నల్లమోతు సునీతకు పిహెచ్.డీ ప్రదానం
భూమిపుత్ర
(హైదరాబాదు) జనవరి 09: ఉత్తరప్రదేశ్, వారణాసిలోని
విశ్వ.వ్యాప్త ప్రసిద్ధ విద్యాసంస్థ కాశీ హిందూ విశ్వవిద్యాలయం తెలుగుశాఖలో
నల్లమోతు సునీతకు పిహెచ్.డి డిగ్రీ మంజూరుచేశారు. జరిగిన మౌఖిక పరీక్ష (వైవాఓసీ)లో
ముఖ్య వరీక్షాధికారిగా హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయ తెలుగు ఆచార్యులు ఆచార్య
దార్ల వెంకటేశ్వరావు గూగుల్ మీట్ ద్వారా హాజరై పరీక్ష నిర్వహించారు. విజయవాడ లోని ఆంధ్ర లొయోల కళాశాలలో హిందీ శాఖ
అధ్యక్షులుగా అధ్యాపన బాధ్యతలు గతంలో నిర్వహించిన కొచ్చర్లకోట వెంకట సుబ్బారావు
రాసిన కథలు పరిశీలన అనే విషయంపై కుమారి నల్లమోతు సునీత చేసిన పరిశోధన గ్రంథానికి
పీహెచ్ డీ డిగ్రీ లభించింది. కాశీ హిందూ విశ్వవిద్యాలయ తెలుగు శాఖలో పనిచేస్తున్న
ఆచార్య చల్లా శ్రీరామచంద్రమూర్తి ప్రత్యేక పర్యవేక్షణలో ఈ సిద్ధాంత గ్రంథ పరిశోధన
జరిగింది. కథకుడు సుబ్బారావు రాసిన 121 కథలతో బాటు 19
అముద్రిత కథలు ఈ పరిశోధనకు ఆధారాలు. కొచ్చర్లకోట వారి కథల్ని హాస్య,
కుటుంబ, స్త్రీల, సామాజిక,
మనస్తత్వ చిత్రణ, కథా కుసుమాలు, ఆటవిడుపు, క్లూ, రోమియో,
అనువాద, బాలకథా తరంగిణి కథలు వంటి వర్గీకరణలతో
పరిశోధకురాలు చేసిన వింగడింపు తెలుగు పరిశోధన నియమావళికి అనువుగా వుందని ఆచార్య
దార్ల ప్రశంసించారు. తీసుకున్న పరిశోధక విషయాన్ని సమగ్రంగా, సూటిగా,
నియమాలకు లోబడి పరిశోధన కావించిన సునీతను సీనియర్ తెలుగు ఆచార్యుడు
భమిడిపాటి విశ్వనాధ్ అభినందించారు. కథా పరిచయాలు, ఎత్తుగడ,
సంభాషణ శిల్పం, వర్ణన శిల్పం, రసపోషణ, అలంకార విన్యాసం వంటి విశ్లేషణలతో లోతైన
చర్చ జరిగింది. సుబ్బారావు రాసిన శ్మశాన భైరవి, మంత్రాక్షరి,
వీరయోగి లొయోల వంటి నవలల పరిచయాలు
అందించడం దీనిలో ప్రత్యేకత. ఆరు ప్రధాన అధ్యాయాలుగా రూపొందిన ఈ పరిశోధనలో సుబ్బారావు
జీవన చిత్రణల విశేషాలు మొదటి అధ్యాయంగా అమరింది. చివరలో కథకుని అన్య భాషాపద ప్రయోగ
వైచిత్రి, సంస్కృతభాషా ఔన్నత్యాలు, వివరించడమేకాకుండా,
తెలుగు కథా సాహిత్యంలో కొచ్చర్లకోట వెంకట సుబ్బారావు స్థానం
సోదాహరణంగా నిరూపించారు.
(భూమిపుత్ర దినపత్రిక, 10.1.2021 సౌజన్యంతో)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి