ఎవరికోసమో!
గమ్యమేవిటో కళ్లముందుముందే కనిపిస్తున్నా
కాళ్లకు చెప్పనంటున్న సముద్రం!
ఎన్ని కొండల్ని
గుండెల్లో దాచుకుందీ సముద్రం!
ఎన్నిపగడాల్ని పంచిందేసముద్రం
ఎన్ని శంఖాన్ని పూరించిందేసముద్రం
ఎన్నెన్ని..నేడేవిటిలా? ఎన్నిసార్లో ఏవేవో చెప్పాలనుకొని
ఎన్నిసార్లుతీరందాకావచ్చిందీసముద్రం!
సముద్రం నిండా
ఏవేవో చెప్పుకోలేని సమస్యలున్నాయేమో!
ఎవరికి చెప్పుకోవాలో తెలియక
ఎన్నిసార్లో అలా అలా వెనుతిరుగుతున్నదేమో!
ఎందుకిలా
ఘోషిస్తోంది సముద్రం?
ఎందుకిలా ఎగసిపడుతోందీ సముద్రం?
సముద్రం
కెరటవుయ్యేదిసంతోషంతోనా?దుఃఖంతోనా?
తన చెలికానితో సరసాలో...సయ్యాటలో..ఆడుతుందేమో!
ఒక్కొక్కసారి
సముద్రమెంత సుందరంగా ఉంటుంది
ఒక్కొక్కసారి సముద్రమెంత సంగీతమవుతుంది
ఆసముద్రం కూడా నాలాగే వుందా?
నేనే ఆసముద్రంలాఉన్నానా?
ఏమో నేనే ఎవరికోసమో తీరానికొచ్చీ
నిరాశతో తిరిగిపోతున్నానేమో!
ఏమో నేనే తీరానికొచ్చినప్పుడల్లా ఏదో నేనే
తీసుకుపోతున్నానేమో!
ఏమో నేనే
తీరానికొచ్చినప్పుడల్లా ఏదో నేనే తీసుకొస్తున్నానేమో!
అది సంతోషమో...అది ఆవేదనో..అదిమరేమో...
అది
అవ్యక్తానుభూతుల సమ్మేళనమో!
అది అనంతకోటి ఆలోచనల సంఘర్షణమో!
ఏమో..నాకూ సముద్రానికీ
సముద్రానికీ నాకూ ఏదో ఎడతెగని అనుబంధమో!!
- వి.ఆర్.దార్ల
Mon, 09 April 2018 ఉpaper,
prabhanews.com//c/27731004
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి