హెచ్ సియులో సివిల్స్ శిక్షణా తరగతులు ప్రారంభం. (26.9.2018)
తమకు తెలిసిన భాషలో సివిల్ సర్వీసెస్ లో ఇంటర్వ్యూ చేసే అవకాశం ఉందనీ, దీన్ని సద్వినియోగం చేసుకొని ఆసక్తి గల అన్ని వర్గాల వారూ విజయం సాధించవచ్చునని మాజీ పోలీసు ఇన్స్పెక్టర్ జనరల్ ఎస్. ఉమాపతి అన్నారు. బుధవారం సాయంత్రం హెచ్ సియులో యూజిసి ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ, ఓబిసి, మైనారిటీ విద్యార్థులకు పోటీ పరీక్షల ప్రత్యేక శిక్షణా తరగతులను ప్రారంభ సమావేశానికి ఉమాపతి ముఖ్య అతిథిగా విచ్చేసి, మాట్లాడారు. సివిల్స్ కు సిద్ధమయ్యే ఔత్సాహికులకు సిలబస్, పరీక్షలు రాసే విధానం, ఇంటర్వ్యూ కి సిద్ధమయ్యేటప్పుడు పాటించాల్సిన సూచనలను వివరించారు. తన ఉద్యోగానుభవాలతో అనేక సూచనలు చేశారు
సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రొ. వైస్ ఛాన్సలర్ ఆచార్య పి.ప్రకాశబాబు మాట్లాడుతూ విశ్వవిద్యాలయం కల్పిస్తున్న అనేక అవకాశాల్లో పోటీ పరీక్షలకు ప్రత్యేక తరగతులు నిర్వహించడం ఒకటనీ, ఆసక్తి ఉన్న విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పారు. డిప్యూటీ డీన్, స్టూడెంట్స్ వెల్ఫేర్ ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రోజువారీ తరగతులకు, పోటీ పరీక్షలకు వేర్వేరు బోధనా పద్ధతుల్లో పాఠ్యాంశాల్ని చెప్పాల్సి ఉంటుందని అందువలన పోటీ పరీక్షలకు సంబంధించి శిక్షణ తీసుకోవడం అత్యంత అవసరమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమానికి కో ఆర్డినేటర్ డాక్టర్ బి కృష్ణయ్య మాట్లాడుతూ ఈ కార్యక్రమం లక్ష్యాలను, ఆశయాలను వివరించారు. అధికారికంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ఈ శిక్షణా తరగతులు ఉద్దేశించి నప్పటికీ, అనధికారికంగా ఆసక్తి కలిగిన అందరూ హాజరుకావచ్చునని ఆయన వివరించారు. కార్యక్రమంలో దీక్ష ఐఏఎస్ స్టడీ సర్కిల్ కు చెందిన రామారావు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి