సంప్రదాయ-ఆధునిక కవిత్వ అనుసంధానమే
రమేశ్ కొత్త సృష్టి ‘కైతికం’
-ఆచార్య
దార్ల వెంకటేశ్వరరావు,
తెలుగుశాఖ,
స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్,
యూనివర్సిటి
ఆఫ్ హైదరాబాద్, హైదరాబాద్-500 046,
·
మాత్ర ఛందస్సులో రాయాలి
·
1,2,3,4,పాదాలలో 9 నుండి 12 మాత్రలు ఉండాలి
·
2,4 పాదాలలో అంత్యానుప్రాసలో ఉండాలి
·
5 పాదంలో ‘‘వారెవ్వా’’ లేదా పై నాలుగు పాదాలను బలపరిచే మకుటం , లేదా
సరైన పదము గానీ వాడాలి.
·
6 వ పాదంలో కవితాత్మక వాక్యం లేదా నూతన పదబంధం లేదా జాతీయం లేదా కొసమెరుపులా
ఉండాలి.
·
5,6పాదాలలో మాత్ర ఛందస్సు నియమం అవసరం లేదు. కాని సరితూగే అక్షరాలు ఉండాలి. పెద్ద
వాక్యాల రూపంలో ఉండకూడదు.
ముత్యాల సరములు తర్వాత ఆధునిక కవిత్వంలో వచ్చిన లఘు రూపాల్లో హైకూలు జపాన్ కవిత్వ ప్రభావంతో వచ్చిన తాత్విక రూపం. దీనికి సిలబల్స్ ముఖ్యమని సాహిత్య విమర్శకులు చేకూరి రామారావుగారు పేర్కొన్నారు. వాటిని బి.వి.వి.ప్రసాద్, ఇస్మాయిల్, పెన్నా శివరామకృష్ణ తదితరులు శక్తివంతంగా రాశారు. కానీ, లక్షణాల్ని పూర్తిగా సమన్వయం చేయడం కుదరలేదు. తర్వాత మరలా ఆచార్య ఎన్. గోపి గారు ‘నానీలు’ కూడా మాత్రా ఛందస్సుని అనుసరిస్తూ రాశారు. దాన్ని కూడా చాలా మంది రాసినా, అందరూ లక్షణాల్ని పరిపూర్ణంగా అనుసరించలేకపోయారు. కానీ, ఆ స్పూర్తిని కొనసాగించారు. ఇప్పుడు రమేశ్ గారు సృష్టించిన కైతికాలను మంచి కట్ల శ్రీనివాస్ (కైతికాల మెరుపులు), గుడిపూడి రాధికారాణి (జీవిత సత్యాలు), గడ్డం శంకర్ ( చైతన్య దీప్తులు), యం.వి.ఉమాదేవి (జే గంటలు), గద్వాల సోమన్న( గద్వాల కైతికాలు) మొదలైన వాళ్ళెంతోమంది రాస్తున్నారు. చిన్న చిన్న మాత్రాఛందస్సుని వాడ్డంలో కొంత సరళత ఉన్నా, నియమాలు వీళ్ళకు ఆటంకం కాకపోవడం ఒక గొప్ప స్వేచ్ఛ కలిగించే కవితారూపంగా దీన్ని చెప్పుకోవచ్చు. నిరంతరం సాహిత్యాన్ని అధ్యయనం చేస్తున్న గోస్కుల రమేశ్ ఒక తెలుగు ఉపాధ్యాయుడు. ఇప్పటికే ఆయనకు మంచి వచనకవిగా పేరొచ్చింది. వందలాది వచనకవితలు రాశారు.
2018లో ‘కైతికాలు’ అనే
ఆధునిక తెలుగు కవితా రూపం సృష్టించినా, అనతికాలంలోనే అత్యంతవేగంగా ప్రాచుర్యంలోకి
కూడా వచ్చిందని అంతమంది రాయడమే దీనికి నిదర్శనం. ఇది తెలుగు కవిత్వంలో క్రొత్త
రూపం. అంతేకానీ, కానీ కొత్త ప్రక్రియ కాదు. కవిత్వం, కథ, నవల, యక్షగానం, ఏకాంకిక,
నాటకం, వ్యాసం, సాహిత్య చరిత్ర, సాహిత్య విమర్శ మొదలైనవన్నీ సాహిత్య ప్రక్రియలు.
అలాగే, కవిత్వంలో పద్యం, వచనం, గేయం, వచన కవిత్వం, మినీకవిత్వం మొదలైన రూపపరమైన
భేదాలుంటాయి. అంతేకానీ, ఇవన్నీ కొత్త ప్రక్రియలు కాదు. ఆ విధంగా ఆధునిక కవిత్వంలో
వస్తున్న కొత్త రూపాల్లో ‘కైతికాలు’ అనేదొక నవ్యకవిత్వరూపం. వ్యవహారంలో చాలామంది
కొత్త ప్రక్రియ అని పిలుస్తున్నా, పరిశీలనగా చెప్పాల్సినప్పుడు ఇదొక రూపపరమైన
నవ్యత్వం. ఈ నవ్యత్వంలో ఎంతో ఆలోచన ఉంది.
సాహిత్య బాధ్యత ఉంది. సాహిత్యం బాగుపడాలనే తపన ఉంది. సాహిత్య రచన ఒక బాధ్యతతో
కూడిందనే స్పృహ కనిపిస్తుంది. ఇలాంటి ఆలోచనలతో ‘కైతికాలు’ సృష్టించిన రమేశ్ గార్ని
అభినందిస్తూ, ఆయన కవిత్వంలో .కనిపించే కొన్ని ముఖ్యాంశాల్ని ఇక్కడ
ప్రస్తావిస్తాను.
గోస్కుల రమేశ్ ‘చీకట్లో
చిరుదివ్వెలు’ పేరుతో రాసిన ఈ సంపుటిలో చక్కని కైతికాలు రాశారు. కవులు కవుల
గురించి వర్ణించడం చాలా సందర్భాల్లో కనిపిస్తుంది. అది సంప్రదాయ పద్య
సాహిత్యంలోను, ఆధునిక వచన కవిత్వంలోనూ కనిపిస్తుంది. రమేశ్ కూడా కవి గురించి వర్ణిస్తూ...
లోకాన్ని చూసొచ్చి
కాగితం లొ మొలిపిస్తడు
కవనంలో దిగుతడు
మర్మం విప్పేస్తడు
వారేవ్వా వీరుడు
కలం నడుపు ధీరుడు’ అని వర్ణించాడు.
ఇదొక అద్భుతమైన
కైతికం. కవి కర్మను వర్ణించిన తీరు చాలా
బాగుంది. కాగితానికి మానవుడికి ఉండే జీవంలాంటి
జీవం లేదు. కానీ, మనిషికి అది కొత్త జీవితాన్నిస్తుందని ధ్వనిమయం చేశాడు. అక్షరానికి
ఉన్నటువంటి శక్తిని ఇక్కడ రమేశ్ మరింతశక్తివంతంగా
పలికించాడు. కవిత్వం సత్యానికి చెందిందనీ, సమాజాన్ని అవలోకించి కవిత్వం
వెలువడుతుందనీ కవిత్వతత్వాన్ని విశదీకరిస్తున్నాడు కవి. సాధారణంగా కవిని చమత్కారంగా
‘అబద్ధాలకోరు’ అంటుంటారు. అంటే కవి అందమైన, భావుకతతో కూడిన వర్ణనలు చేస్తుంటాడని,
ఊహాలోకాల్లో విహరిస్తుంటాడనీ అలా అన్నాడు. కానీ, ఆధునిక కవి అందమైన వర్ణనలతో పాటు,
‘లోకాన్నీ’ విస్మరించడని కవి రమేశ్ తాత్వ్తికంగా,
సాత్త్వికంగా చెప్తాడు.
ఉన్నోడికి
చెక్కుబుక్కు
లేనోడికి రేషన్
కార్డు
మధ్యవర్తిగా
క్రెడిట్ కార్డు
వారెవ్వా
లోకులు
కార్డు చాటు
బ్రతుకులు’’
సమాజంలో కనిపించే వర్గ వ్యత్యాసాల్ని వర్ణించడంలో 'అమ్మచాటు బిడ్డలు' అనే ఒకలోకోక్తిని కవి ఇక్కడ చమత్కారంగా 'కార్డు చాటు బ్రతుకులుగా వాడుకున్నాడు. నేడు ఏదొక కార్డు
లేని వ్యక్తి లేడు! ఇక్కడున్నాడు కవి. ఇలాంటి ప్రయోగాల వల్లనే కైతికాలు సాహిత్యంలో
మనగలుగుతాయి. అలాంటి చమత్కార ప్రయోగాలు తన కైతికాల్లో ఎన్నో చోట్ల ప్రయోగించాడు
కవి.
లోకంలో కనిపించే
రకరకాల మనస్తత్వాలను రమేశ్ ఈ పుస్తకంలో కవిత్వీకరించాడు. శ్రమతత్త్వాన్ని గుర్తించాలనే తపన ఈ కవిత్వంలో ఉంది. కపటత్వం
మంచిది కాదనే బోధన ఉంది. నటనలో జీవించనంతగా జీవితంలో జీవించలేకపోతున్న వార్ని
నిలదీసే మనస్తత్వం ఉంది. ప్రేమపేరుతో వంచించే, వేధించే పోకిరీలను చీపుర్లతో
ఊడ్చేయాలనే ఆవేశం ఉంది. రాజకీయ నాయకుల అవినీతి మీద రాయని ఆధునిక కవి ఉండడేమో.
రమేశ్ కవిత్వంలోనూ దుష్ట రాజకీయనాయకుల కౌటిల్యాన్ని తూర్పారబట్టడం కనిపిస్తుంది.
రైతులు, కూలీల దుస్థితికి దు:ఖించని కవి కూడా ఉండడు. అయితే, ఈ మధ్య కాలంలో
ప్రభుత్వాలు రైతులకు కొన్ని ప్రోత్సాహకాలను అందించడం స్వాగతించవలసిందే. కానీ, ఆ
పథకాలు పెట్టడం కంటే రైతులకు సరైన గిట్టుబాటు ధరల్ని కల్పించడం, సమయానికి
విత్తనాలు, ఎరువులు అందించే చర్యలు తీసుకుంటే భారతదేశం నిజంగా సస్యశ్యామలం అవుతుంది. కొంతమంది యువకులు, పుట్టుకతో వృద్ధులని
శ్రీశ్రీ అన్నట్లే రమేశ్ కూడా తన కవిత్వంలో నిరాశతో, నిస్పృహతో బతికేసే యువత తన
చైతన్యాన్ని గుర్తించి విజయపథం వైపు పయనించాలని ప్రబోధిస్తున్నాడు. మహనీయుల్ని
స్మరించుకోవడం ఉత్తమ సంస్కారానికి నిదర్శనం. భారతదేశంలో మహోన్నతమైన కావ్యం ‘శ్రీమద్రామాయణం’.
దీన్ని రాసిన వాల్మీకి గొప్ప మహర్షి. ఆయన జీవితం కవులకు, సామాన్య ప్రజలకు
నిత్యస్ఫూర్తిమంతం. అందుకనే ఒక కైతికంలో రమేశ్ తన భక్తిభావాన్ని
ప్రదర్శించుకున్నాడు.
‘‘వేటాడే వాల్మీకి
వెలుగులు
నింపేనెంతోమయ
సచ్చీలత జగతి
చాటే
రామాయణ కబ్బంతో
వారెవ్వా
వీరులే
జగతి మహా
మనీషులు’’
రామాయణాన్ని అర్థం
చేసుకోవడానికి సాహితీ విమర్శకులు భిన్న పార్శ్వాల్ని ప్రదర్శిస్తున్నారు. ఆ కాలంలో
రాసిన సాహిత్య వస్తువుని, ఆ నాటి సామాజిక జీవితాల్ని పునర్మూల్యాంకనంతో కొంతమంది
విశ్లేషిస్తున్నారు. మరికొంతమంది దానిలోని ఆదర్శ జీవితాన్ని, ధర్మాన్ని సమకాలీన
సమాజంతో సమన్వయిస్తున్నా, సార్వకాలికాంశాలున్నాయని వ్యాఖ్యానిస్తుంటారు. నిజానికి
మానవ సంబంధాల్లో ముఖ్యమైనవి కుటుంబ సంబంధాలు. వాటిని శక్తివంతంగా వర్ణించిది
రామాయణం. దీనికోసమైనా రామాయణం చదవాలి. రామాయణంలో కవికీ, కవి సృష్టించిన నాయకుడు
శ్రీరాముడికీ ఎంతో ప్రాధాన్యం ఉంది. అందుకే దీన్ని ఎంతో ఉదాత్తంగా గుర్తుచేసి కవి
రమేశ్ అభినందనీయుడు.
నేడు విస్తృతంగానే
కవిత్వం వస్తుంది. కానీ, దానిలో ‘కవిత్వం’ ఎంతుందనే వాళ్ళు చాలా మంది
కన్పిస్తున్నారు. అసలు కవిత్వం రాయాలనుకోవడమే గొప్ప సంస్కారం వైపు పయనించేందుకు
ప్రయత్నించడంగా భావించాలి. సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నట్లు కవిత్వం రాయగా,
రాయగా వాళ్ళే తర్వాత కాలంలో సమకాలీన కవిత్వాన్ని పరిశీలిస్తూ గొప్ప కవిత్వం
రాయవచ్చు. తొలి అడుగే పడకపోతే రెండో అడుగు గురించెలా ఆలోచిస్తాం. ప్రయత్నమే మొదలు
పెట్టకుండా, గమ్యానికెలా చేరుకుంటాం. చిన్న కవిత రాసినా, ఒక్క సాహిత్య వాక్యం
రాసినా నేను వాళ్ళను అభినందిస్తాను. ఎందుకంటే, మాటలు చెప్పడం కంటే కనీసం
వాళ్ళు ఆ ప్రయత్నమైనా చేస్తున్నారు. కాసే
చెట్టుకే రాళ్లు తగులుతాయన్నట్లు, రాసేవాళ్ళకే విమర్శలు కూడా వస్తుంటాయి. ఇక్కడ
‘విమర్శ’ అనేది సమదృష్టితో చెప్పేది కాకుండా, నిందించడంమనే అర్థంలో వ్యవహారంలోకి
వెళ్లిపోతుంది. ఇటువంటి స్థితిని కవి రమేశ్ వర్ణిస్తూ...
‘‘చైతన్యం
నీకుంటే
రాయగలవేదైనా
చవటతనం నీదైతే
వెక్కిరిస్తావెంతైనా
వట్టి పొల్లు
మాటలు
కదలలేని తూటాలు’’ అని అటువంటి ‘నింద’లను పట్టించుకోకుండా ముందుకెళ్లిపోవాలనే
ఆత్మస్థైర్యాన్ని ప్రబోధిస్తాడు.
రమేశ్ కవిత్వంలో చక్కని లయ ఉంది. సమకాలీన
సమాజంలోని భిన్న పార్శ్వాల్ని
కవిత్వీకరించే శక్తి ఉంది. తన నేల తనకందించిన భాషా పరిమళాన్ని కవిత్వానికి అద్దగల
నేర్పుంది. యువకుడిలో ఒక యువకుడిగా, పెద్దవాళ్ళలో ఒక పెద్దవాడిగా ఇమిడిపోగల
సానుకూల మనస్తత్వం ఉంది. రమేశ్ కవిత్వంలో సంప్రదాయ-ఆధునిక కవిత్వ అనుసంధాన
ప్రయత్నముంది. అన్నింటికీ మించి ఈ
‘కైతికాల’కు గొప్ప కవిత్వ శక్తి ఉంది. రమేశ్ అనుకుంటే చక్కని పద్యాన్ని రాయగలడనీ ఈ
కైతికాలు చదివిన తర్వాత నాకు అనిపిస్తుంది. అందుకని రమేశ్ తన సామర్థ్యాన్ని
నిరూపించుకోవడానికి ఒకపద్యశతకమో, కావ్యమూ కూడా రాస్తాడని అనుకుంటున్నాను. ఒక
సాధారణ ఉపాధ్యాయుడై ఉండి, ఒక కొత్త కవిత్వ
రూపాన్ని సృష్టించడం, దాన్ని అనేకమంది కవులు అనుసరిస్తూ కవిత్వం రాయడం సామాన్యమైన
విషయం కాదు. నేడు కైతికాలు ఒక ఉద్యమరూపం సంతరించుకుంటున్న కొత్త కవితారూపంగా
మారబోతుందనిపిస్తుంది. మిత్రుడు గోస్కుల రమేశ్ గార్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ,
ఈ కవిత్వం తెలుగు కవిత్వానికి మరింత శక్తినిస్తుందని నమ్ముతూ, ఈ కవిత్వాన్ని
సహృదయులంతా ఆస్వాదించవలసినదిగా కోరుతున్నాను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి