సాహిత్యంలో జీవిత సత్యాన్ని ప్రతిఫలించడమే ముఖ్యం
తెలుగు కథా సాహిత్యం సామాజిక వాస్తవాల్ని, మ జీవిత సత్యాలను ఆవిష్కరించడంలో ఎంతో ముందుందని హెచ్సీయూ తెలుగు శాఖ అధ్యక్షుడు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు అన్నారు. మాడభూషి సాహిత్య కళా పరిషత్, చెన్నై వారు అంతర్జాలం ద్వారా నిర్వహిస్తున్న కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీతల ఉపన్యాస పరంపరలో భాగంగా శనివారం (27.11.2021) నాడు, వల్లంపాటి వెంకట సుబ్బయ్య 'కథా శిల్పం' పుస్తకం గురించి ఆచార్య దార్ల వెంకటేశ్వర రావు మాట్లాడారు. తెలుగు సాహిత్యంలో విభిన్న ప్రక్రియలు వచ్చాయని వాటిలో నవల, కథానిక అనే ప్రక్రియలు సామాజిక వాస్తవమే కేంద్రంగా చేసుకుని కొనసాగిన గొప్ప సాహిత్య ప్రక్రియలను ఆయన పేర్కొన్నారు. సమాజంలోని మధ్యతరగతి, కింది వర్గాలను చైతన్యవంతం చేయడంలో ఎంతో నవల, కథానిక ప్రక్రియలు గొప్ప పాత్రను నిర్వహిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. నవల కంటే కథానిక రాయటం చాలా కష్టమైన పని అని అనుభూతి తో పాటు జీవితం అంతా గుర్తుండిపోయేలా మంచి కథలు రాయాలంటే మంచి కథలను వాటికి సంబంధించిన సామాజిక ఆర్థిక సైద్ధాంతిక శాస్త్రాలను అధ్యయనం చేయవలసి ఉంటుందని వల్లంపాటి వారు తన 'కథా శిల్పం' గ్రంథంలో వివరించారని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు సోదాహరణంగా పేర్కొన్నారు. సాహిత్యంలో వస్తువు శిల్పం ఈ రెండింటిలో ప్రధానమైనదేమిటని ఆలోచించినప్పుడు జీవితాన్ని అర్థమయ్యేలా చేయడానికి శిల్పం ఉపయోగపడాలని, కనుక వస్తువే ప్రధానమని వల్లంపాటి భావించారని దార్ల వివరించారు. రచయితకు అత్యంత ముఖ్యమైనది దృక్పథం అని ఒక దృక్పథం లేకుండా రాసే రచనలు ప్రజలకు ఏమాత్రం ఉపయోగ పడకపోగా గందరగోళంలో పడేసే అవకాశం ఉందని ఎంతో స్పష్టంగా తన కథా శిల్పం గ్రంథంలో పేర్కొన్నారని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు సోదాహరణంగా వివరించారు. అంతర్జాలం ద్వారా నిర్వహించిన ఈ ప్రసంగ కార్యక్రమంలో మద్రాసు విశ్వ విద్యాలయం తెలుగు శాఖ పూర్వ అధ్యక్షులు ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ వక్తలను పరిచయం చేసి, ఉపన్యాస పరంపర లక్ష్యాలు, ఉద్దేశాల్నీ వివరించారు. త్రిపురనేని గోపీచంద్ (పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా) గురించి డా. అమ్మంగి వేణుగోపాల్ ప్రసంగించారు. ఈకార్యక్రమంలో ఆచార్య జి.యస్.మోహన్, ఆచార్య వెలమల సిమ్మన్న, డా.రేవూరి అనంత పద్మనాభ రావు, సుధీర్ రెడ్డి పామిరెడ్డి, అనేకమంది ప్రముఖ సాహితీవేత్తలు పాల్గొన్నారు.










కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి