"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

20 June, 2021

సామాజిక ప్రగతిశీలతను ఆకాంక్షించే భోజన్న సాహిత్యవ్యాసాలు

 

సామాజిక ప్రగతిశీలతను ఆకాంక్షించే భోజన్న  సాహిత్యవ్యాసాలు

-ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు,

ఆచార్యుడు, తెలుగుశాఖ,

మానవీయ శాస్త్రాల విభాగం &

డిప్యూటి డీన్, స్టూడెంట్స్ వెల్ఫేర్,  సెంట్రల్ యూనివర్సిటి, హైదరాబాదు.


మిత్రుడు టి.భోజన్న మా సెంట్రల్ యూనివర్సిటీలో ఎం.ఏ., తెలుగు చదివిన విద్యార్థి.  తర్వాత జానపద కథల పై ఎం.ఫిల్., పరిశోధన చేశాడు. ఆ పరిశోధనను పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ఆర్థిక సహాయంతో ఒక పుస్తకరూపంలో కూడా తీసుకువచ్చాడు. ప్రస్తుతం జానపద కథలు పైనే పిహెచ్.డి., పరిశోధన చ   .కేవలం తన పరిశోధన పరిధిలోనే తాను ఆగిపోకుండా భోజన్న ఇతర సాహిత్య అంశాలను కూడా సీరియస్ గానే అధ్యయనం చేస్తున్నాడు. తాను అధ్యయనం చేసేటప్పుడు తనకు స్ఫురించే సమన్వయాలతో కొన్ని వ్యాసాలను రాస్తుంటాడు. అప్పుడప్పుడు కొన్ని జాతీయ సదస్సుల్లో కూడా తన పత్రాల్ని సమర్పిస్తుంటాడు.  దీనిలో భాగంగానే  పేరుతో తాను రాసిన కొన్ని వ్యాసాలను 'అలంకృతి' (సాహిత్య వ్యాసమాలిక) పుస్తక రూపంలో తీసుకొస్తున్నాడు. ప్రాచీన తెలుగు సాహిత్యంపై రాసిన వ్యాసాలున్నా, ఆధునిక తెలుగు సాహిత్యానికి చెందిన వ్యాసాలను మాత్రమే ఈ పుస్తకంలో తీసుకున్నాడు.  వీటిలో మరలా ఆధునిక కవిత్వం గురించి సగం,  మిగతా సగం తెలుగు నవలల గురించి రాసిన వ్యాసాలున్నాయి.  ఈ వ్యాసాలన్నింటినీ చూస్తే మూడు ప్రత్యేక లక్షణాలు కనిపిస్తున్నాయి.

ఒకటి: ఆధునిక తెలుగు సాహిత్యంలో ప్రతిఫలించిన సమాజాన్ని పట్టుకోవడం.

రెండు: ఆధునిక తెలుగు సాహిత్యాన్ని రాసిన కవుల,రచయితల వ్యక్తిత్వాలను, వారి భావజాలాన్ని విశ్లేషించడం.

మూడు: కేవలం సాహిత్యంలో  వస్తువును మాత్రమే కాకుండా, సాహిత్యంలో రూపాన్ని కూడా పరిశీలించే ప్రయత్నం చేయడం.

భోజన్న తాను ఏదో ఒకటి రాయాలనే ఆసక్తి మాత్రమే ఉంటే ఏవో కొన్ని వ్యాసాలు రాస్తూ ఉండేవాడు. కానీ భోజన్న ఈ వ్యాసాలు రాయడాన్ని ఒక బాధ్యతగా భావిస్తున్నాడు. ఒక్క కొత్త విషయమై నా లేకపోతే తానీ వ్యాసాలు రాయవలసిన అవసరం లేదనే  అభిప్రాయం కూడా ఆయా వ్యాసాల్లో కనిపిస్తుంది. ప్రతి వ్యాసంలోనూ  సాహిత్యం సమాజాభివృద్ధికి తోడ్పడాలనే ఆకాంక్ష బలంగా కనిపిస్తుంది. అందుకనే అవధాన సాహిత్యంలో కూడా సామాజిక అంశాల ప్రతిఫలనాన్ని విశ్లేషించే ప్రయత్నం చేశాడు. కొన్ని  ఆధునిక సాహిత్య వ్యాసాల్లో జానపద పరిశోధనలో పాటించే క్షేత్రపరిశీలనా విధానాన్ని పాటించడం భోజన్న వ్యాసాల్లో కల్పించి ఒక ప్రత్యేకత. ప్రఖ్యాత అభ్యుదయ రచయిత కేశవ రెడ్డి గారి నవలల్లో ప్రతిఫలించే సామాజిక పీడిత స్వభావాన్ని, సామాజిక వాస్తవికతను ప్రదర్శించేందుకు క్షేత్ర పర్యటన పద్ధతిని కూడా ఉపయోగించుకున్నాడు. స్వాతంత్ర్యానికి పూర్వమున్న సామాజిక  పరిస్థితినీ, నేటి సామాజిక పరిస్థితినీ గమనించి, జీవించిన కొంతమందిని ముఖాముఖీ జరిపి, వారి అనుభవాల్ని ఆ వ్యాసంలో ఉపయోగించుకోవడాన్ని గమనించాలి.  ఒక రచనను చదివి, దానిలోని విషయాల పట్ల పాఠకుల ప్రతిస్పందనను పరిశీలించి, ఆ అనుభవాన్ని ఆధారం చేసుకొని, దానికి అనుగుణమైన విశ్లేషణ చేయడమనేది పాఠక ప్రతిస్పందన విమర్శలో కనిపిస్తుంది. దీన్ని తెలిసో తెలియకో భోజన్న తన వ్యాసంలో పాటించాడు. స్వాతంత్ర్యానికి ముందూ, స్వాతంత్ర్యం తర్వాతా కొన్ని కులాలు సమాజంలో తమ ఆధిపత్యాన్ని నేటికీ చెలాస్తున్నాయనేది సూత్రీకరించడం తన పరిశోధనలో సాధించిన విజయం. తన తొలి వ్యాసం తోనే తాను అభ్యుదయ ఆకాంక్ష గల వాడిననే అభిప్రాయాన్ని చెప్పకుండానే చెప్పినట్లయింది. ఇంచుమించు దీనిలోని ప్రతి వ్యాసంలోనూ అభ్యుదయ ఆకాంక్షే స్పష్టంగా కనిపిస్తుంది.

 గురజాడ అప్పారావు, గుర్రం జాషువా వంటి కవులను, వారి సాహిత్యాన్ని ఎన్నుకోవడంలోనే తన ఆలోచన స్పష్టంగా తెలుస్తుంది.గురజాడ ప్రజల భాషలోనే సమాజాన్ని చూశాడంటాడు రచయిత. కన్యాశుల్కం నాటకంలో బ్రాహ్మణ వాడుక భాషను చిత్రించాడని స్పష్టంగానే గుర్తిస్తాడు. మతాన్ని నిరసించిన గురజాడను మతంలోని అభిమతంతో ఈవ్యాసాన్ని ప్రారంభించడం ఒక విశేషం. గుర్రంజాషువాని ప్రజల పక్షాన నిలబడి కులరహిత సమాజం కోసం నిరంతరం పోరాడిన సాహితీయోధునిగా అభివర్ణిస్తాడు. జాషువాలోని అభ్యుదయభావాలు, ప్రజలకోసం ఆరాటపడ్డం, ధైర్యంగా తాను చెప్పాలనుకున్నదాన్ని చెప్పడం అనే మూడు లక్షణాలు తెలుగు సాహిత్యంలో జాషువాని విశిష్టకవిగా నిలపడానికి దోహదపడ్డాయని వ్యాఖ్యానించాడు. రైతు జీవితాన్ని వర్ణించిన తెలుగు కవులు ఎంతోమంది ఉన్నారు. వారిలో కొంతమంది కవితాఖండకల్ని తీసుకొని రైతు దేశానికి నిజమైన వెన్నుముకగా సాహితీవేత్తలు గుర్తించడాన్ని సాహిత్యం సామాజిక బాధ్యతను నెరవేరుస్తుందని నిరూపిస్తాడు. అవసరమొచ్చినప్పుడల్లా భోజన్న జానపదుల సాహిత్యాన్ని ప్రస్తావించకుండా ఉండడని చెప్పడానికి ఈ వ్యాసం ఉదాహరణ. అది అవసరం కూడా. తెలుగులో శిష్టసాహిత్యంగా చెప్పుకునే సాహిత్యంలో అనేక జానపదాంశాలు ఉన్నాయి. జానపదుల స్వచ్ఛమైన ప్రేమ, అద్భుతకల్పనలు శిష్టసాహిత్యంలో చేరి, ఆ సాహిత్యానికి ఎంతో విలువను తీసుకొచ్చాయి.

మరొక వ్యాసంలో తెలుగు సాహిత్యం చిత్రించిన మానవవిలువల గురించి వ్యక్తిత్వవికాస కోణంలో విశ్లేషిస్తాడు. సాహిత్య ప్రయోజనమని నాడు చెప్పిన అంశాలు నేడు సాహిత్యంలో వ్యక్తిత్వవికాసాన్ని వివరించే అంశాలుగా ఆధునిక శాస్త్రవిజ్ఞానంతో సమన్వయించి చెప్పేప్రయత్నం కొంతమంది చేస్తున్నారు. అది భోజన్న రాసిన ఈ వ్యాసంలోనూ కనిపిస్తుంది. ప్రాచీన తెలుగు సాహిత్యాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే, ఆధ్యాత్మిక విలువల బోధన విడదీయరానంతగా కలిసిపోయిందనిపిస్తుంది. భావవాదదృష్టి ఆ నాటి కవుల్లో అధికంగా ఉండడం దీనికి ఒక కారణం. అందుకే కొన్నిసార్లు ప్రాచీన తెలుగుసాహిత్యాన్ని బోధించేవాళ్లు మతప్రబోధకులుగా కూడా మారిపోయిన, మారిపోతున్న పరిస్థితి మనకు కళ్లెదుటే కనిపిస్తుంది. అందువల్లనే కొన్ని పత్రికలు ఆధ్యాత్మికం, అంతర్యామి మొదలైన పేర్లతో ప్రచురించే సాహిత్యంలో కూడా ప్రాచీన తెలుగుసాహిత్యం ఒక భాగమైంది. ఈ వ్యాసంలో భోజన్న కొన్ని అలాంటి పత్రికల్లోని వ్యాసాల్ని కూడా స్వీకరించడానికి అదొక బలమైనకారణంగా కనిపిస్తుంది. రాయలసీమసాహిత్యం గురించి రాసిన వ్యాసంలో తెలుగు సాహిత్య ప్రక్రియలని ప్రస్తావించినా, కవిత్వాన్నే ప్రధానంగా తీసుకున్నాడు. ప్రాచీన, ఆధునిక కవిత్వంతో పాటు, సినిమాపాటల్ని కూడా అక్కడక్కడా తన విశ్లేషణకు ఉపయోగించుకున్నాడు.రాయలసీమలో నీటిసమస్య మీద స్పందించిన ఖండికల్ని ఈ వ్యాసంలో స్వీకరించాడు. వ్యాసంలో మరింత లోతైన పరిశీలనతో రాయగలిగే అవకాశం ఉంది.

కాళోజి’ గా పేరొందిన కాళోజి నారాయణరావు గారి గురించి సమగ్రమైన దృశ్యచిత్రాన్ని అందించాడు. తాను పుట్టింది మరొక రాష్ట్రంలోనైనా తెలంగాణా ప్రాంతమే తన ప్రాంతంగా జీవించిన ఉద్యమకవి కాళోజి. అందుకే ఆయనకు తెలంగాణ ప్రభుత్వం ఉన్నతమైన గౌరవాన్నిస్తుంది. సమాజంలోని గొడవను తనగొడవగా చెప్పున్న కవి కాళోజి. కొంచెం ఆవేశం ఆవహించి రాసిన వ్యాసంలా అనిపించినా, వ్యాసంలో ఆయన కవితాఖండికల్ని ఉదాహరించి, విశ్లేషించడం బాగుంది. ఇదే కోవలో రాసిందే అన్నవరం దేవేందర్ తెలంగాణ కవిత్వం గురించిన వ్యాసం. తెలంగాణాలో గల పెత్తందార్లతోను, తెలంగాణేతర వలసవాద పెత్తందార్లతోను  తెలంగాణ అస్తిత్వం కోసం పోరాటం జరిగిన విషయాన్ని కవిత్వం ద్వారా చక్కగా విశ్లేషించాడు.

దీర్ఘకవిత పేరుతో రాసిన వ్యాసం వస్తు, రూపాల్ని విశ్లేషించే వ్యాసం. ‘కథావిరహితంగాను, సంక్షిప్తంగాను, జీవద్భాషలోను ఉన్న కవిత్వం మరలా ఇతిహాసయుగంలో వలే ‘దైర్ఘ్యత’ను సంతరించుకోవడం’ తెలుగులో దీర్ఘకవిత్వం లేదా దీర్ఘకావ్యం ఆవిర్భావ పరిణామాన్ని తెలియజేస్తుందని గుర్తించడం లోతైన పరిశీలనతో కూడినదే.  దీర్ఘకవిత కథ, పాత్రలు లేని ఒక అవిచ్ఛిన్న భావధారతో కొనసాగుతుంది. దైర్ఘ్యత, ఏకరూప వస్తువుని కలిగి ఉంటుంది. ప్రాచీన తెలుగు సాహిత్యంలోని కావ్యానికీ, మహాకావ్యానికీ; ఆధునిక తెలుగు దీర్ఘకవిత లేదా దీర్ఘకావ్యానికీ ఎంతో భేదం ఉంది. అక్కడ కథ ప్రధామైతే, ఇక్కడ సంవేదనే ప్రధానం. అక్కడు పురాణేతిహాసాలు వస్తువులైతే, ఇక్కడు మానవ సంఘర్షణ, సామాజిక సంఘర్షణల ప్రతిఫలనం వస్తువులుగా మారతాయి. అక్కడ ఛందస్తు, ఆశ్వాసాల విభజన ప్రధానమైతే, ఇక్కడ స్వేచ్ఛాపూరితమైన వచనంతో పాటు, ఒక భావాంశం పూర్తవ్వగానే మరొక భాగంగా వర్ణన కొనసాగుతుంది. ఇలాంటి అనేకాంశాలు కావ్యానికి, దీర్ఘకవితకూ మధ్య ఉన్నాయి. తెలుగులో  ఆసుపత్రి గీతం (శివారెడ్డి), కొయ్యగుర్రం (నగ్నముని), విశ్వంభర (సినారె),  గొరిల్లా (గుంటూరు శేషేంద్రశర్మ), జీవనది ( పెన్నాశివరామకృష్ణ) తదితర దీర్ఘకావ్యాలు ప్రఖ్యాతి పొందాయి. వీటిలోని కొన్ని అంశాల్ని తీసుకొని ఈ వ్యాసాన్ని రాయడంలో ఒక లోతైన ఆలోచనాపరుడైన విమర్శకుడుగా కనిపిస్తాడు. బూర్ల వెంకటేశ్వర్లు గారి వచనకవిత్వాన్నీ, అంబేద్కర్ వాది గొల్లపల్లి లక్ష్మిగారి నానీలు వ్యాసాలు కూడా రచయిత సునిశిత పరిశీలనకు నిదర్శనంగా నిలుస్తాయి. దీని తర్వాత అవధాన కవిత్వం గురించి కూడా రాశాడు.  ఈ విధంగా కవిత్వం- పద్యం, వచనం, దానిలో మళ్ళీ దీర్ఘకవిత్వం, మినీ కవితా ప్రక్రియల్లో నానీలపైనా వ్యాసాలు రాయడం వల్ల భోజన్న ఎన్నుకున్న కవిత్వ వస్తు, రూప విశ్లేషణాసామర్థ్యాన్ని తెలుపుతాయి.

కల్పనా సాహిత్యంలో కథ, నవలను విశ్లేషించడమంటేనే సామాజిక వాస్తవికతను గుర్తించడం. భోజన్న ఈ పుస్తకంలో కేశవరెడ్డి, వట్టికోట ఆళ్వారుస్వామి, బోయ జంగయ్య, నెల్లూరి కేశవస్వామి, మాదిరెడ్డి సులోచన, రావూరి భరద్వాజ తదితరుల గురించి రాసిన వ్యాసాల్లో ఆ పనే చేశాడు. ఆ యా రచయితలు, రచయిత్రి సమాజంలోని వివిధ సమస్యల్ని చిత్రించడం, వాటికి తమదైన పరిష్కారాన్ని సూచించిన తీరుతెన్నుల్ని విశ్లేషించాడు. 

   తెలుగు సాహిత్యం కూడా విశ్వజనీన భావనలను వ్యక్తం చేయడం దాని ప్రధాన లక్ష్యాలలో ఒకటి కావాలనే ఆకాంక్ష కూడా భోజన్నలో కనిపిస్తుంది. ఆంధ్ర, రాయలసీమ,  తెలంగాణ, కళింగాంధ్ర లలోగల అన్ని ప్రాంతాల కవుల, రచయితల రచనల పైనా ఈ వ్యాసాలను ఎన్నుకోవడంలోనే తన లక్ష్యాన్ని స్పురింప చేస్తున్నాడు.

ఈ వ్యాసాలన్నీ చదివిన తర్వాత తెలుగు సాహిత్యంలో ఒక మంచి పరిశోధకుడు, ఒక మంచి విమర్శకుడు రాబోతున్నాడని అనిపించింది. ఈ కృషి ఇలాగే కొనసాగితే తెలుగు సాహిత్యంలో భోజన్న తనదైన ముద్రను వేసుకోగలుగుతాడనిపిస్తుంది. నా దగ్గర చదివిన నావిద్యార్థి అని మాత్రమే కాకుండా, ఈ వ్యాసాలు చదివిన తర్వాత నాలుగు మంచి మాటలు చెప్పకుండా ఉండలేకపోయాను. ఈ వ్యాసాలు చదివిన తర్వాత మీరు కూడా వ్యాసకర్తను మనస్ఫూర్తిగా అభినందిస్తారనుకుంటూ, నేను కూడా అతణ్ణి హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.    

No comments: