"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

24 జులై, 2020

జాషువా సాహిత్యంలో సమకాలీనత ( 24.7.2020 ఖమ్మం వారి అంతర్జాల సదస్సు)

గుర్రం జాషువా సాహిత్య వేదిక - ఖమ్మం వారి ఆధ్వర్యంలో గుర్రం జాషువా 49వ వర్ధంతి అంతర్జాల సాహిత్య  సభ 24-07-2020 వ తేదీన సాయంత్రం 6:00  గంటలు జూమ్ యాప్ ద్వారా  జరిగింది. ఈకార్యక్రమానికి సమన్వయ కర్తగా ప్రముఖ కవి, అధ్యాపకుడు డా. సీతారాం వ్యవహరించారు.


ప్రముఖ కవిశ్రీ మువ్వా శ్రీనివాసరావు  గారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా ప్రొ.శిఖామణి, ప్రొ. పులికొండ సుబ్బాచారి, ప్రొ.ఎండ్లూరి సుధాకర్ , ప్రొ.బన్న అయిలయ్య , ప్రొ.కొలకలూరి ఆశా జ్యోతి, ప్రొ.కొలకలూరి మధు జ్యోతి డా. కోయి కోటేశ్వర రావు, ప్రొ. దార్ల వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు. సమావేశాన్నిజాషువా సాహిత్య వేదిక కార్యదర్శి పగిడిపల్లి వెంకటేశ్వర్లు ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలోఅక్కిరాజు సుందర రామకృష్ణ, అదూరి వెంకటరత్నం, కన్నెగంటి వెంకటయ్య, మేడగాని శేషగిరి తదితరులు మంచి పద్యాలు చదివి వినిపించారు. జూమ్ యాప్ ద్వారా 100 మందికి మాత్రమే అవకాశం ఉండటం వల్ల చాలామంది కార్యక్రమంలో పాల్గొనలేకపోయారు. సమావేశానికి నామా పురుషోత్తం వందన సమర్పణ చేశారు.

నేను ( ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు) జాషువా సాహిత్యంలో కనిపించే నాటి సమకాలిక అంశాల్లో కొన్ని ముఖ్యాంశాల్ని వివరించాను. ముఖ్యంగా పత్రికల తీరుతెన్నులను జాషువా గమనించిన తీరుని జాషువా ‘‘పత్రికలు’’ అనే శీర్షికతో రాసిన రెండు పద్యాల ద్వారా చదివి వినిపించాను. 
‘‘ దేశజనుల మహిత ధీశక్తి పురో
గమనమునకు బ్రబల కారణములు
వార్తలందజేయు పత్రికలను మాట
నొప్పు కొందు మతిశయోక్తి లేదు’’... అంటూనే
‘సినిమాతారలు, నమృతాం
జనములు కలవారి పెండ్లి సంరంభంబుల్
కనుపించి, పేద సుకవులు
కనుపింపరదేమొ పత్రికా నేత్రములన్’’ అని ఆ నాడు కూడా తమకు బాగా తెలిసినవాళ్ళవీ, సినిమా తారలవీ, అమృతాంజన్ ప్రకటనలకు అత్యధిక ప్రాధాన్యాన్నిచ్చేవారనీ, మంచి కవిత్వం రాసినప్పటికీ పేద కవులను, అంటే పత్రికల వారితో సంబంధం లేని లేదా పెట్టుపడి పెట్టలేని కవుల రచనలను నిరాదరించేవారనే జాషువా పరిశీలన నేటికీ అలాగే ఉండటం ఆశ్చర్యకరం. అందుకనే జాషువా సాహిత్యంలో ప్రాసంగికత కనిపిస్తుంది. 
 రష్యా అంతరిక్షంలోకి పంపించిన లైకా అనే కుక్క మరణానికి జాషువా స్పందించి పద్యాలు రాసిన కరుణరసాత్మక భావాలను వివరించాను.
‘‘ఆకసపు బాటసారీ
లైకా! నీ మరణమొక యలంకృతి, రష్యా
రాకెటు సృష్టి చరిత్రకు
నీకివె మా వేడికంటినీటి నివాళుల్’’ అని నాడు ( 1954-57 నవంబరు 3) రష్యా ప్రయోగించిన  స్పుత్నిక్ 2 ఉపగ్రహం ద్వారా అంతరిక్షంలోకి పంపించిన కుక్క పేరు ‘‘లైకా’’.  అంతరిక్షంలోకి ప్రవేశించిన ‘లైకా’ మరలా భూమికి చేరుకునేలోగా చనిపోయింది. దీనికి స్ఫందించిన జాషువా కరుణ రసాత్మకంగా ‘‘లైకా’’ పేరుతో పద్యాలు రాసి నివాళులర్పించారు. మానవుడికి ప్రకృతి పట్లా, జంతువుల పట్లా ఉండాల్సిన దయాగుణాన్ని ఈ పద్యాల్లో చూడొచ్చు.
‘‘గుండెలు లేవు మానవులకున్ నినుబోలి యనంత రోదసీ 
మండల యాత్రసేయు యజమానుల ఆజ్ఞ శిరాన మల్లె పూ
దండగ దాల్చి కృత్రిమ సుధాంశునితో పయనించి యీ జగ
త్కాండనుతుల్ గడించివిగా, లయికా!శునకాంగనామణీ!!’’
జాషువాకి  సమకాలీన సమాజంలో వస్తున్న ప్రజల ఆలోచనాధోరణిని గుర్తించడం బాగా తెలుసు. అందుకనే నేటి మానవుల్లో వచ్చిన వైజ్ఞానిక దృక్పథాన్ని  జాషువా గుర్తించాడని, ప్రజాస్వామిక పోరాటాలను సమర్థించాడనీ, అయితే దాన్ని గాంధీ దృక్పథంతో చూశాడని చెప్తూ ‘‘గబ్బిలం’’ కావ్యంలో ఒక సందర్భంలో జాషువా చెప్పిన 
‘‘గుఱ్ఱాలకు ఱెక్కలు గల
వెఱ్ఱియుగాల్ దాటిపోయె, విజ్ఞానంబున్
బుఱ్ఱలు గల గాంధియుగమిది
కఱ్ఱలు ఖడ్డంబులేలగాలేవు ప్రజన్’’  అనే పద్యాన్ని ఉదాహరించాను. ఆధునిక యుగంలో మానవుడు అభూతకల్పనలను నమ్మడు., శాస్త్రీయదృష్టి పెరిగింది.  అద్భుత కథనాలను కట్టిపెట్టాలి. పరిపాలించడానికి ఎవరో ఒకరు వస్తారనే అద్భుత కథనాలకు కాలం చెల్లింది. విజ్ఞానాన్ని...అంటే కార్య కారణ సంబంధాన్నీ, సామాజిక వాస్తవికతను ప్రజలు తెలుసుకోగలుగుతున్నారు. ఇది గాంధీయుగం. ఇప్పుడు ప్రజలకు తమ సమస్యల పరిష్కారం కోసం పోరాడ్డం తెలుసు. తమ పాలనను తాము చేసుకోగలమని తెలుెసు. ప్రజాపోరాటాల్ని ఆపేసే అధికారం, నియంతృత్వాలకు కాలం చెల్లిందని చెప్పిన అంశాల్ని  గుర్తించాలి.  జాషువా ప్రజల ఆలోచనల్ని, ఉద్యమాల్ని నాడు జాతీయోద్యమంలో నాయకత్వం వహించిన గాంధీజీ దృష్టితో చూశాడు. అంటే ఇక్కడ గాంధీ ఒక ఉద్యమానికి ప్రతీకగా, తిరుగుబాటుకి ఒక సంకేతంగా భావించాడు. 
జాషువాలో హేతువాద భావాలున్నప్పటికీ, దైవం ఉన్నాడనుకోవడం వల్ల మనిషి సత్ప్రవర్తనకు దారితీస్తుందని భావించి ఉంటాడని
‘‘ఉన్నావో లేవో యని
తన్ను కొనుటకన్న నభ్రతలమున నెందో
యున్నావనుకొనుటే నా
కన్నిటిశుభమని తలంతు నద్భుత చరితా!’’

 అని చెప్పిన జాషువా పద్యాన్ని గమనించాలన్నాను. జాషువా తెలంగాణాలోని ప్రాంతాల గురించి ప్రస్తావన చేయలేదా? దానికి కారణాలేమిటనేదీ పరిశోధన చేయాల్సిన అవసరాన్ని ఈ సమావేశంలో ఆచార్య బన్న అయిలయ్యగారి ప్రసంగం ద్వారా తెలుస్తుందన్నాను. జాషువా వారసత్వాన్ని కొనసాగిస్తున్న కవులను, వారి సాహిత్యాన్ని ఇలాంటి సదస్సుల్లో చర్చించినప్పుడే జాషువా ఆశయం నెరవేరుతుందని పేర్కొన్నాను.

కామెంట్‌లు లేవు: