నువ్వూ...నేనూ...'మనం'
మనం...మళ్ళీ ఆ మనం...
ఆమనిగా మనమంతా
కలిసినప్పుడు
అకస్మాత్తుగా కురిసిన చిరుజల్లుల్లో తడిసినట్లయ్యింది!
వాళ్ళెవరో ఫోజులు రాయుళ్ళు పోతున్నప్పుడు
మనం వదిలిన వ్యంగ్య బాణాల దెబ్బలతో
మూతులు ముడుచుకున్న వాళ్ళంతామనముందు నిలబడుతున్నప్పుడు
మూకుమ్మడిగా మనం నవ్వుకున్ననవ్వుల సవ్వడేదో
మదిలో మెదులుతున్న చప్పుడు వినిపిస్తున్నట్లుంది!
ఆ చప్పుడులో పారిజాతాల్లానోపున్నమి చంద్రునిలానో
మహాసామ్రాజ్యాన్ని గెలిచిన విజేతలుగానో...ఎంతగా మురిసిపోలేదు!
జింక పిల్లల్లా ఎంతగా జడిసి పోలేదు!
ఇదేమిటీ...మనం ఇన్నేళ్ళ తర్వాత కలిసినా
వెంటాడుతూ...వేడివేడి సెగలనేవో రువ్వుతూ...
కీలుగుర్రం మీద వస్తాడనుకున్నఆ యువరాజుగారి
కలల దృశ్యాలేవో కళ్ళల్లో మౌనంగానే కదులుతున్న అలజడి...!
ఎదురుచూస్తూ కలవాలని తలచుకున్నా
కలవడానికి వస్తుంటే మనసేదో తెలియని గుబుల మబ్బుల్తో
ఆ ఎగిసి వచ్చిన స్నేహకెరటంలో
తడవాలో, మునగాలో ఏమీ తెలియని మౌనం...!
ఆ సంభాషణల బంధాల్ని ఆ అనుబంధాల్ని ఏమని వర్ణించాలి?
జ్ఞాపకమెప్పుడూ ఒకవెంటాడే చల్లని కళ్ళ తడి!
జ్ఞాపకమెప్పుడూ మదిని పలకరించే పుష్ప పరిమళం!
జ్ఞాపకమెప్పుడూ గొంతువరకూ వచ్చినా
తడబడుతూ వెలువడే పసిదాని బోసి నవ్వు!
అయినా మనం మళ్ళీ రావడమేంటిలే
కళ్ళముందు మన పిల్లల చేష్టల్లో నిత్యం ఆ మనమే కదా!
ఆ సంభాషణల బంధాల్ని ఆ అనుబంధాల్ని ఏమని వర్ణించాలి?
జ్ఞాపకమెప్పుడూ ఒకవెంటాడే చల్లని కళ్ళ తడి!
జ్ఞాపకమెప్పుడూ మదిని పలకరించే పుష్ప పరిమళం!
జ్ఞాపకమెప్పుడూ గొంతువరకూ వచ్చినా
తడబడుతూ వెలువడే పసిదాని బోసి నవ్వు!
అయినా మనం మళ్ళీ రావడమేంటిలే
కళ్ళముందు మన పిల్లల చేష్టల్లో నిత్యం ఆ మనమే కదా!
-దార్ల వెంకటేశ్వరరావు
చిరునామా: ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు,
డిప్యూటి డీన్, స్టూడెంట్స్ వెల్ఫేర్, యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్
( మనం’ దినపత్రిక, 7 మే 2018 సౌజన్యంతో)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి