"నన్నుమార్క్సిస్టునిచేయనందుకుదేవునికి ధన్యవాదాలు!"
- డానీ
ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల బిల్లును వ్యతిరేకిస్తూ మార్క్సిస్టులు చేస్తున్న వాదనలు 1990ల నాటి పరిణామాల్ని గుర్తు చేస్తున్నాయి.
భారత లౌకిక రాజ్యాంగంలో ఎస్టీ ఎస్సీలకు ప్రభుత్వ రంగంలోని విద్యా, ఉపాధి విభాగాల్లో శాశ్విత రిజర్వేషన్ కల్పించారు. శాసన నిర్మాణంలోని దిగువ సభల్లో ఓ పదేళ్ళ కాలానికి రిజర్వేషన్లు ఇవ్వాలనుకున్నారు. దాన్ని ప్రతి పదేళ్ళకు ఒకసారి పొడిగిస్తూ వస్తున్నారు.
బీఆర్ అంబేడ్కర్ స్థాపించిన రిపబ్లికన్ పార్టి 1956 నుండే వుందిగానీ అది ఇందిరా గాంధీ హయాంలో కాంగ్రెస్ కు తోక పార్టిలా మారిపోయింది. దళితుల్లో పెద్ద భాగం కమ్యూనిస్టు పార్టీల్లో వుండేవారు. 1985 నాటి కారంచేడు ఉద్యమం ‘కులం – వర్గం’ అనే చర్చను ముందుకు తెచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో బిసిలకు రిజర్వేషన్లు కల్పించడానికి 1979లో మురార్జీ దేశాయి నాయకత్వంలోని జనతా ప్రభుత్వం నియమించిన మండల్ కమీషన్ తన రిపోర్టును 1983లో సమర్పించింది. 1989 ఆగస్టులో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న విపి సింగ్ మండల్ కమీషన్ సిఫార్సుల్ని ఆమోదించారు. బిసి సామాజికవర్గాల్లో చిగురించిన కొత్త ఆశలు రెండేళ్ళలోనే చల్లారిపోయాయి. పివి నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా వున్న మన్మోహన్ సింగ్ 1991 జులై 24న నూతన ఆర్ధిక విధానం బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ (LPG) దీని లక్ష్యం. కార్పొరేట్లను ప్రోత్సహిస్తే ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందనేది నూతన ఆర్ధిక విధానం సిధ్ధాంతం. ఒకసారి ఆర్ధిక వ్యవస్థ పుంజుకుంటే ముందు పెట్టుబడీదారులు లబ్దిపొందుతారు. ఆ పిదప సామాన్యులకు కూడ ఎంతో కొంత మేలు జరుగుతుందని వారు ఇంకో సూత్రీకరణ చేశారు. దీనినే అర్థిక రంగంలో ఒలికిడి ప్రభావం (Trickle Down Effect) అంటున్నారు.
నూతన ఆర్ధిక విధానం తన సమర్ధనగా ఏమి చెప్పినప్పటికీ ఆచరణలో అది ప్రవేటు రంగాన్ని అతిగా ప్రోత్సహించి ప్రభుత్వ రంగాన్ని వేగంగా బలహీనపరుస్తూ వుంటుంది. ఆ మేరకు బలహీనవర్గాలకు రిజర్వేషన్ల అవకాశాలు తగ్గిపోతుంటాయి. ఈ పరిణామాల్ని వ్యతిరేకిస్తూ కొత్త తరం అంబేడరిస్టులు, ఫూలేయిస్టులు ముందుకు వచ్చారు. వాళ్లు “రిజర్వేషన్లు – సోషలిస్టు విప్లవం” అనే అంశాన్ని చర్చకు పెట్టారు.
నూతన ఆర్థిక విధానాన్ని కమ్యూనిస్టులు ఒకందుకు వ్యతిరేకిస్తుంటే, కొత్త తరం అంబేడరిస్టులు, ఫూలేయిస్టులు ఇంకోకందుకు వ్యతిరేకిస్తున్నారు. ఈ పరిణామాలు ఒక విధంగా కమ్యూనిస్టు పార్టీలకు కలిసి వచ్చిన అదృష్టము. హఠాత్తుగా ఒక యువ సైన్యం వారికి అందుబాటులోనికి వచ్చింది. వాళ్ళ మధ్య నిర్మాణపరంగా ఐక్యత ఏర్పడి వుంటే దేశంలో సామాజిక ఉద్యమం గమనం చాలా వేగాన్ని పుంజుకుని వుండేది.
కొత్తగా రంగప్రవేశం చేసిన అస్తిత్వవాదాలతో సమర్ధంగా వ్యవహరించడం నాటి కమ్యూనిస్టు పార్టీల నాయకులకు చేతకాలేదు. విప్లవకమ్యూనిస్టు పార్టీలు సహితం దీనికి మినహాయింపుకాదు. ‘కులం’ అజెండా లోనికి వస్తే తమ మౌలిక అజెండా అయిన ‘వర్గం’ వెనక్కిపోతుందని వాళ్లు భయపడ్డారు. “కోటా కాదు ఎర్రకోట కావాలి” అనే ఒక అతివాద నినాదాన్ని ముందుకు తెచ్చారు. తక్షణ సమస్య ఒకటి ముందుకొచ్చినపుడు దీర్ఘకాలిక సమస్యను అడ్డుపెట్టడం పలాయనవాదం. “రిజర్వేషన్ల వలన కుల అసమానతలు పోతాయని చెప్పటం ప్రజల్ని పక్కదారి పట్టించటమే” అనే ఇంకో గడుసు వాదనను ప్రవేశపెట్టారు.
ఈ వాదనకు రెండు పార్శ్వాలున్నాయి. రిజర్వేషన్లను అతిగా నమ్ముకుంటే వర్గ పోరాటం ద్వార సామ్యవాద సమాజాన్ని నిర్మించే కర్తవ్యం నుండి దళితులు పక్కదారి పడతారు అనేది ఒక పార్శ్వం. ఇది నిజాయితీతో కూడిన పార్శ్వం. రిజర్వేషన్ల అంశాన్ని అసలు చర్చకే రాకుండ నిరాకరించడం మరో పార్శ్వం. ఇది నిజాయితీ లేని పార్శ్వం. ఆనాటి కమ్యూనిస్టు పెద్దలు చేసిన వాదనల్లో ఈ రెండు పార్శ్వాలూ వున్నాయి. నిజానికి “మాకు కోటా కావాలి. ఎర్రకోటా కావాలి” అని పిలుపునిస్తే సమస్య పరిష్కారం అయిపోయేది. అలా జరగలేదు. దానితో ఎస్సీలు సమూహాలు సమూహాలుగా కమ్యూనిస్టు పార్టీల నుండి బయటికి పోయారు. పార్టీల కార్యాలయాలు క్రమంగా ఖాళీ అవ్వడం మొదలయ్యాక కమ్యూనిస్టు నాయకులు మేల్కొన్నారు. సంక్షోభ నివారణ చర్యగా కమ్యూనిస్టు పార్టీలు అన్నీ అనేక పేర్లతో ‘కుల నిర్మూలన సంఘాలు’ పెట్టాయి. కానీ, అప్పటికే ఆలస్యం అయిపోయింది. “రిజర్వేషన్ల వలన కుల అసమానతలు పోతాయని చెప్పటం ప్రజల్ని పక్కదారి పట్టించటమే” అనే ప్రకటన కమ్యూనిస్టు పార్టీలకు ఆత్మహత్య సదృశ్యంగా మారింది. ఆనాటి కమ్యూనిస్టు పార్టీల నేతలు ఇంత స్పష్టంగా మాట్లాడారా? అంటే అదీ లేదు. కాని వాళ్ళు వ్యక్తం చేసిన అభిప్రాయాల సారం మాత్రం ఇదే.
నిజానికి రిజర్వేషన్ల వలన కుల అసమానతలు అన్నీ పోతాయని అంబేడ్కర్ కూడ అనలేదు. రిజర్వేషన్లు అనేవి ఒక ఉద్దీపన చర్య మాత్రమే. దళితులు చేయాల్సింది రాజకీయ పోరాటమే. దళితులు రాజ్యాధికారం కోసం పోరాటం చేయాల్సిందే అని అంబేడ్కర్ కూడా అన్నాడు. రాజకీయ రిజర్వేషన్లను పదేళ్ళకు పరిమితం చేయడం వెనుక అంబేడ్కర్ ఉద్దేశ్యం అదే.
ఇందులో విచిత్రం ఏమంటే అస్తిత్వవాదాల్ని కమ్యూనిస్టులకన్నా ద సోకాల్డ్ ప్రధాన స్రవంతీ రాజకీయ పార్టీలే ఆసక్తిగా పట్టించుకుంటున్నాయి. నరేంద్ర మోదీజీని చాయ్ వాలా (క్లాస్)గానూ, బిసి సామాజికవర్గానికి చెందిన అభ్యర్ధి ( క్యాస్ట్ ) గానూ ప్రచారం చేసి బిజెపి గొప్ప లబ్ది పొందింది. ఈ క్లాస్ అండ్ క్యాస్ట్ కాంబినేషన్ కమ్యూనిస్టులకు ఇంకా అబ్బలేదు.
ఇప్పటి మూడు రాజధానుల కొత్త విధానంలోనూ కమ్యూనిస్టు పార్టీలు పాత తప్పులే చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ అంటే నాలుగు ప్రాంతాల సమాహారం. ఉత్తర ఆంధ్రా, మధ్య ఆంధ్రా, దక్షణ ఆంధ్రా, రాయలసీమ. ఇదొక భౌగోళిక సామాజిక వాస్తవం (Geographical Social Fact).
రాజధానిని ఎక్కడ నిర్మించినా మొదట ప్రయోజనం కలిగేది అక్కడి భూ యజమానుల (Land Owners)కు. ఆ తరువాత ఆర్ధిక వ్యవస్థలో వొలికిడి ప్రభావం (Trickle Down Effect) వల్ల అక్కడి సామాన్యులకు కూడ ఎంతో కొంత పరోక్ష మేలు జరుగుతుంది. అలాగే రాజధాని తమ ప్రాంతంలో వున్నదనుకోవడం స్థానికులకు సగర్వంగా (pride)గానూ వుంటుంది. ఇది కూడ ఒక ఉద్దీపన చర్య (Affirmative action).
ఈ నేపథ్యంలో రాజధాని నిర్మాణంలో తమకూ వాటా కావాలనీ అన్ని ప్రాంతాలు అడుగుతాయి. అది వాళ్ళ ప్రజాస్వామిక హక్కు. ఆ హక్కుల్ని ఎలా నెరవేర్చాలని అందరూ ఆలోచించాలి. సాధ్యాసాధ్యాలను గురించి ఆలోచించాలి. భావోద్వేగాలను పరికించాలి. సాంకేతికంగా ఆర్ధికంగా (Technical Feasibility and Economic Viability) సాధ్యం కాదనుకుంటే ఇతర ప్రాంతాల వారిని ఒప్పించాలి. పరిహారాలను ప్రకటించాలి. అమలు చేయాలి.
“మూడు ముక్కల రాజధాని వలన ప్రాంతాల అసమానతలు పోతాయని చెప్పటం ప్రజల్ని పక్కదారి పట్టించటమే” అని ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీల నాయకులు చెప్పడం ఒక విచిత్రం. 1990ల నుండి వీరు గుణపాఠాలు నేర్చుకోలేదు. అప్పుడు కులం గురించి మాట్లాడిన భాషనే ఇప్పుడు రాజధాని విషయంలోనూ వాడుతున్నారు. రాజధానిని మూడు నగరాలకు పంచినంత మాత్రాన రాష్ట్రంలో ప్రాంతాల మధ్య అసమానతలు అంతరించిపోతాయని ఎవ్వరూ అనడం లేదు. అదొక డెమోక్రాటిక్ డిమాండ్. ప్రాంతాల అసమానతల్ని పోగొట్టడానికి అది కూడ పనికి వస్తుంది.
కమ్యూనిస్టు పార్టీల నాయకులు ఇటీవలి కాలంలో 13 జిల్లాల్లోనూ వేలాది కిలో మీటర్ల పాదయాత్రలు నిర్వహించారు. ప్రతి జిల్లాలో స్థానిక అభివృధ్ధికి అవసరమైన ప్రాజెక్టుల జాబితాను రూపొందించి పుస్తకాలుగా ప్రచురించారు. ఇది మహత్తర విషయమం. అందుకు వారిని మెచ్చుకోవాలి. అమరావతి ఉద్యమం పకడ్బందీగా, నిరాఘాటంగా 200 వందల రోజులకు పైగా సాగుతోంది. కమ్యూనిస్టు పార్టీలు తమ పుస్తకాల్లో పేర్కొన వందలాది ప్రాజెక్టుల్లో ఏ ఒక్క దానికోసం అయినా అమరావతి అంతటి వుధృతితో పోరాటాన్ని సాగిస్తున్నారా? అంటే సమాధానం ‘బిగ్ నో’! దీని అర్థం ఏమిటీ? వారికి అమరావతి ప్రధానం. మిగతా ప్రాజెక్టులు అప్రధానం; లేదా లాంఛనం. ఇది మంచి సాంప్రదాయం కాదు.
రాజు నివశించే నగరాన్ని రాజధాని అనే సాంప్రదాయం మధ్యయుగాల్లో వుండేది. ఆ కాలంలో శాసన, పాలన, న్యాయ వ్యవస్థలతోపాటు ధార్మిక వ్యవస్థకు కూడ అధిపతి రాజే కనుక అప్పుడు అన్ని వ్యవస్థలూ ఒక్కచోటే వుండేవి. ప్రభుత్వాన్ని మతం నుండి దూరం చేయడమేగాక ప్రభుత్వానికి సంబంధిన మూడు వ్యవస్థల్ని విడగొట్టి ప్రతిదానికీ స్వతంత్ర ప్రతిపత్తి కల్పించడం ప్రజాస్వామిక విప్లవం తెచ్చిన కొత్త విలువ. పెట్టుబడీదారీ విప్లవం తరువాత యూరప్ లో రాజధాని నిర్వచనమే మారిపోయింది. రాజధాని, కేపిటల్ సిటీ అనేవి సమానార్ధకాలు కావు. ఇదీ ఇప్పుడు చర్చించాల్సిన అంశం.
టెలీ కాన్ఫరెన్సుల సాంప్రదాయం ఓ ఇరవై ఏళ్ళుగానే వుంది. వర్చ్యూవల్ సమావేశాలు నిర్వహించుకోవడానికి ఇటీవల జూమ్, గూగుల్ మీట్ తదితర సౌకర్యాలు వచ్చాయి. కరోనా లాక్ డౌన్ కాలంలో వర్క్ ఫ్రం హోం (WFH) అనివార్యం అయిపోయింది. ఈ రోజుల్లోనూ శాసన, పాలన, న్యాయ వ్యవస్థల అధిపతులు ఒకే నగరంలో వుండడం అనివార్యమా? మనం ఎప్పటికీ అప్ డేట్ కామా?
కమ్యూనిస్టులనే ఎందుకు తప్పుపట్టాలీ? అనేది ఒక కీలక ప్రశ్న. అమరావతి ఆందోళనకు ఇప్పుడు సైధ్ధాంతిక మద్దతునిస్తున్నది కమ్యూనిస్టు పార్టీలే. అమరావతి ఆందోళన మైనస్ కమ్యూనిస్టు పార్టీలు అది పక్కా టిడిపి ప్రాజెక్టు. టిడిపి అంటే నిన్నటి వరకు పాలకవర్గం. అంచేత, మూడు రాజధానుల బిల్లును సమర్ధించేవారిని పాలకవర్గ బంటులు అనే నైతిక హక్కు కమ్యూనిస్టు పార్టీలకు లేదు. పైగా, మధ్య ఆంధ్రా పక్షపాతులుగా మారిన కమ్యూనిస్టు పార్టీలు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల ప్రజా సమూహాల్లో తమ ఉనికిని తామే రద్దు చేసుకుంటున్నారు; గతంలో దళిత సమూహాల్లో తమ ఉనికిని రద్దు చేసుకున్నట్టు.
యధాస్థితిని సమర్ధించే వారు ఎన్నడూ కమ్యూనిస్టులు కాలేరు. “తత్వవేత్తలు ప్రపంచాన్ని రకరకాలుగా నిర్వచించారు; కానీ చేయాల్సిందల్లా దాన్ని మార్చడం” అని కార్ల్ మార్క్స్ చెప్పిన ప్రాధమిక సూత్రం కూడ వీరికి ఇప్పటికీ అర్ధం కాలేదు. మార్క్సిజం ఏం చెపుతున్నదన్నదే కమ్యూనిస్టులకు ప్రాతిపదిక కావాలి. కమ్యూనిస్టు పార్టిల తీర్మానాలను సహితం మార్స్కిస్టులు విమర్శనాత్మకంగా చూడాలి. తనను సహితం మార్క్సిస్టు ప్రమాణాలతో చూడాలని కార్ల్ మార్క్స్ స్వయంగా అన్నాడు. 1870ల నాటి ఫ్రెంచ్ బండ మార్క్సిస్టుల్ని చూశాక కార్ల్ మార్క్స్ చెప్పిన మాటల్ని వర్తమానానికి అన్వయిద్దాం. “భగవంతుడా! (పాపము శమించుగాక కార్ల్ మార్క్స్ కూడా భగవంతుడ్ని తలుచుకున్నాడు) నన్ను మార్క్సిస్టుని చేయనందుకు నీకు ధన్యవాదాలు” .
(చర్చలో అభిప్రాయాలు ప్రధానం; వ్యక్తులుకాదు. ఉద్దేశ్య పూర్వకంగా వ్యక్తుల పేర్లను ఈ వ్యాసంలో పేర్కొనలేదు. కానీ, వారికి తెలుసు ఎవర్ని ఉద్దేశించి ఆ వాక్యాలు రాశానో.)
హైదరాబాద్
8 ఆగస్టు 2020
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి