"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

09 ఫిబ్రవరి, 2021

జీవితాన్ని జీవించడమెలాగో నేర్పిన ఆత్మకథాత్మక కావ్యం ‘‘బతుకు’’ ( భూమిపుత్ర దినపత్రిక, 09.2.2021)

 ఆత్మకథాత్మక కావ్యం ‘‘బతుకు’’

 


-ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు

ప్రొఫెసర్, తెలుగుశాఖ

స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ 

యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్

హైదరాబాద్ -500 046

బతుకు’’ పేరుతో ఆచార్య ఎం. గోనానాయక్ గారు  రాసిన కావ్యాన్ని చదివాను. దీన్ని చదివిన తర్వాత ఇది ఒక ఆత్మ కథాత్మక వచనకావ్యమనడం సమంజసంగా ఉంటుందనిపించింది. కావ్యాన్ని చదవడం మొదలు పెట్టిన దగ్గరనుండి చివరకు పూర్తయ్యేవరకూ పుస్తకాన్ని వదల బుద్ధికాలేదు. భాష సరళంగా, సుందరంగా సాగింది.   దీనిలో పాత్రలు ఉన్నాయి; సన్నివేశాలున్నాయి; కథానాయకుడున్నాడు. అయితే, ఈ పాత్రలు సంప్రదాయ కావ్యాల్లో వర్ణించినట్లుగా ఉండవు. కావ్యమంతా కథానాయకుడు తన జీవితం గురించి చెప్తున్నట్లు  ఆత్మాశ్రయంగా ఉంటుంది. ఒక వ్యక్తి ఉన్నత స్థితిలోకి రావడానికి కేవలం పరిశ్రమ ఉన్నంత మాత్రాన సరిపోదు. క్రమశిక్షణ, మనుష్యులను ప్రేమించడం, ఇతరులకు తలలో నాలుకలా వ్యవహరించడం, కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండటం, నిరంతరం నేర్చుకోవాలనే తపన ఉండటం వంటివన్నీ ఉండాలని ఈ కావ్యం గొప్ప సందేశాన్నిస్తుంది.ఈ కావ్యాన్ని చదువుతున్నంతసేపూ నాజీవితం చాలావరకూ దీనిలో కనిపించింది. బహుశా అట్టడుగువర్గాలవారెవరు చదివినా వాళ్ళకు కూడా అలాగే అనిపిస్తుంది. అందుకే ఈ కావ్యం అందరూ చదవదగినది.

ప్రతి వ్యక్తికీ మొదట తానేమిటో తనకు తెలియదు. ప్రతివ్యక్తీ ఒక రాయిలాంటివాడేకావచ్చు. కానీ ఆ రాయిని తీర్చిదిద్దిడాన్ని బట్టి దాన్ని పూజించడమో, కాలికిందవేసితొక్కడమో తెలుస్తుంది. అయితే అన్ని రాళ్ళూ శిల్పాలకు పనికిరావని  శిల్పశాస్త్రం ( ప్రతిమా శాస్త్రం) చెబుతోంది. కొన్ని రాళ్లు మాత్రమే శిల్పాలుగా మలచడానికి వీలవుతాయి. మరికొన్ని ఎంత ప్రయత్నించినా అవి పనికి రావు. అలాగే, మనిషుల్లో కూడా కొంతమంది స్వభావం రీత్యా వాళ్ళనెంతగా మారుద్దామన్నా, వాళ్ళు మారరు. ఇలాంటప్పుడే పుట్టుకతోనే కొన్ని గుణాలు కూడా వస్తాయని చెప్పకతప్పదనిపిస్తుంది. మరికొంతమందికి ఎవరైనా కొంచెం సహకరిస్తేదాన్ని ఉపయోగించుకొని ఒక స్వతంత్ర వ్యక్తిత్వాన్ని నిర్మించుకోగలుగుతారు. ఆచార్య ఎం.గోనానాయక్ గార్కి అందిన కొద్దిపాటి సహకారంతో ఉన్నతమైన స్థితికి చేరుకున్నారు. పదిమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. తాను పుట్టి పెరిగిన ఊరు నుండి, తన కుటుంబంలోని ప్రతివ్యక్తీ, తనకు సహకరించిన ప్రతి గురువునీ స్మరించుకోవడం ఆచార్య గోనానాయక్ గారిలో కనిపించే గొప్పగుణం. దీనివల్ల అనేకమంది మరికొంతమందిని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ముందుకొస్తారు. ఆ విధమైన ప్రేరణ కలిగించేలా అనేకమందిని దీనిలో స్మరించుకున్నారు.

‘‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసీ’’ అని శ్రీరాముడి చేత వాల్మీకి మహర్షి పలికించిన మాటలు నేటికీ మనం స్వంత ఊరిగురించి గానీ, స్వంత దేశం గురించి గానీ చెప్పుకొనేటప్పుడు స్మరించుకుంటాం. అయోధ్య కంటే లంకలో ఐశ్యర్యం ఉందనీ, అక్కడే ఉండిపోదామన్న మాటలకు సమాధానంగా శ్రీరాముడు ‘మాతృమూర్తి, మాతృదేశం స్వర్గం కంటే గొప్ప’’వని చెప్తాడు. ఆచార్య గోనా నాయక్ గారు కూడా తన స్వంత ఊరు, ఆ ప్రకృతిని ఎంతగానో ఆరాధిస్తారు. తన స్వంత ఊరిని వర్ణించడంతోనే ఈ కావ్యం ప్రారంభమవుతుంది.

‘‘ కాలు పెట్టగానే సేదతీర్చే చెట్టుగాలి/బండలని, పాషాణాలని ఎలా పిలిచినా/నిండు మనసుతో నా ముచ్చట్లకు /నెలవై ఆదరించే నిండు గుండెలు /నా ఊరి బంగారు కొండలు’’  ఇది ప్రకృతి సోయగాల్ని మనముందుంచే వర్ణన. పల్లెటూళ్ళు, కొండప్రాంతాలు పచ్చని ప్రకృతి దృశ్యాలకు ప్రతిరూపాలు. ఆ ప్రకృతిలోనూ విషాన్ని వెదజల్లే సర్పాలు, కదిలినా మెదిలినా కాటువేసే పురుగులూ కూడా ఉండొచ్చు. అందుకే కొంతమందికి గ్రామాలు తమ పెత్తందారీ తనానికి, కిందివర్ణాలు, వర్గాల వారిని చౌకగా ఉపయోగించుకునే ప్రాంతాలుగాను ఉంటాయి. వీటన్నింటి బాధను గుండెల్లో దాచుకుని కవిత్వమై వెలువడినపాదాలివి. ‘బండలు’ ‘పాషాణాలు’ వాచ్యంలా అనిపిస్తున్నా, ధ్వనిగర్భితాలు. నేటికీ చాలామందిలో ఆదివాసులు లేదా గిరిజనుల పట్ల ఉండే ఒక పడిపట్టుపదాల నిరసన కనిపిస్తుందిక్కడ. తన ముచ్చట్లను ఆదరించే బంగారు కొండలుగాను వర్ణించడంలో, ఆ గ్రామంలో లేదా ఆ గూడెంలో ‘‘తన మాటలకీ కళ్ళను మెరిపించే జీవితాలు’’ అక్కడెన్నో ఉన్నాయని అటువంటి ప్రాంతం నుండి తాను వచ్చానని ముందుగానే చక్కగా కావ్యాన్ని ప్రారంభించాడు కవి. ఆ అడవిలో దొరికే పండ్లు, వాటి రుచినీ తన కుటుంబసభ్యులతో తాదాత్మ్యం చేసుకుంటూ కావ్యాన్ని అద్భుతంగా ప్రారంభించాడు. అమ్మ ప్రేమలాంటి తీపిరుచులను అందించే చెరువుని తన పెద్దమ్మలా పోల్చాడు. తర్వాత

‘‘ఊరికి సిరి, ఉసిరి కమ్మని పలకరింపు/చింత తీర్చే దైవంలా నా ఊరిచింత చెట్టు’’  అని వర్ణించి చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఫ్లాష్ బాక్ లోకి వెళ్ళిపోతాడు కవి. ఇంతవరకూ చేసిన వర్ణనను చూసినా, ప్రకృతితో తన జీవితానుబంధమెటువంటిదో చెప్పకనే చెప్పడం కవి శిల్పచాతుర్యానికి నిదర్శనం. తన అస్తిత్వాన్ని , తన వ్యక్తిత్వాన్ని వ్యక్తీకరించడంలోని మృదుత్వాన్ని గమనించాలి. కట్టుకోవడానికి బట్టలే లేనప్పుడు, కప్పుకోవడానికి దుప్పట్టెలా వస్తాయి? నేటికీ గ్రామాల్లో అనేకమంది చలినుండి, దోమలనుండి  రక్షించుకోవడానికి గోనెసంచుల్ని  కప్పుకుంటున్న దయనీయస్థితి అనుభవించిన వాళ్ళకు కళ్ళముందు కదులాడుతుంటుంది. ఇలాంటి కటిక పేదరికాన్ని అనుభవిస్తూ కూడా తన పిల్లల్ని రక్షించిన తన తల్లి పాదాల్ని  భక్తితో అక్షరాభిషేకం చేస్తున్నాడు కవి. ‘అక్షరమే బ్రతుకని, అక్షరమే అక్షయపాత్రని ఉగ్గుపాలతో రంగరించిన తల్లి ఋణాన్ని తీర్చుకోలేకపోయినా, ఇలా అక్షరాభిషేకం చేయడం మాతృమూర్తి ప్రాధాన్యమెప్పుడూ పవిత్రమైనదేనని చాటినట్లయ్యింది.

ప్రాథమిక పాఠశాలలో చేరిన నాటి నుండి తర్వాత విశ్వవిద్యాలయ స్థాయి వరకూ తాను చదువుకొనేటప్పుడు ధైర్యాన్ని నూరిపోసిన గురువులు శంకర్, బ్రహ్మానంద మొదలైన వారిని స్మరించుకుంటాడు కథానాయకుడు. పగలంతా మేకల్ని మేపుతూ, కొండల్లో తిరుగుతున్నా ఆ ఏడుకొండలవాడి దయవల్ల తననే పురుగూ ముట్టుకోలేదనీ చెప్తూ ‘‘పగలు పరిసరాలు/రాత్రి అక్షరాలు/నాకు అప్తమిత్రులయ్యాయి’’ని అంటాడు కవి.  బంజారాలకు పవిత్రమైన  ‘గంపమాల కొండయ్య జాతర’’కు చిన్పప్పడు తాను కూడా వెళ్ళేవాడు. అక్కడ రంగుల రాట్నాలు తిప్పుతుంటే ఎక్కాలనుకున్నా డబ్బులేవి? అక్కడ రకరకాల మిఠాయిలు నోరూరిస్తున్నా కొనడానికి డబ్బులేవి? వాటిని గుర్తు చేసుకుంటూ ‘‘ తీపి మిఠాయిలు నోరూరింపు/తినాలని వున్నా జేబులు చెల్లు/దూరం నుంచే అందుకునే ఆనందం/ ఎప్పటికైనా తినాలనే లక్ష్మం/రాత్రి కలతో కనిపించిన కాలమది’’ అని అనేక మంది పేదపిల్లల అనుభూతుల్ని అక్షరీరికరిస్తాడు కవి.  ఈ కావ్యం చదువుతుంటే నా బాల్యం కూడా దీనిలో కనిపిస్తుంది. చిన్నప్పుడు నేను మా ప్రాంతంలో జరిగే ప్రభల తీర్థానికి వెళ్లినా అక్కడున్నవాటిని చూడ్డమే తప్ప కొనుక్కోలేని పేదరికం. కోనసీమలో జీళ్లు ప్రసిద్ధి. వాటిని తింటూ పిల్లలు ఊరిస్తుంటారు. వాటి గురించి ఆలోచిస్తూ పడుకుంటే కలలో  ఇంటికి బెజ్జం పడి జీళ్లు వర్షం కురుస్తున్నట్లూ, వాటిని ఏరుకుని తింటున్నట్లు అనేక కలలు వచ్చేవి. అవన్నీ ఈ జాతర దృశ్యాలు చదువుతుంటే గుర్తుకొస్తున్నాయి. ఆ జాతరలో తన చిన్నాయన పాటలు పాడుతుంటే, తానూ హార్మోనియం వాయించేవాడట. వాటిని జ్ఞాపకం చేసుకొని ‘‘మళ్ళీ వెళ్ళాలని వుంది.... తుళ్ళి పడ్డ ఆ రోజుల తలపుల్లో మునిగి తేలాలని వుంది. ... ఆ మిఠాయి పొట్లం /చేతిలో నిలుపుకొని తిరగాలని వుంది’’ అనడంలో తన బంజారా జాతి పవిత్రంగా జరుపుకునే, తన బంజారా స్నేహితులంతా కలుసుకునే గంపమాలకొండయ్య జాతర ద్వారా తన సాంస్కృతిక వారసత్వ ఔన్నత్యాన్ని సగర్వంగా తెలియజేస్తున్నాడు కవి. ఆ నాడు సమష్టిగా ఉన్న తన కుటుంబం వల్లనే తాను క్రమశిక్షణతో పెరిగాననీ, తన ప్రకృతివల్లనే తాను రాగాలు తీయగలుగుతున్నానని చెప్తూ ‘‘పద్యాల రాగాలు ప్రకృతికే హారతులు/ చింతచెట్లు, తేనెతూట్లు/చెరువుగట్లు, పచ్చబొట్లు/ నా బంజారా జాతి నా పసితనాన/పసివాడక యిచ్చిన పరిమళసుమాలు’’ అన్నాడు కవి.  అంతే కాదు – ‘‘జాతరలో నాటకాలు/అంజన్న శివన్న ఉత్సవాలు/చెరువుల్లో ఈతలు/చెరుకుముక్కల రసాలు/కృష్ణుని బాల్యం తలపించే/ నాటి నా తాండా జీవితాలు/ నా బతుకు పయనంలో నాఆనందాలు’’ అని తనకున్న ఎలాంటి పరిస్థితులనైనా అనుకూలంగా మార్చుకోగలిగిన నైపుణ్యాన్ని తెలిపాడు కవి.  ఈ పరిణామాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. క్లిష్టపరిస్థితుల్ని కూడా అనుకూలంగా మార్చుకోగలిగినప్పుడే మనిషి విజయాల్ని అందుకోగలుగుతాడనిఈ సంఘటన గొప్పసందేశాన్నిస్తుంది.

అనేక మంది తాను పుట్టిన ప్రాంతాన్నీ, తాను పుట్టిన కులాన్నీ, తాను పెరిగిన పరిసరాల్నీ నిందించుకుంటూ కూర్చొంటారు. కానీ, విజేతలజీవితాల్ని పరిశీలిస్తే అననుకూల పరిస్థితుల్ని కూడా అనుకూల పరిస్థితులుగా మార్చుకోగలిగారని తెలుసుకుంటాం. చిన్న అవయవలోపం ఉంటేనే తామెందుకూ పనిచేయమనుకునేవాళ్ళకు శరీరంలోని అనేకావయవాలు పనిచేయకపోయినా ప్రపంచంలో విశ్వవిజేతలుగా వెలుగొందిన వాళ్ళెంతోమంది ఉన్నారు. అమెరికాలో అత్యంత పేదకుటుంబం నుండి వచ్చి అధ్యక్షపదవికి చేరి, బానిసత్వనిర్మూలనకు విశేషమైన కృషిచేసిన గొప్పవ్యక్తి అబ్రహాంలింకన్ (1809 – 1865). భారతదేశంలో అంటరానితనం నిరంతరం అణచివేస్తున్నా భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహానుభావుడు డా.బి.ఆర్.అంబేద్కర్(1891-1956) స్టెఫెన్ హాకింగ్ (1942-2018) motor neurone disease అనే నరాల వ్యాధి వల్ల శరీర కదలికలు లేకపోయినా, ప్రపంచంలో గొప్ప శాస్త్రవేత్తగా ప్రసిద్ధి చెందాడు. ఇలాంటి వాళ్ళెంతోమంది ఎలాంటి పరిస్థితులనైనా తమకు అనుకూలంగా మార్చుకోగలగడమే చరిత్రలో వారి పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. ఈ వర్ణననాకు ఇలాంటి చారిత్రవ్యక్తుల్ని గుర్తుచేస్తున్నట్లనిపించింది.  

ఈ కావ్యం ప్రతి సన్నివేశం ఒక్కొక్క గొప్ప సంఘటనని చరిత్రీకరించేలా ఉంది. తాత, అవ్వ, తండ్రి, తల్లి, చిన్నాన్న, అన్నదమ్ములు, ఊరు, తన జాతి, తాను చదువుకోవడానికి సహకరించిన అనేకమందిని ఈ కావ్యంలో స్మరించుకున్నాడు కవి.

‘‘ధర్మరాజు మాతాత ఓనేత’’ అని తన తాత గురించి చెప్పుకున్నాడు. తన అవ్వ ను గురించి ‘‘ నా చిరు ఆశలు తీర్చిన కల్పవృక్షం’’గా అభివర్ణించుకున్నాడు. తన తాత వారసత్వాన్ని అందుకున్న తన తండ్రి జాతరలు, పండగలకు పాటలు పాడ్డమే కాదు, ‘‘ అందరికీ తనయ్యాడు నాడు/ఎందరికైనా కల్పతరువు తానయ్యాడ’’ని  అందుకే ‘‘ మా నాయన ధన్యజీవి’’ అని ప్రకటిస్తాడు. కేవలం కుటుంబ స్వార్థం కోసం కాకుండా, తన ప్రజలకోజం జీవించిన వారి జీవితమే ధన్యమని దీనిలో కనిపించే సందేశం. తనకున్న సంస్కారానికి మూలం తన తండ్రేనని, తనకు చిన్ననాటి నుండే భారత, రామాయణాలు చెప్పిన తొలిగురువుగా అభివర్ణించుకున్నాడు కవి. తన తండ్రిని నోరారా కీర్తిస్తూ ‘‘ నాకు గీతంటే మా నాయన...నాకు ఉపనిషత్తంటే మా నాయన...నాకు దేవతలు, గురువు... అన్నీ మా నాయనే’’అని తన్మయత్వంతో చెప్పుకున్నాడు. ఒక తండ్రికి తన కుమారుడు తనను పవిత్రంగా భావించడం కంటే ఇంకేం కావాలి?  ఒక గురువుకి తన శిష్యుడు గౌరవంగా శిరస్సువంచడం కంటే మించిందేమిటి? ఇవన్నీ ఈ కావ్యంలో కనిపిస్తాయి.

మొత్తం కావ్యమంతా చదివిన తర్వాత ఇంకా చెప్పాలనిపిస్తుంది. కానీ, ఆ మాధుర్యాన్ని, ఆ అనుభూతినీ మీరు కూడా అందుకోవాలంటే, మీరు కూడా ఈ కావ్యాన్ని అంతటినీ చదవాలి. తానిప్పుడు కనిపించే విజయశిఖరాలకున్న మూలాల్ని మరిచిపోకుండా ఆ మూలాల్ని గుర్తుచేసే గొప్పకావ్యాన్ని మీరు కూడా ఆస్వాదించాలి. శిల్పం కాదగిన శిలలు శిల్పాలు కాకుండా అలాగే మూలనపడిపోకుండా శిల్పాలుగా మారాలంటే ఏం చెయ్యాలో ఈ కావ్యం చదివితే కొత్త ఆలోచనలు చిగురిస్తాయి. కేవలం బండలుగా మాత్రమే కనిపించే కొండల గుండెల గుసగుసలు తెలియాలంటే ఈ కావ్యం చదవాలి. ప్రకృతిలో పారవశ్యంగా పాడుకునే పక్షుల కిలకిల రావాల మాధుర్యాన్ని హృదయంలో దాచుకోవాలంటే ఈ కావ్యాన్ని చదవాలి.

నేను ఈ కావ్యాన్ని  చదివి మీతో ఇలా పలకగలిగాను. నేను ఈ కావ్యాన్ని  చదివి మీతో ఇలా చెప్పగలిగాను. నేను ఈ కావ్యాన్ని  చదివి నా జీవితాన్ని నేను మళ్ళీ చూసుకోగలిగాను. అందుకే ఇది కేవలం ఆచార్య గోనానాయక్ గారి జీవితం మాత్రమే కాదు; నాలాంటి, మీలాంటి వాళ్ళజీవితమెంతో దీనిలో ఉంది. ‘జీవితాన్ని’ జీవించడమెలాగా ఈ కావ్యం నేర్పుతుంది. జీవితంలోని సుఖదు:ఖాల్ని ఎలా స్వాగతించాలో ఈ కావ్యం మార్గం చూపిస్తుంది. నిలువెత్తు ఆత్మవిశ్వాసంతో దర్పణం ముందు నిలబడి తన జీవితాన్నింత నిజాయితీగా ప్రదర్శించిన ఆచార్య గోనానాయక్ గారితో నాలుగు మాటలు పంచుకునే అవకాశం కలిగించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

కామెంట్‌లు లేవు: