"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

15 January, 2021

వెయ్యేళ్ళ తెలుగు శతక సాహిత్యం-ఒక పునర్మూల్యాంకనం

 

వెయ్యేళ్ళ తెలుగు శతక సాహిత్యం-ఒక పునర్మూల్యాంకనం

-ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు,

తెలుగుశాఖ, స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్,

యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్, హైదరాబాద్-500 019,


  

 

శ్రీరాముని దయ చేతను

నారూఢిగ సకలజనులు నౌరా యనగా

ధారాళమైన నీతులు

నోరూరగ చవులు బుట్ట నుడివెద సుమతీ!

అని శ్రీరామచంద్రుడిని తన ఇష్టదేవతగా భావిస్తూ “సుమతీ శతకం” ప్రారంభించిన శతకకర్త బద్దెనకవి, దాన్ని ఒక నీతిశతకంగా రాశానన్నాడు. శతక కర్తలంతా ఇంచుమించు ఇలా మంగళకరంగా రచనను ప్రారంభించడమనే సంప్రదాయాన్నే దీనిలోనూ పాటించారు.  ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ‘సకల జనులు ఔరా’ అనేటట్లు రాస్తున్నానని చెప్పిన శతకకర్త దాన్ని తన శతకంలో పాటించాడా? ఈ పద్యంతోనే నా ప్రసంగాన్నెందుకు ప్రారంభిస్తున్నాననంటే సాధారణంగా సాహిత్యాన్ని నిర్వచించుకొనేటప్పుడు మనం సార్వజనీనత, సార్వకాలికత, జనానురంజకత్వం అనే మూడు ప్రధానమైన భావనల్ని దృష్టిలో పెట్టుకుంటాం. ఇవి ఉంటేనే దాన్ని సాహిత్యం అనొచ్చనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ భావనలన్నీ కాలం చెల్లినవని వాదించేవాళ్ళు మరికొంతమంది ఉన్నారు.  కానీ,  ప్రాచీన కాలం నుండీ నేటి వరకూ కొనసాగుతున్న కవిత్వ ప్రక్రియల్లో శతకం ఒకటని మాత్రం ఇంచుమించు అందరూ అంగీకరిస్తారనుకుంటున్నాను. ఈ పద్యంలో పేర్కొన ‘సకలజనులు ఔరా? అన్నారో లేదో’ దాన్ని కూడా వివరించే ప్రయత్నం చేస్తాను.

శతకం ఒక రకంగా పండిత, పామరులందరికీ చేరువైన తెలుగు కవిత్వ రూపమనడంలో పెద్దగా భేదాభిప్రాయాలు ఉండవనుకుంటున్నాను.[i] శతకం ఆవిర్భావ వికాసాల్ని నా ప్రసంగంలో వివరించడం కంటే, శతకం సమాజం మీదా, సాహిత్యం మీదా చూపించిన ప్రభావాన్ని, మనం శతక ప్రక్రియలో గమనించాల్సిన ముఖ్యాంశాల్ని వివరించుకోవడం అవసరమనుకుంటున్నాను. రెండు రోజుల పాటు నిర్వహించుకునే ఈ ‘‘వెయ్యేళ్ళ తెలుగు శతక సాహిత్యం – సమాలోచనం’’లో మనం వివిధ అంశాల్ని చర్చిస్తున్నాం. అందువల్ల  నాకు తెలిసిన కొన్ని అంశాల్ని ఇక్కడ ప్రస్తావిస్తాను. ఈ అభిప్రాయాల్ని కూడా చర్చించాల్సిన అవసరం ఉందనుకుంటే వాటిని ఈ సదస్సులో గానీ, తర్వాత గానీ పరిశోధకులు, సాహితీవేత్తలు వీటిపై దృష్టిని కేంద్రీకరిస్తారని ఆశిస్తున్నాను.ఈ తెలుగులో నన్నయ సాహిత్యం తర్వాతనే లిఖిత సాహిత్యం ప్రారంభమైందని ఒప్పుకుంటూ అక్కడ నుండి లెక్కలు వేసి, వెయ్యేళ్ళపైగా ఉన్న తెలుగు సాహిత్య చరిత్రలాగే  తెలుగు శతక సాహిత్యానికి కూడా వెయ్యేళ్ళ చరిత్రఉందని భావించడం ఔచిత్యంగా ఉంది. ఈకాలంలో శతకసాహిత్యంలో వచ్చిన పరిణామాలేమిటి? అవి మన సాహిత్యాన్ని ముందుకు తీసుకువెళ్లాయా? వెనక్కి లాక్కెళ్ళాయా? అనేది ప్రధానంగా మనం ఈ సదస్సులో చర్చించుకోవాలి. ఈ సందర్భంగా శతకాన్ని మన తెలుగు సాహిత్య చరిత్రకారులెలా గుర్తించారో ప్రస్తావించుకోవడం కూడా అవసరమనుకుంటున్నాను.

‌మన తెలుగు సాహిత్యాన్ని సాహిత్య చరిత్రకారులు కావ్యాలను ఆధారంగా చేసుకుని లేదా కవిత్వాన్ని ఆధారంగా చేసుకుని యుగ విభజన చేయడానికే ఎక్కువ మంది ఆసక్తి చూపించారు. కానీ కథలు, నవలలు, సాహిత్య విమర్శ, పరిశోధన తదితర ప్రక్రియలు తెలుగు సాహిత్యంలో విస్తృతంగానే వచ్చినా, వాటికి పెద్దగా ప్రాధాన్యాన్నివ్వలేదు. పైగా ‘శతకం’ రచన అనేది అప్పుడే పద్యాన్ని నేర్చుకుంటున్నవాళ్ళు తమ సాధనలో భాగంగా నేర్చుకొని, తర్వాత కావ్యమే నిజమైన గీటురాయిగా భావిస్తుంటారు. సాహిత్య చరిత్రకారులు శతకాల్ని ఒక ప్రక్రియగా గుర్తించడం వేరు, దాన్నొక సాహిత్య యుగంగా గుర్తించడం వేరు. అన్ని యుగాల్లోనూ శతక ప్రక్రియ కొనసాగింది. కనుక, దాన్నొక సాహిత్య యుగంగా గుర్తించడానికి కొన్ని ఇబ్బందున్నలుమాట కూడా నిజమే.  అందువల్లనే కొంతమంది సాహిత్య చరిత్రకారులు ఆరుద్ర, నాగయ్య, ద్వా.నా.శాస్త్రి తదితరులు మాత్రం శతకాలను కూడా ప్రస్తావించారు.

శతకాలన్నీ సమకాలీన సమాజాన్నీ, సాహిత్యాన్నీ, భాషనూ ప్రతిఫలించే చక్కటి కవిత్వ ప్రక్రియ అని మాత్రం ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే, మన తెలుగులో ‌భాషాపరంగా కూడా ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. గ్రాంథిక భాష నుండి వ్యవహారికం దానినుండి స్థానిక భాషలకు ప్రాధాన్యం పెరిగింది. ‌ఆదాన ప్రదానాల  కారణంగా తెలుగు భాషలో అన్యభాషా పదజాలం కూడా విస్తృతంగానే చేరింది. ‌మరొకవైపు మాండలికం అనకూడదని, మాండలికం అనే పదం స్థానంలో  ‘స్థానిక భాష’ అనాలనే చైతన్యం కనిపిస్తుంది.  అందువల్ల దీన్నంతా భాషలో వచ్చిన వైవిద్యం అనడం కూడా మనం భాషాశాస్త్రంలో చూస్తున్నాం. ఇవన్నీ సాహిత్య చరిత్ర కారులు సాహిత్య చరిత్ర రచనలో యుగవిభజన చేసేటప్పుడు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలు. ఇటువంటి సమస్య నిజానికి తెలుగులో వచ్చిన ఈ వెయ్యేళ్ళ శతక సాహిత్యాన్ని ఏ యుగంలో పెట్టాలనేది కూడా పెద్ద సమస్యే. అందుకే ఆరుద్ర ఆ యా యుగాల్లోనే ఆ శతకాలను, శతకకర్తలను పేర్కొన్నాడు. ఉన్నంతలో ఈ పద్ధతి కొంతవరకూ మంచిదనుకోవాలి కూడా!

 వాస్తవానికి తెలుగులో శతక సాహిత్యం విస్తృతంగా వస్తుంది. దీనితో పాటు శతక సాహిత్యం మీద అనేకమంది పరిశోధన గ్రంథాలు కూడా వెలువరిస్తున్నారు.  వేదం వేంకట కృష్ణ శర్మ ‘శతక వాజ్మయ సర్వస్వము’, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారు ప్రచురించిన శతక సంపుటి, వంగూరి సుబ్బారావు గారు రాసిన ‘శతకకవుల చరిత్ర’, డాక్టర్ కె. గోపాల కృష్ణారావు ‘ఆంధ్ర శతక వాజ్మయం-ఉత్పత్తి వికాసాలు’ మొదలైనవన్నీ శతకాల్లోని లక్షణాలు, ఆరంభ వికాసాలు గురించి చర్చించాయి. మనదేశంలో ఎన్ని దేవాలయాలున్నాయో అంతకు రెట్టింపు శతకాలున్నాయంటే తప్పులేదని వంగూరి సుబ్బారావు వ్యాఖ్యానించడం(శతకకవుల చరిత్ర, గ్రంథ ప్రవేశం, పుట: 37)  తెలుగులో శతక రచన ఎలా కొనసాగుతుందో తెలియజేస్తుంది. ఈ పరిశోధలను,  విడివిడిగా వివిధ శతకాల మీద జరుగుతున్న అనేకమంది పరిశోధనలు  వివిధ సమస్యలు లేదా అంశాల ఆధారంగా  కూడా పరిశోధనలను గమనిస్తే శతకసాహిత్యంలో జరుగుతున్న, జరగవలసిన పరిశోధన స్వభావం, తీరుతెన్నుల్ని కొంతవరకైనా గుర్తించగలుగుతాం.

తెలుగులో నన్నయ ‘శ్రీమదాంధ్రమహాభారతం’ ఉదంకోపాఖ్యానంలో ‘మాకు ప్రసన్నుడయ్యెడున్’ అనే మకుటంతో నాలుగు పద్యాలలో  నాగ స్తుతి చేస్తాడు.

·         బహువనపాదపాబ్ధి కులపర్వత పూర్ణ సరస్సరస్వతీ

సహిత మహామహీభర మజస్ర సహస్ర ఫణాళి దాల్చి దు

స్సహతర మూర్తికిన్ జలధిశాయికి పాయక శయ్యయైన అ

య్యహిపతి దుష్కృతాంతకు డనంతుడు మాకు ప్రసన్నుడయ్యెడున్ [ii] (ఆది.1-106 )

 ఆ నాలుగూ పద్యాలనూ శతక రచనకు శ్రీకారాలుగా పరిశోధకులు భావిస్తున్నారని మనం చెప్పుకుంటున్నాం. అయితే ఇంచుమించు చిన్న మార్పులతో ఈ మకుటంతోనే సుమారు 150 పద్యాలు గల శతకం ఒకటి ఈ ఆధునిక కాలంలో కనిపిస్తుంది. దీన్ని బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం నుంచే సంస్కృతంలో ఎం.ఏ., పట్టా అందుకున్న మానాప్రగడ శేషశాయి(1927- ?) అరసవిల్లి సూర్యనారాయణ స్వామిని స్తుతిస్తూ ‘ప్రసన్న భాస్కరం’ శతకం (243 పద్యాలతో) రాశారు. దీనిలో 150 పద్యాలను ‘మాకు ప్రసన్నమయ్యెడున్‌’తో ఆ పద్యాలకు మకుటంగా పెట్టి నన్నయపై ఉన్న గౌరవాన్ని ప్రకటించుకున్నారు. ఆ విధంగా నన్నయ ముకుట రచనకు శ్రీకారాన్ని చుట్టినా, ఆయన రాసిన శతకాలు మనకు దొరకలేదు. మనకు లభించినంతవరకూ 12 వశతాబ్దిలో శివకవులే శతకరచనకు ఆద్యులని మల్లికార్జున పండితారాధ్యుడనే శివ కవి రాసిన ‘శివతత్త్వసారము’ తొలిశతకమన్నారు. శతకమనేపేరు లేకపోయినా శివతత్త్వసారంలో పద్యాలన్నీ సర్వ విధాలా శతకలక్షణాల్ని కలిగి ఉన్నాయని పరిశోధకులు ఆచార్య జి.నాగయ్య, నిడదవోలు వెంకట్రావు తదితరులంతా అంగీకరించారు.

ఆ తర్వాత తెలుగులో వందలాది శతకాలు వచ్చాయి. సంస్కృతం నుండి అనువాదాలైన శతకాలు కూడా చాలా వచ్చాయి. కానీ, తెలుగులో శతకాలు కేవలం అనువాదాల మీదనో, అనుకరణల మీదనో ఆధారపడకుండా స్వతంత్రంగా నిలబడింది. [iii] నిడదవోలు వెంకట్రావు గారు తెలుగులో శతక రచనకు కన్నడ భాషలోని క్రీ.శ. 950 ప్రాంతంలో, 'త్రైలోక్యచూడామణి' అను మకుటం గల శతక ప్రభావం వల్ల,  ఆ కాలంలో  తెలుగు కన్నడ భాషల పరస్పర సంబంధాన్ని బట్టి కన్నడ శతక రచన తెలుగు రచనకు మార్గదర్శకం కావచ్చునేమో అంటూనే, తెలుగు శతకాలను స్వతంత్ర రచనలుగా నిర్ధారణ చేయవచ్చుననీ, వీటిని దేశీసాహిత్యంలో భాగంగా పరిగణించాలంటారు.

 

శతకలక్షణాలు : 108 సంఖ్య ప్రాధాన్యం?

తెలుగులో శతకాలకు కొన్ని లక్షణాలు ఉండాలన్నారు. అవి 1.సంఖ్యా నియమం, 2. మకుట నియమం, 3. వృత్త నియమం, 4. రస నియమం, 5. భాషా నియమం.సంఖ్యా నియమం అనేది సంస్కృత స్త్రోత్రాలనుండి స్వీకరించారు. అష్టోత్తర శతకసంఖ్యకు (108) మంత్రమహిమ ఉందని, దేవుణ్ణి 108 సార్లు జపించే పద్ధతినుండి తీసుకున్నారు. దీనితో పాటు 27 నక్షత్రాలు, ఒక్కోనక్షత్రానికి 4 పాదాలు. దీన్ని గుణిస్తే కూడా 108 సంఖ్య రావడం ఒక విశేషం. హిందువులు  పూజలు చేసుకునే సమయాల్లో దైవానికి పుష్పాల్ని సమర్పించడం ప్రధానంగా భావిస్తారు. అందువల్ల మల్లికార్జున పండితుడు చంపకోత్పలమాలలతో శివుని సంబోధిస్తూ శతకాన్ని రాసి ఉండొచ్చని నిడదవోలు వెంకట్రావు ఊహిస్తారు. నిజంగా ఇదొక గొప్ప పరిశీలన. దీన్ని బట్టి శతకాన్ని హిందూ మతంతో ముడిపెట్టే ప్రయత్నం జరిగిందనే ఊహకు కూడా రావచ్చు. కానీ, తర్వాత కాలంలో అన్ని మతాల వాళ్ళూ శతక సంప్రదాయాన్ని తమ ఇష్టదైవాన్ని స్తుతించు కోవడానికి కూడా 108 పద్యాల్నే పాటించడం ఒక విచిత్రం. దీన్ని కొంతమంది పాటించడంలో గల ఆంతర్యాన్ని పాటించకపోవడానికి గలకారణాల్ని కూడా పునర్మూల్యాంకనం చేసుకోవాలి.

శతక కర్తృత్వ సమస్యలు :

ఒకేపేరుతో లేదా ఒకే మకుటంతో అనేకమంది శతకాలను రాస్తున్నారు. అందువల్ల ‌నేటికీ కొన్ని శతక రచయితలను గుర్తించడంలో కర్తృత్వ సమస్యలు కనిపిస్తున్నాయి. అలాంటి వాటిలో సుమతీ శతకం ఒకటి. దీన్ని  బద్దెన  రాశాడా? భద్ర భూపాలుడు రాశాడా? అనేది ఒక సమస్య. ఈ సమస్యలతో పాటు ఈ శతకంలో నీతి పద్యాలు ఉన్నా, అనేక సమస్యలకు కేంద్రం అయ్యింది. సుమతీ శతకమందు కొన్ని పద్యములు సంస్కృత శ్లోకముల కాంధ్రీకరణములు. ఉదాహరణ:

·         శ్లో: కార్యేషుదాసీ కరణేషు మంత్రీ

రూపేచలక్ష్మీ క్షమయా ధరిత్రీ

భోజ్యేషు మాతా శయనేషు రంభా

షడ్ధర్మయుక్తా కులధర్మపత్నీ’’ ఈ శ్లోకాన్ని...

·         పని సేయునెడల దాసియు

ననుభవమున రంభ మంత్రి యాలోచనలన్

దనభుక్తియెడల దల్లియు

నన దనకుల కాంత యుండ నగురా సుమతీ’’ అని అనువాదం చేశారు.

            అయితే ఇలాంటి పద్యాల్లో సుమతీ శతక కర్త అనేక సందర్భాల్లో స్త్రీలను తక్కువగా అంచెనా వేయడమే కాదు, అవమానించేలా కూడా భావించాడు.

·         మేలెంచని మాలిన్యుని

మాలను నగసాలివాని మంగలి హితుగా

నేలిన నరపతి రాజ్యము

నేలఁగలసిపోవుగాని నెగడదు సుమతీ!

(తాత్పర్యం: ఉపకారాన్ని గుర్తుంచుకోని దుర్మార్గుడ్ని, మాలవాణ్ణి, కంసాలివానిని, మంగలిని హితలుగా చేసుకొని పాలించే రాజు రాజ్యం మట్టిలో కలిసి నాశనం అవుతుంది కానీ కీర్తిని పొందదు.)

·         నమ్మకు సుంకరి జూదరి
నమ్మకు మగసాలివాని నటు వెలయాలిన్
నమ్మకు మంగలివానిని
నమ్మకుమీ వామహస్తు నవనిని సుమతీ!

(తాత్పర్యం: పన్నులు వసూలు చేసే వానిని, జూదం ఆడేవాడిని,
కంసాలివానిని, నటకుని, వేశ్యను, వర్తకుని, ఎడమ చేతితో పనులు చేసేవాడిని నమ్మవద్దు.)

·         అల్లుని మంచితనంబును

గొల్లని సాహిత్యవిద్య, కోమలి నిజమున్

బొల్లున దంచిన బియ్యముఁ

దెల్లని కాకులును లేవు తెలియర సుమతీ!

(తాత్పర్యం: అల్లుడి మంచితనం, గొల్లవాని పాండిత్య జ్ఞానం, ఆడదానియందు నిజం, పొల్లు ధాన్యములో బియ్యం, తెల్లని కాకులూ లోకములో ఉండవు.)

            ఇలాంటి పద్యాల్ని ‘నీతి’ పద్యాలుగా దీన్నొక ‘నీతి’శతకంగా  భావించే ఆలోచనల్ని పునర్మూల్యాంకనం చేసుకోవాలి. సుమతీ శతకాన్ని అనుకరిస్తూ అనేకమంది పద్యాలు రాశారు. అంతే కాదు, కుమతీ శతకం’  కూడా దీన్ని అనుకరిస్తూ వచ్చిందే. ఒక ఉదాహరణ చూద్దాం.

తొక్కిన కదలని సైకిలు

 పక్కింటి మిటారిపైన పగటి భ్రమయున్‌

యెక్కకె పారెడి గుఱ్ఱము

 గ్రక్కున విడువంగ వలయు గదరా సుమతీ’’

ఇలా అసుమతీ, వేమన పద్యాల్ని అనుకరిస్తూ అదే మకుటంతో అనేక మంది శతకాలు రాయడంవల్ల కూడా కొన్ని సంవత్సరాల తర్వాత కర్తృత్త్వ సమస్యలు ఎదురవుతుండడానికి ఒక ప్రధాన కారణంగా గుర్తించవచ్చు. అటువంటప్పుడు ఆ శతకాలలో కనిపిస్తున్న అటువంటి కొన్ని విషయాలను బట్టి కర్తృత్వ విషయాలను గుర్తించడం కొత్త సమస్యగా మారిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కొన్ని పద్యాలు గుర్తించేటప్పుడు నిజంగా ఆ పద్యాలు శతక కర్తే రాశాడో లో లేదో అనేది కూడా గుర్తించవలసిన అవసరం ఉంది. మనకి వేమన శతకం లో - భిన్న వైరుధ్యాలు గల పద్యాలు కనిపించటంతో ఈ దిశగా చాలామంది పరిశోధనలు కొనసాగిస్తున్నారు.విశ్వదాభిరామ వినురవేమ అనే మకుటం ఉన్నంత మాత్రం చేత అది వేమన పద్యమని గుర్తించలేని పరిస్థితి ఏర్పడింది.  ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు వేమన పద్యాలను గుర్తించడానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిశీలనలతో, పద్ధతులతో గుర్తించవలసిన చేయాల్సిన అవసరం ఉంది.ఇటువంటి అప్పుడే పండితుల సహకారం ఎంతో అవసరం. శతకం రాయడం కంటే శతకంలో ఉన్న పద్యాలు ఆ మకుటంతో ఉన్న పద్యాలన్నీ ఆ శతక కర్త లేదా ఒకే కవి రాసినవేనా అని గుర్తించడానికి పాండిత్యమే ఏకైక ఆధారం.  ఆ పద్యంలో కనిపించే భాష శైలి ఆలంకారిక ప్రయోగాలు మొదలైనవన్నీ జాగ్రత్తగా గమనిస్తే మనం ఈ సమస్యను పరిష్కరించడం సులువుగా ఉంటుందనుకొంటున్నాను.  దీనితోపాటు ఆ రచయిత సమగ్ర రచనలు పరిశీలన భావజాలం ఆ పరిణామాలు ఆ చారిత్రక నేపథ్యం కూడా ఆ పద్యాలను నిర్ణయించేటప్పుడు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనుకుంటున్నాను.

శతకానికి ఉండే మకుటాన్ని కొంతమంది శతక కవులు సులభంగా ఉండేటట్లు రాస్తే, మరికొంతమంది ఎంతో క్లిష్టంగా రాసినవారున్నారు.  మోదుకూరి శంకరయ్య ‘ధీరధీ శతకం’లో ధరశాధీరధిశనుత దాశరధీ ధరధీర ధీరథీ’’ అని రాశారు. ఒకే పేరుతో అనేకమంది శతకాలను రాశారు.  పోటీపరీక్షలలో ప్రశ్నలు అడిగేవారు వీటిని దృష్టిలో పెట్టుకోవాలి. గాంధి శతకం పేరుతో  భాగవతుల నృసింహశర్మ, చొల్లేటి నృసింహశర్మ కవి, బయిరెడ్డి సుబ్రహ్మణ్యం మొదలైనవాళ్ళు రాశారు. అలాగే, గోపాల శతకము పేరుతో  కందుకూరి వీరేశలింగం,  కల్లూరి విశాలాక్షమ్మ,  సత్యవోలు సోమసుందరకవి మొదలైన వాళ్ళు రాశారు. జానకీపతి శతకము  పేరుతో  కొవ్వలి వెంకటరాజేశ్వరరావు,  శృంగారం అయ్యమాచార్య, వాజపేయయాజుల రామసుబ్బారాయుడు మొదలైనవాళ్ళు రాశారు. ఇలా అనేకమంది ఒకే మకుటం లేదా పేరుతో రాసినవాళ్లున్నారు.  

ఛందోపరంగా శతకాలను చూసినప్పుడు చాలా మంది వృత్తాలు, జాతులూ, ఉపజాతులలో రాశారు. ప్రతిభావంతుడైన కవి ఏ ఛందస్సులో రాసినా అది పాఠకులు ఆదరిస్తారు. కొంతమంది కవులు నాలుగు పాదాల్లో పద్యాన్ని పూర్తి చేయలేక పాదాల్ని పొడిగించుకుంటూ వెళ్ళినవాళ్ళున్నారు. ఉదాహరణకు: గోపీనాథం వెంకటయ్య శాస్త్రులు ‘బ్రహ్మానందశతకం’లో సీసపద్యాల్ని కొనసాగించుకుంటూ రాశారు.

నాటకాల్లోని అంకము లాగా, కావ్యాల్లోని ఆశ్వాసాల్లా , కొన్ని శతకాల్లో విభాగాల్ని మన పరిశోధకులు నిడదవోలు వెంకట్రావు గమనించారు. పోతన నారాయణ శతకంలో 1) ఆది, 2) అవతార, 3) దివ్యరూప, 4) నామ, 5) కృష్ణావతార వింశతి, 6) జ్ఞాన వింశతి, 7)మోక్ష వింశతి, అను పదివిభాగాలు చేశాడు. పైడిపాటి నృసింహకవి రామచంద్ర శతకంలో1)స్తుతి, 2) కావ్యోన్నతి, 3) దాసవృత్తి, 4) మనోవృత్తి, 5) సంసారం, 6) మాయ, 7) తత్త్వము, 8) అభేదం, 9)దీనత్రాణం, 10)అవతారం, 11) నీతి అను విభాగాలు కనిపిస్తాయి. శతకాల్లో ప్రతిపాద్యమైన విషయాన్ని అనుసరించి వాటిని 18 రకాలుగా విభజించారు. భక్తి లేక స్తుతి శతకాలు, శృంగార, నీతి, వేదాంత,హాస్య ,చారిత్రక,జీవిత చారిత్రక, స్వీయచరిత ,వ్యాజ నిందాస్తుతి ,కథా ,సమస్యా ,నిఘంటు ,మానవస్తుతి ,అనువాద, అచ్చతెనుగు ,చాటు ,జంతుసంబోధ ,సామాన్య విషయక శతకాలుగా వర్గీకరించారు. భాష, వ్యాకరణ, ఛందో విషయాల్ని పాటించకుండా రాస్తున్నవాళ్ళున్నారు. వంగూరు సుబ్బారావు గారు ‘శతక కవుల చరిత్ర’లో దీన్ని స్పష్టంగానే చెప్పారు.

            ఇలా తెలుగులో వచ్చిన శతకాలను కుల, మత, లింగ, ప్రాంతీయ, భాష భేదాల్ని, విభేదాల్ని పెంచే పద్యాల్ని పరిష్కరించుకోవడం, వాటిని పాఠ్యాంశాల్లో చేర్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి ఒకసారి మన వెయ్యేళ్ళ తెలుగు శతకసాహిత్యాన్ని పునర్మూల్యాంకనం చేసుకోవాలనే ఆలోచనను ఈ సదస్సు కలిగిస్తుందని, ఆ దిశగా మీ పత్రాలు ఉంటాయని ఆశిస్తున్నాను.

(తెలుగు శాఖ- బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం మరియు  జానుడి సెంటర్ ఫర్ లిటరేచర్  & ఆర్ట్స్ (ఒంగోలు ) సంయుక్త ఆధ్వర్యం లో రెండు రోజుల పాటు ( 23 అక్టోబర్ 2020 నుండి 24 అక్టోబర్ 2020 వరకు) జరిగిన  ‘‘వెయ్యేళ్ళ తెలుగు శతక సాహిత్యం - సమాలోచన”  అనే అంతర్జాల అంతర్జాతీయ సదస్సులో చేసిన కీలకోపన్యాసం)





[i] ఇది పండితులను, పామరులను, బాలురను, వృద్ధులను, సామాన్య ప్రజానీకమును సర్వేసర్వత్ర సమానముగా రంజింప జేయగల శక్తిమంత మైనది.( నిడదవోలు వెంకటరావు, https://andhrabharati.com/vachana/pIThikalu/shatakacharitra.html)

[ii] ఎన్నో అడవిచెట్లతోనూ (పాదపము అంటే చెట్టు), సముద్రాలతోనూ (అబ్ధి), కులపర్వతాలతోనూ, పూర్ణ సరః అంటే నిండైన సరస్సులతోనూ, సరస్వతీ అంటే నదులతోనూ, సహిత=కూడిన, మహా భూభారాన్ని, అజస్ర=స్థిరమైన, సహస్రఫణాళి=వేయిపడగలతో, దాల్చి, దుస్సహరత=భరింపశక్యము కాని మూర్తి కల విష్ణుమూర్తికి నిరంతరం పాన్పుగా ఉన్న నాగరాజు అనంతుడు, దుష్కృతాంతకుడు=పాపములని అంతమొందించేవాడు, మాకు ప్రసన్నుడు అవుగాక.

ఇందులోని పదాల పొహళింపు పాము బుసని ఎలా ధ్వనిస్తోందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. విశ్వమంతా వ్యాపించినవాడు విష్ణుమూర్తి. అందుకే అతను దుస్సహతర మూర్తి. ఒక వైపు తన పడగలతో భూభారాన్ని మోస్తూ, మరొక వైపు ఆ దుస్సహతర మూర్తికి పానుపయ్యాడు, అక్కడ విష్ణుమూర్తికి ఉపయోగించిన పదం జాగ్రత్తగా చూడండి. అతను "జలధిశాయి". అంటే సముద్రంలో శయనించేవాడు. కాబట్టి అతని పానుపైన ఆదిశేషువు కూడా సముద్రంలోనే ఉండాలి కదా. ఇంత భారాన్ని మోస్తూ అతనున్నది అస్థితరమైన సముద్రంలో నన్న మాట!

[iii] సంస్కృతానువాదములైన శతకముల సంఖ్య శతమును మించవు. కావున వేలకు మించిన తెలుగు శతకములన్నియు స్వతంత్ర రచనలనియే నిర్ధారణ చేయ వచ్చును. ఇవి యచ్చముగా, తెనుగు ముద్ర గలిగి దేశి సాహిత్యమునకు సంబంధించినవి. .( నిడదవోలు వెంకటరావు, https://andhrabharati.com/vachana/pIThikalu/shatakacharitra.html)

No comments: