"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

09 December, 2021

వర్గీకరణ

 "75 ఏళ్ళ స్వతంత్రమైనా అందిస్తుందా వర్గీకరణ"?


  “వర్గీకరణ ను వ్యతిరేకిస్తే - అసమానులను, సమానులుగా చూపుతూ - సమానత్వం అనే హక్కే ఓడిపోతుంది" 

(సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ - సివిల్ అపీల్ నం: 2317/2011 -  పేజీ నంబర్ 71)   


    ఎస్సీ వర్గీకరణకు సంబంధించి పంజాబ్ రాష్ట్ర విషయమై తీర్పు వెలువరిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. 


    ఈ తీర్పు లోనే 2004 లో సుప్రీం కోర్ట్ లో కొట్టివేయబడ్డ ఆంధ్ర ప్రదేశ్ (ఉమ్మడి) ఎస్సీల వర్గీకరణ అంశం పై తమ తీర్పును పున:పరిశీలన చేసుకోవాలి అని భావిస్తున్నట్టు, దీనిపై 7 లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యుల ధర్మాసనం ఏర్పాటు చేయాలి అని ప్రధాన న్యాయమూర్తి ని కోరింది తీర్పు వెలువరించిన ధర్మాసనం. 


  వర్గీకరణ ఒక సుదీర్ఘ ఉద్యమం. రాజకీయ నాయకుల హామీలు, పాలకుల ప్రకటనలు కొద్దిసేపు పక్కన పెట్టి ఈ 75 ఏళ్ల స్వతంత్ర భారతం లో  అధికారికంగా నివేదించబడ్డ కొన్ని చారిత్రక నిజాలు చర్చకు పెట్టుకుందాం. 


  స్వతంత్రం వచ్చిన తొలి దశాబ్దం లోనే  ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు సంఖ్యాపరంగా అధికంగా మరియు రాజకీయంగా  అవగాహన ఉన్న   ఒకటి రెండు కులాలు తెగలు మాత్రమే ఆయా రాష్ట్రాల్లో అత్యధికంగా లబ్ది పొందుతున్నాయి అనే వాస్తవాలు బయటికొచ్చాయి.  


   అందుకే కేంద్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ ల జాబితా సవరణకు నాడు లోకూర్ కమీషన్ (1965) ను నియమించింది. 


  ఆ కమీషన్ 1956-57 & 57-58 సంవత్సరాలకు, సంబంధించిన, కమీషనర్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్స్ & ట్రైబ్స్ నివేదిక పరిశీలించిన మేర 1958-59 నివేదిక లో (ఎస్టిమేట్స్ కమిటీ) "తక్కువ వృద్ధి సాధించిన షెడ్యూల్డ్ కులాలు & తెగల కు ప్రాధాన్యం ఇవ్వాలని భావించారు" (లోకూర్ కమీషన్ - పేజీ నం: 9). 


  లోకూర్ కమీషన్ తన నివేదిక తయారు చేసే ముందు అనేక మంది ప్రజా ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు తదితరులను కలిసింది. ఆ సందర్భంగా దళితుల్లో అందరికంటే ముందున్న కొన్ని కులాలను జాబితా నుండి తొలగించాలి అని ఆనాడే అభిప్రాయం వ్యక్తం అయ్యింది. 


   వారు ఆంధ్రా లో మాలలు, మహారాష్ట్ర లో మహార్లు, ఉత్తర ప్రదేశ్, బీహార్, పంజాబ్ మధ్య ప్రదేశ్ లో చమార్లు ఉన్నారు. (లోకూర్ కమీషన్ : పేజీ నం : 11) .


    కారణాలేవయినా నాడు ఆ తొలగింపులు జరగలేదు. పరిష్కరించబడని ఏ సమస్యైనా నిరంతరం రగులుతూనే ఉంటుంది.  పరిష్కారం వెతకవలసిన అవసరం, సందర్భం రానే వచ్చాయి.


   ఈ అసమానతలతోనే కాలం గడుస్తున్న క్రమంలో  1975 లో మొట్టమొదటి సారి ఈ వర్గీకరణ పంజాబ్ రాష్ట్రం లో జరిగింది. అందుబాటు లో ఉన్న ఎస్సీ రిజర్వేషన్లలో లో 50 శాతం వెనుకబడ్డ దళిత కులాలకు కేటాయించబడ్డాయి. (ఉషా మెహ్రా కమీషన్ (2008 : పేజీ నం: 51).


    1986-87 సంవత్సర  వార్షిక నివేదిక (కమీషనర్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్స్ & ట్రైబ్స్) లో ఈ అసమానతల  విషయం మరింత స్పష్టం అయ్యింది. ఆ నివేదిక లో పాయింట్ 3.28 లో ఇలా అభిప్రాయపడ్డారు. 


"అఖిల భారత స్థాయిలో రిజర్వ్డ్ ఖాళీల భర్తీ, అసమానుల మధ్య పోటీలా తయారయ్యింది. రాష్ట్రాలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. అభివృద్ధి చెందిన వారితో పోటీ పడి ఈ అవకాశాలు పొందడం లో వెనుకబడ్డ వారు అసంతృప్తి తో ఉన్నారు" . (పేజీ : 42).


   స్వతంత్రం వచ్చిన తొలి దశాబ్దం లోనే బయటపడ్డ ఈ అసమానతలు గుర్తించినా ఏ మార్పుని కోరుకోని పాలకుల నిర్లక్ష్యం వల్లే  ఇప్పటికీ ఆ అసంతృప్తి దళిత కులాలు, గిరిజనుల్లో నెలకొని ఉంది. 1994 లో హర్యానా లో ఎస్సీ రిజర్వేషన్లు బ్లాక్ ఏ & బ్లాక్ బీ గా విభజన చేశారు.


    ఇవన్నీ కూడా సమస్య తీవ్రత తగ్గించడానికి ఆయా రాష్ట్రాలు తమ పరిధిలో తీసుకున్న నిర్ణయాలు. వాటితో కొంతమేర ఫలితాయి దక్కాయి. కానీ ఆ ఫలితాలు ఇంకా శాశ్వతం కాలేదు. 


   ఇక 1994 కి వచ్చేసరికి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో వర్గీకరణ కోసం కృష్ణ మాదిగ నాయకత్వం లో  ఉవ్వెత్తున ఎగసిన మాదిగ దండోరా ఉద్యమం చరిత్ర అందరికీ తెలిసిందే. భారత దేశాన్ని ఉత్తర దక్షిణ భారత  దేశాలుగా విభజించుకుంటే  దక్షిణ భారత దేశం లో కర్ణాటక, తమిళనాడు , ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాలలో ఈ వర్గీకరణ సమస్య ఉంది. 


   తమిళనాడు లో అరుంధతీయులకు 3 శాతం ప్రత్యేకంగా రిజర్వేషన్ కల్పించబడింది. ఇప్పటికీ అమలవుతుంది.  దళిత ఉద్యమాలు, దళితుల్లో నాయకులు ముందుకొచ్చిన ప్రతి రాష్ట్రం లో ఈ అంశం చర్చకు వచ్చింది.  ఉత్తర ప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర,  పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, వంటి రాష్ట్రాల్లో ఈ అంశం న్యాయం కోసం ఎదురు చూస్తూనే ఉంది. 


   బీహార్ లో దళితులను దళిత్స్ & మహా దళిత్స్ ( బాగా వెనుకబడ్డ వారు) గా విభజించి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. రాజస్థాన్, మధ్య ప్రదేశ్, బెంగాల్ వంటి రాష్ట్రాల్లో కూడా ఈ సమస్య నలుగుతుంది. కానీ గొంతు అందించి నడిపే నాయకులు లేక ఆ అంశం అక్కడ వెలుగులోకి రావడం లేదు. 


   ఇటీవల గుజరాత్ లో దళితుల్లో చర్చకు నోచుకున్న వారిలో జజ్ఞేష్ మేవానీ ప్రముఖులు. ఆయన ప్రజా ప్రతినిధిగా ఎన్నుకోబడి హైదరాబాద్ వచ్చినప్పుడు కృష్ణ మాదిగ గారిని కలిసి వర్గీకరణ కు తన మద్దత్తు తెలిపారు. 


  కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ కమిటీ లు వేసినా వర్గీకరణ అనుకూల నివేదికలే వస్తున్నాయి.  కానీ పాలక వర్గ నిర్లక్ష్యం ఫలితాన్ని ఆలస్యం చేస్తుంది. ఆలస్యం చేయడమే కాదు, 75 ఏళ్లుగా దళిత గిరిజన సమాజం లోనే ఒక "అంతర్గత అసమ సమాజాన్ని సృష్టించింది". అసమానతలు తొలగించాల్సిన వారే వాటిని కళ్లారా చూస్తూ కూడా పరిష్కరించకపోవడం ఎంత  భాధాకరం? 


  సుప్రీం కోర్ట్ తన తీర్పులో ఒక విషయం స్పష్టంగా చెప్పింది. 


  "రిజర్వేషన్లు, రిజర్వ్డ్ కులాల్లోనే అసమానతలు సృష్టిస్తున్నప్పుడు, వాటిని న్యాయంగా వర్గీకరించి అందరికీ న్యాయం అందించే భాద్యత రాజ్యానిదే" (పేజీ నం: 73) . కానీ రాజ్యం నిర్లక్ష్య ఫలితం, ఒక అట్టడుగు వర్గం లో మరొక అణగారిన సమాజం. 


          75 ఏళ్ళ స్వతంత్ర దినం సమీపిస్తుండగా ఈ  దేశంలో 8 లక్షల ఆదాయం ఉన్న అగ్ర వర్ణ పేదలకు రిజర్వేషన్లు అందాయి. 


   ఒకనాడు  అసమంజసం గా ఉన్న బీసీ రిజర్వేషన్లకు చట్టబద్దత లభించింది. దేశ స్థాయిలో బీసీల వర్గీకరణకు మార్గం సుగమం అవుతుంది, కేంద్రం దీనిపై  కమీషన్ వేసి కసరత్తు చేస్తుంది. మైనారిటీలకు రిజర్వేషన్లు లభిస్తున్నాయి. కానీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల విషయం లో ఎటువంటి మార్పూ లేదు. ఒకటే మూస ధోరణి. 


    ఇన్నేళ్ళ అసమాన పంపిణీ లో, ఫలితం పొందిన వాడు కింద ఉన్న వాడిని పూర్తిగా దాటవేసి వెళ్ళగా, కింద ఉన్న వాడు పై వాడిని అందుకోలేక ఇంకా వెనకబడిపోతున్నాడు. “బలవంతుడి దగ్గర పండ్ల తట్ట పెడితే మిగతా వారి సంగతేంటి”? అని ప్రశ్నించింది సుప్రీం కోర్ట్. అయినా ఇంకా ఈ విషయం పరిష్కారానికి నోచుకోలేదు. 


        ఇన్నాళ్ళూ ఎస్సీ ల వర్గీకరణ అధికారం రాష్ట్రాల పరిధిలోనిది కాదు అని దాటవేస్తూ వచ్చిన వారికి ఒక పరిష్కార మార్గం లా సుప్రీం కోర్ట్ ఆ అధికారం రాష్ట్రాలకు ఉంది అని స్పష్టం చేసింది.  


    ఏ మార్పూ చెందని సమాజం ఒక బండ రాయి వంటిది. కదలిక లేని చోట తిష్ట వేసేది కష్టమే. రాజకీయ పార్టీలలో అందరి మద్దత్తు ఉన్న వర్గీకరణ ఎందుకు కావడం లేదో, అది కోరుకునే సామాన్య ప్రజానీకానికి అర్ధం కాదు.  


     ఫలితం కోసం చూసి చూసి కళ్ళు కాయలు కాచిన వర్గీకరణ మద్దత్తుదారులు సుప్రీం కోర్ట్ వైపు ఆశగా చూస్తున్నారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల ఆకాంక్షల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన పాలక వర్గం నిర్లక్ష్య ధోరణే ప్రజలను చట్టసభల వైపు కాకుండా, కోర్టుల వైపు చూసే దాకా చేసింది . 


    మరో 8 నెలల్లో దేశం 75 వ స్వతంత్రం జరుపుకోనుంది. ఈ 75 ఏళ్ళ స్వతంత్రమైనా అందిస్తుందా వర్గీకరణ? లేదా మరి కొన్నేళ్ళు దళితుల్లోనే మరొక అసమ సమాజాన్ని పెంచి పోషిస్తుందా?. 


     కోట్ల రూపాయలు పెట్టి కొత్త పార్లమెంట్ భవనం కడుతున్నాం కానీ, పైసా  ఖర్చు లేకుండా ఒక నూతన సమాజాన్ని దళిత గిరిజనుల్లో నిర్మించే వర్గీకరణ ను మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. 


        దేశం లో దళితుల జనాభా దాదాపు 20  నుండి 25 కోట్ల మధ్య ఉంది. ఇన్ని కోట్ల మందికి సంబంధించిన వర్గీకరణ పట్ల పాలక వర్గం సాగదీత అత్యంత దారుణమైన విషయం. ఇది అట్లాంటి ఇట్లాంటి దారుణం కాదు. 75 ఏళ్ళ దారుణం.


     అందుకే సుప్రీం కోర్ట్ మాటలు మరలా గుర్తుకు చేస్తున్నా, “వర్గీకరణ ను వ్యతిరేకిస్తే - అసమానులను, సమానులుగా చూపుతూ - సమానత్వం అనే హక్కే ఓడిపోతుంది". ఈ హక్కు ఇంకెన్నాళ్ళు ఓడిపోవాలో?


పచ్చల రాజేష్ 

8331823086.


                           పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా డిల్లీలో కృష్ణ మాదిగ గారి నాయకత్వం లో  వర్గీకరణ కోసం జంతర్ మంతర్ వద్ద మాదిగ విద్యార్థుల ధర్నా జరగనుంది.

No comments: