విరిగిన స్వప్నాలు
ఒకప్పుడు
ఆ పలుకంతా పంచదారలా
ప్రతి పదమూ కవిత్వమయ్యేది
ఒకప్పుడు
ఆ నడకంతా ఆత్మవిశ్వాసంతో
ప్రతి అడుగూ ధైర్యమిచ్చేది
ఒకప్పుడు
ఆ కళ్ళనిండా నదులు కదులుతూ
కలల సీతాకోక చిలుకలే ఎగురుతుండేవి
ఇప్పుడేమిటిలా
గొంతుని తడపని జల్లుల్లా
ఆ మాటల్లో అస్పష్టమైన భావాలు
ఇప్పుడేమిటిలా
తప్పనిసరి బాటసారి పయనంలా
తడబడుతున్న అడుగులు
ఇప్పుడేమిటిలా
కళ్ళనిండా కురుస్తున్న చీకటితో
నేలరాలుతున్న స్వప్నాల చప్పుళ్ళు.
దార్ల వెంకటేశ్వరరావు, 12.5.2022
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి