ఎదురుచూస్తాను!
వారమంతా ఎదురుచూస్తాను
ఈసారైనా నాలుగు చినుకులుపడతాయేమో
ఈసారైనా మనసేమైనా తడుస్తుందేమో...
వారమంతా ఎదురుచూస్తాను
నాలుగు చినుకులకోసం!
మళ్ళీ వాళ్ళేరూపాలుమార్చుకుంటూ
మళ్ళీ మళ్ళీ వాళ్ళే!పేర్చిన అక్షరాల్లా
గోడలకి తగిలించిన బొమ్మల్లా
కదలని గుట్టల్లామళ్ళీ అవే వాదాలు
మళ్ళీ అవే వేదాలుమళ్ళీ అవే జిడ్డు ముఖాలు
మళ్ళీ అవే కమురుకొట్టే జులపాలు
మళ్ళీ అవే ఒక్కపిట్టవాలని రాళ్ళగుట్టలు
మళ్ళీ అవే శిల్పమవ్వలేని శిలలు!
వారమంతా ఎదురుచూస్తాను
ఒక్కసారైనా ఒక్కరెవరైనా
వాళ్ళువాళ్ళుగా వస్తారా?
రెండుచేతులూ చాచి నిలబడిన
గుండెలమీద వాలిపోవడానికి
తనను మాత్రమే తానుగా తెచ్చుకునే
పసిపాపలా ఒక్కరైనా వాలతారా!
వారమంతా ఎదురుచూస్తాను
ఏమూలనైనా కాస్త అలజడైనా
కలుగుతుందా
పొడిబారుతున్న కళ్ళతో
తడికోరుతున్న యెదను పరిచి
వారమంతా ఎదురుచూస్తాను
నిరీక్షణను ఊరడిస్తూ
పొరపాటునో గ్రహపాటునో
ఒక్కోనీటితుంపర!
మళ్ళీవారమే కాదు
జీవితమంతా ఎదురుచూస్తాను
ఒళ్ళంతా తడిసే
కళ్ళంతా తుడిసే కవిత్వం కోసం
జీవితమే కవిత్వమై
తారసపడేదాకా ఎదురుచూస్తాను!
-దార్ల వెంకటేశ్వరరావు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి