"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

20 డిసెంబర్, 2019

తెలంగాణ క్రైస్తవ సమాజ బీజం ‘అతడు అబ్రహాం’

 తెలంగాణ క్రైస్తవ సమాజ బీజం ‘అతడు అబ్రహాం’

ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు



తెలంగాణా ప్రాంతం నుండి ఇంతవరకు వచ్చిన నవలల్లో అత్యధిక శాతం తెలంగాణ సాయుధపోరాటం, భూస్వాముల దౌర్జన్యాలు, పటేల్ పట్వారీ వ్యవస్థలోని భిన్నపార్శ్వాలు, నిజాం పాలనలో రజాకార్ల దుర్మార్గాలు చిత్రితమయ్యాయి. తెలంగాణ దళిత నవలల్లోనూ ఆ విషయాలతో విడివడని జీవితాల్ని పరిచయం చేస్తూనే, కులం, పేదరికం, భూస్వామ్యవ్యవస్థ, మతాల వల్ల నలిగిపోయిన దళితుల జీవితాల్ని, వారి సంస్కృతుల విధ్వంసాన్నీ, వారి అస్తిత్వాల్ని చిత్రించారు. కడియం డేవిడ్, డా.గడ్డం మోహన్ రావు లు ఇద్దరూ కలిసి రాసిన నవల 'అతడు అబ్రహాం’. ఒకరు చరిత్ర రాసినా మరొకరు దాన్ని సృజనీకరించడంలో చూపిన నైపుణ్యం వల్ల దీన్ని ఇద్దరు రాశారనే భావన కనిపించదు. ఒక చేతిపైనే రచన కొనసాగినట్లుంది.

ఈ నవలలో తెలంగాణా ప్రాంతంలో అభివృద్ధి చెందిన రెండు ప్రధాన పరిణామాల్ని చిత్రించారు. ఒకటి హిందూ మతం ఉన్నా, క్రైస్తవంలోకి దళితులు రావడం, దాన్ని వ్యాప్తి చేయడం. రెండవది తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయం అభివృద్ధి పరిణామాల్ని చిత్రించడం. దళితుల్లో పేదరికానికి గల కారణాల్ని విశ్లేషించడంకూడా ఈ నవల సాధించిన ఒక విజయం. కులాన్ని, దాని వికృత స్వభావాన్ని చిత్రిస్తూనే, దాన్ని అధిగమించి ఆత్మాభిమానంతో బతకడానికి కృషీ, పట్టుదల, ఆత్మవిశ్వాసం కలిగించడంలో క్రైస్తవం ఇచ్చిన ధైర్యాన్ని ఈ నవల చర్చించింది.


తెలుగు సాహిత్యంలో దళిత సాహిత్య ధోరణి వల్ల Personel Narratives కి సాహిత్యంలో అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. తెలుగు నవలా వికాసంలో ఆత్మకథాత్మక రచనలు విరివిగా రావడం ఒక గొప్ప పరిణామం. బోయ జంగయ్య (జగడం), జి. కళ్యాణరావు (అంటరానివసంతం), స్పార్టకస్ (ఖాకీబతుకులు), వేముల ఎల్లయ్య (కక్క, సిద్ధి), భూతం ముత్యాలు (సూర), జాజుల గౌరి (వొయినం), వై.బి.సత్యనారాయణ (మా నాయన బాలయ్య), దుగ్గనపల్లి ఎజ్రాశాస్త్రి (మా ఎర్ర ఓబన్నపల్లె ), డా.గడ్డం మోహనరావు (కొంగవాలు కత్తి) మొదలైనవన్నీ దళిత వాస్తవికతను ఆధారం చేసుకున్న ఆత్మకథాత్మక నవలా లక్షణాలున్న రచనలు. తెలుగు నవలా సాహిత్యాన్ని గొప్పమలుపు తిప్పడంలో ఈ నవలల ప్రభావం సామాన్యమైందికాదు. వీటికి ‘అతడు అబ్రహాం' నవల కూడా తోడవుతుందని నమ్ముతున్నాను.


ఈ నవల చదువుతుంటే బైబిల్లోని కొన్ని సన్నివేశాలు జ్ఞప్తికొస్తున్నాయి. బైబిల్లో కొన్ని వంశాల వారు వలసలు పోయి, అక్కడ వారి వంశాల్ని అభివృద్ధి చేసుకుంటూనే, నీతివంతమైన జీవనంతో భగవంతుణ్ణి ఆరాధించిన సంఘటనలెన్నో గుర్తుకొస్తుంటాయి. ఒక సామాన్యుడు తన తెలివితేటలతో కులమతాలకు అతీతంగా ఆత్మగౌరవంతో బతకడం ఎలాగో ఈ నవల చదివితే అబ్రహాం జీవితం వల్ల మనకు తెలుస్తుంది. దైద నుండి వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన వాళ్లంతా మరల కలిసినప్పుడు వాళ్ళలో కలిగిన అనుభూతి

తన్మయత్వాన్ని గొప్పగా వర్ణించారు. ఆ విధంగా తమ మూలాల్ని అన్వేషిస్తూ సాగిన ఈ నవల మనల్ని ప్రేమానుబంధాల్ని అన్వేషించాలని ప్రబోధిస్తుంది. ఆ అనుబంధాల వల్ల తాత్కాలికంగా తామెక్కడున్నా తమవాళ్ళను కలిసినప్పుడల్లా ఒక అనిర్వచనీయమైన అనుబంధం పల్లవిస్తుంది. ఒక్కొక్క వంశాన్నీ జాగ్రత్తగా ఇలా అన్వేషించుకుంటూ పోతే మానవులంతా ఒకే వంశానికి చెందినవాళ్ళవుతారనీ, వాళ్ళు కలిసినప్పుడు రాగద్వేషాల్లో ద్వేషం పోయి మనమంతా ఒక్కటనే భావన నెలకొంటుందనే సూచనను ఈ నవల మనకి అందిస్తుంది.


అబ్రహాం గురించి చెప్తూ"పంటమార్పిడి అంటే ఏమిటో తెలియనప్పుడే ఆయన పంటమార్పిడి పద్ధతిని అనుసరించిండు” అనీ, అంతరపంటలను వేసి వ్యవసాయంలో నూతన పద్ధతుల్ని ప్రవేశపెట్టాడు. వ్యవసాయంలో పండించేవాటిని బట్టే పశువుల్ని, వాటికి మేతనీ సృష్టించవచ్చునని తెలియజెప్పాడు. వ్యవసాయంలో వాణిజ్యపంటల్ని కూడా పండిస్తూ లాభాలు గడించవచ్చని నిరూపించాడు. ఈ విషయాన్ని నవలా రచయితలు సృజనీకరించడంలో ఆధిపత్య ధోరణిలో కాకుండా, స్వీయానుభవ జీవనమే తనకా వ్యవసాయాన్ని చేసేలా చేసిందని, దాన్నేదో ఇక్కడివాళ్లకు నేర్పడానికి ఉద్దేశించిందనే ధోరణి ప్రదర్శించలేదు. కానీ, కష్టపడ్డం, ఆ కష్టపడ్డంలో కూడా స్థానిక వనరుల్ని ఎలా ఉపయోగించుకుంటూ కష్టపడాలో అబ్రహాంని చూసి చాలా మంది నేర్చుకున్నారు.


మామిడాల గ్రామదేశ్ ముఖ్ నారాయణరెడ్డి దొర, చుట్టుప్రక్కలున్న పన్నెండు గ్రామాలకు కూడా దేశ్ ముఖ్ . అతడి ఆకారాన్ని చూసే ఎంతో మంది భయపడుతుంటారట. “అబ్రామటగారా...! పంటలు మంచిగ పండిస్తుండట... దొరరమ్మంటుండని తోల్కరా...పో” అని తన జీతగాణ్ణి పంపించడం వెనుక, ఆ వ్యవసాయంలో మెళకువల్ని తెలుసుకోవాలనేదే ఆ దొర ప్రధాన ఆకాంక్ష. దీని తర్వాత ఎక్కడా అబ్రహాంని చూసి వ్యవసాయం నేర్చుకున్నారని వాచ్యం చెయ్యరు రచయితలు. దొరలాంటివాడే అబ్రహాం దగ్గర వ్యవసాయం నేర్చుకున్నాడంటే ఆ వ్యవసాయం చేయడంలో నైపుణ్యాన్ని మీరే అంచనావేసుకోమని సూచిస్తూ వదిలేశారు రచయితలు. ఇలా వదిలేయడంలో సృజనాత్మక రచనకు ఆలోచనను, భావుకతను కలిగిస్తుంది. అబ్రహాం తెలివితేటలు దొరకు నచ్చాయి. కనుకనే అతడితో ఒకవిధంగా స్నేహాన్ని కొనసాగించాడు అబ్రహాం. దొరలాంటి వాడు తనకు అండగా ఉన్నా, తన సౌజన్యాన్నేనాడూ వదులుకోలేదు. అన్ని మతాల వాళ్ళతోనూ కలిసిమెలిసి ఉంటూనే తన క్రైస్తవమత ధార్మికతను విడనాడలేదు. తెలంగాణాలో వ్యాపించిన క్రైస్తవజీవన నేపథ్యం తెలుసుకోవడానికి ఈ నవల తోడ్పడుతుందనగలుగుతున్నాను.


మరొక వైపు దున్న ఇద్దాసు పాత్రను, ఆయన నమ్ముకున్న హిందూ మత బోధనల్ని ప్రస్తావించడం కూడా సమకాలీన సమాజంలో దళితుల్లో హిందూమతం పట్ల కూడా ఉన్న అనుబంధాన్ని వివరించినట్లయ్యింది. చరిత్రలో దున్న ఇద్దాసు (క్రీ.శ. 1811- 1919 ) గొప్ప తాత్త్వికుడు. ఈయనకు మహాయోగి అనే పేరుంది. నల్లగొండ పరిసరప్రాంతాల్లో ఈయన కీర్తనలు ఎంతో వ్యాప్తిచెందాయి. తెలంగాణ చరిత్ర, సాహిత్యం పునర్నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో దున్న ఇద్దాసు లాంటి మహాతాత్త్వికుల్ని బయటకు తీసుకొస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన ప్రపంచ తెలుసు మహాసభల్లో (2017) మహాయోగి దున్నఇద్దాసు పేరుతో మాసబ్ ట్యాంక్ దాటిన తర్వాత సరోజినిదేవి కంటి ఆసుపత్రి దగ్గర జాతీయరహదారిపై స్వాగతతోరణాన్ని కట్టారు. నిజానికి ఆంధ్ర ప్రాంతంలో పోతులూరి వీరబ్రహ్మం తత్త్వవేత్తగా ప్రసిద్ధి చెందాడు. దున్న ఇద్దాసుకు కూడా అటువంటి వ్యాప్తి రావలసింది. రాలేక పోవడానికి కుల, ప్రాంతీయ ప్రభావాలున్నాయని గతంలో ఒక వ్యాసంలో కూడా రాశాను. ఈ సాంస్కృతిక వారసత్వం అబ్రహాం కుటుంబానికి ఉందని చెప్పకుండానే ఒక పాత్ర ద్వారా చెప్పించారు. రచయితలు.


సాధారణంగా ఏ ప్రాంతంలోనైనా నిరక్షరాస్యత ప్రబలంగా ఉన్నప్పుడు, అక్కడ మూఢవిశ్వాసాలు, భక్తి విస్తృతంగా ఉంటుంది. సస్యశ్యామలం కాని ప్రాంతాలు, ఆ ప్రాంతాల్లోని భూముల్ని సాగుచేసే శక్తిలేక, ఉన్నవాటిని వదిలి వలసలు పోవడం లేదా భూస్వాముల దగ్గర పనివాళ్ళుగా, బానిసలుగా జీవించడం అలవాటైపోతుంది. దాని వల్ల ఆధిపత్యం పెరిగిపోయి, సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమైపోతుంది. ఆ కొద్దిమందే ప్రజల్ని మూఢత్వంలో మరింతగా ముంచేయడానికీ, దాని ద్వారానే సంపదను సృష్టించడానికి ప్రయత్నిస్తుంటారు. శాస్త్రీయతకు అవకాశం కలగనివ్వరు. విద్యాసంస్థల్ని ఏర్పాటు చేయకుండా, నిరక్షరాస్యతను పారద్రోలకుండా జ్ఞానాన్ని సంపద గల కొద్దిమందికే అందుబాటులో పెట్టుకుంటారు. అటువంటి స్థితిలో క్రైస్తవ సంస్థలు మొదట ప్రేమను అందిస్తూ, నిరక్షరాస్యతను పోగొట్టేందుకు కృషిచేస్తూ, క్రమేపీ తమ మతాన్ని వ్యాపింపచేశాయి. హిందూ మతం దూరం చేసిన వాళ్ళంతా ముస్లిములు, క్రైస్తవులుగా మారిపోవడానికి కారణమైంది. ఒకసారి ఆ మతాల్లోకి వచ్చిన తర్వాత, ఆ 'రుచి' తెలిసిన తర్వాత, ఆ మతాలు తమకిచ్చిన ఆత్మవిశ్వాసం, సామాజిక గౌరవం తన తరువాత తరాల్ని కూడా ప్రభావితం చేసేలా చేస్తుంది. అదే తెలంగాణ ప్రాంతంలో కూడా జరిగింది. అయితే,కోస్తాలో అత్యంత వేగంగా, విస్తృతంగా వ్యాపించిన క్రైస్తవం, తెలంగాణ ఇప్పుడిప్పుడే బాగా వ్యాపించడానికి అనేక చారిత్రక కారణాలున్నాయి.


వీటి మూలాలు ఈ నవలలో కనిపిస్తున్నాయి.


అబ్రహాం వంశం వివిధ ప్రాంతాలకు విస్తరించి, అభివృద్ధి చెందింది. కానీ, ఆ అభివృద్ధిలో భౌగోళిక ప్రభావం ఎంతగానో పనిచేస్తుందని సూచించడం గమనించాలి. విజయవాడలో తన వంశానికే చెందిన వాళ్ళను వివాహం చేసుకున్న దార్ల వారు రాజకీయంగా రాష్ట్ర స్థాయి నాయకత్వం వైపు దూసుకుపోయారని సూచించారు. మరొకవైపు ఎన్నో తెలివి తేటలున్నప్పటికీ తెలంగాణాలో అబ్రహాంకి సరైన వైద్యం అందలేదు. ఇక్కడ ఒకే కులానికి చెందినప్పటికీ భిన్న ప్రాంతాలలో భిన్నమైన చైతన్యం రూపొందడానికి రాజకీయ, ఆర్ధిక, మత నేపథ్యం గుర్తించాల్సి ఉంటుంది.


తెలంగాణాలో ముస్లిము పాలకులు బలవంతంగా మత మార్పిడులు చేసినట్లు మన చరిత్ర స్పష్టంగా చెప్తోంది. ముస్లిములకు, ముస్లిమేతరులకు పన్నుల విధానంలో కూడా వ్యత్యాసాన్ని చూపించేవారని చరిత్ర వివరిస్తోంది. అందువల్ల తాత్కాలికంగా తెలంగాణాలో దళితులు కూడా ముస్లిములుగా మారినా, ఆ జీవితాన్ని స్వంత జీవితంగా మార్చుకోలేకపోయారు. తరతరాలుగా విగ్రహారాధనకు ఆలవాటు పడిన వాళ్ళు ముస్లిములుగా జీవిస్తున్నా, హిందూ మత సంప్రదాయాల్ని పాటించేవాళ్ళెంతోమంది కనిపిస్తారు. దర్గాల వ్యవస్థ, సూఫీయిజంలో హిందూజీవన శైలి ఎంతగానో కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో క్రైస్తవం ఎంతో తెలివిగా స్థానిక దేశీయమైన జీవన విధానికి అనుగుణమైన సరళీకృత విధానాలతో తన మతాన్ని విస్తరించుకుంది. ఈ పరిణామాలన్నీ అబ్రహాం పాత్ర, వారి కుటుంబాలరూపంలో కనిపిస్తాయి. తెలంగాణాలో సుమారు నూరు సంవత్సరాల సామాజిక, ఆర్థిక పరిస్థితుల్ని ‘అతడు అబ్రహాం' నవల చిత్రీకరించింది. అది దళితుల్ని కేంద్రీకరిస్తూ కొనసాగడం ఈ నవల ప్రత్యేకత. వివిధ కుటుంబాల మధ్య గల ప్రేమానుబంధాల్ని, వాటిని మరలా కలుపుకోవాలనే ఆంక్షల ద్వారా అన్ని మతాల్ని కలుపుకున్నట్లే ఉన్నా, క్రైస్తవమత ఔన్నత్యాన్ని విశదీకరించడంలో రచయితలు ఎంతో నైపుణ్యాన్ని ప్రదర్శించారు.


ఈ నవల ఫ్రూఫ్ ప్రతిని ముందుమాట రాసేటప్పుడు చూడ్డం వల్ల భాష పట్ల రచయితలు తీసుకున్న జాగ్రత్తలు చాలా చోట్ల గమనించగలిగాను. మీ చేతిలో ఈ నవల ఈ విధంగా రూపొందడంలో ప్రతి వాక్యానికీ, ప్రతి పేరాకీ, ప్రతి సన్నివేశానికీ తగిలిన ఉలిదెబ్బలెన్నో ఉన్నాయి. అవి శిల్పం రూపొందడానికి ఎంతగానో సహకరించాయి. ఇద్దరు రచయితల నిరంతర చర్చోపచర్చలున్నాయనిపిస్తుంది. ఒకరు తాతముత్తాతల నుండి తెలంగాణాకే చెందిన రచయిత జీవితానుభవం ఉంటే, మరొకరికి ఆంధ్ర ప్రాంతం నుండి వాళ్ళ తాత ముత్తాతలు వలస వచ్చి తెలంగాణలో స్థిరపడిన జీవితం కనిపిస్తుంది. రెండింటికీ అనుసంధానమైన వాస్తవికజీవితచిత్రణ దీనిలో ప్రదర్శితమైంది.


అబ్రహాంకు తల్లి శాశ్వతంగా దూరమైందనే సన్నివేశాన్ని “సువార్తలతో వీధులన్నీ కలియ తిరుగుతున్నది పీరమ్మ. పిచ్చిదానిలా వున్నది ఆమె వాలకం. ఒక పిచ్చికుక్క వెనుకే వచ్చింది. కాలందుకున్నది. ఆకు పసర్లు, చెట్లమందులు, పత్యం సరిగాలేదు. అప్పటికి అబ్రహాంకు ఆరేండ్లు. మరియమ్మకు తొమ్మిదేండ్లు. తల్లిలేని ఒంటరిపక్షులయ్యిండ్రు అక్కాతమ్ముళ్ళు” అని వర్ణించారు రచయితలు. ఇలాంటి ఔచిత్యభరితమైన వర్ణనలు అనేకం కనిపిస్తాయి. చెప్పాల్సిన విషయాన్ని అందంగా, సుకుమారంగా, స్పష్టంగా చెప్పాలంటే రచయిత ఎంతో సంస్కారం కలిగిన వాడై ఉండాలి. ఆ సంస్కారం ఇలాంటి సన్నివేశవర్ణనల్లో కనిపిస్తుంది.


మొత్తం మీద, క్రైస్తవ మత ప్రభావం తెలంగాణా ప్రాంతంలో తెచ్చిన సామాజిక చైతన్యాన్ని, మానవుల్లో కలిగించిన ప్రేమతత్త్వాన్నీ మనముందుంచే ‘అతడు అబ్రహాం' నవలను రాసిన రచయితలు ఇద్దర్నీ అభినందిస్తున్నాను. ఒక మతం మరొక మతాన్ని ద్వేషించాలని గానీ, ఆ మనుషుల్ని దూరంగా పెట్టాలని గానీ బోధించదు. ఒక వేళ అలా బోధిస్తే అలాంటి మతం విశ్వశాంతిని చేకూర్చలేదు. మానవ కళ్యాణాన్ని ఆకాంక్షించలేదు. అబ్రహాం తన ఆధునిక పద్ధతులతో చేసే వ్యవసాయంలో వాణిజ్యపంటల్ని పండిస్తూ కూడా లాభాలు పొందగలిగే అవకాశం ఉన్నా, ఒక క్రైస్తవ ఉజ్జీవ సభలో విన్న సందేశం వ్యవసాయంలో పొగాకును పండించడం కూడా ఆపేసేలా చేసిందంటే దాని ప్రభావం ఎలాంటిదో తెలుస్తుంది.

ప్రొఫెసర్, తెలుగుశాఖ, డిప్యూటి డీన్, స్టూడెంట్స్ వెల్ఫేర్, సెంట్రల్ యూనివర్సిటి, హైదరాబాదు

25.12. 2018

కామెంట్‌లు లేవు: