ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వివిధ విశ్వవిద్యాలయాల్లోని తెలుగు శాఖలలో బోర్డ్ ఆఫ్ స్టడీస్ (పాఠ్య ప్రణాళిక సంఘ సభ్యులు)గా ఎంపికయ్యారు. మద్రాసు విశ్వవిద్యాలయం, (చెన్నై), కృష్ణ విశ్వవిద్యాలయం, (మచిలీపట్నం), పాండిచ్చేరి విశ్వవిద్యాలయం (డా.ఎస్.ఆర్.కె. ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల, యానాం). కృష్ణ విశ్వవిద్యాలయంలో డిగ్రీ స్థాయిలో పాఠ్య ప్రణాళికా సంఘంలో రెండేళ్లు, మిగతా వానిలో మూడు సంవత్సరాలు చొప్పున పాఠ్య ప్రణాళికా సంఘం సభ్యులుగా కొనసాగుతారు. సంబంధిత విశ్వవిద్యాలయం రిజిష్ట్రార్ల నుండి ఉత్తర్వులను అందుకున్నారు. విశ్వవిద్యాలయాల్లో సమకాలీన సమాజ పరిస్థితులకు అనుగుణంగా పాఠ్య ప్రణాళికలను రూపొందించడంలో పాఠ్య ప్రణాళికా సంఘం కీలకంగా వ్యవహరిస్తుంది. హెచ్ సి యు (హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటి, తెలుగుశాఖ)లోనే చదివి, అక్కడే ప్రొఫెసరుగా పనిచేస్తున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు తనకున్న అనుభవం, పరిశీలనలతో సమకాలీన సమాజ అవసరాలకు అనుగుణంగా కొన్ని కొత్త పాఠ్య ప్రణాళికలను కూడా రూపొందించారు. దళిత సాహిత్యం, డయాస్పోరా సాహిత్యం, సృజనాత్మక నైపుణ్యాలు వంటి కోర్సులను రూపొందించి, ఎం.ఏ విద్యార్థులకు బోధిస్తున్నారు. అలాగే, ఎం.ఏ., స్థాయిలోనే పరిశోధన పట్ల అవగాహన కలగడానికి వీలుగా పరిశోధన పద్ధతులను పరిచయం చేసే కోర్సుని కూడా రూపొందించారు. ఇంతకు ముందు బెంగళూరు విశ్వవిద్యాలయం, (బెంగళూరు), బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం (వారణాసి)లలో పాఠ్య ప్రణాళికా సంఘం సభ్యులుగా పనిచేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం తెలుగుశాఖ, హైదరాబాదు విశ్వవిద్యాలయం సభ్యునిగా ఉంటూనే, పి.బి.సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, (విజయవాడ), ఆంధ్ర లయోలా కళాశాల, (విజయవాడ), తారా ప్రభుత్వ కళాశాల, (సంగారెడ్డి)లలో కూడా సభ్యునిగా తన సేవలందిస్తున్నారు. ఈ సందర్భంగా ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన విద్యావిధానం వల్ల పాఠ్య ప్రణాళికల్లో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందనీ, ప్రపంచ పరిస్థితులు, భారతదేశ, స్థానిక రాష్ట్ర స్థితి గతులను దృష్టిలో పెట్టుకొని పాఠ్యాంశాలను నిర్ణయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాఠ్య ప్రణాళికా సంఘం సభ్యులు ఎంతో జాగ్రత్తగా పాఠ్యాంశాల్ని ఎంపికచేయాల్సి ఉంటుందన్నారు. ముఖ్యంగా తెలుగు శాఖల్లో స్థానిక చరిత్ర, సంస్కృతి. భాషలకు ప్రాధాన్యాన్నిచ్చేవిధంగా పాఠ్యాంశాల్ని రూపొందించుకోవాలన్నారు. కుల, మత, ప్రాంతీయ విద్యేషాలు లేకుండా జాతీయ సమగ్రతను పెంపొందించేవిధంగా అన్ని వర్గాలకు ప్రాతినిథ్యం వహించేలా పాఠ్య ప్రణాళికలను రూపొందించుకోవాలన్నారు. తనను ఎంపిక చేసిన వివిధ విశ్వవిద్యాలయ అధికారులకు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు. మంచి పాఠ్యాంశాల్ని నిర్ణయించడంలో తన వంతు కృషి చేస్తానని ఆయన అన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి