"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

28 July, 2021

ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం, నెల్లూరులో ‘దార్లమాట’ శతకం : ఆవిష్కరణ విశేషాలు

26/07/2021 సోమవారం నాడు ప్రాచీన విశిష్ట అధ్యయనం కేంద్రం నెల్లూరులో ‘దార్లమాట’ శతకం ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. సదస్సు ప్రాజెక్టు డైరెక్టర్ ఆచార్య మునిరత్నం నాయుడుగారి, ప్రాజెక్ట్ రీసెర్చ్ ఫెలోస్ ఆధ్యర్యంలో చల్లని సాయంత్రం వేళలో చాలా చక్కగా ప్రారంభమైంది. దీనికి సమన్వయ కర్తగా సీనియర్ ప్రాజెక్టు ఫెలో డా ఎన్. రాంబాబు వ్యవహరిస్తూ...‘‘ఆచార్య దార్ల వెంకటేశ్వరరావుగారి పర్యవేక్షణలో నేను తొలి పిహెచ్. డి., పరిశోధకుడిగా అంతే కాదు మా గురువుగారు మాకు ఎన్నో విషయాలను నేర్పించారు. మరెన్నో అంశాలలో మాకు ఆదర్శనీయులు. వారు కవిగా, రచయితగా, గొప్ప సాహిత్య విమర్శకుడుగాను, విశ్వవిద్యాలయంలో  పరిపాలన విభాగంలోనూ, సాహిత్యరంగంలోనూ, పరిశోధకుడిగాను, పర్యవేక్షకులుగాను, నిరంతర కృషి మా గురువు గారి సొంతం అని చెబుతూ, ఎందరో పరిశోధక విద్యార్థులకు, పరిశోధన మెళకువలను చెప్తూ, వారి పరిశోధనకు ముందుండి సలహాలు ఇచ్చి ఇప్పటికీ 14 PHD లు, 19 పైగా M.Phil పర్యవేక్షణ బాధ్యత వహిస్తున్నారు, దార్ల గారు పరిశోధనా రంగంలో, విద్యార్థులకు పాఠం చెప్పే విధానంలో ఎప్పుడు ముందుండి, భావి పరిశోధకులకు మార్గదర్శకం అని చెప్తూ, నిరంతరం ఎప్పుడు ఏదో ఒక పత్రికలో వ్యాసాలు, కవితలు, వెబినార్లు ,సెమినార్లు,అనేక అంశాలమీద నిరంతరం వ్యాసాలు రాస్తూ, భావి పరిశోధకులకు మార్గదర్శకులు అని చెప్పడంలో సందేహం లేదని అని వివరించారు. 
ర్ల సారు హైదరాబాద్ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు అయిన తర్వాత అనేక బాధ్యతలు నిర్వహిస్తూ కూడా నిరంతరం శ్రమిస్తూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా ఉండడం. ఈ పుస్తకం కవర్ పేజీ మీద ఉన్న బాబు, దార్ల శ్రీనివాసరావు అని చెబుతూ, సార్ కొడుకు పుట్టిన తర్వాతే ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పరిశోధనా రంగం పైకి దూసుకొస్తున్నారు, అనడంలో సందేహం లేదు, అసిస్టెంట్, అసోసియేట్, ప్రొఫెసర్ గాను, తెలుగుశాఖ అధ్యక్షులు, తక్కువ కాలంలోనే ఎక్కువ పేరు తెచ్చుకున్నారు. చాలామంది ప్రొఫెసర్ అయిన తరువాత కొంత స్పీడు తగ్గుతుంది, కానీ మా గురువుగారైన దార్ల వెంకటేశ్వరరావు గారికి ఇంకా రెట్టింపు ఉత్సాహంతో తెలుగు సాహిత్య రంగంలోకి, పరిపాలన రంగంలోకి దూసుకుపోతున్నారు అని చెప్పవచ్చు. చాలా రోజుల తర్వాత మా గురువుగారు దార్ల సార్ ని కలవడం జరిగింది.దానిలో భాగంగా దార్లమాట శతకం ఈ పుస్తకాన్ని నాకు ఇచ్చారు, అదే క్రమంలో లో ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం లో ఉన్న ప్రాజెక్టు ఫెలోస్ కి ,డైరెక్టర్ గారి కి, లైబ్రరీకి.దార్లమాట శతకం పుస్తకాన్ని అందరికీ ఇవ్వమని వీలుంటే దాని గురించి రెండు మాటలు మాట్లాడమని అందరిని కోరగా, ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం నెల్లూరు, మా డైరెక్టర్ గారి సలహా మేరకు డైరెక్టర్ గారిని కోరిన పిమ్మట సరే అని మాట ఇచ్చారు, కాని అందరూ ఉంటే బాగుంటుంది అని చెప్పటం ద్వారా అందరూ వచ్చిన తరువాత గురు పౌర్ణమి పురస్కరించుకొని 26 తారీఖు సాయంత్రం నాలుగు గంటలకు ఈ కార్యక్రమాన్ని అన్ని ప్రారంభించనున్నామని, ప్రాజెక్టు ఫెలోస్, ఆఫీస్ స్టాఫ్, సమక్షంలో దార్లమాట శతకం ఈ గ్రంథాన్ని ఆవిష్కరించగల చేశాము, దార్ల మాటా శతకం పుస్తకావిష్కరణ ఈ కార్యక్రమానికి డా॥ నూనావత్‌ రాంబాబు. గారు సమన్వయకర్తగా, ఈకార్యక్రమాన్ని అధ్యక్షులుగా తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం డైరెక్టర్ గారు, ఆచార్య డి. మునిరత్నం నాయుడు గారు, గ్రంథ రచయిత  పరిచయ కార్యక్రమాన్ని, డాక్టర్. కె రమేష్ గారు, పుస్తక పరిచయం, డాక్టర్. టి.సతీష్ గారు, ఈ కార్యక్రమం యొక్క ముగింపు పలుకులను డాక్టర్. కాసిం బాబు గారు ‘దార్లమాట’ శతకం ఆవిష్కరణ మా గురువు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావుగారు రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించాలని ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం ప్రాజెక్టు డైరెక్టర్ ఆచార్య మునిరత్నం నాయుడుగారిని డా ఎన్. రాంబాబు కోరారు.

శతక రచయిత ఆచార్య దార్ల వెంకటేశ్వరరావుగారికి సభా ముఖంగా అందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తర్వాత ఆచార్య దార్లవారి జీవితాన్ని, సాహిత్య ప్రస్థానాన్ని సీనియర్ ఫెలో డా కళ్యాడపు రమేశ్ సంక్షిప్తంగా పరిచయం చేస్తూ...


 ‘‘ఆచార్య దార్ల వెంకటేశ్వరరావుగారు నాకు ప్రత్యక్ష గురువు. ఈయన తెలుగు సాహిత్యంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు గడిస్తున్న వ్యక్తి.ఎస్. టి. జ్ఞానానందకవి రాసిన ‘ఆమ్రపాలి’ పై ఎం.ఫిల్ పరిశోధన చేశారు. ‘పరిశోధకుడుగా ఆరుద్ర’ అనే అంశంపై పిహెచ్. డి., చేశారు. తర్వాత జూనియర్ లెక్చరర్ గా, డిగ్రీ లెక్చరర్ గా ఆయా కళాశాలల్లో పనిచేశారు.  తాను చదువుకున్న విశ్వవిద్యాలయంలోనే అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేరారు. అలా అంచలంచెలుగా అసోసియేట్ ఫ్రొఫెసర్, ప్రొఫెసర్ గా పదోన్నతులు పొంది, అత్యున్నత పదవి  అయిన తెలుగు శాఖ అధ్యక్షులుగా ఎదగడం మామూలు విషయం కాదు. ఒక సామాజిక వర్గం నుంచి వచ్చి చిన్న చిన్న రచనలు చేస్తూ గొప్ప ఆచార్యులుగా ఎదిగిన క్రమం మాకందరికీ ఆదర్శనీయం.’’ అని తన ప్రసంగాన్ని ముగించారు.




డా.టి.సతీశ్ మాట్లాడుతూ ‘‘దార్లవారి సరికొత్త రచన దార్లమాటశతకం. ఇది పద్య శతకం. దార్ల వెంకటేశ్వరావుగారు పద్యం రాశారంటే నాకు ఆశ్చర్యమనేసింది. ఎందుకంటే వారి నేపథ్యం ఎలాంటిది. అది ఏమిటంటే! ఒకప్పుడు అస్తిత్వ ఉద్యమాలు విద్యార్థుల్లో ఉత్తుంగా తరంగాల్లాగ వస్తున్న కాలంలో హైదరాబాదు విశ్వవిద్యాలయంలో ‘విస్ఫోటన’ అనే పత్రికను విద్యార్థులే నడిపిన సందర్భంలో ఎం. ఏ విద్యార్థిగా ఆచార్య దార్ల వెంకటేశ్వరావుగారు ఆ ప్రతికలో కవిగా, ఉద్యమకారుడిగాను కృషి చేసిన సందర్భం నాకు తెలుసు. అలాంటి వ్యక్తి విద్యార్థిగా, పరిశోధకుడిగా వచ్చి, అధ్యాపకుడై హైదరాబాదు విశ్వవిద్యాలయంల తెలుగుశాఖ అధ్యక్ష పదవి స్థాయికి ఎదగడం మామూలు విషయం కాదు. విమర్శని అలంకార శాస్త్రాన్ని, సౌందర్య తత్త్వాన్ని, దళిత కవిత్వాన్ని బోధించే సందర్భంలో సామాజిక విమర్శ చేసే స్థితిని నేను చూశాను. అలా చేసిన ఆయన అస్తిత్వ ఉద్యమ చైతన్యంతో ఉన్న వ్యక్తి పద్యం రాయడం ఆశ్చర్యమనే అనిపించింది. బహుశా  పద్యం ఫ్యూడల్, పద్యం పాతబడిందని అనుకుంటారు. కాని అది తప్పు. పద్యాన్ని అంటరాని వస్తువుగా చూడాల్సిన అవసరం లేదు. ఆ సందర్భంలో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావుగారు వచన కవిగా, విమర్శకుడిగా, పద్యకవిగా ఇలా విభిన్న కోణాల్లో పయనిస్తున్నారు. ఆయా ప్రక్రియలు రాశాక శతక ప్రక్రియలోకి ప్రవేశించారు. ఈ నేపథ్యంలోనే  ‘దార్లమాట’ అనే శతకాన్ని అచ్చువేశారు. దీనికి నేను వ్యక్తిగతంగా ఆనందిస్తున్నాను. దార్ల సారు నిజానికి  ఏపని చేసినా దానికి ఒక లెక్కుంటుంది. దీనికి కూడా ఒక లెక్క ఉంది. ఈ పుస్తకం 56 పేజిలు ఉంది. ఇందులో 28 పేజిల్లో ముందుమాటలు, పీఠికలు, ఆత్మీయ మాటలు ఉన్నాయి. తర్వాత శతకం ప్రారంభమవుతుంది. గ్రంథంలో 165 పద్యాలు ఉంటాయి. ఇదేంది శతకమంటే 100 లేదా 108 పద్యాలు కదా అనుకుంటాం సాధారణంగా, కాని విషయమేమిటంటే సంప్రదాయ ప్రక్రియను చేపట్టినా, సంప్రదాయ భావాలు లేదా వాసనలు ఉండాల్సిన అవసరం లేదని ఈ శతకం మొక్క సాంఖ్యాక శాస్త్రం రుజువు చేస్తుంది. నిజానికి దార్ల వెంకటేశ్వరరావు అనే వ్యక్తి సంప్రదాయ భావాలకు బంధిఅయ్యేవారు కాదు. ఒక వేళ అనుకున్న కాలేని వ్యక్తి కూడా. ఆ నేపథ్యం నుండి ఈ ‘దార్లమాట’ శతకాన్ని చూడాల్సి ఉంటుంది. దానితో పాటు ఇంకో విషయం చెప్పాలి. నిజానికి ఈ దార్ల మాట శతకం విజ్ఞేశ్వర స్తుతితో మొదలైంది. సాధారణంగా స్తుతితో మొదలయ్యే శతకాలు లేవు. తర్వాత తర్వాతకాలంలో ఈ స్తుతులు కూడా వచ్చాయి. ఈయన కొత్త ప్రక్రియ తీసుకోవడం, చిన్నప్పుడు నుండి ఏదో ఒక రాస్తుండటం ఆ విధంగా, ప్రక్రియగా, గ్రంథంగా ఈ శతకాన్ని తీసుకురావడం అభినందనీయం. ఇందులో  విజ్ఞేశ్వరుని స్తుతి చేశాడు. అంటే ఆ భగవంతుడు ఎటువంటి విజ్ఞానాలు కలిగించకుండా ఉండాలని ఆకాంక్షించారు. మామూలుగా ఇది ఆటవెలది ఛందస్సులో రాశాడు. ఆటవెలది అంటే వెలదిని ఆటల ఆడించే అని అర్థం.అంటే ఈ వెలదిలో అనేక వెసులుబాట్లు ఉన్నాయి. అంతమాత్రంలో ఆటవెలదితో పాఠకుల్ని ఆకట్టుకోవడం అంత సులభమేమి కాదు. ఈ ఆటవెలదితో రంజింపజేయాలంటే మాత్రం కాస్త సృజన ఉండాలి. చెయ్యి తిరిగుండాలి అప్పుడు మాత్రమే ఆట వెలదిగా భాసిస్తుంది. ఆ ప్రయత్నంలో దార్ల వెంకటేశ్వరరావు ఈ శతకం తీసుకురావడం ముదావహం. ఈయన పద్య విద్యను ఎలా అభ్యసిస్తూ పోయాడంటే సమస్యా పూరణలతో ప్రారంభించారు. అక్కడక్కడ ఇంటర్నెట్లలో వస్తున్న సమస్య పూరణల్ని చూసి ప్రతిస్పందించి వాటికి పూరణగా రాసిన పద్యాల్ని మొదటగా అభ్యసిస్తూ వచ్చారు. కాని సమస్యల్ని పూరించేవిసమస్యపూరణలు నిజానికి ఈ శతకంలో జీవిత సమస్యల్ని పూరించే పద్యాలను ఎక్కువగా ఈ శతకంలో పొందుపరిచారు. ఇందులో మరో విషయమేమిటంటే కొత్త ఛందస్సు, కొత్త ప్రక్రియలాగా వారి ఇంట్లోకి కొత్త లోకం  చూపించిన కొడుకు వచ్చాడు కాబట్టి ఆయనలో నవ ఉత్సాహం వెల్లివిరిసింది.  నేపథ్యంలో కూడా ఇది రావడానికి సుగమం ఏర్పడిందని చెప్పవచ్చు. దానికి సాక్ష్యం ఈ ముఖచిత్రం.  ఇక ఈ శతకంలోని ఒక్క రెండు పద్యాలను వినిపిస్తాను....    

‘‘వేసవి సెలవులకు వెళ్ళితినూరికి

          ఉక్కబోసిచంపెఊరునందు

అన్ని మరచిపోతి అమ్మను చూడగా

దారి పూలతోట దార్ల మాట.

వేసవిఉక్కపోయిస్తుంది,చెమటకక్కిస్తుంది,ఊరికేకూర్చోనివ్వదు. ఈయన కోనసిమ కుర్రాడు. కాబట్టి అన్నిటినిదాటుకోగలిగి అమ్మను చూసే సరికి అంతా మరిచిపోయాడు. ఎలాంటి కవి అయినా ఉద్యమకారుడైనా, విప్లవకారుడైనా, రక్తం ఉరకలేసినా అమ్మ అమ్మే. అమ్మను మించిన దైవం లేదు. అంతేకాదు అమ్మతనం కొడుకు తనం దానిని చెప్పడానికి రాసిన ఉదాహరణకి. మరో పద్యం...

కట్టుకున్న హాయి కాటను చీరయే

పెట్టవలయు గంజి పట్టుబట్టి

ఉతికినప్పుడల్లబ్రతుకేమొబేజారు

దారి పూలతోట దార్ల మాట !

నిజం చెప్పాలంటే ఈ పద్యం కొంత గిలిగింతలు పెడుతుంది. కవి ఈ పద్యంలో ఒక మెలిక పెట్టారు. అసలు కట్టుకున్న హాయి కాటను చీరయేది. కాటను చీర ఎవరైనా కట్టుకోవచ్చు. సరే స్త్రీలే కట్టుకున్నారనుకొండి. కట్టుకుంటే హాయిగా ఉంటుంది. అసలు హాయి ఎవరికి కట్టుకున్న వారికా చూసేవారికా?పెట్టవలయు గంజి పట్టుబట్టి! ఈ గంజి పెట్టేదెవరు మనకు ఆమె పెడుతుందా? ఈయన పెడతాడా? లేదా ఇంకెవరైనా పెడతారా?ఇలా చాలా పద్యాల్లో నిబిడీకృతమైన అర్థాలు చాలా ఉన్నాయి. ఉతికినప్పుడల్లాబ్రతుకేమొబేజారు! అసలు బేజారు పడాల్సిన పనేముంది?  నిజానికి స్త్రీ కట్టుకుంది అనుకొండి చాలా ఇష్టంగా, ఈ చీరలో చాలా ఆనందంగా ఉన్నానని మురిసిపోయి ఉండవచ్చునేమో గాక! కాని ఇక్కడ ఉతికినప్పుడల్లాబేజారుఅంటాడు కవి. ఇలా గిలిగింతలు పెట్టే సందర్భాలు పద్యాల్లో కనబడతాయి. ఒక్కో పద్యం రెండు మూడు అర్థాలకు దారి తీస్తూ చెక్కిలిగింతలు పెట్టే పద్యాలివి. ఇలాంటి భావాలు చాలా ఉన్నాయి. అమ్మతో ఆత్మీయతను పంచుకున్న భావాలున్నాయి. దానితో పాటుగా మరో పద్యం చూడండి.

‘‘కులము మతములన్నికుత్సితబుద్ధులు

కలపవలయు గాని కలహమేల?

మంచి కన్న మించు మానవత్వము లేదు

దారిపూలతోట దార్లమాట

            నిజానికి దార్లవారు ఒక అస్తిత్వ చైతన్యం నుంచి వచ్చినా ఇంత అభ్యుదయంగా ఉంటారని నేను ఊహించలేదు. ఇలాంటి నేపథ్యంలో ఆయన ఆత్మీయత, అనురాగం, స్నేహశీలత్వం, ఆధునికతల్లో ఉన్న వృత్తులకు సంబంధించి కూడా ఆయన చెప్పడం, సామాజిక ఉద్యమాలు, సామాజిక సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు, కొన్ని చోట్ల పాటకులకే ఆలోచించుకోమని వదిలిపెట్టిన సందర్భాలు ఈ సమకాలీన, వర్థమాన సమాజంలో చిగురించిన ఈ దార్ల శతకమనేది ఒక మంచి పరిణామం. దీనికి మకుటం ‘దారిపూలబాట దార్ల మాట’ అనేది హాయిగా చెప్పారు కాని ఈయన చెప్పిన విషయాలు పూలబాటకు తీసుకెళతాయనికోరుకోవచ్చుగాని దారి మాత్రం ముళ్ళబాట. ఆ పూలబాటను వేసుకోవాలంటే ఈ ముళ్లబాటను దాటాలి అనే స్పృహ ఈ శతకం ద్వారా తెలియజేశారు. ప్రతి పాఠకుడికి అది అర్థమవ్వలనే ఉద్దేశ్యంతో రాశారు. ప్రతి పద్యంలోనూ అది కనిపిస్తుంది. ఈ శతకం రాసినందుకు ఆచార్య దార్లవెంకటేశ్వరరావుగారిని మేమంతా అభిమాన పూర్వకంగా, అభినందన పూర్వకంగా, మాకు పాఠం చెప్పిన అధ్యాపకుడిగా, ఆత్మీయతను పంచుకుని, అక్కున చేర్చుకుంటూ, మేమూ గర్వపడుతూ, ఇలాంటి మరో ప్రక్రియలోకి, మరో భావనలోకి విశాల ప్రపంచంలోకి వస్తున్నందుకు ఆహ్వానిస్తూ పద్యంలో పుట్టిన వచన కవిగాఈయనను మేము గుర్తిస్తున్నాం. మీరు కూడా ఈ శతకాన్ని చదివి వాటి భావాల్ని పంచుకోవాలని కోరుకుంటున్నాను. ఈయన ఈ పద్యంలోకి వచ్చినప్పుడు ఎలాంటి మొహమాటాలు పడకుండా, దాపరికాలు లేకుండా, ఎదుర్కొన్న ఇబ్బందులూ, దీని ఎడిటింగ్ లో వచ్చిన సమస్యలూ, వాటి సుహృద్భావన వాతావరణం, ఆయనకు దొరికే తోడ్పాటూ గురించి ఎంతో సహజంగా రాసుకోవడం చాలా చక్కగా ఉంది. కాబట్టి ఈ శతకాన్ని ప్రతి ఒక్కరూ చదివి ముళ్లబాటల్ని తెలుసుకుని పూలబాటల్ని చేరుకుంటారని ఆకాంక్షిస్తున్నాను. ఈ అవకాశం కల్పించిన డా ఎన్. రాంబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు’ అని తన ప్రసంగాన్ని ముగించారు.

తర్వాత ప్రాజెక్టు డైరెక్టర్ ఆచార్య మునిరత్నం నాయుడుగారు ప్రసంగిస్తూ...



‘‘ఈ కార్యక్రమాన్ని ప్రాచీన విశిష్ట అధ్యయన కేంద్రంలో నిర్వహించడం చాలా సంతోషం. ముఖ్యంగా మిత్రుడు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావుగారు నాకు గత ఇరవై ఏళ్ళుగా బాగా తెలుసు. వారి పుస్తకం మన సమక్షంలో ఆవిష్కరణకు అవకాశం రావడం గొప్పదని భావిస్తున్నాను. దార్లవారు ఈ శతకంలో నేడు సామాజిక రుగ్మతల్లో ఎన్ని సమస్యల్నీ, రాజకీయ సమస్యల్నీ ఎంతో సూక్ష్మంగా పరిశీలించారని చెప్పాలి. నిజంగా మన సతీశ్ చెప్పినట్లు ముళ్లబాటను దాటుకునే పూలబాటను చేరుకోవాలంటూ... ఈ పద్యాల్ని ఉదహరించారు.

        ‘‘క్రొత్త నోట్ల వలన కోరి వచ్చుననిరి

                   నోట్లు రద్దు చేయ కోట్ల కొలది

                   నల్ల ధనము లేదు తెల్ల ధనము లేదు

                   దారిపూలతోట దార్లమాట’’అంటే నోట్ల రద్దు వల్ల నిష్ప్రయోజనమే తప్ప ప్రయోజనం లేదు. అని కవి భావన. అదేవిధంగా దోపిడి వ్యవస్థను ఎండగడుతూ రాసిన పద్యం చూడండి.

                   ‘‘తెల్ల దొరలు పోయి నల్లదొరలువచ్చె

                   మారవలయు ముందు మనిషి మనసు

                   దేశమేదియైనదేవళంబౌనురా

                   దారి పూలతోట దార్లమాట.’’

            ఇక్కడ రాజకీయ వ్యవస్థ ఎట్లా మారినా మన బతుకులకు వెలుగు రాలేదని కవి ఆవేదన కనబడుతుంది.

                   ‘‘శిలను చెక్కి శిల్పి శిల్పముగ మలుచు

                    కఠిన హృదయమైన కరునట్లు

                    సహృదయతను నింపు సాహిత్య పఠనంబు

              దారి పూలతోట దార్లమాట’’ ఈ పద్యంలో సాహిత్య పఠనం ఎంతో గొప్పదని దీనిని కవి శిల్పంతో పోల్చాడని గుర్తుచేశారు.

 దార్ల వారు మరో పద్యంలో  తెలుగు వారి లేదా భారతీయ ఆత్మీయతను ఈ విధంగా పద్యంలో ఇముడ్చారు.

                  ‘‘కలిమి లేములన్నికష్టసుఖములట్లు

                   తల్లి దండ్రియన్నదమ్ములుంద్రు

                   రక్తబంధమదియెరాదేదియును సాటి

            దారిపూల తోట దార్ల మాట.’’  అంటూ... కుటుంబ వ్యవస్థకు ఉన్న ప్రాముఖ్యతను, రక్తసంబంధాల విలువను ఇందులో దార్ల చాలా చక్కగా వర్ణించారు.

            ఎంతో హృద్యంగా శతకాన్ని రాసిన ఆచార్య దార్లవారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ తమ ప్రసంగాన్ని ముగించారు.

 ‘‘పద్యం ఎప్పటికి హృద్యమే’’ గొంతు సవరించి తీయగా పాడగలవారుంటే హాయిగా ఆ రసానందలో మునిగి తేలిపోవచ్చు. అయితే ఆ రోజు ఇక్కడి పద్య ప్రయోజనం ఇంకా బలమైనది, విలువైనది కూడా. ఆచార్య దార్ల వెంకటేశ్వరరావుగారు కాదు కాదు ‘దార్ల’గా సాహిత్యలోకంలో ప్రసిద్ధులైన ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారు, వారు నాకు దాదాపుగా పదేళ్ళుగా అంటే నేను పిహెచ్. డి., చేసే తొలినాళ్ళ నుంచి పరిచయస్తులు. వారిని అన్నా అని ఆత్మీయంగా పిలుచుకునేంత చనువు వుంది. మా గొంతుక అని చెప్పుకునే పొగరూ ఉంది. వారితో ఎన్నో సార్లు నా ఆలోచనలను, సందేహాలను పంచుకున్నాను. మిత్రమా! అని నోరారా పలకరిస్తూ మనసారా మాట్లాడే గొప్ప స్నేహశీలి. మంచి కవి రచయిత, గొప్ప విమర్శకుడు, ఎన్నో వ్యాసాలను, పుస్తకాలను ప్రకటించి తనదైన శకాన్ని కొనసాగిస్తున్నారు. వారి అభివృద్ధికి నేను ఎప్పుడూ సంతోషిస్తా. ఇక ‘దారి పూలబాట దార్లమాట’ అనే మకుటంతోవచ్చిన ఈ శతకాన్ని చూచినప్పుడు ఇందులో వాత్సల్యం నిండివున్న అమ్మ తలపు ఉంది. ఆత్మను పంచి యిచ్చే ప్రేమికుడి మనసూ ఉంది. అలాగే సమాజాన్ని గురించి పరితపించే సంస్కర్త పిలుపూ ఉంది. మట్టినాదని విర్రవీగి, వట్టిచేత పోయే వాడిని హెచ్చరించే తత్వ చింతనా ఉంది. ఒక రాజకీయ నాయకుడు, ఒక ఓటరు, అమ్మభాష, నోటు, కులము, మతం మోడి, నిన్నటి బిగ్ బాస్ ఇలా ఒకటేమిటి సమకాలీన సమాజంలో ఉన్న ప్రతి విషయాన్ని, ప్రతి సమస్యని భూతద్దంలో వెతికి వెతికి ఒక్క కథలాగా కాక, ఒక్కొక్క పద్యమొక కథలాగా చెప్పి, ఈ సమాజం పోకడను వేలెత్తి చూపుతున్నపుడు వేమన్నలు, జాషువాలు, కనిపిస్తారు, వినిపిస్తారు. తెలుగు, ఇంగ్లీషు, హిందీ, ఇలా విభిన్న పదాలను ఏరుకుని, అందమైన పదబంధాలను కూర్చుకొని సరళమైన శైలిలో, లోతైన భావావేశంలో తన ఆర్తిని, ఆవేశాన్ని చూపుతూనే, అక్కడక్కడా వ్యంగ్యాన్ని జోడిస్తూ రాసిన ఈ ‘దార్లమాట’ శతకం చదవవలసిన పుస్తకం. అందరికి స్ఫూర్తిదాయకం. తోటలో మరెన్నో పూలమాటలు పరిమళించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పుస్తకావిష్కరణ పని మన ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రంలో ఆవిష్కరణ చేయాలన్న గొప్ప ఆలోచన చేసినందుకు మన సీనియర్ ఫెలో డా ఎన్. రాంబాబు గారికి, ఈ సభను జయప్రదం కావాలని మనస్ఫూర్తిగా విచ్చేసిన మన కేంద్రం విద్యాత్మక సిబ్బంది అందరికీ పేరుపేరున ధన్యవాదాలు తెలియజేస్తూ... ఇంతటితో ఈ కార్యక్రమం ముగిసిందని ప్రకటించారు.

                       

                                     










 ధన్యవాదాలు. స్వస్తి. 

 శతకం ఆవిష్కరణ: పత్రికల రిపోర్టులు



పీపుల్స్ న్యూస్ దినపత్రిక, 27.7.2021 సౌజన్యంతో

ఈనాడు దినపత్రిక, 27.7.2021 సౌజన్యంతో



ఆంధ్రజ్యోతి దినపత్రిక, 27.7.2021 సౌజన్యంతో



సభ సమన్వయ కర్త: నూనావత్‌ రాంబాబు (సీనియర్ ఫెలో)

రిపోర్టర్ :డా బడిగె ఉమేశ్. (అసోసియేట్ ఫెలో)

ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం, నెల్లూరు


No comments: