"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

12 మార్చి, 2022

ఐసియు తెలిపిన దేవుని మహిమలీ కథలు*

 *ఐసియు తెలిపిన దేవుని మహిమలీ కథలు*


ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి గారు గొప్ప సహృదయులు, ప్రేమ మూర్తి. ఇతరుల మనసులను అర్థం చేసుకోవడంలో ఒక సైకాలజిస్టులా సరిగ్గా అంచనా వేస్తుంటారు. మానవ సంబంధాల్లో మనం గుర్తించలేనంత సున్నితమైన విషయాలను కూడా ఆయన తెలియజేస్తూ అప్పుడప్పుడు కథలుగా రాస్తుంటారు. స్పందన ఆధ్యాత్మిక మాసపత్రికలో గత కొన్ని సంచికల నుండి ఆయన    ICU కరోనా కథలు పేరుతో కొన్ని ప్రత్యేకమైన జీవన చిత్రాలు ఒక్కపేజీలో సరిపోయేలా రాస్తున్నారు. అవన్నీ మనం నిత్యం చూస్తున్న దృశ్యాలే అయినా వాటిని మరలా మనం ఇలా అక్షర రూపంలో  చదువుతుంటే ఆ ప్రవర్తన ఆశ్చర్యమనిపిస్తుంది. 

అక్టోబరు 2021 సంచికలో కరోనాతో ఆసుపత్రిలో చేరిన ఒక ముసలావిడ చేసిన హడావిడిని కళ్ళకు కట్టినట్లు వర్ణించారు. వాస్తవాన్ని పేషెంట్లకు వాస్తవంగా చెప్పడానికి ఆసుపత్రిలో సిబ్బంది ఎంత అవస్థలకు గురవుతుంటారో ఈ కథ మనకి తెలియజేస్తుంది. 

 నవంబరు 2021 సంచికలో  కరోనా సోకిన తన కొడుకునెలాగైనా కాపాడుకోవాలని ఒక తల్లి  ఆసుపత్రిలో చేరిస్తే,   వైద్యులు తమ నిస్సహాయతను వ్యక్తం చేస్తారు, అయినా తన కొడుకుని చూస్తూ ఆందోళనతో నిద్రలేకుండా రాత్రంతా ఆందోళన పడుతూనే ఉంటుంది. తెల్లవారుతుందనగా తనకు తెలియకుండానే ఆ తల్లి నిద్రలోకి జారుకుంటుంది. ప్రొద్దున కొడుకు నవ్వుతూ, సంతోషంగా మాట్లాడుతూ కనిపిస్తాడు. అంత ఆందోళన పడుతున్న సమయంలోనే  ఒక ఫాస్టర్  వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోయిన సంఘటన అప్పుడు గుర్తుకొస్తుంది. ఆ వచ్చింది ఫాస్టర్ రూపంలో దేవుడేనని  గమనించిన ఆమే మనసంతా కృతజ్ఞతాస్తుతులతో నిండిపోతుంది. మనుషులకు సాధ్యం కానిది ఉండవచ్చునేమో, కానీ దేవునికి సాధ్యం కానిది ఉంటుందా!  ప్రార్థనలో  ఉన్న మహిమను,  ఎవ్వరూ నిర్లక్ష్యం చేయడం గానీ, చులకన చేయడం గానీ. చేయకూడదనే సత్యాన్ని ఆ వాస్తవిక కథ ద్వారా రచయిత తెలియజేశారు.

  డిసెంబర్ 2021 సంచికలో 'కరోనా కలిపిన క్రిస్మస్' లో మతాలు వేరైనా వారి అభిమతాలు ఒకటి కావడానికి  మనుషుల మధ్య కనిపించిన నిజమైన ప్రేమే కారణమైందని వివరించారు. ఫిబ్రవరి 2022 లో  కొంతమంది తమ చివరి ఘడియల్లో కూడా మనుషుల్ని ప్రేమించలేని వాళ్లు ఉంటారని, అది అంతా తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి చేసే ప్రయత్నమైనా, దానివల్ల ఎంత మంది మనః క్షోభకు గురౌతారో చక్కగా తెలిపారు. 

మార్చి, 2022 సంచికలో  ఒక ముసలమ్మ ఆసుపత్రిలో చేరిన తర్వాత, ఆమె పొట్టలో రాళ్ళున్నాయని, ఆపరేషన్ చేసి తీయాలని వైద్యులు చెబుతారు. ఆమె పాఠశాల విద్యార్థులకు పెట్టవలసిన కోడిగుడ్లు, కూరగాయలు సరిపడా పెట్టకుండా, దొంగ చాటుగా తనింటికి పట్టికెళ్ళి తృప్తిగా తినేదని, దాని ఫలితంగానే ఇలా ఆసుపత్రి పాలయ్యిందని ఆమెను చూసుకోవడానికని వచ్చిన ఆమె ప్రక్కవాళ్ళతో చెబుతుంది. మనం చేసిన పాపానికి పరిహారం తప్పదని, దానికి దేవుడు ఏదొక రూపంలో శిక్షిస్తాడనీ హెచ్చరిస్తాడు కథకుడు.

ఇలా తాను కూడా కరోనాబాధితుడిగా ఆసుపత్రిలో చేరి, దాన్ని జయించిన తర్వాత తాను గమనించిన అనేకమంది జీవిత గాథలను ఐసియు కథలుగా రాస్తూ, కొన్ని జీవిత సత్యాలను సాక్ష్యాలుగా మన ముందు అక్షర దృశ్యంలా ఆవిష్కరిస్తున్నారు. 

ఒక్క పేజీలో, చక్కని తెలుగు వాక్యాలతో, సందర్భోచితమైన పలుకుబడులతో, వాస్తవ జీవితాలను ఒక కథలా అందించడం ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారిగారి సృజన నైపుణ్యానికి నిదర్శనం. సాధారణంగా  జీవితంలో ఏదొక నాడు ప్రతివారూ ఏదొక అనారోగ్య సమస్యతో ఆసుపత్రిలో చేరతారు. అది మానవుని ఆలోచనా విధానాన్నే మార్చేయవచ్చు. అది కూడా మనిషి క్రొత్త జీవితానికి పయనించడానికి దేవుడు మనకిచ్చే మరో చివరి అవకాశం కూడా కావచ్చు. ఒక గొప్ప మానసిక పరివర్తన కలగవచ్చు, లేకపోతే తాను చేసిన పాపాన్ని గుర్తించలేని మూర్ఖత్వంతో కూడా మరణించవచ్చు. ఒక ఆసుపత్రి ద్వారా మన జీవన గమనం ఎలా ఉంటుందో, ఆ జీవన గమనం ద్వారా నేర్చుకోవలసిన జీవిత పాఠాలను మనకిలా అందించడానికే దేవుడు ఆచార్య కృపాచారి గారిని కూడా కరోనా నెపంతో ఆసుపత్రిలో ఉండేలా చేశారేమో అనిపిస్తుంది. ఈ కథలు దేవుని మహిమను ఘన పరుస్తున్నాయి. దేవుణ్ణి వ్యతిరేకించే వ్యక్తుల జీవితాలు ఎలా పతనమై పోతాయో తెలియజేస్తున్నాయి. తాను సేకరించిన వాస్తవాల నుండి  పరిశోధకుడు ఆ ఫలితాంశాల్ని వెల్లడించినట్లు, రచయిత కృపాచారి గారు మానవుడు తన జీవితంలో  జీవించిన విధానాన్ని బట్టి ఆ జీవితానికి భగవంతుడు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాడో పరిశుద్ధ గ్రంథంలోని ఒక వాక్యం ద్వారా ఆ కథను ముగించడం ఈ కథల్లో కనిపించే ఒక గొప్ప కొసమెరుపు. ఒక సంఘటన ద్వారా జీవితాన్ని అంతటినీ చూపించడం అనేది ఈ కథలో కనిపించే గొప్ప శిల్ప రహస్యం. చిన్న కథల్లో కూడా మరీ చిన్న కథలా ఒక గీత గీసి, దానికి అటూయిటూ దాటకుండా వాస్తవజీవిత సత్యాన్ని దృశ్యాత్మకంగా వర్ణించే  కల్పనా సాహిత్య ప్రక్రియలో ఇటువంటి దాన్ని  స్కెచ్ స్టోరీ అని పిలిచే అవకాశం ఉంది. ఇలాంటి రచనల్లో రచయితలు సూచన ద్వారా చెప్పవలసినవెన్నో ఉన్నావాటిని పాఠకునికే వదిలేస్తారు. దీనివల్ల కథ చిన్నదే కావడం, మబ్బుల మాటునో, చెట్టు కొమ్ములు, ఆకుల మాటునో దాగిన వాటినో వెతుకుతుంటే, తొలుత దొరకనివేవో వెతికితే దొరుకుతుంటే పొందే సంతోషంలాంటిదేదో పాఠకుడు పొందుతూ   ఆ చిన్ని కథను మరలా చదివే అవకాశం ఉంటుంది. ఈ లక్షణాలన్నీ ఆచార్య కృపాచారి గారు రాసిన ఈ కథలలో కనిపిస్తాయి. మానవ జీవితం పరిపూర్ణమవుతున్నప్పుడు ఆ  ప్రేమామృతాన్ని అందరికీ పంచాలనుకోవడం దివ్యమైన గుణం. అది ఆధ్యాత్మిక జీవనంతో ముడిపడి ఉంటుంది. ఆధ్యాత్మికత మానవుని అస్తిత్వాన్ని , ఈ భౌతిక ప్రపంచాన్ని, మనిషి నిత్యం చూసే సత్యాలు, అసత్యాలు శాశ్వతాలు, ఆశాశ్వతాలు, లౌకికం, పారలౌకికం మొదలైన తాత్వకాంశాలపై నిరంతరం ఆలోచించేలా చేస్తుంది. తానేమిటో తనకు తెలిసిన తర్వాత లోకమంతా ప్రేమమయంగా కనిపిస్తుంది. ఆ ప్రేమ, ఆ పవిత్రత, వాటిని తినేవాళ్ళందరికీ పంచాలనే తపనే ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి గారి ఈ చిన్ని కథల్లో కనిపించే పెద్ద ఆశ. నాకు నెలనెలా ఈ కథలను పంపి, ఆ కథలతో పాటు స్పందన ఆధ్యాత్మిక మాసపత్రికలో అనేకమైన ఆసక్తికరమైన విషయాలను గుర్తించేలా గొప్ప అవకాశం కల్పించినందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

-ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, తెలుగు శాఖ అధ్యక్షుడు, మానవీయ శాస్త్రాల విభాగం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ హైదరాబాద్-500 046, ఫోన్: 9182685231

కామెంట్‌లు లేవు: