( ‘మనం’ 25 ఆగస్టు 2018 సౌజన్యంతో)
అంతరంగనృత్యం!
తెరతీసి ముఖాన్ని చూసీ చూడనట్లు
తీసినా తియ్యకున్నా చూడాలన్నట్లు
నీఅంతరార్థాన్ని పట్టుకోవాలనీ
నీ అంతరంగాని ముట్టుకోవాలనీ
నీఆనందాన్ని పంచుకోవాలనీ
పరుగుపరుగునొస్తాను
పట్టుపరికిణిలా మెత్తగా తాకగానే
తన్మయమవుతూ పట్టేసుకోగలిగానన్నంతనే
గట్టుకిచేరినట్టే చేరీ చేరనట్లే
గుట్టును విప్పీ విప్పనట్లే
అర్థమైయ్యీ
కానట్లే
కోపాన్ని కంటిలోనూ
ప్రేమని పెదవిమీదా మొలకల పులకరింతలై
మది వలపు తలుపులు వెతుకమంటావు!
బాధనో, వేదనో, మోదాన్నో
పట్టుకొన్నట్లు
పదాల్నో, పెదాల్నో, నదాల్నో
పట్టుకొనివేలాడాలని మళ్ళీ...!
నీ పాదాల్ని
నాయెదవాకిట్లో
చిందులేయించాలని మళ్ళీ మళ్ళీ నీవెంటే!
నీతో నేనున్నా నాతో నువ్వున్నా
కళ్ళవంతెనల్లో కల్లోలాల పాలపుంతల్లో
నువ్వూనేనయ్యే నేనూనువ్వైయ్యే
అవ్యక్తానురూపాలింగనమై అనుభూతుల తన్మయ
కాంతిపుంజమైమెరిసిపోతుంటావు!
నువ్వు నాకెలా తెలుస్తావో
నువ్వు నాకేదొకటి తేలుస్తావో
తలుచుకుంటూ తలచుకుంటా తన్నుకుంటుంటే
నువ్వొక్కొక్క చోట దయతో జారవిడిచే
ఓ కొత్తశబ్దమై తగలగానే
చిక్కావులే చేతికనుకుంటూ
అకారాదిగానో
మకారాదిగానో
వికారంగానో
నిఘా వేసి మరీ వెతుకుతా
నిన్ను గుర్తుపట్టాలనుకుంటానా
నీబడిగుండెల్లోనే ఉంటానంటావు!
నీ యెదవాకిట్లోనే నిలిచానంటావు!
-దార్ల వెంకటేశ్వరరావు
21.8.2018
(కవిత్వాన్ని అర్థం చేసుకోవడం, అదీ ఆధునిక
కవిత్వాన్ని అవగాహన చేసుకోవడంలో పాఠకుడు పొందే అనుభూతి!)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి