేపలు పట్టుకొచ్చేవాడు. అప్పుడప్పుడు పెద్ద చేపలు దొరికేవి. వాటిని ఊరిలో ఉన్న వాళ్లకు మా అమ్మ అమ్ముకొచ్చేది. చిన్న చేపల్ని మేము వండుకొనేవాళ్ళం. నాన్న కూడా చేపలు పట్టుకొని బుట్టలో వేయడానికని నేను కూడా వెళ్ళేవాడిని. ఒక్కోసారి చేపలు దొరికేవి కాదు. అప్పుడు కాలువలో దిగి ఇసుక, మట్టిలో దూరి ఉండే దొందులు , బొమ్మిడాయలు పట్టుకునేవాడు. అంటే మట్టి జాగ్రత్తగా తీసి పైకి వెయ్యాలి. అప్పుడు అందులో కొన్ని దొందులు గానీ, బొమ్మిడాయలుగానీ, మార్పులు, ఇంగిలాయలు వంటివి దొరికేవి. ఇంగియాలకు ముళ్ళుంటాయి. అవి గుచ్చుకుంటే తేలుకుట్టినంత బాధ పడాలి. అలా అనేక సార్లు ఆ చేపలు పట్టుకొనేటప్పుడు కుట్టించుకోకతప్పదు. చీకటి పడేవరకూ అలా చేపలు పట్టుకొని ఇంటికి తెచ్చేవాడు.
ఒకపని అన్లేదు. అనేక పనులు చేసేవాడు. వ్యవసాయం పనులు కూడా చేసేవాడు. మామూలుగా అయితే కూలి ఇస్తారు. అలా కాకుండా గుత్తకు తీసుకొని పనిచేసేవాడు. దానివల్ల నలుగురైదుగురు చేసే పనిని ఇద్దరో ఒకరో చేసేస్తారు. చీకటి పడినా పని పూర్తి చేస్తారు. విశ్రాంతి తీసుకోకుండా కష్టపడి చేస్తారు. అలా గుత్తకివ్వడం వల్ల అయిదుగురికివ్వవలసిన కూలీని ముగ్గురు లేదా నలుగురుకి అయ్యే కూలీ ఇస్తే సరిపోతుంది. పనికూడా ఆరోజుకే అయిపోతుంది. అందువల్ల రైతులు నమ్మకంగా గుత్తకు చేసేవాళ్ళకి పనిచ్చేవారు. అలా మా నాన్న, అమ్మా ఒకరిద్ధర్ని కలుపుకొని గుత్తకు పనిచేసేవారు.దానివల్ల మామూలు కూలికంటే ఎక్కువగా వస్తాయి. వీటితో పాటు ధాన్యం బస్తాల్ని మొయ్యడం, దించడం వంటివి కూడా గుత్తకే తీసుకునేవాడు.
పొద్దున్నంతా కొబ్బరి చెట్లో, తాడిచెట్లో ఎక్కి కష్టపడి కూడా మా కోసం మా నాన్న అంత కష్టపడ్డాన్ని గమనించే నాకు మానాన్నంటే ఎక్కడలేని ప్రేమనిపించేది.
నాన్నా... నువ్వు నా బాల్యాన్నంతా తీపిగుర్తులతో నింపావు
నన్నుా నీతో పాటే పొలాలకు తీసుకెళ్ళేవాడివి
నువ్వు పొలంలో వరికోత కోస్తుంటే
నీచేతిలో కొడవలి వణికిపోయేది
పోటీపడి మరీ వరికంకులన్నీ నీచేతిలో ఒదిగిపోయేవి
నాకూ చాలా సరదా అనిపించేది
నేనూ అలా కోయాలనుకునేవాణ్ణి
ప్రయత్నించి వరితో పాటు చేయినీ కోసుకున్నప్పుడు
నువ్వు పడిన హడావిడిలో నాకా బాధే తెలిసేదికాదు
నాన్నా... నువ్వు పొలం దున్నుతుంటే
అలుపూ సొలుపూ లేకుండా నీతో పోటీపడి మరీ
ఆ ఎద్దులు పరిగెట్టాలనుకునేవి
నీ వెనకాలో
నీ ముందో
ఎవరొకరు నాగళ్ళు దున్నతుంటే నిన్ను చూసి వాళ్ళు
వాళ్ళని చూసి నువ్వూ పోటీ పడుతుంటే
పనిలోనే పసందుంటుందనిపించేది
నాన్నా మన పొలం దున్నడానికి
నీతో పాటు రాజుగారు, పెద్దకాపు, చిన్నకాపు అంతా వాచ్చేవాళ్ళేమిటి?
వాళ్ళకేమీ కూలిచ్చేవాడివి కాదు కదా
వాళ్ళకేమీ మనదగ్గర
కూలితీసుకోవాల్సిన అవసరం లేదనేవాడివి కదా
మరెందుకొచ్చేవారు నాన్నా?
నాన్నా నిన్ను అడగాల్సినవి చాలా ఉన్నాయి
నువ్వు నాకు చెప్పాల్సినవీ చాలా ఉన్నాయి
నీకన్ని పనల్నెవరు నేర్పారు నాన్నా?
-ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, తెలుగు శాఖ అధ్యక్షులు, స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, హైదరాబాద్
(సశేషం)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి