చికటితో స్నేహమే అంధుల జీవితం. ఆ చీకటిలో కాసింత వెలుగు ప్రసరిస్తే అంతకన్నా ఆనందం లేదు. ఆ వెలుగు కంటి చూపే కానక్కర్లేదు. కాలు కదిపి ముందడుగు వేయించే మాటే మహామంత్ర మవుతుంది. వెలుగు మాత్రమే దారి చూపదు. కంటిచూపు కరువైన పరిస్థితిలో ఎదురుగా ఎవరు ఉన్నారో, చేతిలో ఉన్న కరెన్సీనోటు విలువెంతో, ముందున్న పుస్తకంలో ఏం రాసుందో తెలిపే కంఠస్వరా నికన్నా మంచి నేస్తం మరొకటి ఉండదు. ఈ సత్యాన్ని అర్థం చేసుకున్న ఇజై లీ కంప్యూటర్ సైంటిస్టు అమ్నాన్ షాషువా అంధుల ఇబ్బందుల్ని పరిష్కరించే ఒక కొత్త కళ్ళజోడును కనుగొన్నారు. ఈ కళ్ళజోడును 'ఆర్కామ్ మై ఐ 2' అనే పేరుతో పిలుస్తున్నారు. కృత్రిమ మేధస్సు సహకారంతో ఈ కళ్ళ జోడు మాట్లాడుతుంది. ఎదురుగా ఉన్న వ్యక్తి ఎవరో గుర్తుపట్టి చెబుతుంది. అలాగే కరెన్సీనోటు విలువెంతో చెబుతుంది. పుస్తకాల్ని చదివి వినిపిస్తుంది. ఈ కళ్ళజోడు కేవలం అంధులకు మాత్రమే కాకుండా, చదవడంలో ఇబ్బందులు ఎదుర్కొనే డిస్లెక్సియా వ్యాధిపీడితులకు కూడా ఉపయుక్తంగా ఉంటుంది. వచ్చే ఏడాది ఈ ఆర్కామ్ మై ఐ 2 కళ్ళజోడును మరింత ఆధునికీకరించి, దాన్ని ఉపయోగించే వ్యక్తికి అవసరమైన సమాచారాన్ని వినిపించేలా దీన్ని సాంకేతికంగా అభివృద్ధి చేయనున్నారు. వార్తాపత్రికల్లో కేవలం వార్తల శీర్షికల్ని మాత్రమే చదవడం, హోటళ్లలోని మెనూకార్డులో కేవలం స్టార్టర్ల జాబితాను మాత్రమే చదివి వినిపించేలా ఈ కళ్ళజోడును అభివృద్ధి చేస్తారు. ఇప్పుడు ఈ కళ్ళజోడు 48 దేశాల మార్కెట్ లోకి అందు బాటులోకి వచ్చింది. ఇజ్రాయిల్ దేశంలో జరిగే ఎన్నికల్లో అంధులు ఈ కళ్ళ జోడును ఉపయో గించుకుని ఓటు వేస్తున్నారు.
( మనం దినపత్రిక, 8 డిసెంబరు 2019 సౌజన్యంతో)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి