"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

10 జూన్, 2022

మాలావత్ పూర్ణ...ఓ విజయకేతనం

 

భూమిపుత్ర దినపత్రిక 10.6.2022 సౌజన్యంతో 

ఆమె ఆటోగ్రాఫ్

ఓపరి‘పూర్ణ’మైనవిజయపతాకం
-ఆచార్య దార్లవెంకటేశ్వరరావు, 
తెలుగుశాఖ అధ్యక్షుడు, స్కూల్ఆఫ్ హ్యుమానిటీస్
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (సెంట్రల్ యూనివర్సిటీ)
హైదరాబాద్, ఇండియా. 

‘‘కొన్ని లక్షల మందిలోఅవకాశం మనగుమ్మం తొక్కింది. 
నాకు సమానత్వం ఎలుగెత్తి చూపే అవకాశం వచ్చింది. 
మీరు నన్ను మనసార ఆశ్వీరదించిపంపండి. 
మీఆశీస్సులతో క్షేమంగా తిరిగివస్తాను. 
దయచేసి నన్ను పంపండి. నేనువెళతాను’’…ఈమాటలుఎవరివోకాదు
13 ఏండ్ల మాలావత్ పూర్ణ పలికినవి. 
తానువెళ్ళేదెక్కడికోపాఠశాలకో, 
విదేశాల్లో విహారయాత్రకో కాదు; 
ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి! 
తరతరాలుగా తనజాతి ఏమీసాధించలేదంటే, 
తాను సాధించి చూపించడానికి!
విజయం సాధించడానికి
పట్టుదల, తెగువ కావాలితప్ప
కుల, మతం, వర్గ, లింగభేదాలుకావని నిరూపించడానికి!
ఇలాంటి ఓ గొప్పసాహసాన్ని, 
తన ప్రాణాల్ని సైతం పణంగా పెట్టడానికి సిద్ధపడిన
అత్యంతపేదరికంతో జీవించే ఒక గిరిజనయువతి విజయగాథే
 సుధీర్ రెడ్డి పామిరెడ్డిగారు రాసినఎవరెస్ట్ ఇన్ మైండ్!
ఎవరెస్ట్ ఇన్మైండ్…పేరులోనే పెన్నిధిని పలికించే ఈపుస్తకరచయిత నాకు తెలిసినంతవరకు విస్తృతమైన అధ్యయనశీలి. తెలుగు, ఇంగ్లీషు సాహిత్యాన్ని, ఇతర శాస్త్రాల్ని బాగాచదువుతారు. వాటితో పాటు చరిత్రను కూడా ప్రత్యేకంగా చదువుతారు. ఆయన చదివిన దాన్ని జీర్ణించుకుని దాన్నెలా చెప్పాలో తెలిసిన నైపుణ్యం గలిగినవారు. ఆయన భౌతికంగా భారతదేశానికి అవతల, దూరంగా ఉన్నారు. కానీ, ఒకభారతీయుడిగా, ఒకతెలుగుపాఠకునిగా, ఒకప్రేక్షకుడిగా, ఒకవక్తగా మనకంటే దగ్గరగా ఒకవిడదీయలేనంతబంధాన్ని పెనవేసుకుని జీవిస్తున్నారు. ఆయనమాట, ఆయన ప్రతిస్పందన, ఆయన గొంతు వింటున్న వాళ్ళలోఒకనిగా చెప్తున్న మాట ఇది. ఏసామాజికవర్గాలమధ్య పచ్చగడ్డివేస్తే భగ్గునమండుతుందో అదే సామాజికవర్గం నుండి ఆ మంటల్నార్పడానికి గంగను నెత్తిమీదమోసుకొస్తూ తనవంతుగా కృషి చేస్తున్న సామాజిక సమన్వయదార్శనికుడు. ఇప్పుడు భారతదేశంలో, ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పట్టిందల్లా బంగారమయ్యే ఒకఅత్యంత ప్రభావితమైన సామాజికవర్గానికి చెందినవాడు. నిజంగా డబ్బుసంపాదించడమో, అధికారాన్నిహస్తగతం చేసుకోవడమో మాత్రమే చేసుకోవాలంటే ఆ వర్గాలకు అన్నిదారులూ తెరుచుకున్న సమయమిది. ఈపరిస్థితుల్లో ఈ రచయిత సమాజంలో పీడితులగొంతుగా అక్షరమవుతున్న అనేకసందర్భాల్ని గమనిస్తున్నాను. డా.బి.ఆర్.అంబేద్కర్ ఆశయాల్ని ప్రచారంచేయడంలో పాత్రధారికావడాన్ని నేను గమనిస్తున్నాను. దీనిలో భాగంగానే ఈపుస్తకాన్ని ఆయన రాశారని భావిస్తున్నాను.
ఈపుస్తకం చదువుతుంటే ఒకఉద్వేగానికి లోనయ్యాను. ఊపిరిసలపనివ్వని ఉక్కిరిబిక్కిరికేదో గురయ్యాను. పూర్ణ ఒకతండా నుంచి వచ్చిన ఒకగిరిజన యువతి. ఆ అమ్మాయి ఏడుశిఖరాల్ని ఎలా ఎక్కిందో గాని ఈపుస్తకంచదువుతున్నంతసేపూ నేనేఎవరెస్ట్ ఎక్కుతున్నంతగా ఫీలయ్యాను. ఆ అమ్మాయే నన్నో మహోన్నతశిఖరంపై కూర్చోపెట్టినట్లనిపించింది. ఈ పుస్తకం చదువుతున్నంతసేపూ ఒకమహాసాహసి జీవితచరిత్రనేదో చదువుతున్నట్లు, ఒకఅద్భుతమైన ప్రపంచాన్నేదో కళ్ళెదుట చూస్తున్నట్లపించింది. ఈ రచనా శైలిని చూసినప్పుడు ఒకచరిత్రను, ఒకనవలను మిళితంచేసి చదువుతున్నట్లుగా అనిపించింది. అది చివరి వరకూ ఇలాగే కొనసాగితే సాహిత్యవిమర్శకులు దీన్నొక నవలగా గుర్తించేవాళ్ళు.
యానాదులు, ట్రైబల్ క్రిమినల్ యాక్టుల గురించి వెన్నెలకంటిరాఘవయ్య, బంజారాల గురించి డా.డి.బి.నాయక్ మొదలైనవాళ్ళు కొంత పరిశోధనాత్మకరచనలు చేశారు. వీటితోపాటు మరికొన్ని పరిశోధనలు, రచనలను ఈ రచయిత నిజాయితీగానే ప్రస్తావించారు. ఈ పుస్తకం రాకముందే మాలావత్ పూర్ణ సాధించిన విజయాల్ని కొంతమంది హిందీ, తెలుగు, ఇంగ్లీషు భాషల్లో సినిమాలుగా కూడా తీశారు. Poorna (The Youngest Girl in the World to Scale Mount Everest)పేరుతో అపర్ణతోట ఒకపుస్తకం కూడా రాశారు. దాని తెలుగు అనువాదం కూడా వచ్చింది. ఇక్కడ వీటన్నింటినీ సమీక్షించటం నాఉద్దేశ్యం కాదు. సుధీర్ రెడ్డిగారి పుస్తకం చదివిన తర్వాత, పూర్ణ 2014లో సాధించిన ఆ విజయం తర్వాత కూడా మరిన్ని రికార్డుల్ని నమోదుచేసినా, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడంపైనే ఈ పుస్తకాన్ని కేంద్రీకరిస్తూ రాయడం వెనుక ఒక కారణమేదో ఉందనిపిస్తుంది. అందువల్లే దీన్ని చదివిన తర్వాత నాకు కలిగిన అభిప్రాయాల్ని ఇలా పంచుకోవడమే దీని లక్ష్యంగా భావిస్తున్నాను.

ఈ రచన శైలీ ఎవరినైనా ఇట్టే కట్టిపడేస్తుంది. అడవిలో చిన్నప్పుడు తప్పిపోయిన పూర్ణను తండ్రి వెతికేటప్పుడు రచయిత దాన్ని రాస్తూ ‘‘నీడ తన బిడ్డ క్షేమాన్ని కోరి తనకంటే ముందుగా పరిగెడుతుందట’’. ఈరచనలో వర్ణించిన అడవి …ఆ అడవిలో ఉన్నచెట్లు, పక్షులు, జంతువులు వాటి ప్రవర్తన ఎంతో లోతుగా పరిశీలన చేస్తే తప్ప అంతసులువుగా అర్థంకావు. ఈ వర్ణనలు పూర్ణ జీవనశైలి నివాస్తవికంగా ఉంటూనే ఆత్మీయం చేస్తున్నాయి. తండ్రి తనకూతురి నివెతుక్కుంటూ వెళ్ళాడు. ఆ గువ్వని అనుసరించటం… సుంకేసులచెట్ల వర్ణనలు వంటివన్నీ డా.కేశవరెడ్డి అతడుఅడవినిజయించాడు నవలను గుర్తుచేస్తుంటాయి. 
హిమాలయాలపై అడుగుపెట్టిన పూర్ణ మనసు విస్మయానికి గురవ్వడంతోబాటు, ఇంకా ఎలాఉందో వర్ణిస్తూ రచయిత ఒకచోట ఇలా అంటాడు.‘‘తెల్లవారు జామున, ఆకాశం నీలమణిలలాంటి నక్షత్రాలతో నిండి అందంగా మెరుస్తుంది. అక్కడికిచేరుకుని, ఓ పిడికెడు నక్షత్రాలను అందుకుంటే బావుందనిపిస్తుంది’’
దళితులు, గిరిజనులు, శూద్రులు ఇలా వారి చరిత్రలను నిర్మించడంలో చాలామంది చరిత్రకారులు సరైనదృక్పథాన్నిపాటించలేదు. దాన్ని పూరించవలరించవలసిన అవసరం ఉంది. అది ఈరచనలో కొద్దిగా కనిపిస్తుంది. గిరిజనులు ముఖ్యంగా ఆ తెగల్లోని బంజారాలు ఈదేశానికి తోడ్పడిన చరిత్రను, సాధారణ చరిత్రకారులు విస్మరించి, చీకటిలోనే దాచేసిన చారిత్రక కోణాల్ని పూర్ణ తండ్రి దేవీదాస్ ద్వార చెప్పించడం రచయితలోని చరిత్రరచనా దృక్పథాన్ని, చరిత్ర పునర్నిర్మాణావశ్యకతను స్పురించేలాచేయగలిగారు.
పూర్ణ తనజీవితాన్ని విజయమార్గం వైపు పయనించడంలో అత్యంత ప్రముఖపాత్ర పోషించిన ఐ.పి.యస్.ఆఫీసర్ఆర్. ఎస్.ప్రవీణ్ కుమార్ మార్గా న్ని వర్ణిస్తూ ఆయన్ని ఒక కర్మయోగిగా అభివర్ణించడంతో పాటు సముచితరీతిలో ప్రస్తావించడం కూడా ఈ రచనకు నిండుతనాన్ని తీసుకొచ్చింది. రచయిత ఏ రాజకీయ భావజాలాలకు లొంగిపోకుండా రచనను కొనసాగించిన తీరుకీ ఘట్టం ఒక గొప్ప ఉదాహరణ. 
గిరిజనులు, దళిత, పీడితజీవితాలతో తన జీవితాన్ని పెనవేసుకున్న ఐ.ఏ.యస్. ఆఫీసర్ ఎస్.ఆర్.శంకరన్ని ఒకమహోన్నతమైనవ్యక్తిత్వం గల సామాజిక పరివర్తన శీలిగా చిత్రించి నవిధానం రచయిత పట్లమేధావుల్లో గౌరవాన్ని కలిగిస్తుంది. ఈ ఇద్దరు మేధావులఇంటిపేర్లూ చూస్తే అటు, ఇటు తిరగేసుకున్నారేమోననిపిస్తుంది!
కోచ్ ల ద్వారా చెప్పిన ప్రతిమాటా ఈ రచనను చదువుతున్న ప్రతిఒక్కరిలోనూ నిరాశను తరిమేసి, కొత్త ఉత్సాహాన్నినింపుతుంది. నేనైతే ఆకోచ్ చెప్పిన మాటల్ని అనేక సార్లుచదువుకున్నాను. కొన్నైతే నాడైరీలో రాసుకున్నాను. మీరూ వీటిని చదివితే ఒకవిద్యుత్ శక్తిలాంటి ఉత్సాహాన్నిపొందుతారు.
• ''సామర్థ్యం అనేది ఒకమానసికస్థితి. సాధారణ ఆలోచనలతో మనమెదడు మొద్దుబారేట్లుగా చేస్తుంటే కొత్త ఆలోచనలు పుట్టవు. ఏరంగంలోనైనా అడుగు పెట్టేటప్పుడు మీకెంతతెలుసు అనేది ముఖ్యంకాదు. ఆ రంగపు తలుపులు తెరిచాక, ఎంత నేర్చుకుంటారు, ఆ నేర్చుకున్నదాన్ని ఎంత సృజనాత్మకంగా ఉపయోగించుకుంటారనేది ముఖ్యమైన వైఖరి. మనం ఏం చేయగలమనేది, మనమెంచుకున్నరంగంలో ఎంతచేయగలమని అనుకోవడం మీద ఆధారపడి ఉంటుంది. 'నేను ఏపనైనా బాగా చేయగలను' అన్న వారికే ప్రపంచం సలాం కొడుతుంది''
• ''అవతలి వ్యక్తిని చైతన్యవంతుడిని చేయాలంటే, ఉత్సాహాన్ని పెంచాలంటే ముందు మనం గొప్పఉత్సాహంతో ఉండాలి. ఉత్సాహం లేనివ్యక్తి అవతలి వారిలో ఉత్సాహగుణాన్ని రగిలించలేడు. చేసేపనిలో ఉత్సాహం ఉంటే ఫలితం నూరుశాతం మెరుగుపడుతుంది.''
• ''మీరు మీలో దేన్నీ చూస్తారో ఇతరులు కూడా బయటనుండి దాన్నే చూస్తారు. దేనికి అర్హులని మీరనుకుంటారో, అది తప్పక మీకు దక్కుతుంది. మీరు నిజంగానే ఎవరెస్ట్ ఎక్కాలనుకుంటే, ఎన్ని అవాంతరాలు ఎదురైనా మీమనస్సు ఎవరెస్ట్ ఎక్కడంలో మీకు దారులుచూపుతుంది. మీ ఆలోచనే అలాజరిగేటట్లుచేస్తుంది"
ఈ పుస్తకం నిండా ఇలాంటివెన్నో స్పూర్తినిచ్చే వాక్యాలున్నాయి. ఇక్కడనాకుఎవరెస్ట్అంటే కేవలం భౌతికంగా ఒకఎత్తైన శిఖరం ఎక్కడం మాత్రమే కాదు; మనం సాధించాలనుకున్న లక్ష్యం కూడా దాన్ని ప్రతిధ్వనిస్తుంది. అందువల్ల తెలుగులో రాసిన ఈ పుస్తకానికున్న పేరు ఇంగ్లీషులో ఉన్నా చాలాబాగుంది. అందుకే ఇది పూర్ణ కోసం రాయలేదు! అంటే కేవలం పూర్ణకోసమే రాయలేదు, మనలో గూడుకట్టుకున్న నిరాశను పోగొట్టుకోవాలనుకొనేవారు పూర్ణ నుచదవాలని చెప్పడానికిరాశారు. పూర్ణను ఒకస్పూర్తి శిఖరంలా చూపడం కోసం రాశారు. అందుకే ఇదిపూర్ణ కోసం రాయలేదు! అంటే కేవలం పూర్ణ కోసమే రాయలేదు, మనలో దట్టంగా. అలుముకున్న చిక్కటి చీకటి నిపోగొట్టుకొనే వెలుగునిచ్చే సంపూర్ణమైన సూర్యశక్తిని మనలోకి ప్రవహింప చేసుకోవడానికిది రాశారు. 
ధ్యానం, యోగా, సూర్య నమస్కారాలు మనలో కలిగించే శక్తినీ, సామర్థ్యాన్ని అనుభవపూర్వకంగా తెలియజెప్పిన విజయగాథ ఇది. దీన్ని భారతీయులు ప్రపంచానికి ఎంతోముందుగానే చెప్పినా దాన్నొక మతవిధానంగా, మతంలో అంతర్భాగంగా భావించేవారికిది ఒకశాస్త్రీయనిరూపణగా సూచిస్తుంది. హిమాలయాలు, ఆ పరిసర శిఖరాలున్న ప్రాంతాల్లో వీటి అవసరం ఎంతో ఉంది. అందువల్లనే ధ్యానాన్ని ఆచరించేవాళ్ళు నేపాల్, టిబెట్, ఇటు చైనా పరిసరప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నారు. ఈ ధ్యానాన్ని శాంతియుత జీవనానికి బౌద్ధం ఒక ప్రధాన ఆచరణగా పాటిస్తుండడం వల్లనే బహుశా ఆ పరిసరప్రాంతాల్లోనే బౌద్ధం అత్యధికంగా నిలబడగలిగిందేమోనని కూడా అనిపిస్తుంది.  
పర్వతారోహణ కోసం అనుమతిస్తూ పూర్ణ తల్లిదండ్రుల సంతకాలు చేసేటప్పుడు తల్లిలో నిఅనురాగం, తండ్రిలోని మొక్కవోనివ్వని ధైర్యాన్ని వర్ణించే సన్నివేశం ఒక్కసారిగా మనకు తెలియకుండానే ఒకఉద్విగ్నతకు గురిచేస్తూ మనచెంపల్ని కొన్ని కన్నీటిబిందువులు ముద్దాడిపోతాయి.
పూర్ణ శిఖరారోహణ సమయంలో ఆక్సిజన్ కోల్పోయి, ఊపిరాడని, ఇక నడవలేనిస్థితిలో అనేక కష్టనష్టాలను అనుభవిస్తున్నప్పుడు తల్లి గుర్తొస్తుంది. ఆకలి తీర్చుకోవడానికి తినలేని తిండిని తినాల్సినప్పుడు ఆమెకు కుటుంబం గుర్తుకొస్తుంది. మరలా తిరిగొచ్చేటప్పుడు ఏమి కావాలో చెప్పమంటే తల్లి ఎందుకేడుస్తుందో మనకా పరిస్థితుల్ని వర్ణించినప్పుడు తీవ్రమైన ఉద్విగ్నతకులోనవుతాం. మరలా నువ్వు తిరిగొస్తే చాలనుకున్న తల్లిమనసుతో మనమూ మమేకమవుతాం. 
ఎవరెస్ శిఖరాన్ని అధిరోహించడమంటే మాటలా? నిత్యం దాన్నే వృత్తిగా నమ్ముకున్న షెర్ఫాలెంతమంది ప్రాణాల్ని పోగొట్టుకుంటున్నారు? దేశదేశాలకు చెందినవాళ్ళు ఎన్నోసార్లు ప్రయత్నించీ ప్రాణాల్ని కోల్పోయిన వాళ్ళెంతమందో. వాళ్ళ శవాల్ని ప్రత్యక్షంగా చూసింది పూర్ణ. అయినా మొక్కవోని ధైర్యంతో ముందుకెళ్ళడంమంటే మాటలా? పూర్ణ, ఆనంద్ లు చిన్నపిల్లలు. వాళ్ళు ఆ వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలనుకుంటే, దాని సాధ్యాసాధ్యాలు ఆలోచించాలి. ఏదైనా జరిగితే అంత పెద్దచదువులు చదువుకున్న ప్రవీణ్ కుమార్ కి ఆ మాత్రంతెలీదా అని ఎంతమంది నిందించేవాళ్ళో! 
ప్రవీణ్ కుమార్ గారు నిరంతరం ఫోన్ ద్వారా వాళ్ళ ప్రయాణాన్ని పర్యవేక్షిస్తున్నా, అనుకోకుండా జరిగిన ఒకప్రమాదంలో పర్వతారోహకులకు సహకరించే షెర్ఫాలు చనిపోవడం, అది నేపాల్ ప్రభుత్వాన్నికుదిపేయడం, ఆ సందర్భంలో వీళ్ళేమయ్యారోనని ఆందోళన చెందినప్పుడు, ఎవరెస్టునెక్కడంకంటే ప్రాణాలతో బయటపడ్డమే ముఖ్యమనిపించే పరిస్థితుల్లో వాళ్ళున్నారనిపించినప్పుడు అక్కడ నుండి తిరిగివచ్చేయమనే ప్రవీణ్ కుమార్ సూచించారని రచయిత రాశారు. అది ప్రవీణ్ కుమార్ వాళ్ళపట్ల తీసుకున్న జాగ్రత్తలకు నిదర్శనం.
మరి, ఆ సందర్భంలో వాళ్ళెలా ప్రతిస్పందించారనేది స్వేరో నింపిన ఆత్మవిశ్వాసాన్ని ప్రతిఫలించేలా రచయిత అంతే గొప్పగా రాశారు. పూర్ణ స్వేరోలో చదువుకున్న పదిసూత్రాల్లో తొలిసూత్రం‘‘నేను ఎవరి కంటే తక్కువ కాదు’’ అనేది తన ఎవరెస్ట్ శిఖరారోహణకు స్పూర్తి తీసుకుందంటారు రచయిత. పదోసూత్రం ‘‘నేను మొదలు పెట్టిన పనిని పూర్తి చేసే దాకా వదలను’ ’అనే దాన్ని ఆత్మవిశ్వాసంగా మార్చుకుంది. అందుక నేప్రపంచంలోనే అతిచిన్నవయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటివ్యక్తిగా చరిత్ర సృష్టించింది. అంతేనా…ప్రతిరోజూ ప్రపంచదేశాల్ని చుట్టివచ్చే ఇండిగో క్యారియర్ లగేజీ విమానాలపై స్త్రీశక్తికి గుర్తుగా "పూర్ణ" అనే అక్షరాలు విజయపతాకంగా ఎగిరేలా చేసింది. 
పూర్ణ తాను ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన వెంటనే డా.బి.ఆర్.అంబేద్కర్, ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్, ఎస్.ఆర్.శంకరన్ గార్లకెలా కృతజ్ఞతా భావాన్ని వ్యక్తం చేసిందో చెప్తూ రచయిత ఈరచనను అద్భుతంగా ముగించారు. అది మీరు తెలుసుకోవాలంటే చదివాలి. అది ఈ రచనకుప్రాణం.
చివరిలో తనరచనానుభవాన్ని కూడా స్ఫూర్తిని నింపేలా చెప్పినమాటలు మనందరినీ ఆలోచింపజేస్తాయి. ఇంతగొప్ప రచనను అందించిన సుధీర్ రెడ్డిగారి రచనను పూర్తిగా చదివితే నాతో పాటు మీరూ అభినందించకుండాఉండలేరు.
ముగించే ముందొకమాట చెప్పాలనిపిస్తుంది. 
ఈ పుస్తకం చదువుతున్నంతసేపూ
పూర్ణనుఒకతండ్రిలాఎత్తుకు నిముద్దాడాలనిపించింది.
పూర్ణ ఆ శిఖరాల్ని ఎక్కుతుంటే నేనే ఎక్కుతున్నంతగా ఫీలయ్యాను.
విజయం చివరిదాకా వచ్చి
ఏ నిస్పృహ గెద్ద తన్నుకుపోతుందోననిపించింది.
ఆమె విజయ పతాకాన్ని ఎగురవేసిన తర్వాత 
నా మనసంతా ఎంతో తేలికై పోయింది. అమ్మయ్య అనిపించింది.
సంతోషంతో ఆనందభాష్పాలు రాలిపడ్డాయి.
ఆమె అధిరోహించిన ఎవరెస్ట్ శిఖరాన్నిప్పుడునేనెలాగూఎక్కలేను;
ఆమెనొకతండ్రిలాఎత్తుకొనీ ముద్దాడలేను. 
కానీ, ఆమెనుండి ఓఆటో గ్రాఫ్ తీసుకోవాలనిపిస్తుంది.
ఆమె ఆటోగ్రాఫ్
ఓపరి ‘పూర్ణ’మైనవిజయపతాకంగా
నిత్యం నాలో రెపరెలాడించుకోవాలనిపిస్తుంది. 
ఇదే ఈ పుస్తకంలోని ఎవరెస్ట్ ఇన్ మైండ్ లక్ష్యమనుకుంటున్నాను!
***

కామెంట్‌లు లేవు: