"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

30 మే, 2022

కృపాకర్ మాదిగ కవిత్వం ‘పంచుకుందాం రా’ పుస్తకంపై ఆచార్య దార్ల ప్రసంగం (29.5.2022)

భూమిపుత్ర దినపత్రిక, 29.5.2022 సౌజన్యంతో

కృపాకర్‌ మాదిగ కవిత్వంలో  బహుజన దృక్పథం

ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు,

  తెలుగు శాఖ అధ్యక్షుడు, యూనివర్సిటి ఆఫ్‌ హైదరాబాద్‌ ,

 హైదరాబాద్‌`500046,

ఫోను: 9182685231

 

                మాదిగ సాహిత్యానికున్న సొంతదనాన్ని, మాదిగ జీవితాల్నే కేంద్రంగా చేసుకొని వచ్చిన సాహిత్యాన్ని, దాని ద్వారా ప్రతిఫలనమైన మాదిగ తత్త్వాన్ని కృపాకర్‌ మాదిగ తన కవిత్వం, వ్యాసాల ద్వారా బలమైన గొంతుతో వినిపిస్తున్నారు. ఈయన 1989 నుండి 2022 వరకు రాసిన 127 కవితలను ‘‘పంచుకుందాం రా!   బహుజన మహాకావ్యం పేరుతో ఒక సంపుటిగా మనముందుకి తీసుకొచ్చారు. ఇంచుమించు ఈ కవితలన్నీ వివిధ పత్రికల్లో ప్రచురితమైనవే. దీనికి ఆచార్య ఎండ్లూరి సుధాకర్, ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, జూపాక సుభద్ర, బి.ఎస్.రాములు, జి. లక్ష్మీనరసయ్య ముందుమాటలు రాశారు. నామాట పేరుతో కవి కృపాకర్ మాదిగ ఈ తన కవిత్వ నేపథ్యాన్ని వివరించారు.

నా చీకటి తొవ్వల్లో

చుక్కపొద్దులై నిలిచి

 నా అడివి దారుల్లో

పరిమళాలై పూసి

నా ఎండ తలను

నీడ కొమ్మలై నిమిరి

నా చెమటంటిన జీవితాన్ని

శరదృతువులై చుట్టి

నా ఆకటి ఆకాశంలో

సంగటి సందమామలై

దిగులు మొగులు కమ్మినపుడు

దిటవు దీపాలై ఎలిగిన

స్నేహితురాళ్ళకు

 

ఇంకా

నా ఇంటి పొద్దు

జూపాక సుభద్రకు

 

నాతో నడిచిన

నన్ను వెంబడించిన

కార్యకర్తలకు

సహచర మిత్రులకు

వివక్షల పై దండోరేసి

గూటమెత్తిన ప్రతి వొక్కరికీ......

ఇంకా నా ఇంటి పొద్దు జూపాక సుభద్రకు

నాతో నడిచిన నన్ను వెంబడించిన

కార్యకర్తలకు సహచర మిత్రులకు వివక్షల పై దండోరేసి

గూటమెత్తిన ప్రతి వొక్కరికీ...... దీనిలో మాదిగజీవితాన్ని ప్రధానకేంద్రంగా తీసుకొని కవిత్వం రాసినా, స్థానీయత నుండి విశ్వజనీనతను చూపించగలిగే కవితాహృదయం ఈపుస్తకం నిండా కనిపిస్తుంది. సామాజిక సమస్యల్ని కళాత్మకం చేయడమనే కవితారహస్యం ఈ కవిత్వంలో ప్రతి కవితలోను ప్రతిఫలిస్తుంది. ఇవన్నీ అలవడాలంటే జీవితానుభవం, విస్తతమైన అవగాహన, లోతైన సాహిత్య, సామాజిక పరిశీలన ఉంటే తప్ప అలవడ్దం అంత సులభం కాదు. దీన్ని సొంతం చేసుకున్నారు. కృపాకర్‌ మాదిగ. ఒక వ్యక్తి ఉద్యమకారుడిగా, వక్తగా, దార్శనికుడిగా, రచయితగా, కవిగా విభిన్న పార్శ్వాలతో వెలుగొందేవాళ్ళు చాలా కొందిమంది మాత్రమే ఉంటారు. అటువంటి వారిలో పొనుగోటి కృపాకర్‌ మాదిగ ఒకరు. మాదిగ దండోరా ఉద్యమానికి తాత్త్వికపునాదులు వేయడంలో, దాన్ని కొనసాగించడంలోనూ ఈయన కృషి మరువలేనిది. ఒకవైపు క్షేత్రస్థాయిలో సామాన్య ప్రజల నుండి మేధావుల వరకు తన ఉద్యమంతో చైతన్యపరుస్తూనే, సాహిత్యం ద్వారా మాదిగ భావజాలాన్ని కూడా విస్తరింపజేస్తున్నారు. ఈయన సంపాదకత్వంలో వచ్చిన ‘‘కైతునకలదండెం’’ కవితా సంకలనం మాదిగ జీవితాల్లోని అనేక సాంస్క ృతికాంశాలను ఒకేచోటపెట్టి తెలుగు సాహిత్యానికి పరిచయం చేసింది. ఇది తెలుగు సాహిత్యంలో మాదిగ సాంస్కృతిక జీవిత పార్శ్వాన్ని అనేక కోణాల నుండి చూపించి సరికొత్త ధోరణికి మార్గం వేసింది. ఇప్పుడు సబ్బండ కులాలన్నింటి గొంతుగా, కలిసి పయనిస్తూనే తమ తమ అస్తిత్వాలకు భంగం కలగకుండా ఎవరికి రావలసిన హక్కుల్ని పొందడానికి కలిసిపనిచేయలాల్సిన పరిస్థితిని చెప్తూనే, తమ తమ హక్కుల్ని సమానంగా అనుభవించే ఒక ప్రజాస్వామ్య ఐక్యతాసూత్రాన్నీ సూచిస్తున్నారు.

            ‘’నాలుగు చేతులు ఒక్క బంతై/ గాల్లో ఎగరడం

            నాలుగు కళ్ళూ వేటలో /ఒకటే గురిగా మారడం

            కళ్ళు అనేకమైనా/ కల ఒక్కటే కనడం

            నాలుగు కాళ్ళూ ఒకే దారిగా నడవడం ‘’ (పంచుకుందాం రా! పుటః 82-83) అని బహుజన తత్త్వంలోని మూలసూత్రాన్ని కవిత్వీకరిస్తాడు కవి.సమాజానికి నేడెలాంటి భావాలవసరమో వాటిని భావోద్వేగసమ్మేళనంగా ఈ కవిత్వాన్ని అందించారు కవి.సెజ్‌(Special Economic Zones) పేరుతో భూముల్ని సేకరించి పరిశ్రమల పేరుతో ధనవంతుల్ని మరింత ధనవంతులుగాను, పేదవాళ్లను మరింత పేదవాళ్ళుగాను మార్చే ప్రక్రియ ప్రపంచీకరణ ముసుగులో వచ్చిన ఒక మేధోపరమైన దోపిడీమార్గంగా చాలా చోట్ల కనిపిస్తుంది. దీన్ని స్థానికత నుండి విశ్వజనీనతకు చూడదగిన కవిత్వాంశం. సామాజిక హక్కుల కోసం, కనీసం జీవన భద్రత కోసం జరుగుతున్న పోరాటాల్లో భాగంగా మారిపోతున్న పరిస్థితుల్ని‘‘ప్రత్యేక చావు మండళ్ళు’’ కవితలో శక్తివంతంగా వర్ణించారు కవి.

                        ‘‘సీవలు పుట్టలు పెట్టినట్టు

                        తేనీగలు తుట్టెలు కట్టినట్టు

                        మేం కట్టిందే మావూరు

                        ఇప్పుడది పనిదొంగల పెత్తందార్ల

            యాపార్ల పూజార్ల వూరయ్యింది’’ అంటూ రాసిన కవితలో పైసా పైసా కూడ బెట్టుకొని సంపాదించుకున్న సెంటు భూమిని కూడా పేదవాళ్లనుండి అధికారికంగానే లాగేసుకుంటున్న వైనాన్ని సీమలు పెట్టిన పుట్టల్లో పాములు దూరినట్లు, ఒక్కొక్క పువ్వునుండి మధువుని సేకరించిన తేనెటీగల్ని చంపేసి ఆ తేనెను చేజిక్కుంచుకునే వాళ్ళతో పెత్తందార్లను పోల్చడం గొప్ప అభివ్యక్తి. ఈ పరిస్థితి తెలంగాణలోనో, ఆంధ్రప్రదేశ్‌ లోనో మాత్రమే కాదు, యావత్తు భారతదేశంలోను, ప్రపంచంలోని అనేక దేశాల్లో  ఇదేరకమైన ప్రమాదకరమైన పరిస్థితి కనిపిస్తుంది. దీన్నే కవి స్థానికత నుండి విశ్వజనీనతను దర్శించడమంటే. అది కూడా భౌతిక వాస్తవికతలనుండి సామాజిక ప్రతిఫలనను కవిత్వీకరించడం ప్రగతిశీల కవికి మాత్రమే సాధ్యం.

            ఇంచుమించు దీనికి దగ్గరగానే ఉంటూనే ప్రపంచీకరణ ప్రజాస్వామ్యంలో ప్రవేశించిన దోపిడీ తీరుతెన్నుల్ని మన కళ్ళముందుంచే కవిత పాదయాత్రలన్నీ దండయాత్రలే’. ఒక కంట్లో వెండితెర, ఇంకొకకంట్లో బుల్లితెరలను మనకిచ్చి, మన ప్రమేయం లేని కార్యక్రమాల్నీ, వాళ్ళ జీవితాల్నీ వార్తాంశాలు, కథనాలుగా ప్రసారం చేసే ప్రసార, ప్రచార సాధనాలను గమనించాలంటున్నాడు కవి. మీడియా మాయాజాలాల్లో  వాళ్ళిచ్చిందే వార్త. వాళ్ళు రాసిందే నిజం. 5 w s & H ఆధిపత్యం చెప్పినట్లు వినాల్సిందే. తమ గురించి ఉన్న గొప్పనీ లేని గొప్పనీ చెప్పుకోవడంతో ఆగదీ మీడియా. వైయక్తిక, ప్రాంతీయ విద్వేషాల్ని కూడా నిస్సిగ్గుగా ప్రసారం చేయడానికీ వెనుకాడని స్థితి కొన్ని ఛానల్స్‌ లో కనిపించడాన్ని ఉదాహరణగా ‘‘ఇగ నీ బొమ్మల పెట్టెను మూస్తావా?’’ కవితను చూడొచ్చు.

            పోనీ ప్రభుత్వ ప్రచార, ప్రసార సాధనాలేమైనా పేదల, అణగారిన వర్గాల, వర్ణాల వార్తలేమైనా పట్టించుకుంటాయా అని ప్రశ్నించుకుంటే సంక్షేమ పథకాలన్నీ వీళ్ళగురించే ఉంటాయి. వాటి అమలు, వాటిలో అవినీతి లొసుగుల వంటివాటిని పట్టించుకోవు. శాటిలైట్‌ ఛానల్స్‌ వచ్చిన తర్వాత ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న ఛానల్స్‌, ఆకాశవాణి ప్రసారాలు, ప్రజాపౌరసంబంధాల వాళ్ళు ప్రచారం చేసేవన్నీ గణాంకాలు, ప్రభుత్వాధినేతల ఫోటోలతోనే నిండిపోతున్నాయి. ప్రభుత్వం ఆధ్వర్యంలో వచ్చే పత్రికలు ప్రజాసమస్యల్ని, వాటి పరిష్కారాల కోసం పోరాడేవార్తాంశాల్ని ప్రచురిస్తాయనుకోవడం అత్యాశగానే కనిపిస్తోంది. అందుకనే ‘‘మీడియాజాగీర్లపై దండోరా’’ చేయాల్సిన అవసరం ఉందంటున్నాడు కవి. అలాగే జీవితాల్ని మార్చగలిగే శాశ్వత సంక్షేమపథకాలు కాకుండా, తాత్కాలిక ప్రయోజనాల్ని పొందుతూనే, వాటిలోను తమ ఆర్థిక ప్రయోజనాల్నీ సాధించగలిగేలా రూపొందించే పథకాల పట్ల ఓటర్లు జాగూరుకత కలిగి ఉండాల్సిన అవసరాన్ని చాటుతున్నాడు. లేకపోతే ప్రజాస్వామ్యంరూపంలో మనీ, మజిల్‌, మీడియాల మాయాజాలాలకు బలికావాల్సిందేననే హెచ్చరిక చేస్తున్నాడు కవి. లేకపోతే అదొక దొమ్మీస్వామ్యంఅయిపోయి ‘‘ఆ పేద తల్లి ఐదేళ్ల ఆశల్ని’’ ఒక్క ఓటుతో కోల్పోవలసి వస్తుంది. మానవులు, మానవ జీవితంలో సమస్యల్లాగే ఈ కవితాసంపుటిలోని కవితల మధ్య ఒక సూత్రత ఉంటూనే ప్రత్యేక అస్తిత్వాన్ని కలిగి                ఉన్నాయి. ఇది  వైయక్తికత నుండి వ్యవస్థీకృత ధర్మాన్ని సాధించిన కవితాలక్షణం.

            ఇంతవరకు తెలుగు సాహిత్యంలో మాదిగలకున్న అస్పృశ్యతనే అత్యధికంగా చిత్రించిన కవులున్నారు. మాదిగల జీవితాల్ని కేంద్రంగా చేసుకొని కథలు రాసినవాళ్లూ ఉన్నారు. దళితుల గురించి రాస్తున్నారంటే మాదిగల గురించి రాయడమే ప్రధానంగా జరిగేది, నేటికీ జరుగుతున్నదీ అదే. కానీ మాదిగ దండోరా ఉద్యమం, దాని ప్రభావంతో వచ్చిన సాహిత్యం వల్ల ‘‘దళిత’’ సాహిత్యం అస్తిత్వం ప్రశ్నార్థకమయ్యింది. కులం వల్ల సామాజికంగా, ఆర్థికంగా, సాంస్క ృతికంగా, రాజకీయంగా, మానసికంగా, అన్నిరంగాల్లోనూ పీడనకు గురవుతున్న వాళ్ళను దళితులుగా గుర్తించిన సాహితీవేత్తలే పునరాలోచనలో పడ్డారు. మాదిగసాహిత్యం నుండే దళితసాహిత్యాన్ని చూడాలనే వాదన పెరిగింది. అందువల్ల దళిత సాహిత్యమంతా మాదిగ సాహిత్యంగానే చూడాల్సిన పరిస్థితి ఏర్పడిరది. ఎందుకంటే కేవలం కులం మాత్రమే ప్రధాన వివక్ష కాకుండా ప్రధానజీవన స్రవంతికి దూరంగా కొండల్లో, కోనల్లో బతుకుతున్న వారి సమస్యల్ని చిత్రించే సాహిత్యం గిరిజన సాహిత్యంగా ప్రత్యేక గుర్తింపుని పొందింది. మతం, ప్రాంతం (స్థానికత), కులాంతరతల ముప్పేట వివక్షలకు గురవుతున్న ముస్లిములు, క్రిస్టియన్సు తమది ‘‘మైనారిటీ సాహిత్యం’’ సాహిత్యం అంటున్నారు. అందువల్ల ముస్లిం మైనారిటీ సాహిత్యం, క్రిస్టియన్‌ మైనారిటీ సాహిత్యంగా అది ప్రత్యేక అస్తిత్వాన్ని కోరుకుంటుంది. స్త్రీల సమస్యలు ప్రధాన కేంద్రంగా, కుల వివక్ష కూడా తోడయినప్పడు స్త్రీవాదంలో ఆయా కుల స్త్రీవాదాలుగా గుర్తింపుని కోరుకుంటున్నాయి. ఇక, నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో మాదిగ, మాల, గిరిజన, ముస్లిముల తర్వాత కుల వివక్షను ఎదుర్కొంటున్నవాళ్ళు వెనుకబడిన తరగతులవారు. వీరిప్పుడు ‘‘వెనుకబడిన కులాలు’’ అనే  గుర్తింపుతో ముందుకొస్తూ, బి.సి.సాహిత్యంగా ప్రత్యేక అస్తిత్వాన్ని కోరుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ‘‘దళితసాహిత్యం’’ అనే పారిభాషిక పదం క్రమేపీ కనుమరుగయ్యేలా చేసి, దాని స్థానంలో పైన పేర్కొన్న వాళ్ళందరి సాహిత్యాన్నీ ‘‘బహుజనసాహిత్యం’’గా పరిగణించాలని భావిస్తున్నారు. దీనివల్ల ఒక ప్రయోజనం ఉంది. మరొక ప్రమాదం కూడా ఉంది.

            ఒకప్పుడు ‘‘దళితసాహిత్యం’’ పేరుతో కుల, మత, లింగవివక్షలకు గురైనవాళ్ళంతా ఒక సమైక్యశక్తిగా ముందుకొచ్చినా, అప్పడు ఆయా కులాల వారికి ప్రత్యేక అస్తిత్వాలు లేవు. దీన్నంతటని కలిపి అస్తిత్వసాహిత్యంగా పిలిచారు. కానీ ఇప్పుడు వాళ్ళ వాళ్ళ కుల ప్రత్యేక అస్తిత్వాల్ని కాపాడుకుంటూనే, సమైక్యశక్తిగా బ్రాహ్మణీయ కులాధిపత్యాన్ని, ఆ వివక్షల్నీ ఎదిరించగలగే బలీయమైన సాహిత్యం ‘‘బహుజన సాహిత్యం’’గా మారుతుంది. దీన్నే అస్తిత్వానంతర సాహిత్యం అని పిలుస్తున్నారు. దళిత సాహిత్యం కనీస గుర్తింపుని కోరుకుని తెలుగు సాహితీ ప్రపంచంలో అస్తిత్వం కోసం ప్రయత్నించిన సాహిత్యం అయ్యింది. తర్వాత దశలో సాహిత్యంలో గుర్తింపు లభించినా, సాహిత్యం ద్వారా సాధించాల్సిన సామాజిక ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. ప్రత్యామ్నాయ సంస్కృతి స్థిరీకరణతో పాటు సాహిత్యం రాజ్యాధికారానికి ప్రేరణగా నిలవాల్సిన మార్గాన్ని చూపిస్తుంది. అందువల్ల దీన్ని అస్తిత్వానంతర సాహిత్యంగా పిలుస్తున్నారు. అయితే బహుజన సాహిత్యం అనడంలో గలప్రమాదం విషయాన్ని పరిశీలిస్తే, మరలా రాయగలిగేవాళ్ళు, అంతర్గత ఆధిపత్యకులాల వాళ్ళు సమైక్యం పేరుతో మళ్ళీ తమ ఆధిపత్యాన్ని చెలాయించగలుగుతూ, కొన్ని కులాల సాహిత్యాన్నే ‘‘బహుజనసాహిత్యం’’గా ప్రచారం చేస్తారనే భయం ఉంది. కానీ, కృపాకర్‌ మాదిగ రాసిన కవిత్వాన్నిగానీ, సాహిత్యాన్నిగానీ పరిశీలిస్తే తమ తమ అస్తిత్వాల్ని గుర్తించుకుంటూనే రాజ్యాధికారం వైపు మార్గాన్ని సూచించేలా ఉంది. దీనికి ఒక బలమైన ఉదాహరణగా నిలిచే కవితా ఖండిక యూదా ముద్దు’. దీనిలో మాదిగ-మాలలది అహేశ్యతలోను, వివక్షలోను ఐక్యతా ఘర్షణల సామాజిక బంధంగా  కారల్‌ మార్క్స్‌ సిద్ధాంతంలోని ఒక సూత్రాన్ని దేశీయకోణంతో అనువర్తింపజేశారు. ఈ కవితలో ఇంతవరకు మాలలకున్న అస్పృశ్యత, వివక్షలను తెలుగు సాహిత్యంలో నాకు తెలిసినంతవరకూ ఎవరూ వర్ణించలేని వారి స్థాయీ భేదాల్నీ వివరిస్తూనే, మాదిగలకు జరిగిన అన్యాయాన్ని సమర్థవంతంగా నిరూపించగలిగాడు కవి.  ఈ పద్ధతిలో బహుజన సాహిత్యంకొనసాగగలగాలి. దీనికి చక్కని సైద్ధాంతిక ప్రాతిపదికను సూచించిన కవితగా దీన్ని చెప్పుకోవచ్చు. ఐక్యతా సంఘర్షణలున్నా భావజాలాల విషయంలో తమ పోరాటమెవరిపైనో స్పష్టంగా చూపే కవితగా కులానికి ఉరి కలేకూరిని అభివర్ణించవచ్చు. 

            తెలంగాణా ప్రాంతీయ సమస్యలు వచ్చినప్పుడు మాదిగ కవులు, సాహితీవేత్తలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రావిర్భావానికి తమవంతు మద్ధతునిచ్చారు. దీన్ని ‘‘దండోరా ధూం ధాం’’ కవితలో మాదిగ దండోరా అడుగుతున్న ఎస్సీ వర్గీకరణతో ముడిపెట్టి వర్ణించడంలోనే కవిగా కృపాకర్‌ మాదిగ మాదిగలందరి ప్రతినిధిగా మాట్లాడుతున్నట్లుంది. తెలంగాణ రాష్ట్రావిర్భావం న్యాయంగా జరిగింది. అలాగే ఎస్సీ వర్గీకరణ కూడా న్యాయపరంగా జరగాల్సి ఉంది. న్యాయం గురించి మాట్లాడే  వాళ్ళు ఎస్సీ వర్గీకరణ సమస్య న్యాయం కాదని కోర్టులకెళ్ళడం వారి ద్వంద్వనీతికి నిదర్శనంగా నిలుస్తుంది. దళిత సమైక్యతగురించి మాట్లాడేవాళ్ళు ఏదిరా సమ ఐక్యత కవిత చదవాల్సిందే. మాదిగల ప్రత్యేక అస్తిత్వాన్నీ, న్యాయంగా రావాల్సిన హక్కుల్నీ సాంస్కృతిక పునాదుల నుండి చూపిస్తూ

                        ‘‘ఏ వూళ్ళో నన్నా

                        మా పిలగాళ్ళకి మీ పిల్లల్ని ముడేస్తారా?’’ అని మాదిగ-మాలల మధ్య వైవాహిక సంబంధాలు లేని వాస్తవాన్ని కవిత్వీకరించాడు కవి. ఇక్కడో ప్రశ్న చాలామందికి పుడుతుంది. కులాంతర వివాహాలు జరుగుతున్నాయని, మాదిగ, మాలల మధ్య పెళ్ళిళ్ళు జరుగుతున్నాయని వాదించే వాళ్ళుంటారు. అవన్నీ బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, కమ్మ, రెడ్డి కులస్తులతో మాదిగలు, మాలలకు వివాహాలు జరిగినట్లే జరుగుతున్నాయి. ఇష్టపూర్వకంగా, వ్యవస్థీకృతంగా జరుగుతున్న వివాహాలు కాదు. ఆచార సంప్రదాయాలుగా జరుగుతున్నవంతకంటే కాదు. అలాంటివే మాదిగ, మాలల మధ్య జరుగుతున్న వివాహాలు కూడా.

            ‘బతుకుపాట’, ‘నాకవితమొదలైనవన్నీ కవిత్వావిర్భావానికి కవిపడే పురిటినొప్పుల్ని మనముందుంచుతుంది. తన కవిత్వం సరదా కోసమో, ప్రయోగాల ప్రదర్శన కోసమో కాదనీ, కవిత్వం ఒక బాధ్యతగా, కవిత్వం ఒక సామాజిక ప్రయోజనంగా భావిస్తున్న సంవేదన వీటిలో కనిపిస్తుంది. బతుకుపాటలో...

                        ‘‘కాసిన్ని గీతాలకోసమే కదా

                        నేను నిద్రహారాలూ మానించి

                        చీకటి దారులెంట పిచ్చిగా తిరిగింది

                        చెట్లూ, పుట్టలూ అరణ్యాలూ పట్టుకువెతికింది’’ అంటూ కాసిన్ని గీతాలకోసమే కదా’’ అనే పునరుక్తి అక్షరం కోసం, చదువుకోసం, కవిత్వమవ్వడం కోసం తరతరాలుగా ఎదురుచూసినవారి వేదనను వర్ణించిన తీరు అద్భుతం.

            వాకిలిపిట్టలు, వొంటరిపాట, సాగర సందర్శనం, అమ్మకోసం మొదలైన కవితలన్నీ చక్కని దృశ్యాత్మక వర్ణనానుభూతులు, పదచిత్రాలతో పాఠకుల్ని అనుభూతులతో నింపేస్తాయి. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టును చూసిన కవి ‘‘కూలి దుక్కాల మడుగు కూలిన జీవితాల గొడుగు’’ అనడంలో శ్రామికదృక్పథం స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకి మాత్రమే పరిమితమైన కవిత కాదిది. సాధారణంగా  ఏ బహుళ ప్రాజెక్టు కట్టినా పేదవాళ్ళు నిలబడ్డానికి పైసాపైసా కూడబెట్టుకున్న స్థలాలే అధికారికంగా బలవంతంగా లాక్కునే ప్రయత్నాలు కనిపిస్తుంటాయి. కాకపోతే, కొన్నాళ్ళు ఆందోళనలు, పత్రికల పతాకశీర్షికలు, టీవీల్లో చర్చలు జరుగుతాయి. సారాంశంలో ప్రజాప్రయోజనాలకు వాటిని తీసుకోవడం తప్పుకాదనే డైరెక్షన్‌ని ఇస్తాయి. ఆ ప్రాజెక్టులకు కోల్పోయిన భౌతికమైన ఆస్తులతో పాటు వారికి ఆ నేలతో మానసికంగా పెనవేసుకొన్న బంధాల్ని కూడా లాగేసుకుంటారు. పర్యాటకులకు గానీ, ఆ ప్రాజెక్టుల వల్ల తొంబదితొమ్మిది శాతం లబ్ది పొందుతున్నవాళ్ళకు ఎవరికీ ఈ కోల్పోయినబంధాలు తెలియవు. వాళ్ళు కనీసం వాటిని పట్టించుకోరు. వాళ్ళు పట్టించుకొనేదల్లా రికార్డుల్లో కనిపించే శిలాఫలకాల చరిత్ర మాత్రమే.ఆప్రాజెక్టుల భౌతికప్రయోజనాలు మాత్రమే. ఆ ప్రాజెక్టుల భౌతిక సౌందర్యం మాత్రమే. ఇలాంటప్పుడే ఈ కవి ఆ ప్రాజెక్టుల్లో ఆత్మను దర్శించగలిగాడు. ఈ కవిత ద్వారా పోలవరం ప్రాజెక్టు, గంగవరం పోర్టు, కోస్తాకారిడార్‌, అమరావతి నగర నిర్మాణం మొదలైన ప్రాజెక్టులను స్ఫూరింపజేస్తున్నాడు కవి. ఒక భౌతిక సౌందర్యం వెనుక దాగున్న విషాదకెరటాల్ని దృశ్యమానం చేస్తున్నాడు కవి. 

            ‘‘మాగూడెంలోకి రా’’ అనే కవిత ఒకరు రాసిన కవితకు ప్రతిస్పందనగా వచ్చిందే అయినా, జీవితానుభవాల్ని తాత్వీకరించే భావాలీ కవితనిండా ఉన్నాయి. జ్ఞానం రకరకాలుగా ఉంటుంది. దీన్ని ప్రధానంగా మూడురకాలుగా చెప్తుంటారు. అనుభవ జ్ఞానం. జీవితానుభవాల ద్వారా వచ్చేది. రెండవది సగం జీవితానుభవాల నుండీ, ఇతర జీవితానుభవాలను తెలుసుకోవడం ద్వారా కలిగేది. మూడోది జీవితానుభవం, తార్కికత లేకుండా ఊహల నుండి జీవితాల్ని వాస్తవమని నమ్మించగలిగే మేధో జ్ఞానం. మూడోది చాలా ప్రమాదకరమైంది. మొదటిది ప్రమోదకరమైంది. రెండవది ప్రయోజనకరమైంది. కొంతమంది జీవితాల గురించి తెలియకుండా ఆ జీవితాల గురించి ఊహల్ని రాయడం, వాస్తవాల్ని విస్మరించి, దాన్ని నీచ సంస్క ృతిగా అభివర్ణించడం సాహిత్యంలో నేరంలాంటిదే. అలాంటి నేరాల్ని తెలుగు సాహిత్యంలో చాలా మంది చేశారు. ఇంకాచేయాలని ప్రయత్నిస్తున్నారు. వాళ్ళును అడ్డుకట్టవేసి, వాళ్ళనీ వాస్తవాన్ని గుర్తించి రాయమని చెప్పే కవితగా దీన్ని చూడాలి. ‘‘గూడెం’’ ఒకప్పడు సమాజం అన్నిరకాలుగాను విస్మరించిన జాతులు జీవించే జీవితాలకు ప్రతీక. ఆ జీవితాల్ని కళ్ళారా చూస్తే, మనసారా ఆలింగనం చేసుకుంటే ఈ కవితాసంపుటి నిండా ఉన్న ఉద్వేగాలు, త్యాగాలు, వీరత్వాలు కనిపిస్తాయి. సంస్కృతికి ఉన్న అర్థం తెలుస్తుంది. అందుకే కేవలం మా గూడెంలోకి రా’’ అనేదొక కవితకే కాకుండా సంపుటిలోని కవితలు ప్రతిధ్వనించే భావ జాలాలన్నింటికీ ప్రాతినిధ్యం వహిస్తుంది. 

            తినే తిండిమీదా, మాట్లాడే మాటమీదా, ఉండే స్థలం మీదా... ఇలా అన్నింటిపైనా ఆంక్షలు పెట్టే ఆధిపత్య సంస్క ృతిని బలంగా తిప్పికొట్టడమే కాకుండా, అనేక పీడిత కులాల వారి అస్తిత్వగొంతుగా ఈ కవిత్వం కనిపిస్తోంది. ఆ దేవాలయాల్లోకి రానీయరు, మరొక దేవాలయాలకు పోనీయరు. ఆ మతాన్ని అనుసరించాలంటే ఆంక్షల సంకెళ్ళు భరించాలి. ఆ సంకెళ్ళు తెంచుకుని తమకున్న స్వేచ్ఛతో తమకిష్టమైన మతాన్ని అనుసరిస్తున్నారు. దాన్నీ వ్యతిరేకించడమే కాకుండా దాడుల్ని చేస్తున్న మతమౌఢ్యాన్ని ఖండిస్తున్నాడు కవి. చివరికి తామేది మాట్లాడాలో, తామేది తినాలో, తామేమి కట్టుకోవాలో, తామెలా జీవించాలో నేర్పే నియంతృత్వాన్ని నిరసిస్తున్నాడు. మానవహక్కుల్ని హరించే విషసంస్కృతిని వ్యతిరేకించే బలమైన పిడికిళ్ళుగా కనిపిస్తాయీ కవితలు.

            కొన్ని శతాబ్దాల చారిత్రకానుభవాల్ని ఆత్మీకరించుకొని, సుమారు మూడు దశాబ్దాలుగా రాసిన ఆణిముత్యాల్లాంటి కవితల్లో కొన్నింటిని ఈ సంపుటిగా అందిస్తున్న ఈ కవిత్వాన్ని జీర్ణించుకోవాలంటే మనసున్న మనుషులు కావాలి. మానవత్వం పరిమళించమనసుకావాలి. అప్పుడే దీనిలో పరిమళించే భాషాసౌందర్యం తెలుస్తుంది. దీనిలో వర్ణించిన జీవితం తెలియాలంటే మట్టిని ముద్దాడే మనుషులు నివసించే గూడేల్లోకి రావాలి. ఈ కవిత్వం అర్థం కావాలంటే తరతరాల ఆధిపత్యం అర్థం కావాలి. ఈ కవిత్వాన్ని ఆలింగనం చేసుకోవాలంటే వ్యక్తిగా మనిషికున్న స్పందనలు తెలియాలి. వ్యక్తిగా మనిషికున్న హక్కులు తెలియాలి. వ్యక్తి వ్యవస్థగా పరిణమించిన, పరిణమించాల్సిన పరిస్థితులు అవగతం కావాలి. వ్యక్తి ఆయుధంగా మారాల్సిన అవసరం అర్థం కావాలి. సమకాలీన సమాజాన్ని చూడగలగాలి. వ్యక్తి కుటుంబంగా మారినప్పుడు తల్లిదండ్రుల ఆత్మీయతానురాగాలు ఒంటపట్టాలి. కుటుంబంలో భార్యాభర్తలు ఒకరికొకరు వాకిలిపిట్టలై ఎదురుచూడగలిగే నిరీక్షణ కావాలి. విడదీయరాని  అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ళ అనుబంధాలతో మమేకం కావాలి. గ్రామానికీ, పట్టణానికీ, నగరానికీ, దేశానికీ మధ్య గల వంతెనలు దాటాలి. స్థానికత నుండి విశ్వజనీన మానవుడిగా ఎదగగలగాలి. కృపాకర్‌ మాదిగను ఇంతవరకు ఒక  ఉద్యమకారుడిగా చూసిన సమాజం, సాహిత్యోద్యమకారుడిగా, కళాత్మక ప్రయోజనాన్ని నెరవేరుస్తున్న సృజనకారుడిగా హృదయానికి హత్తుకుంటుందని నాకెంతో నమ్మకముంది.

            ఈ కవితా సంపుటిలో పని కవిత ప్రయోగాలు శిల్ప రహస్యాలు ఉన్నాయి. ఒక నిష్కళంకమైన కవిత్వం దాంతోపాటు అనుభవం నుండి వచ్చిన ప్రయోగాలు ఈ కవితా సంపుటిలో కనిపించే ఒక విశేషం. నడిచే దీపస్తంభం నాన్న పేరుతో రాసిన కవిత ఒక రూప పరమైనటువంటి ప్రయోగం. ఆకాశం పగిలినట్టు, ఇంటి కప్పు మింటి ధారలైతే, తాటి మట్టలతో వాసూరు బద్దతో నువు మన పూరింటి కప్పుగా మారావు నాన్నా’’ ..అంటూ దళితుల, పేదల పూరి గుడిసెల వర్షపు బతుకుల్ని కళ్ళకు కట్టినట్లు వర్ణించాడు. తాపీ పనిలో భవననిర్మాణం...ఇలా బహుజనుల వృత్తుల్లోని నైపుణ్యాన్ని ఈ కవితలో శ్రమైక జీవన సౌందర్యాన్ని హృద్యంగా వర్ణించాడు. ఒక  మాదిగ వృత్తిలోని ఔన్నత్యాన్ని వర్ణిస్తూ...  నువు గొడ్డు తోలు వలుస్తుంటే ఏ జనరల్‌ సర్జనూ సరిపోడేమో! దూడ తోలు ఊని, చింత గింజలు జిగురుగా ఉడకేసి, కొత్త తప్పెట పలక జేసి,కొత్త కొత్త శైలులుతో నువు దరువులు వాయిస్తుంటే చూడాల నాన్నా! నేలానింగీ ఊగిపోయేది. పిల్లలంతా నీ పలక చుట్టుజేరి చిందులేసే వాళ్ళు పెద్దలంతాఅంటాడు కవి. ఈ కవితా బహుజన తత్త్వం ప్రతిఫలిస్తుంది. ఈ కవిత అంతా కథలోని వచనంలా ఉంటుంది.కాని అది కవిత్వం. వచన కవిత్వం అలా అనిపిస్తుంది కానీ అది  వచనం పాదాల్లో  పేర్చి కనిపించదు. మో, సీతారాం, అఫ్సర్‌, ప్రసేన్‌  లాంటివాళ్ళు కూడా ఇలా కవిత్వం రాశారు. అది తెలుగు వచన కవిత్వానికి అదనపు ఆలోచనను తీసుకొచ్చింది.

            మనం సమాజంలో భిన్నభావజాలాల్ని గమనిస్తుంటాం. దేవుళ్ళను నమ్మకపోయినా దేవాలయాలలో ప్రవేశించడాన్ని  కొంతమందినెందుకు అంగీకరించడం లేదని నిలదీస్తుంటారు. ఉద్యమాలు కూడా చేస్తుంటారు. ఒక మతానికి ప్రత్యామ్నాయంగా మరొక మతం విస్తరిస్తుంటే తట్టుకోలేని వాళ్ళు రకరకాల దాడులు చేస్తుంటారు. అటువంటప్పుడు దాడికి గురైన వాళ్ళ మతాన్ని తాము అనుసరించకపోయినా, ఆ దాడుల్ని ఖండిస్తారు. అలా చేయడం వెనుక స్వేచ్ఛను కాపాడుకోవడం, మానవత్వాన్ని మంటకలిసిపోకుండా పరిరక్షించుకోవడానికి ప్రజాస్వామ్య వాదులు ప్రయత్నిస్తుంటారు. అలా ప్రయత్నించండంలో ఆధిపత్యాన్ని తిరస్కరించే తత్వముంది. దీన్ని హుజనులెలా అనుసరిస్తుంటారో కవి ఇలా వర్ణించాడు.

‘’నేను బౌద్ధుణ్ణి కాను గానీ బుద్దుడి అనుచరుణ్ణి

నేను క్రైస్తవుణ్ణి కాను గానీ, జీసస్‌ అనుచరుణ్ణి

నేను ముస్లిమ్‌ ని కాను గానీ

ముహమ్మద్‌ ప్రవక్త అనుచరుణ్ణి

నేను హిందువుని కాను గానీ గురు రవిదాస్‌ అనుచరుణ్ణి

పైసల ముడుపులు కట్టే వాణ్ణి కాను గానీ

ప్రశ్నల గుత్తులు వేసే చార్వాకుణ్ణి

నేను దైవం పక్షం కాదు గానీ కేవలం మానవ పక్షం వాణ్ణి

వొట్టి మానవతా పక్షపాతిని’’

            ఇలా సమాజంలో వైరుధ్యాల్లా కనిపించే వాటిలోని స్పష్టతనీ, స్పష్టత లేనివాటిలోని అస్పష్టతనీ స్పష్టంగా విశదీకరిస్తుందీకవిత్వం. బహుజనులు ఏ సందర్భంలో ఎలా వ్యవహరించాలో బోధిస్తుంది.

            ఒక్కొక్కరుగా తమతమ అస్తిత్వాలను కాపాడుకుంటూనే ఉమ్మడిగా బహుజనులు చేయాల్సిన ఒక మహా ప్రయాణానికి గమ్యాన్ని చూపిస్తుందీ కవిత్వం. అందుకే దీన్ని బహుజన మహాకవిత్వం అని కవి పొనుగోటి కృపాకర్‌ మాదిగ కవితా సంపుటికి ఒక ట్యాగ్‌ లైన్‌ పెట్టారు. కవినీ, కవి సహచరి ఫ్రముఖ రచయిత్రి జూపాక సుభద్రను  దగ్గరగా పరిశీలించిన ఆచార్య ఎండ్లూరి సుధాకర్‌ గారి ఆత్మీయమైన ముందుమాట, దానితోపాటు కృపాకర్‌ గారి జీవితాన్నీ, ఉద్యమ లక్ష్యాన్నీ, కవిత్వ శిల్పాన్నీ సమపాళ్ళలో విశ్లేషిస్తూ ప్రముఖ విమర్శకుడు జి.లక్ష్మీ నరసయ్య గారి ముందు మాట ఈ పుస్తకాలకు అదనపు సొగసుని, గౌరవాన్ని ,విలువను కలిగిస్తాయి. సమకాలీన సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక కోణాల్ని అవగాహన చేసుకోవడానికి ఈ కవిత్వాన్ని చదవాలి. ఒక వస్తువు కవిత్వమెలా చేయాలో తెలుసుకోవాలనుకునే వారు ఈ కవిత్వాన్ని చదవాలి.

(ప్రచురణ వివరాలు: పంచుకుందాం రా!  బహుజన మహాకావ్యం, పొనుగోటి కృపాకర్ మాదిగ,  ఏప్రిల్, 2022, దండోరా ప్రచురణలు, హైదరాబాద్. పుటలు: 296, పుస్తకం ఖరీదు: రూ.200.00లు)

                    

 








కామెంట్‌లు లేవు: