డియర్ ప్రవీణ్!
నా 'బహుజన సాహిత్యం పుస్తకాన్ని చదువుతూ నువ్వు వ్యక్తీకరించిన అభిప్రాయానికి ఆనందిస్తున్నాను. నువ్వు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పరిశోకుడిగా గా చేరిన తర్వాత నీ ఆలోచనా పరిధిలో పరిణతి కనిపిస్తుంది. మన వాస్తవ అస్తిత్వాన్ని గుర్తిస్తున్నందుకుకూడా నాకు సంతోషంగా ఉంది. నేను నీకు ఎం.ఏ.,లో సాహిత్య విమర్శ పాఠాలు చెప్పేటప్పుడు నేను చెప్పే కొన్ని లోతైన భావనలను నువ్వు పట్టుకొని, వాటిని మరింత స్పష్టంగా అడిగి తెలుసుకొనే ప్రయత్నం చేసేవాడివి. సరే! హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నీకు పిహెచ్.డి సీటు రాకపోవడం, అది మంచో చెడో తర్వాత కాలమే నిర్ణయిస్తుంది. ఇప్పుడు మనం చెప్పలేమనుకుంటున్నాను.
ఇక, నేను ఆచార్య కొలకలూరి ఇనాక్ గారి అభిప్రాయాన్ని సాహిత్య సత్యంగా భావించి నా వాదనకు సరిపోయే విధంగా ఉటంకించానని అనుకుంటున్నాను.
ప్రవీణ్! నిజానికి నేడు సాహిత్యం రాజకీయ మయంగా ఉంది. నాకు తెలిసిన తెలుగు సాహిత్యం వరకూ గమనించినా, ఆ రాజకీయ ప్రాబల్యం స్పష్టంగానే గుర్తించానని అనిపిస్తోంది. మనం రాసిన సాహిత్యం పదిమందికి చేరడానికి సాహిత్యంలో రాజకీయం కావాలి. అందుకనే పది మందికి చేరిన సాహిత్యమంతా గొప్ప సాహిత్య అనుకోవడానికి కుదరదు-కానీ గొప్ప సాహిత్యం కూడా అందులో ఉంటుంది. నువ్వు అడిగిన ఆ అనుమానానికి ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ తో దాన్ని వివరించే ప్రయత్నం చేస్తాను. ప్రపంచ సాహిత్యం గా గుర్తింపబడుతున్న సాహిత్యంలో చాలా వరకూ ప్రపంచ సాహిత్యానికి ఉండవలసిన లక్షణాలు కనిపించట్లేదు. రచనను ప్రాథమికంగా మంచి రచనగా గుర్తించడానికి కొన్ని ప్రమాణాలు పెట్టుకున్నాం. కానీ ఆ ప్రమాణాలను పాటించేది చాలా కొద్దిమంది మాత్రమే. వాళ్లకి సాహిత్య రాజకీయాలతో పెద్దగా సంబంధం ఉండకపోవచ్చు. అందువల్ల ఆ సాహిత్యానికి రావలసినంత గుర్తింపు కూడా రాదు. గుర్తింపుకి మొదటి మెట్టు కొన్నిసార్లు పురస్కారాలు అవుతాయి. మరి కొన్నిసార్లు పాఠ్యాంశాలు అవుతాయి. ఇంకొన్నిసార్లు చర్చోపచర్చలు, వాగ్వివాదాలు..వాటి ద్వారా దానిలో గొప్ప విలువల్ని ప్రతిపాదించే ప్రయత్నం చేస్తుంటారు. వీటి వెనుక భావజాలం బలంగా పనిచేస్తుంది. ఉదాహరణకి మన తెలుగులో లేదా సంస్కృతంలో మహాభారతం అంత ప్రాచుర్యం పొందడానికి దానిలో ఉన్న భావజాలమే ప్రధానమైనకారణం. అది చాతుర్వర్ణ వ్యవస్థను బలంగా కొనసాగించేలా చేస్తుంది. ఆధిపత్యాన్ని అంగీకరిస్తుంది. సమానత్వాన్ని వ్యతిరేకిస్తుంది. సమాజంలో చాలా కొద్ది మంది తప్ప అత్యధికులు ఆధిపత్యాన్నే కోరుకుంటారు. ఆ కొద్ది మందిలో కూడా అవకాశం వస్తే వాళ్లు కూడా ఆధిపత్యాన్నే కోరుకుంటారు. నిచ్చెన మెట్ల వ్యవస్థ వంటి సామాజిక వ్యవస్థలో తాము నలిగిపోతున్నా, తాము ఇంకొకర్ని నలిగిపోయేలా చేస్తున్నామనఘ భావనే వాళ్ళకి అత్యంత సంతృప్తిని కలిగిస్తుంది.
దీనిలో భాగంగానే ఆచార్య కొలకలూరి ఇనాక్ గారి అభిప్రాయాన్ని చూడాలి. ఆయన చాలా జాగ్రత్తగా ఒక పుస్తకం పేరు లేదా కొంత మంది కవుల పేర్లు చెప్పకుండా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అందుకే నిలిచి ఉండడం కంటే నిలిపి ఉంచడం అనేదాన్ని మనం జాగ్రత్తగా గమనించాలన్నారు. సాహిత్యంలో విశ్వజనీనత, సార్వజనీనత అనే భావనలను ఆయన వ్యతిరేకిస్తారు. అలాగే సార్వకాలికత కూడా ఉండదంటారు. మారుతున్న కాలమాన పరిస్థితులను బట్టి మన అభిప్రాయాల్లో మార్పులు రావాలి. స్థల కాల పరిస్థితులను బట్టి సాహిత్యం పుట్టుకొని రావాలి. అప్పుడే అది సజీవ సాహిత్యం అవుతుంది. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం ఉంటుంది. అలా కాకుండా కొన్ని వర్గాలకు మాత్రమే ప్రాతినిధ్యం వహించిన సాహిత్యాన్ని విశ్వ సాహిత్యం గా చెప్తే దాన్ని ఎలా అంగీకరించాలి? అయినా కానీ దాన్ని అంగీకరించటం చేయడమే నిలిపి ఉంచడం. దాన్ని ఆయన వ్యతిరేకిస్తారు. అలా వ్యతిరేకించక పోతే కింది వర్గాల లేదా నిమ్న వర్గాలు అనుకుంటున్న లేదా అని పిలుస్తున్న వారి భావనలు సాహిత్యంలో ప్రవేశించలేవు. సార్వకాలికత, విశ్వజనీనతలకంటే నిబద్ధత, నిమగ్నత అత్యంత ముఖ్యమని ఆయన ప్రతిపాదించారు. అంటే ఆచరించలేని మాటలు సాహిత్యం గా చలామణి అవుతూ సాహిత్యం గుర్తింపు పొందినా అది వ్యర్థమని ఆయన భావన. అలా నిమగ్నత, నిబద్ధత ఉన్నటువంటి సాహిత్యాన్ని నిలబెట్టడానికి ప్రయత్నించరని ఆయన విమర్శ. కొంత మంది గొప్ప సాహిత్యంగా ప్రచారం చేసే టప్పుడు దాన్నే మరికొంతమంది ఉన్నతవిలువలుగల సాహిత్యంగా అనుసరిస్తున్నారనే విమర్శ కూడా ఆ భావనలో ఉంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి