ఆయన ఆశయాలను ఆచరణలో చూపడమే అంబేద్కర్ కిచ్చే నిజమైన నివాళి
మాట్లాడుతున్న ఆచార్య బి.జె.రావుగారు
అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేస్తున్న. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వైస్ ఛాన్సలర్ ఆచార్య బి.జె.రావు, డీన్, స్టూడెంట్స్ వెల్ఫేర్ ఆచార్య గుండిమెడ నాగరాజు తదితరులు
మాట్లాడుతున్న ఆచార్య జి.జాగరాజు
మాట్లాడుతున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో చూపడమే మనమంతా డా.బి.ఆర్. అంబేద్కర్ కి మనమిచ్చే నివాళులని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య బి.జె.రావు వ్యాఖ్యానించారు. హెచ్ సియు విద్యార్థి సంక్షేమ కార్యాలయం ఆధ్వర్యంలో అంబేద్కర్ 131వ జయంతి వేడుకల్లో భాగంగా మంగళవారం 75 యేండ్ల స్వాతంత్ర్య భారతదేశ అవగాహనలో డా.బి.ఆర్. అంబేద్కర్ పాత్ర అనే అంశంపై డిఎస్ డబ్ల్యు డీన్ ఆచార్య గుండిమెడ నాగరాజు అధ్యక్షతన జరిగిన చర్చా గోష్టిలో ఆచార్య బి.జె.రావు ముఖ్య అతిథిగా పాల్గొని, దాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రతి సమాజానికీ సంస్కృతీ, సంప్రదాయాలు ఉంటాయని, వాటిని కాలానుగుణంగా మార్పులు, చేర్పులు చేసుకోవడం అవసరమవుతుందని, ఆ పనిని సంఘసంస్కర్తలు చేస్తారనీ, అలాంటి వారిలో డా.బి.ఆర్. అంబేద్కర్ ఒకరని ఆయన పేర్కొన్నారు. మనమంతా స్వతంత్ర భారత దేశంలో ఉన్నా, నేటికీ ఆర్ధిక స్వాతంత్ర్యం గురించి మాట్లాడుకోలేక పోతున్నామని ఆయన అన్నారు. సభకు అధ్యక్షత వహించిన ఆచార్య గుండిమెడ నాగరాజు మాట్లాడుతూ భారతీయ సమాజంలో అనేక రుగ్మతలకు శక్తివంతమైన పరిష్కారాలను అందించిన ఘనత అంబేద్కర్ కే దక్కుతుందని, అందువల్లనే ఆయన సిద్ధాంతాలు నేటికీ సమాజానికి అవసరమౌతున్నాయని అన్నారు. డా.బి.ఆర్.అంబేద్కర్ రాజ్యాంగ రచనా కమిటీ చైర్మన్ గా ఉండి, ఆ సభ్యులు రకరకాల కారణాలతో దూరంగా ఉన్నారనీ, అయినా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుమారు అరవై రాజ్యాంగాల్ని అధ్యయనం చేసి భారత రాజ్యాంగాన్ని రూపొందించారని తెలుగు శాఖ అధ్యక్షుడు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వివరించారు. మనిషికి కావలసిన అత్యంత ముఖ్యమైన మానవహక్కులను పరిరక్షణకు, కార్మిక, మహిళల హక్కులు గురించి ఉద్యమాలు చేశారని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు తెలిపారు. అంబేద్కర్ చేసిన సామాజిక కృషిని వక్రీకరిస్తూ ఆయన్ని కేవలం కొందరికే పరిమితం చేయడం, కొంతమందికి కేవలం కొన్ని సామాజిక వర్గానికి చేసిన కృషిని అందరికీ చేసినట్లు వ్యాఖ్యానిస్తూ చారిత్రక వక్రీకరణలు జరుగుతున్నాయని, ఈ ఆలోచనా విధానం మారినప్పుడు మాత్రమే అంబేద్కర్ ఈ దేశానికి చేసిన నిజమైన సేవ, ఆయన పాత్ర సమాజానికి తెలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ చర్చాగోష్టిలో రాజనీతి శాస్త్ర అధ్యాపకులు డా.అనఘా ఇంగోలా మాట్లాడుతూ కుల, మత వివక్షల నుండి భారతీయ సమాజాన్ని చూస్తూ సమానత్వాన్ని ఆకాంక్షించారన్నారు. కమ్యూనికేషన్ శాఖ ఆచార్యులు పి.తిరుమల్ మాట్లాడుతూ పత్రికా రంగం, అది సమాజంలో కలిగిస్తున్న ప్రభావాన్ని అంబేద్కర్ ఆనాడే గుర్తించారన్నారు. సామాజిక శాస్త్రవేత్త ఆచార్య శశీజీ హెగ్డే గుర్తింపు రాజకీయాలను గుర్తించి నప్పుడే అంబేద్కర్ పాత్ర అర్ధమవుతుందన్నారు. ఈ చర్చా కార్యక్రమంలో డిప్యూటీ డీన్స్ డా.జి.పద్మజ, ఆచార్య సంతోష్ ఆర్ కాపాడే, పరిశోధకులు, విద్యార్ధినీ విద్యార్ధులు పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి