"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

25 నవంబర్, 2020

డా.కేతవరపు రాజ్యశ్రీ మెరుపుల్లోకవిత్వమై మెరిసిన సమకాలీనత

 

ప్రముఖ కవయిత్రి డా.కేతవరపు రాజ్యశ్రీ గారి ‘‘మెరుపులు’’లఘు కవిత్వానికి రాసిన ముందుమాట

డా.కేతవరపు రాజ్యశ్రీ మెరుపుల్లోకవిత్వమై మెరిసిన సమకాలీనత

-ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు,

ప్రొఫెసర్, తెలుగు శాఖ & డిప్యూటి డీన్,స్టూడెంట్స్ వెల్ఫేర్,

 సెంట్రల్ యూనివర్సిటి, హైదరాబాద్. 

 

‘‘సముద్రమథనం లోంచి

అమృతం

మేథోమథనం లోంచి

కవిత్వం-

సృజన లోంచే

ఆలోచనామృతం!’’- డాకేతవరపు రాజ్యశ్రీ గారి కవిత ఇది.  దీనిలో మూడు పార్శ్వాల్ని చూడొచ్చు. కవయిత్రి కవిత్వమయ్యేవేళ పొందే రసానునుభవ స్థితి. ఇది వైయక్తికంగా కనిపించినా,  అది కవిత్వం రాసేవాళ్ళూ, కవిత్వాన్ని చదివేవాళ్ళూ పొందాల్సిన అనుభవం. అప్పుడది వైయక్తికత నుండి సాధారణీకరణమౌతుంది. ఒక నిర్వచనంగా నిలుస్తుంది. కవిత్వమెలా ఉండాలో మరలా కవిత్వం ద్వారానే  అభివ్యక్తీకరించేందుకు తీసుకున్న పోలిక-ఔచిత్యమంతం! మూడోది కవయిత్రి ఆలోచనా దృక్పథం. కవిత్వాన్ని సరళీకరిస్తున్నప్పటికీ, తన భావజాలాన్ని విస్మరించకుండా పయనించడం.

డా కేతవరపు రాజ్యశ్రీ గారు ఇప్పటికే లబ్దప్రతిష్ఠులైన కవయిత్రి.  వీరు రాసిన ‘రెక్కల్లో గీతామృతం’తో తెలుగు వచన కవితా ప్రపంచంలో తనదైన స్థానాన్ని సంపాదించుకున్నారు. సరళమైన పద్ధతిలో ‘భగవద్గీత’ తత్త్వాన్ని ఆ పుస్తకం ద్వారా కవిత్వం చేశారు. వీరు కవిత్వాన్ని చదివే తీరు కూడా చాలా బాగుంటుంది. ఒకసారి శ్రీత్యాగరాయ గాన సభలో వీరు కవిత్వాన్ని చదివినప్పుడు నేను ప్రత్యక్షంగా విన్నాను.  ముక్తకాలు, రెక్కలు మొదలైన  ఆధునిక లఘు రూపకాల్లో కవిత్వం రాసిన డాక్టర్ రాజ్యశ్రీ గారు ‘మెరుపులు’కి శ్రీకారం చుట్టారు. మెరుపుల లక్షణాల్ని స్పష్టంగానే చెప్పుకున్నారు. నిజానికి ఒకప్పుడు డాక్టర్ అద్దేపల్లి రామమెనరావుగారు మినీ కవిత్వాన్ని ఒక ఉద్యమంగా తీసుకొచ్చారు. నేడు మరలా యం.కె.సుగమ్ బాబు గారు మినీ కవిత్వాన్ని మరో రూపంలో ఉద్యమప్రాయం చేస్తున్నారు.  ఆయన రూపకల్పన చేసిన ‘రెక్కలు’ లఘుకవితా రూపం  ఆధునిక వచనకవిత్వం రాసే అనేక మందికి అనుసరణీయమైంది. బి.ఏ.వి.వర్మగారు ‘రవ్వలు’ కూడా ఈ ఉద్యమానికి ఊపునిచ్చేటట్లే వచ్చాయి. కొంచెం లోతుగా పరిశీలిస్తే రెక్కలు కవితా రూపంలో హైకూ తత్త్వం కొంత ఉన్నా, దీని ప్రత్యేకత దీనికి ఉంది. హైకూల్లో  ‘తత్త్వం’ ప్రధానమైతే, రెక్కలులో చివరి రెండు పంక్తులు పాఠకుణ్ణి ఆనందడోలికల్లో తేలియాడేలా చేయడం విశేషం. భావుకతకు రెక్కలు వచ్చేటట్లు చేస్తాయన్నమాట. ఆ రెక్కలులో చివరి మెరుపుని ఆధారం చేసుకునే డాక్టర్ రాజ్యశ్రీ గారి ‘మెరుపులు’ లఘుకవితా రూపం మనముందుకొచ్చిందనిపిస్తుంది.

సమకాలీన సమాజంలో కనిపించే మానవ సంబంధాల విచ్ఛిన్నకరపరిస్థితులకు డాక్టర్ రాజ్యశ్రీ గారు ప్రతి ఒక్కరూ పడాల్సిన ఆందోళనను మెరుపులు లఘు రూప కవిత్వంలో చూడొచ్చు. పసిపాప దగ్గర నుండి వృద్ధాప్యం వరకూ, ఇంటి నుండి ఆకాశం వరకూ, ప్రకృతి నుండి మనిషి వరకూ... ఇలా అనేక పార్శ్వాల్లో కవయిత్రి కవిత్వమయ్యారు. నిత్యం వార్తాపత్రికలు, టీ.వీలు, రకరకాల సోషల్ మీడియాల నిండా వచ్చే కొన్ని వార్తల్ని చదువుతున్నప్పుడు, చూస్తున్నప్పుడు మనమే సమాజంలో ఉన్నామనిపిస్తుంటుంది.  

‘‘నెరిసిన తల

ముసుగులో

మాటేసిన వాంఛ-

ఆరేళ్ళపాపపై

పడగెత్తిన పాము’’ అని పసిపాపల్ని కాటేసే దుర్మార్గుల్ని ‘‘పాము’’తో పోలుస్తారు కవయిత్రి. ఒక పసిపాప అస్తిత్వం ప్రశ్నార్థకమైన సమాజాన్ని చూపిన కవయిత్రి, ఒక వృధ్యాప్య నిస్సహాయతను కూడా కింది విధంగా వర్ణిస్తారు.

‘‘కొడుకులు, కోడళ్ళు

మనుమలు, మనుమరాళ్లు

ఇల్లంతా సందడి-

సమూహంలో ఉన్నా

ఒంటరిది వృద్ధాప్యం!’’

ఒంటరిగా ఉండడం ఒక వేదనైతే, అందరూ ఉండి ఎవరూ తనతో మాట్లాడేవాళ్ళు లేని ఒంటరితనం మరింత వేదనాభరితమే కాదు, ఆ బాధ వర్ణనాతీతం. కొంతమంది టీవీలకు, మరికొంతమంది కంప్యూటర్లకు, ఇంకొంతమంది మొబైల్స్ కు... ఇలా అంతా ఇంటిలోనే ఉన్నా ఎవరికి వారవుతున్న కుటుంబాల పరిస్థితికి ఈ కవిత నిలువుటద్దంలాంటిది. తర్వాత కూడా మరో మెరుపులో పిల్లలు శిశువిహార్లకూ, భార్యాభర్తలు ఉద్యోగాలకు పోతే, ఇక ఇంటిలో మిగిలే పెద్దవాళ్లను చూసేదెవరు? అందుకే వాళ్ళు ‘వృద్ధాశ్రమాలకు’ వెళ్ళిపోకతప్పడం లేదంటారు కవయిత్రి. అయితే కుటుంబాల్లో  పెద్దవాళ్లు లేకపోవడం వల్ల చిన్నదానికీ, పెద్దదానికీ కార్పోరేట్ హాస్పటల్స్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి దాపురిస్తోంది. పెద్దవాళ్లు వాళ్ళ జీవితానుభవంలో సాధించిన సారాన్ని పిల్లలు అందుకోలేకపోతున్నారనే వేదనతో ఇలా అంటారు.

‘‘అపర ధన్వంతరీలు

సంస్కృతీ సంప్రదాయాల

పట్టుగొమ్మలు

మన బామ్మలు-

వృద్ధాశ్రమాల పాలు!’’ కొన్ని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు ఇంటి చిట్కాలతో పరిష్కారాలు లభిస్తాయి. అవి కూడా శాశ్వతంగా వాటిని రూపుమాపవచ్చు. కానీ, ఆ సలహాలివ్వడానికి కూడా పెద్దవాళ్లను ఇంటి దగ్గర పెట్టుకోలేని యాంత్రిక జీవితాల్ని గడుపుతున్న దీనస్థితిని ఈ మెరుపు ద్వారా అందించారు.

నిజానికి ఈ పుస్తకం చిన్నదే కావచ్చు; కానీ దీనిలోని మెరుపులు మన హృదయంలో మెరిసి, మురిసి, మరిచిపోకుండా ఆయా సందర్భాల్లో మరలా ఆలోచనల్లో మెరిసేలా చిన్న చిన్న మెరుపులుగా వర్ణించారు కవయిత్రి. కవులు చేతన, అచేతన వస్తువుల్లో దేనిలోనైనా ‘ప్రాణస్పందన’ను చూడగలుగుతారు.  నోరులేకపోయినా, చెప్పు నోరు మూయించడం, ఉదయం, సాయంత్రమనే కాదు, నీరసంగా ఉన్నప్పుడల్లా ఎంతోమందికి ఉత్సాహాన్ని తెచ్చే ఛాయ్ ని వర్ణించడంలో అచేతనలో చేతనత్వాన్ని చూడ్డమే కవయిత్రికున్న భావుకతా సామర్థ్యానికి నిదర్శనం. సమకాలీన సమాజంలో కనిపించే రాజకీయ నాయకుల ఆర్భాటాల్నీ, ప్రజాస్వామ్యంలో ఎన్నికల సమయంలోనే పనులు చేయించే కుట్రలను, మొబైల్, టీవీ, వివిధ రకాల మీడియాల స్థితి గతులు, వారి విపరీత పోకడల్ని ఈ మెరుపుల్లో కవిత్వీకరించారు. ఆకలికి మతం ఉండదని

 ‘‘రాముడు గుడి ముందు

రహీం బాయి

పూలకొట్టు-

ఆకలి ముందు

మతం ఫట్టు’’ అని మార్క్సిస్టు తత్వవేత్తలా ఒక కవితలో అభివర్ణించారు. మూగజీవాల్ని కూడా తన కవిత్వంలో ఉదాత్తీకరించారు.

‘‘నిద్రిస్తున్న పల్లెకి

వీధికుక్కల కాపలా

జీతభత్యాలు

కోరని

సెక్యూరిటీ గార్డులు!’’

 డాక్టర్ కేతవరపు రాజ్యశ్రీ గారిలో ఉన్న భావుకతను, సామాజిక వాస్తవికతను, కవిత్వ నిర్మాణ సామర్థ్యాన్ని తెలియజేసే ‘మెరుపులు’ కవిత్వం పాఠకుల్ని ఆనందింపజేస్తూనే, ఆలోచింపజేస్తుందని నమ్ముతున్నాను. ఒక చిన్న మెరుపు... అంధకారంలో ఉన్నవారికి మార్గం చూపే మలుపవ్వాని భావిస్తూ, మెరుపులతో పాటు కవయిత్రి భావుకత, కవిత్వ సామర్థ్యాన్ని మరో కోణంలో కూడా ప్రదర్శించగలిగే ఖండికలు, దీర్ఘకవితలను కూడా రాయాలని ఆకాంక్షిస్తున్నాను. 

(డా,కేతవరపు రాజ్యశ్రీ, మెరుపులు (లఘురూపకవిత్వం),  క్షయ గ్రాఫిక్స్, హైదరాబాద్ ప్రచుణ, మార్చి, 2020, పుటలు: 9-12)

పుస్తకం కోసం http://www.rajyasri.com/pdfbooks/rajyasri-Merupulu.pdf



కామెంట్‌లు లేవు: