"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

07 January, 2021

మహాభారతంలో వివిధ పాత్రల కరదీపిక (మహాభారతం-సమకాలీనత గ్రంథానికి రాసిన ముందుమాట) ( అక్టోబరు, 2020)

మహాభారతంలో వివిధ పాత్రల కరదీపిక

-ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు,

తెలుగుశాఖ, స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్,

యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్ ( సెంట్రల్ యూనివర్సిటి),

 హైదరాబాద్. 

 













          ప్రముఖ కవి, సాహితీవేత్త డా. వైరాగ్యం ప్రభాకర్ గారి సంపాదకత్వంలో వెలువడుతున్న ‘‘మహాభారతం-సమకాలీనత’’ అనే గ్రంథం చదివాను. సుమారు రెండువందలు పుటల్లో తీసుకొస్తున్న ఈ పుస్తకం మహాభారతాన్ని మళ్ళీ చదివించేలా చేస్తుంది. పాఠశాల స్థాయి నుండి విశ్వవిద్యాలయ స్థాయి వరకు వివిధ హోదాల్లో ఉన్న వాళ్ళు ఈ వ్యాసాల్ని రాశారు. మూడు తరాల వారు మహాభారతాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారో తెలియడానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తుందీ పుస్తకం.

 సాహిత్యంలో కాలాన్ని, తత్వాన్ని ఆధారంగా ఆధునికతను చేసుకొని రెండు రకాలుగా అర్థం చేసుకుంటున్నారు. ఒక కాలంలో వెలువడిన సాహిత్యం తర్వాత కాలానికి ప్రాచీనమవుతుంది. మరలా అప్పుడు వెలువడిన సాహిత్య ఆనాటికి ఆధునికం అవుతుంది. కాలానుగుణంగా చూస్తే అది ఒకరకంగా సమంజసమనిపిస్తుంది. ఇలా ఒక కాలంలో వెలువడిన సాహిత్యమంతా తర్వాత కాలానికి ప్రాచీనమైపోతే, దానిలోని భావాలను బట్టి ఆధునికతను గుర్తించడంలో వైఫల్యం చెందుతారు. గతకాలంలో వెలువడిన సాహిత్యమంతా ‘ప్రాచీనం’ అయిపోదు. తర్వాత వెలువడిన సాహిత్యం కంటే ఒక్కోసారి  దానిలోనే అనేక నవ్వమైన అంశాలు కూడా ఉండొచ్చు. కాబట్టి సాహిత్యంలో కాలానుగుణమైన విభజన, గుర్తింపులను, ప్రత్యేకతలను ఆధారంగా చేసుకొని ఆధునికతను గుర్తించడంలో సమస్యలున్నాయి. కానీ, సమకాలీనతకు ఈ సమస్య లేదు. ఒక కాలంలో వెలువడే ఏ సాహిత్యమైనా సమకాలీన సాహిత్యమే అవుతుంది. అయితే, ఇక్కడ మహాభారతంలో సమకాలీనతను గుర్తించడమంటే, నేటి కాలానికి కూడా మహాభారతం ప్రాసంగికమైనదని నిరూపించే ప్రయత్నం చేయడం అవుతుంది. ఇలా సమన్వయించేటప్పుడు మాత్రం కొన్ని సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది.

సాధారణంగా ప్రతి సృజన సాహిత్య కారుడూ తన కాలాన్నీ, తన సమాజాన్నీ ప్రత్యక్షంగానో, పరోక్షంగా ప్రతిఫలించకుండా సాహిత్య సృజన చేయలేడు. వాటిని గుర్తిస్తూనే, మానసికమైన సంఘర్షణలను చిత్రించడంలో మాత్రం సృజనకారుడు ‘సార్వకాలికమైన’ ‘సార్వజనీనమైన’ కొన్ని అంశాల్ని పట్టుకోగలుగుతాడు. ఈ అంశాల్ని సరిగ్గా చర్చించకపోవడం లేదా విస్మరించడం వల్ల సార్వకాలికత, సార్వజనీనతల పట్ల ప్రాచీన సాహిత్యం పట్ల వ్యతిరేకత కనిపిస్తుంది. ప్రతి సాహిత్యంలోనూ సార్వకాలికమైనవీ ఉంటాయి. సార్వకాలికం కానివీ ఉంటాయి. అలాగే సార్వజనీనత అనే భావన కూడా! దీనికి మహాభారతం – అది సంస్కృతమైనా, తెలుగైనా మినహాయింపేమీకాదు. దీనికి ప్రబంధాలు, కావ్యాలు, ఆధునిక రచలు.. ఏవైనా మినహాయింపేమీ కాదు.  ఈ వాస్తవిక దృష్టితో చూసినప్పుడు ఈ గ్రంథంలో ‘సమకాలీనత’ను చాలామంది బాగా గుర్తించారు. ఈ గ్రంథంలో కనిపించే ఒక  ప్రత్యేకత ఏమిటంటే, మహాభారతంలోని వివిధ పాత్రలను పరిచయం చేస్తూనే రచయితలు తమైదైన విశ్లేషణ చేశారు. ఈ విశ్లేషణలు మహాభారతంలోని వివిధ పాత్రల్ని పరిచయాత్మకంగా తెలుసుకోవాలనుకునేవాళ్ళకు ఒక నిఘంటువులా ఉపయోగపడుతుంది. ఒక పురాణ నామ సంగ్రహంలా పనికి వస్తుంది. ఇప్పటికే మహాభారతంలోని వివిధ పార్శ్వాల్లో పరిశోధనలు, విమర్శలు వెలువడ్డాయి. అవి చదువుకోగలిగిన వారికంటే, మహాభారతంలోని వివిధ పాత్రల పరిచయాన్ని స్థూలంగా తెలుసుకోవాలనుకునేవారికి ఈ పుస్తకం ఒక కరదీపికలా ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు.

భీష్ముడిని ఒక కర్మయోగిగా అభివర్ణించిన చివుకుల లక్ష్మి మహాభారతంలో పర్వానుక్రమంగా ఆ పాత్రను పరిచయం చేస్తూ, చేసిన విశ్లేషణ బాగుంది. దైవాన్నీ విశ్వసించేవాళ్ళు ధర్మాధర్మాల గురించి తెలిసినా, కొన్ని సార్లు ‘కర్మ’ వలన ఆ ‘విధి’ నిర్వర్తించక తప్పని పరిస్థితుల్ని పరోక్షంగా సూచించడమే దీనిలోని సమకాలీనత. ధర్మరాజుని మహాభారతానికి నాయకుడిగా భావిస్తూ ఒక ఆదర్శనాయడుగా గుర్తించాలని డా.కొయ్యా శ్రీనివాసులు అభిప్రాయపడ్డారు. నిజానికి ధర్మరాజులోని అనేక గుణాలు సమకాలీన సమాజానికి నిజంగా ఆదర్శమే. ఆయనలో మూర్తీభవించిన అనురాగం ఉంది. రాజనీతజ్ఞత ఉంది. సంభాషణా నైపుణ్యం ఉంది. పెద్దల పట్లా, బంధువుల పట్లా, కుటుంబం పట్లా, తనని నమ్ముకున్నవారి పట్లా ఎలా ప్రవర్తించాలో తెలియపరిచే విశిష్ట గుణాలెన్నో ఉన్నాయి. ఇవన్నీ లేకపోయినా, సమకాలీన సమాజంలో రాజ్య నిర్వహణలో అటువంటి రాజనీతజ్ఞతను ప్రదర్శిస్తున్నవాళ్ళున్నారు. అందుకని ఈ పాత్రలో కూడా సమకాలీనత ఉంది.  

గాంధారి పాత్ర నేటి అత్యుత్తమ న్యాయ దేవతకు ప్రతీకగా డా. గుంటుపల్లి గౌరి నిరూపించడంలో ఒక లాయర్‌ లా తన వాదనాపటిమను చూపించారు. నైతికత, సామాజిక ఘర్షణ మధ్య నలిగిపోయిన స్త్రీ మూర్తిగా సుదేష్ణ పాత్రను నిరూపిస్తూ డా.బల్లూరి ఉమాదేవి లోతైన విశ్లేషణ చేశారు. కుట్రులు, కుతంత్రాలు చేస్తే దాన్ని శకుని విద్యనే నానుడి ఏర్పడ్డంలోని ఆంతర్యాన్ని వివరిస్తూనే,  శకుని పాత్రల పట్ల మానవుంతా కుట్రలు , కుతంత్రాల పట్ల ఎలా జాగురూకులై మసుకోవాలో తెలియజేస్తుందంటారు ఓగన్న దేవనపల్లి. ఆత్మాభిమానం, స్వతంత్ర ఆలోచను కలిగిన వాళ్ళు ఏవరొకరి దగ్గరే పడి ఉండలేరనే సత్యాన్ని ఆవిష్కరించిన పాత్రగా ఘటోత్కచుడు కనిపిస్తాడని తోట వెంకటస్వామి చక్కగా విశ్లేషించారు. ఇందులో డా.రాంభట్ల వెంకటరాయశర్మ, డా.మూల మల్లికార్జున రెడ్డి, డా.వైరాగ్యం ప్రభాకర్‌ తదితరులు రాసిన వ్యాసాల్ని  జాగ్రత్తగా గమనిస్తే పరిశోధన వ్యాసం రాసేవాళ్ళకు కొన్ని మెళకువలు కనిపిస్తాయి. డా.తిరుమల ఆముక్తమాల్యద సాహిత్యాన్ని సాహిత్యేతర శాస్త్రాలతో చూడాల్సిన అవసరాన్ని స్పర్శామాత్రంగా చెప్తూనే దూర్వాసమహర్షి పాత్ర గురించి వ్యాఖ్యానించారు. అరిషడ్వార్గాల్ని జయించలేనప్పుడు ఎదురయ్యే పరిస్థితులెలా ఉంటాయో తెలుసుకోవడానికి ఉపయోగపడే చక్కని వ్యాసాన్ని రాశారు. పరీక్షిత్తు పాత్ర గురించి అన్నపూర్ణగారి వ్యాసం చదువుతుంటే, మహాభారతంలో ఉన్న అంతరార్థాన్ని వివరిస్తూ వచ్చిన రచనల్ని చదువుతున్నట్లనిపిస్తుంది. తాత్కాలికంగా అన్యాయం జయించినా, అంతిమ విజయం ధర్మానిదేనని మహాభారతం నిరూపిస్తుందంటూ, దానిలోని అంతర్భాగంగానే అభిమన్యుడి పాత్ర కూడా అని, అభిమన్యుడు ధర్మయుద్ధం ద్వారా శాశ్వత కీర్తి పొందిన వైనాన్ని ఆచార్య గిడ్డి వెంకటరమణ చక్కగా వివరించారు. తామే కులంలో పుట్టినా ప్రయత్నం వల్ల మహోన్నతమైన జీవితాన్ని జీవించవచ్చని నిరూపించిన గొప్పరాజనీతజ్ఞుడిగా సంజయుడిని బి.స్వప్న నిరూపించారు. విదురుడి పాత్ర ద్వారా శారీరక బలంతో పాటు నైతిక బలం కూడా ముఖ్యమని, అది సర్వవేళలా ఆచరణీయమని  డా.పానుగంటి శేషకళ నిరూపిస్తూ చక్కని వ్యాసాన్ని రాశారు. దుశ్శాసనుడి పాత్ర గురించి డా. వైరాగ్యం ప్రభాకర్‌ గారు వ్యాఖ్యానిస్తూ పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల పాత్ర అనిర్వచనీయమైందంటారు. ‘‘పెంపకంలో తల్లిదండ్రుల అలసత్వం, నిర్లక్ష్యం, వారి పట్ల వారి ప్రవర్తన పట్ల అనుక్షణం  జాగ్రత్త వహించకపోవడం ఒక కారణమైతే ఈ నాటి ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తున్న సందర్బాల్ని’’ కూడా జాగ్రత్తగా పర్యవేక్షించకపోతే తమపిల్లలపై ఆ ప్రభావం పడుతుందని, అలా సరిగ్గా పెంచకపోవడం వల్లనే దుశ్శాసనుడి ప్రవర్తన ఆవిధంగా మారిందని, అది సమకాలీన సమాజంలో కనిపిస్తుందని సూత్రీకరించడం బాగుంది.

            నేటి గురుకు వ్యవస్థకీ, నాటి గురుకు వ్యవస్థకీ మధ్య భేదాల్ని గమనిస్తూనే, గురు-శిష్య సంబంధాల్ని మర్చిపోకుండా ఉండడానికి ఏకలవ్యుని పాత్రను గుర్తు చేసుకోవాలి. ఆనాటి విద్యావిధానం ఎలా ఉండేదో వివరిస్తూ మాధవిగారు ఏకలవ్యుని పాత్రను విశ్లేషించారు. నాడే కాదు నేటికీ, ఒక విద్యార్థి పట్ల గురువుకి ప్రేమాభిమానాలు పెరగడానికి ఆ శిష్యుడు ప్రవర్తించే తీరే ప్రధానమవుతుంది. గురువు పట్ల వినయం, విధేయత, క్రమశిక్షణతో వ్యవహరిస్తే, గురువు శిష్యుడికి ఎన్నో రహస్యాలు చెప్తాడు. అందరికీ చెప్పే అంశాల కంటే భిన్నంగా తన ప్రియశిష్యుడికి చెప్తాడు. ఆ శిష్యుడిని సర్వవేళలా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆదుకుంటాడు. కానీ, ద్రోణాచార్యుడు తాను ప్రత్యక్షంగా నేర్పని విద్యకు ఏకలవ్యుడి దగ్గర కుడి బొటనవ్రేలు గురుదక్షిణ తీసుకోవడం ఒక పెద్ద చర్చకు దారితీసింది. విలువిద్యలో బొటనవ్రేలు అత్యంత ముఖ్యం. దాన్ని తీసేసుకుంటే ఆ విలువిద్య దేనికీ పనిచేయదు. ఏకలవ్యుని పాత్రను కేంద్రీకరించుకొని ఇంచుమించు భారతీయ భాషలన్నింటిలోనే ఎంతో సాహిత్యం వచ్చింది. గురువు కూడా మానవ మాత్రుడే. గురువు కూడా అధికారం గొడుగు క్రింద బ్రతకవలసినవాడే. పాండవుల నీడలో ఉన్నాడు. తనకిష్ణమున్నా, లేకున్నా భవిష్యత్తులో పాండవుల విజయం కోసం, వాళ్ళకు ఎదురునిలిచేవాళ్ళుండకుండా చూడక తప్పదు.

            నేడు మనం అనేక వార్తాకథనాలను వింటున్నాం. వ్రాత పరీక్షలో అత్యధిక మార్కులు సాధించినా, ఇంటర్వ్యూల్లో మార్కులు తక్కువగా వేయడం వల్ల తమకు రావాల్సిన, సీట్లు, ఉద్యోగాలు తమకు రావడంలేదని ఆవేదన చెందుతున్న ప్రతిభావంతులైన వారు ఎంతోమంది ఉన్నారు. రకరకాలైన ప్రలోభాల వల్ల ఒక్కోసారి ఇంటర్వ్యూ బోర్డులో ఉన్న వాళ్ళకూడా ఇష్ణమున్నా, లేకున్నా ఆ పనులు చేయాల్సిన పరిస్థితులు ఎదురవుతుంటాయి. నేటి విద్యావ్యవస్థలో కొన్ని మార్కులు ప్రత్యక్షంగా ఉపాధ్యాయుడు / అధ్యాపకుడే వేయాలి. ఈ మార్కులతో పాటు ఫైనల్‌ పరీక్షలో రాసిన మార్కులు కలుపుతారు. ఇక్కడ కూడా ఇలాంటి ప్రతిభావంతులెంతో మంది వేదనకు గురవుతున్నారు. ఇక్కడ ఒక కులం, ఒక మతం, ఒక ప్రాంతం, ఒకవర్గం అనేవేమీ ఉండదు. సందర్భాన్ని బట్టి ఈ అన్యాయం జరుగుతుంటుంది. ఇలాంటి సమకాలీన అంశాల్ని మనం మహాభారతంలోని ఏకలవ్యుని పాత్రలో గమనించగలుగుతాం. ఇలా ప్రతి పాత్రలనూ వివరించుకుంటూ పోయే అవకాశం ఉంది. ఇలా ప్రతి వ్యాసాన్నీ సమీక్షించుకుంటూ వెళితే ఈ ముందుమాట ఒక పెద్ద వ్యాసం అయిపోతుంది. కనుక, దీన్ని ఇక్కడితో ముగించేముందు కొన్ని సూచనలు చేయానుకుంటున్నాను. దీనిలోని వ్యాసాలు రాసిన డా.పెద్దింటి ముకుందరావు, డా.దేవినేని జ్యోతి,  డా.కె.యస్‌.ఎల్‌.పద్మావతీదేవి,  డా. పైడిరాజు, డా. చల్లా భాగ్యక్ష్మి, హిమాలిని, డా.సత్య గాయత్రి, సయ్యద్‌ సమీనా పర్వీన్‌, బాదూరి కుమారి, డా.రాజగోపాల్‌ రెడ్డి, పి.ఆర్‌. రంగనాథశర్మ మొదలైన వ్యాసకర్తందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

            ఈ గ్రంథంలో కొంతమంది పూర్వగాథాలహరి (వేమూరి శ్రీనివాసరావు), పురాణ నామ సంగ్రహం, పెద్ద బాలశిక్ష, మహాభారత వచన కథలు, వికీపీడియా మొదలైన వాటిని చదివి వ్యాసాల్ని రాశారు. మూలాన్ని చూసి, జీర్ణించుకొని వ్యాసాల్ని రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ, తమ వ్యాసంలో సమకాలీనతను సమన్వయించిన వాళ్ళు మాత్రం చాలా కొద్దిమంది మాత్రమే ఉన్నారు. ఒకరిద్దరు, మూలాన్నీ, దానిమీద వచ్చిన రచనల్నీ చదివి రాసే క్రమంలో, దాన్ని ఎలా ముగించాలో తెలియలేదు. అలాంటి వ్యాసాు ఒకటి రెండున్నాయి. భాష విషయంలో కూడా వ్యావహారికాన్ని పూర్తిగా రాయకుండా, సరళ గ్రాంథికాన్ని రాసినవాళ్లున్నారు. తాము వ్యాస భారతాన్ని తీసుకున్నారో, ఆంధ్రమహాభారతాన్ని తీసుకున్నారో స్పష్టంగా చెప్పి, దానిలో చిత్రితమైన పాత్ర గురించి రాయడం ఉత్తమపరిశోధకునికి ఉన్న ఒక క్షణం. అంటే తన అంశం పట్ల అవగాహన, పరిధి, పరిమితులను గుర్తించి, వాటిని తెలియజేయడం కూడా ముఖ్యం. అది ఈ పుస్తకంలో చాలా మంది పాటించలేదు. కానీ, అత్యధికులు ఆంధ్రమహాభారతాన్నే దృష్టిలో పెట్టుకొని, ఆ పాత్రనే విశ్లేషించే ప్రయత్నం చేశారు.  అంతేకాదు, చాలామంది వ్యాసాల్ని గమనిస్తే భారతం ప్రశస్తి వంటి విషయాల్లో పునరావృత్తి తప్పలేదు. విడివిడిగా ఆ వ్యాసాలకు అది అవసరం. కానీ, ఒకే పుస్తకంగా చదివేటప్పుడు పునరావృత్తిలాగే అనిపిస్తుంది. మరికొంతమంది వ్యాసాన్ని సూటిగా తాము చెప్పాల్సిన అంశాన్నే ప్రస్తావించారు. దీనివల్ల తాము చెప్పవలసిన మరికొన్ని ఎక్కువ అంశాల్ని తమకిచ్చిన వ్యాసపరిధిలోనే చెప్పగలిగే అవకాశం ఉంటుంది. సామాజిక బాధ్యత కలిగిన వాళ్ళు, ముఖ్యంగా సాహిత్యాన్ని సీరియస్‌ గా తీసుకునేవాళ్ళు అది ప్రాచీనమైనా, అది ఆధునికమైనా సమకాలీన సమాజానికి ఎలా ఉపయోగపడుతుందని ఆలోచిస్తారు. ఒకవేళ ఆ సాహిత్యంపై తీవ్రమైన వాదోపవాదాలు జరుగుతున్నా, వాటిని సమన్వయించి, ఆ సాహిత్యంలోని మంచిని గ్రహించే ప్రయత్నం చేస్తుంటారు. కేవలం సాహిత్యాన్ని చదివి, దాన్ని బోధించేవాళ్లే కాకుండా, సాహిత్యేతరమైన విద్యను అభ్యసించినా, సాహిత్యం పట్ల గ అభిరుచి, ఆసక్తి గ వాళ్ళను కూడా కుపుకుంటూ ఈ గ్రంథాన్ని వెలువరిస్తున్నారు. సాహిత్యం సమాజాన్ని ప్రతిఫలిస్తుందని మరోసారి నిరూపిస్తూ చేసే ఒక మంచి ప్రయత్నంగా దీన్ని భావిస్తూ, ఇంత మంచి పుస్తకం తీసుకొస్తున్న సహృదయ సాహితీ మిత్రడు డా.వైరాగ్యం ప్రభాకర్‌ గార్కి నాహృదయపూర్వక అభినందలను తెలియజేస్తున్నాను.


( అక్టోబరు, 2020), ISBN 978-93-5419-873-1

 


No comments: