నా కళ్ళముందింకా
భోపాల్ విషాద దృశ్యాలు కనుమరుగవ్వకముందే
విశాఖ విషాదం కళ్ళను బైర్లు కమ్మేస్తుంది
ఆడుకుంటూ ఆడుకుంటూ
అలాగే కోమాలోకి వెళ్ళిపోవడానికి
ఆ పసిపిల్లలు చేసిన ఘోరమేంటి?
బ్రతుకు భారాన్ని మోయలేక మోయలేక
వయోభారాన్ని మోస్తున్నా
ఎందుకు కూలిపోతున్నారో
కనీసం తెలుసుకోగలిగారా ఆ వృద్ధులు!
తమస్వేచ్ఛా గీతమెందుకు మూగబోతోందో
మరణశయ్యపై వాలిపోతున్న
మూగజీవులకైనా తెలుసా?
కథల వర్ణనల్లో ఊహలన్నీ
కళ్ళతో నిజంగా చూసి
నిర్జీవంగా నిలబడేరోజొస్తుందని
ఏనాడైనా కలగన్నానా!
అది విషం చిమ్ముతాదని తెలిసినా
నేనిక్కడే జీవించాల్సి వస్తుందని
నా పూరి గుడిసెకేమైనా తెలుసా?
అన్నీ తెలిసిన వాళ్లు
నన్నిప్పుడు పరామర్శిస్తుంటేనే
ఆ విషవాయువుకంటే విషం చిమ్ముతున్నట్లుంది!
-ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు,
సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్
7.5.2020
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి