"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

06 June, 2021

నిత్య చైతన్య శీలి, నిరాడంబర కవి ఆచార్య దార్ల వెంకటేశ్వర రావు ( భూమిపుత్రి దినపత్రిక, 6.6.2021 సౌజన్యంతో)


నిత్య చైతన్య శీలి, నిరాడంబర కవి ఆచార్య దార్ల వెంకటేశ్వర రావుhttps://www.bhumiputra.net/eternal-consciousness-dedication-simplicity-study-social-awareness-darla/

                                    అన్నం ఒకవైపు

                                    అక్షరం మరొకవైపు పెడితే

                                    నేను అక్షరాన్నే హత్తుకుంటాను ఆబగా! (నెమలి కన్నులు :24)

            అంటూ అక్షరాలను, అన్నపు మెతుకులను పక్కపక్కనే పెడితే నేను అక్షరాలను నమిలి ఆకలిని తీర్చుకుంటానని ప్రకటించిన కవి ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు. ఈపూట నేను అన్నం తింటే కడుపు నిండవచ్చు. కాని నేను అక్షరాలు నేర్చుకోపోతే జ్ఞానాన్ని కోల్పోయి వేల సంవత్సరాలు వెనకబడిపోతానంటారు. అందుకే నాకావాల్సింది అన్నం కాదు అక్షరం అన్నారు. ఆ అక్షరమే ఆకాశమంత ఎత్తులో ఉంచుతుంది. ఆ అక్షరమే మట్టి విలువను, మనుష్యుల బంధాలను తెలుపుతుందంటారు. మట్టిమనిషి ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు  తూర్పు గోదావరి జిల్లా చెయ్యేరు అగ్రహారంలో జన్మించి కవిగా, రచయితగా, విమర్శకుడిగా, గొప్ప పరిశోధకుడిగా, అన్నింటికీ మించి మంచి మానవతావాదిగా తెలుగు సాహిత్యంలో పేరు ప్రఖ్యాతలు పొందారు. తెలుగు సాహిత్యంలో ప్రాచీన అలంకార శాస్త్రాల నుండి మొదలుకొని నేడు వస్తున్న అనేక అస్తిత్వ ఉద్యమ సాహిత్యాల వరకు క్షుణ్ణంగా అధ్యయనం చేస్తూ

, ఎప్పటికప్పుడు వివిధ పత్రికల్లో మనందరితో తన ఆలోచనలు పంచుకుంటూ సమాజాన్ని చైతన్యపరుస్తున్న వ్యక్తి ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు.   

            ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారిని దాదాపు 2009 నుండి నేను చాలా దగ్గర నుండి చూస్తున్న వ్యక్తిని. తన జీవితం వడ్డించిన విస్తరి కాదు. విస్తరి తయారీ ఆయనదే, వడ్డన కూడా ఆయనదే. అంటే తనకు తానుగా నిలబడ్డ గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనం ఆయన. పట్టుదల, అధ్యయనం, అనుశీలనం, సామాజిక చైతన్యం కలిగిన నిత్యపరిశోధకులు వీరు. తన కుటుంబంలోనే కాక, గ్రామంలోనే ఎం.ఏ, ఎం.ఫిల్‌, పిహెచ్‌.డి., చేసిన మొట్టమొదటి వ్యక్తి ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు. పాఠశాల స్థాయి నుండే ఎంతో క్రమశిక్షణతో తన జీవితాన్ని మలుచుకున్నారు. అలాగే, పాఠశాల స్థాయి నుండే విద్యారంగంలో ముందు వరుసలో ఉంటూ తెలుగు సాహిత్యంపై అభిరుచిని ఏర్పరచుకుని చిన్న చిన్న కవితలు రాయడం ప్రారంభించారు. ఇంటర్‌ పూర్తవగానే  డిగ్రిలో స్పెషల్‌ తెలుగు తీసుకుని డా॥ద్వానా శాస్రి గారి శిష్యరికంలో సాహిత్య అభ్యసనం కొనసాగించారు. అంతేకాదు, ఆయన సలహాలు, సూచనల మేరకు, హైదరాబాదు కేంద్రీయ విశ్వ విద్యాలయంలో ఎం.ఏ, తెలుగులో ప్రవేశం పొంది, అక్కడే ఎం.ఫిల్‌, పిహెచ్‌.డి., పూర్తి చేశారు. ఇదంతా ఒక క్రమ పరిణామం అయితే అక్కడే చదివి అక్కడే అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గా ఎంపికై, ప్రొఫెసర్‌గా కొనసాగుతూ నేడు తెలుగుశాఖ అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తించడం ఎంతో గర్వించదగిన విషయం. అది ఎందరికో ఆదర్శనీయం, అది ఎందరికో ప్రేరణనిచ్చే అంశం.

            కాలానికి అనుగూణంగా మార్పు ఉండాలి. గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు శాఖ హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో కొన్ని సబ్జెక్టులు మాత్రమే పరంపరగా  కొనసాగు తుండేవి. సమకాలీన తెలుగు సాహిత్యంలో వస్తున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని కొంత మార్పు అవసరమని గుర్తించి తెలుగుశాఖలో అప్పటి అధ్యక్షులైన ఆచార్య పరిమి రామనరసింహం, ఆచార్య బేతవోలు రామబ్రహ్మం, ఆచార్య ఎన్‌. ఎస్‌. రాజు  గార్లను  ఒప్పించి ‘‘దళిత సాహిత్యం’’ ‘‘డయోస్పోరా సాహిత్యం - పరిచయం’’ వంటి నూతన కోర్సులను ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ప్రవేశపెట్టారు. అలాగే సమాజంలో పేద ప్రజలపై జరుగుతున్న వివక్షలను, ప్రత్యక్ష సంఘటనలను చూసి చలించిపోయి అనేక కవితలను రాశారు. దాంతో పాటు విద్యార్థి దశలోనే అనేక మంది దళితులకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తూ మాదిగ సాహిత్య వేదిక అనే సంస్థను స్థాపించడంలో ఆయన కీలకపాత్రను పోషించారు. మాదిగ చైతన్యం (1997) అనే పేరుతో మాదిగ జీవితాలను వర్ణిస్తూ రాసిన కవితలను  నాగప్పగారి సుందర్రాజుతో కలిసి ఒక కవితా సంకలనంగా తీసుకొచ్చారు. ఆచార్య ఎస్‌.శరత్‌ జ్యోత్స్నారాణి గారు ప్రధాన సంపాదకులుగా, తాను ఉప సంపాదకుడిగా తెలుగు సాహిత్యంలో కవుల కృషిని వివరిస్తూ తాను రీసెర్చ్‌స్కాలర్‌ గా ఉండగానే ‘‘సాహితీ మూర్తుల ప్రశస్తి’’ (1998) అనే గ్రంథాన్ని తీసుకొచ్చారు., నాటి కాలంలో దళితులు ఎదుర్కొంటున్న స్థితి గతులను స్వీయానుభవాలతో వర్ణిస్తూ రాసిన కవితలను ‘‘దళిత తాత్త్వికుడు’’ (2004) పేరుతో ఒక కవితా సంపుటిగా మనముందుంచారు.

            ఇప్పుడున్న విద్యార్థిలోకంలో సృజనాత్మక అంశాలను పెంపొందించాలని ఇంటర్‌, డిగ్రీ కళాశాల స్థాయి నుండే వారిలో సృజనాత్మకతను రచనలను (క్రియేటివిట్‌ రైటింగ్‌) రాసేదిశగా విద్యార్థులను తయారు చేయాలనే సంకల్పంతో  సృజనాత్మక రచనలు చేయడం ఎలా?(2005) అనే ఒక గ్రంథాన్ని రాశారు. ఈ గ్రంథం కొత్తగా రచనలు చేయాలనుకొనేవారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే మరో గ్రంథం సాహితీ సులోచనం (విమర్శ వ్యాసాలు 2006)లో తాను అప్పుడప్ఫుడూ రాసిన సాహిత్య విమర్శ, సమీక్ష వ్యాసాలు ఉన్నాయి. ముఖ్యంగా దళితసాహిత్యానికి సంబంధించిన గ్రంథాల విశ్లేషణ చాలా చక్కగా ఉంది. అలాగే  ‘‘దళిత సాహిత్యం- మాదిగ దృక్పథం’’(2008) గ్రంథంలో తెలుగులో దళిత సాహిత్య పరిణామాలను తెలుపుతూ రాశారు. దీనిలో  ప్రధానంగా  దళిత సాహిత్యంలో అంతర్భాగం మాదిగ సాహిత్యమా? మాదిగ సాహిత్యంలో అంతర్భాగం దళిత సాహిత్యమా? అనే చర్చను ప్రవేశపెడుతూ, మాదిగ సాహిత్యం నుండే దళిత సాహిత్యం ఆవిర్భవించిందనీ, అయితే, దాన్ని మాదిగ సాహిత్యంగా కాకుండా దళితసాహిత్యంగా ప్రచారం చేశారనీ నిరూపించారు. దళితులైనా, దళితేతరులైనా తొలినుండీ నిజమైన అస్ఫృశ్యతను అనుభవిస్తున్న మాదిగల గురించే రాశారనీ, ఆవిధంగా మాదిగ సాహిత్యం నుండే దళిత సాహిత్య ఆవిర్భావాన్ని చూడాలని దాన్ని చర్చకు పెట్టారు. కానీ దళిత సాహితీవేత్తలు చర్చలో పాల్గొనలేదు. అంటే ఆ ప్రతిపాదనను అందరూ అంగీకరించినట్లే భావించే అవకాశం ఉంది. దీనితో పాటు ఈ గ్రంథంలో దళితులకు రావలసిన సమాన హక్కులకోసం జరుగుతున్న మాదిగ  దండోరా ఉద్యమ ఫలితంగా వచ్చిన  వర్గీకరణ సాహిత్యానికి,ఆ ఉద్యమానికి గల శాస్త్రీయ దృక్పథాన్ని కూడి వివరించారు ఈ గ్రంథంలో.   సాహితీ ప్రపంచంలో ఒక ట్రెండ్‌ సెట్టర్‌ గా భావింపబడుతున్న డాక్టర్‌ నాగప్పగారి సుందర్రాజు దళిత యువతి, యువకులను ఎంతగానో ప్రోత్సహిస్తూ, వారి, వారి చుట్టుపక్కల మాదిగ జీవితాలు ప్రపంచానికి తెలపాలనే ఆశయంతో కవిత్వం, కథా సంకలనాలుగా మాదిగ సాహిత్య వేదిక ద్వారా పరిచయం చేశారు. సాహిత్యంలో ఆయన కృషిని తెలుపుతూ, అతనితో దార్ల వెంకటేశ్వరరావుకు ఉన్న అనుబంధాన్ని తెలుపుతూ సుందర్రాజు  స్మృతిగా ‘‘ఒక మాదిగ స్మృతి’’ ’నాగప్పగారి సుందర్రాజు పరిచయం (2007 స్మృతి గ్రంథం) అనే చారిత్రక గ్రంథాన్ని వెలుగులోకి తీసుకువచ్చిన ఘనత దార్ల వెంకటేశ్వరరావుగారికే దక్కుతుందని చెప్పాలి.                           

తెలుగు సాహిత్యంలో వచ్చిన అనేక ప్రక్రియల్లోని మౌలిక అంశాలను తెలుపుతూ ‘‘వీచిక’’ (విమర్శ వ్యాసాలు.2009) అనే గ్రంథాన్ని ముద్రించారు. తెలుగులో మొదటి కథానిక ఏది? ఎందువల్ల ? అనే వ్యాసం, దళిత సాహిత్యం మౌలిక భావనలు అనే వ్యాసాల్లో ఎన్నో విలువైన అంశాలు మనకు కన్పిస్తాయి. అందుకే ఈ గ్రంథం వివిధ విశ్వవిద్యాలయాల్లోని తెలుగు శాఖలో  కొన్ని పాఠ్యాంశాలకు  రిఫరెన్స్‌ గ్రంథంగా (ఆధారం గ్రంథంగా) కొనసాగుతుంది. ఆచార్య బేతవోలు రామబ్రహ్మం, డా॥ ద్వా.నా. శాస్త్రి లాంటి గొప్ప పండితులచే గొప్ప ప్రశంసలు అందుకున్న వ్యక్తి దార్ల వెంకటేశ్వరరావు. ఆ తర్వాత ‘‘పునర్మూల్యాంకనం’’ (విమర్శ వ్యాసాలు, 2010) అనే గ్రంథం ద్వారా సమకాలీన సాహిత్య ప్రక్రియల్లో వస్తున్న వివిధ పోకడలను, విలువలను పునర్మూల్యాంకనం చేశారు. 2005 నుండి ఎక్కువగా వినబడుతున్న పదం బహుజనవాదం. బహుజన వాదం సాహిత్యంలో కూడా ప్రవేశించిన తర్వాత  ‘‘బహుజన సాహిత్య దృక్పథం’’ (విమర్శ వ్యాసాలు 2012) అనే పేరుతో ఒక గ్రంథాన్ని వెలువరించారు. ముఖ్యంగా సాహిత్యంలో అస్తిత్వ వాదం కొనసాగుతన్న తరుణంలో పోతులూరి వీరబహ్మ్రేందర స్వామి, అన్నమయ్య నుండి మొదలుకొని కొమ్రన్న వరకు కొనసాగిన బహుజన సిద్ధాంతాన్ని వివిధ నాయకులు, సాహితీవేత్తలు ఎలా వెలుగులోకి తీసుకువచ్చారో ఈ గ్రంథంలో సైద్ధాంతికంగా వివరించారు. తెలుగు సాహిత్యంలో బహుజన సిద్ధాంతానికి గల తాత్త్వికతను చక్కగా వివరించారు.

            ఒకవైపు వ్యాసాలు రాస్తూనే  వివిధ సంఘటనలు, ఆలోచనలను తనను కలిచివేసినప్పుడు కవిగా కూడా మారేవాడు. లోతైన భావాలతో సులభమైన  పదాలతో కవిత్వం రాసి ‘‘నెమలి కన్నులు’’ (కవిత్వం, 2015) పరిచయం చేశాడు.

‘‘నేను ఈ కులంలో పుట్టడమే మంచిదైంది

  అవమానమంటే అర్థమయ్యింది

 అందర్నీ ప్రేమించడమూ తెలిసింది’’  అనే ఎక్స్‌ప్రెషన్‌ ఎంతో అద్భుతంగా ఉంది. సమాజంలో కులవివక్ష అనే వేర్లు ఎలా పెనవేసుకొని

ఉంటాయో చాలా అద్భుతంగా తెలిపారు. గురజాడ, జాషువా తదితర సాహితీవేత్తల దృక్పథాలను వివరిస్తూ  ‘‘సాహితీ మూర్తులు ` స్పూర్తులు’’ (విమర్శ వ్యాసాలు2015) అనే గ్రంథాన్ని ప్రచురించారు. ఎంతో మందికి  ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ముందుమాటలను రాస్తూ వారిని ప్రోత్సహిస్తుంటారు. అలా రాసిన కొన్ని ముందుమాటలను ‘‘సాహితీ సౌగ్రంథి’’ (వ్యాసాలు 2016) పేరుతో ప్రచురించారు.  

ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారికి తాను వెలుగుతూ ఇతరులకు వెలుగు నివ్వడం ఆయన నైజం. విద్యార్థులలో ఉండే సృజనాత్మకతను వెలికితీయడంలో భాగంగా  (2014 `16 బ్యాచ్‌) పి.జి చదివే విద్యార్థులచేత తెలుగులో మొట్టమొదటి నవల అయిన కందుకూరి వీరేశలింగంగారి  శ్రీరాజశేఖర చరిత్రం నవల పై క్లాసు రూమ్‌ సెమినార్‌ నిర్వహించారు. ఒక్కో విద్యార్థికి ఈ నవలలోని ఒక్కో అంశం ఇచ్చి వారిచేత పత్ర సమర్పణ చేయించారు. ఆ పత్రాల సమాహార గ్రంథమే ‘‘రాజశేఖర చరిత్ర విభిన్న దృక్కోణాలు(2017). దీనిలో ఎన్నో  లోతైన అంశాలను విద్యార్థులకు వివరించి వాటిని పత్రాలుగా సమర్పించి, వాటిని ఒక మంచి గ్రంథంగా మనముందుంచారు. ఈ గ్రంథం ప్రతి విద్యార్థికి ఒక తీపి జ్ఞాపకంగా గుర్తుండిపోయేలా చేశారు. మరొక విశేషమేమిటంటే, తన పుస్తకాలన్నీ ఆన్ లైన్ (https://vrdarla.blogspot.com/p/my-books.html) లో ఉచితంగా అందుబాటులో పెట్టేస్తారు.

సాహిత్యం, సమాజాన్ని రెండు కళ్ళుగా భావించి ఈ రెండు కళ్ళతో రెండింటినీ సమపాళ్ళుగా వీక్షించి, దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నించడం ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారి రచనల్లో కనిపించే ఒక పార్వ్శం. అచ్చం దళితుల్లాగే అనేక బాధలు అనుభవిస్తున్న తెలంగాణ ప్రజల స్థితిగతులను కూడా తెలుసుకుని చిన్న రాష్ట్రాల ద్వారానే సామాన్య ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉంటారని భావించి, ప్రత్యేక రాష్ట్రం ద్వారానే అభివృద్ది కూడా అధికంగా జరుగుతుందని తెలిపిన డా. బి. ఆర్‌. అంబేద్కర్‌ ఆలోచనా విధానాన్ని పాటిస్తూ ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు సామాజిక తెలంగాణ ప్రత్యేక  రాష్ట్రం కోసం తెలంగాణ ప్రజలు కోరికను సమర్ధించారు. తెలంగాణా వారి బాధలను కవిత్వం రూపంలో మన ముందుంచి, గొప్ప మానవతావాదిగా  తన వంతు బాధ్యతను నిర్వర్తించారు.

తన నెమలికన్నులు కవితా సంపుటిలో ఒకకవితలో  శ్రామికులు, దళితుల పనికి గుర్తింపు రానితనాన్ని తన జీవితం గురించి చెబుతున్నట్లుగా ఆత్మాశ్రయ పద్ధతిలో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ఇలా అంటారు.

            ‘‘పగలనక, రాత్రనక

          ఆకలనక, దప్పికనక

          నీరసమనక, నిద్రనక

          నగర నిర్మాణంలో కలిసిపోయింది నా జీవితం’’ (నగర పురస్కారం)

            నిజానికి ప్రతిశ్రామికుడినీ తన జీవితంగా చెప్పడం దీనిలోని ప్రతేకత. కానీ, నిజంగా కూడా ఆయన కూడా రాత్రీ, పగలనకుండా శ్రమించే తత్వం గల అధ్యాపకుడు. ’నగరం’ ఒక అభివృద్దికి ప్రతీకగా తీసుకున్నాడు కవి. అభివృద్ధి చెందిన ప్రతిదానిలోనూ శ్రామికుడు, దళితుల పాత్ర ఎంతో ఉన్నాదాన్ని విస్మరిస్తున్న స్థితిని ఈ కవిత వివరిస్తుంది.  సమకాలీన సమస్యలపై స్పందించే తత్త్వ జీవి ఆచార్య దార్ల. ఆయన తన బోధనలో పరిశోధనాంశాల రుచి చూపించగల ఋషి. ప్రతి అంశం పట్లా ఒక తాత్త్విక దృక్పథాన్ని ఏర్పరచి విద్యార్థులను సాహితీ పరిశోధన మైదానంలోకి తీసుకెళతారు. కావ్యానికి హేతువులు ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యసనం ఎలాంటివో విద్యార్థులకు పఠనం, విశ్లేషణం, తాత్త్విక దృక్పథం అవసరమని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ఉద్భోదిస్తుంటారు.

            ఆయన ఏదో ఒక ప్రక్రియలోనే కాదు,  బహు ప్రక్రియా పారాయణులు. పద్య కవిత్వం, వచన కవిత్వం, శతకం, విమర్శ విశ్లేషణ వంటి ప్రక్రియల్లో రాస్తూ  సాహితీ ప్రియులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు. నిరంతరం ఏదో ఒక నూతన అంశాన్ని శోధన చేస్తూ నిత్య శ్రామికుడిగా ఉంటూ కొత్త కొత్త అంశాలను పరిశోధిస్తూ గొప్ప పరిశోధకుడిగా మారిపోతుంటారు. ఆయన చేసిన సాహిత్య కృషికిగాను గుర్తింపుగా భారతీయ దళిత సాహిత్య అకాడమి న్యూఢిల్లీ వారు 2007 లో డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ పురస్కారంతో సత్కరించారు. తాను తెలుగు సాహిత్య విమర్శ రంగంలో చేస్తున్న కృషికి గాను  పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాదు వారు 2012 లో ఉత్తమ విమర్శ విభాగంలో ‘‘కీర్తి పురస్కారాన్ని’’ అందించారు. అలాగే, తెలుగు సాహిత్యంలో విశేషమైన కృషి చేస్తున్న వారికి ఆంధ్రప్రదేశ్‌ బహుజన రచయితల సంఘం వారిచ్చే మధురకవి మల్లవరపు జాన్‌ కవి స్మారక పురస్కారాన్ని 2016 ప్రదానం చేశారు. ఇలా అనేక పురస్కారాల్ని పొందిన ఆయన గురించి ఒక్కమాటలో చెప్పాలంటే` మనం కృషి చేస్తే అన్ని మనల్ని వెతుక్కుంటూ అన్నీ వస్తాయనడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఆచార్య దార్ల వెంకటేశ్వర రావు గారు.

            తన ప్రతిభా సామర్ధ్యం మేరకు వివిధ పత్రికల వారు ఈయనను గౌరవనీయులుగా గుర్తిస్తూ రాయలసీమ జాగృతి మాసపత్రిక, బహుజన కెరటాలు మాస పత్రిక వారు సంపాదక మండలి సభ్యులుగా, విద్య మాస పత్రికకు గౌరవ సంపాదకులుగా ప్రజా మణిపూస మాస పత్రికకు గౌరవ సంపాదక మండలి సభ్యులుగా, అక్షరక్రాంతి త్రైమాసిన పత్రికకు గౌరవ సంపాదకులుగా కొనసాగుతున్నారు. అలాగే ప్రతినెలా వివిధ పత్రికల్లో కవితలు, వ్యాసాలు, అభిప్రాయాలు పంచుకుంటారు. ఆయన సెంట్రల్‌ యూనివర్సిటి ( యూనివర్సిటి ఆఫ్‌ హైదరాబాద్‌ ) తెలుగు శాఖలో అక్కడే చదువుకొని, అక్కడే శాఖాధిపతిగా 1వతేదీ జూన్‌ 2021 న పదవీ బాధ్యతలు స్వీరించారు. ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ, తెలుగు శాఖను ప్రజాస్వామ్య పద్ధతిలో అన్ని వర్గాలకు అవకాశాలు కల్గించేలా చేస్తారని ఆశిస్తున్నాను. 

-డా॥గిన్నారపు ఆదినారాయణ,

హైదరాబాద్‌. ఫోన్‌ : 9949532456

 

 

 

 

 

No comments: