తెలుగు సాహిత్యానికి శ్రీ కృష్ణ దేవరాయలు ఒక స్వర్ణయుగం
శ్రీకృష్ణదేవరాయలు కేవలం పరిపాలనాదక్షుడు మాత్రమే కాకుండా స్వయంగా కవి కూడా కావడం వల్ల అనేకమంది కవులను పోషించారనీ, ఆ కవులు ఉత్తమమైన ప్రబంధసాహిత్యాన్ని సృష్టించారనీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, తెలుగు శాఖ అధ్యక్షుడు ఆచార్య దార్ల వెంకటేశ్వర రావు వ్యాఖ్యానించారు. కర్ణాటక రాష్ట్ర సార్వత్రిక విశ్వవిద్యాలయం, మైసూరు వారు నిర్వహిస్తున్న రెండు రోజుల (29, 30.4.2022) అంతర్జాల అంతర్జాతీయ సదస్సు సాహితీ సమరాంగణ సార్వభౌముడు- శ్రీకృష్ణదేవరాయలు ప్రారంభ సభలో విశిష్ట అతిథిగా పాల్గొని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ప్రసంగించారు. పదహారవ శతాబ్దం నాటికే సమాజంలో కింది వర్గాల, కులాలలో ఉన్న ప్రతిభను గుర్తించిన శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద లో మాలదాసరి కథ ద్వారా వారి అస్తిత్వాన్ని చిత్రించే ప్రయత్నం చేశారని ఆయన అన్నారు. దక్షిణ భారతదేశంలో విశేషమైన ప్రాబల్యాన్ని చూపించిన వైష్ణవ మతానికి ఆళ్వారులు చేసిన కృషి అసామాన్యమైనదనీ వివరించారు . దురదృష్టవశాత్తూ తెలుగు సాహిత్యాన్ని కుల, మత దృష్టితో చూస్తూ కొందరి సాహిత్యమే గొప్పదని స్థిరీకరించే ప్రయత్నం చేస్తున్నారనీ, శ్రీకృష్ణదేవరాయల కులాన్ని ప్రాంతాన్ని నేటికీ విస్తృతంగా చర్చిస్తున్నారని ఈ సందర్భంలో ఈ సదస్సు జరగడం కొత్త ఆలోచనలకి అవకాశం ఇస్తుందని ఆయన అన్నారు. ఈ సదస్సు నిర్వాహకులు ఆచార్య ఎం. రామనాధం నాయుడు , విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య ఎస్. విద్యా శంకర్, డా.మండలి బుద్ధప్రసాద్, డా.తోటకూర రఘు, ఆచార్య ఆశాజ్యోతి వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన ఆచార్య విస్తాలి శంకరరావు, ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ , ఆచార్య బాలసుబ్రమణ్యం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి