నిన్న 29 ఏప్రిల్ 2018 ‘మనం’ పత్రిక వారు ఆదివారం అనుబంధం ‘మకుటం’లో నా అనుభవాలను ప్రచురించారు. దానితో పాటు అందమైన చిత్రాన్ని గీసారు. విద్యార్థిగా ఉన్న రోజుల్లో కొన్ని కథలు రాసినా, మళ్ళీ ఆ రచనా ప్రక్రియను స్ఫర్శించలేదు. అంటే అలా రాయలేదు. ఇదిగో దీనితో మరలా ప్రవేశించాలనుకుంటున్నాను. అది ఒక ఉద్యేగంతో రాశాను. కేవలం ఒక పుట మాత్రమే ప్రచురిస్తారు. అందువల్ల ఆ పుటను నిర్వహించే ఎడిటర్ ఫోను చేశారు. ఎడిట్ చేసి పంపించమని. కానీ, దాన్ని మీరే చేస్తేబాగుంటుందన్నాను. దాన్ని నిన్న ప్రచురించారు. దాన్ని చదివి వందలాది మంది అభినందిస్తూ ఫోనులు చేశారు. ‘మనం’ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, వారి సౌజన్యంతో నా రచనను, మూలాన్ని ఇక్కడ ప్రచురిస్తున్నాను.
నారచన పూర్తి పాఠం:
మనం వారి ఆదివారం అనుబంధం ‘మకుటం’ (29 ఏప్రిల్ 2018) సౌజన్యంతో...
అమ్మమ్మ
ఊరిలో ‘అమ్మచెట్టు’
మా అమ్మమ్మ ఊరి పేరు
వింటే నాకు ఒకకెరటమేదో మనసుని చల్లగా తాకినట్లనిపిస్తుంది. ఆ కెరటంపై అరటిబోదె, ఆ
బోదెపై నేనూ కెరటాలతో సయ్యాటలాడుతున్నట్లనిపిస్తుంది.
ఇంటి చూరు ముందు
నిలుచొని తడిసీ తడవని జల్లల్లో తడుస్తూ, వాననీటిలో కాగితప్పడవల్ని
వదులుతున్నట్లనిపిస్తుంది. అమ్మమ్మ గారింటి వెనుకున్న ప్రశాంతమైన చెఱువు... ఆ
నీటిపై చిల్లరపెంకుల్ని చిందులేయించిన జ్ఞాపకాలు కళ్ళల్లో మెరుస్తుంటాయి.
అమ్మమ్మగారి ఊళ్ళోని
రామస్వామి తోటలో చిలుక్కొట్టిన జాంపండ్ల కోసం వెతుకుతుంటే సిగ్గుమొగ్గలయ్యే యువతులెవరో
కేరింతలు కొడుతున్నట్లుంటుంది. కాకి ఎంగిలితో స్నేహితులమంతా పంచుకున్న జీళ్ల రుచి
నోటిలో ఊరుతున్నట్లనిపిస్తుంది.
వచ్చీరాని సైకిల్ని
వేగంగా తొక్కి రత్తాలత్తను గుద్దేసి అమ్మ కొంగు చాటున కోడిపిల్లలా భయం భయంగా
దాక్కున్న దడేదో గుండెలో మెదులుతుంది. జీడిమామిడి తోటలో దుమికినట్టు, ఏటిగట్టున
కాల్వలో ఈతకొట్టినట్టవుతుంది.
వేసవికాలంలో కాల్వలో దూకి కేకలేస్తూ స్నానం
చేస్తున్నంత సంతోషంగా ఉంది – అమ్మమ్మ ఊరు గుర్తొస్తుంటే వరదలవుతున్న భావాలు,
పొందికకానంటూ నురగలా ఎగిరిపడుతున్న అక్షరాలు...
మా
అమ్మమ్మ ఊరు తూర్పుగోదావరి జిల్లా, అందాల కోనసీమలోని కాట్రేనికోన. అది మండల
కేంద్రం. ఎటు చూసినా ప్రకృతి పచ్చని చీరకట్టినట్టుంటుంది. రోడ్డుకిరువైపులా నిలబడి
స్వాగతం పలుకుతున్నట్లు కొబ్బరిచెట్లు... దారిలో కొంచెం ఆగితే తినడానికేమైనా ఇచ్చే
బంధువుల్లా పిలిచే తోటల్లోని అరటి,
బొప్పాయి, జామ, సపోటా, పనస, మామిడి...రకరకాల ఫలవృక్షాలు... ఎటుచూసినా
ప్రవహించేకాల్వలు.
కొన్ని ఊళ్ళలో
పెద్దపెద్ద చెరువులు. ఇరుకిరుకుగా కట్టుకునే ఇళ్ళు. ఆ ఇళ్ళ దగ్గరా కాస్తకూడా చోటు
లేకుండా నాటిన మొక్కలో, కూరగాయలో పెంచుకోవాలనుకునే వాళ్ళ కుతూహలం... . ఆ
ఇళ్ళపక్కనే పశువుల పాకలు, కోళ్ళు ఉండడానికి గంపలు, పెట్టెలు... వాటితో ముచ్చట్లాడే
పక్షల కిలకిలారావాలు... అమ్మమ్మ ఊరు నాకొక నిత్యవసంతాన్నిచ్చే చక్కని అనుభూతి...
మా ఊరు చెయ్యేరు
అగ్రహారంలో ఐదోతరగతి పూర్తవగానే, తర్వాత
చదువుకోవడానికి చెయ్యేరులో ఉన్న ఉన్నత పాఠశాలలో సీటు దొరకలేదు. దొరకలేదనే కంటే,
నాకు సీటు దొరకనివ్వకుండా చేశారని తర్వాత తెలిసింది. మా ఊరుకి చుట్టూ ఒక అయిదారుకిలోమీటర్ల
దూరంలో మూడు హైస్కూల్స్ ఉన్నాయి. ముమ్మిడివరం, భీమనపల్లి..మరొకటి కాట్రేనికోన.
మా ఊరుకి కాట్రేనికోన ఆరు కిలోమీటర్లు. అది మా అమ్మగారి
పుట్టినూరు. అక్కడే అమ్మమ్మవాళ్ళున్నారు.అందువల్ల అక్కడున్న ఉన్నతపాఠశాలలో
చేర్చారు. అందువల్ల వారానికి రెండుమూడుసార్లు అమ్మమ్మగారింటిలోనే ఉండేవాణ్ణి.
ఆ పాఠశాల పేరు
శ్రీవరాహబొట్ల నారాయణమూర్తి ప్రాథమికోన్నత పాఠశాల. ఒక బ్రాహ్మణాయన విరాళం ఇవ్వగా
కట్టిన పాఠశాల. అది చాలా పెద్దది. ఆ వయసులో ఆ హైస్కూల్ ని చూసి ఒకింత భయం, ఒకింత
సంతోషం కలబోసిన రెండుకళ్ళల్లో అమరిపోయాయి. మా ఊళ్ళోకంటే పెద్ద స్కూల్లో
చదువబోతున్నననే చిన్నపాటి గర్వంగా కూడా ఫీలయ్యాను. రెండు మూడు వారాలు భయం ఉండేది.
తరగతి గదిలో శ్రీకంఠం లక్ష్మణరావుగారు తెలుగు
పాఠాలు చెప్పేవారు. పద్యాలు రాగయుక్తంగా పాడేవారు. అప్పుడప్పుడూ పిల్లల్ని కూడా
చదవమనేవారు. వెంకటరెడ్డిగారనే ఒక సోషల్
టీచర్ ఉండేవారు. ఆయన బోర్డుపై రాయించేవారు. ఈ రెండు పన్లూ భయపడకుండా చెయ్యడానికి
నేనూ లేచేవాణ్ణి. గట్టిగా రాగం తీస్తూ చదివేవాణ్ణి. కొన్నాళ్ళ తర్వాత క్లాసులో
చదవమన్నప్పుడల్లా ‘‘బూరా...రారా...చదవరా..’’ అనేవారు. క్లాసంతా
నవ్వులు...నాలో మాత్రం విజయదరహాసంతో కూడిన ముసిముసినవ్వులు కురిసేవి...
మా ఊరి నుండి రోజూ
నడిచి వస్తుంటే, పెనుమల్లె నుండి సైకిల్ పై వచ్చేవారు. ఆయనతో పాటు ఆతుకూరు
లక్ష్మణరావుగారనే ఒక సోషల్ మాస్టారు ఉండేవారు. రోజువారీ వార్తల్ని బోర్డుమీద
రాయించేవారు. అప్పుడే లైబ్రరీకి వెళ్ళడం బాగా అలవాటుగా మారింది. ఆ విధంగా
పత్రికల్ని చదవించే అలవాటుతో పాటు, లోకజ్ఞానాన్ని పెంపొందించేవారు. ఆయన చెయ్యేరు
గున్నేపల్లి నుండి సైకిల్ పై వచ్చేవారు. ఆయనకీ ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయితో
పాటు వీళ్ళు ఒక్కొక్కసారి నన్ను సైకిల్ పై ఎక్కించుకునేవారు.
పితాని
సత్యనారాయణగారనే ఒక సైన్స్ మాస్టారు ఉండేవారు.
పాఠం చెప్తే మళ్ళీ చదవనవసరం లేకుండా అరటిపండు ఒలిచినట్లు చెప్పేవారు.
పోటీలు పెట్టి, సొంత డబ్బుల్తో నిఘంటువుల్ని బహుమతిగా ఇచ్చేవారు. ఒకసారి నేనూ
గెలుచుకున్నాను. ఆ నిఘంటువునొకరు నాదగ్గర నుండి తీసుకున్నారు. అది నా దగ్గర లేదనే
విచారం నన్ను వెంటాడుతుంటుంది.
అందువల్ల తరగతిలో
తొందరగానే నాకెంతోమంది స్నేహితులు ఏర్పడ్డారు. నాకు తొలిసారి పరిచయమైన మిత్రుడు
నారాయణమూర్తి. వాళ్ళ తాతగారే ఈ హైస్కూల్ ని కట్టించారు. తర్వాత వర్మ, అప్పాజీ,
బాబీస్టెవార్డ్...ఎంతోమంది మిత్రులయ్యారు. వాళ్ళతో తోటల్లో తిరిగిన రోజులు
గుర్తుకొస్తున్నాయి. అదే ఊరైనా మధ్యాహ్నం భోజనం తెచ్చుకుని, తోటల్లో చెట్ల కొమ్మల
మీద కూర్చొని తిన్న కోతి చేష్టలు గుర్తుకొస్తున్నాయి.
అమ్మమ్మ దగ్గరే తన
నలుగురు కూతుళ్ళలో చిన్నామే లక్ష్మి పిన్ని ఉండేది. నేటికీ మా పిన్నివాళ్ళ కుటుంబమే ఉన్నారు.
పిన్నికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లాడు. వాడూ నేనూ మా పొలంలోకి వెళ్ళి
కొబ్బరిబొండాలు తాగేవాళ్ళం.
పొలంలో కందికాయలు
కోసుకొని కాల్చుకొని తినేవాళ్ళం. పండిన గుమ్మడికాయల్లో గుజ్జుని తీసేసి, దానిలో
బెల్లం పెట్టి తంపడ (కాల్చేపద్ధతి) వేసుకుని తింటే, ఆ రుచే వేరు. గుమ్మడికాయ
పనసతొనల్లా విడిపోయి తియ్యగా ఉంటుంది.
ఒక్కోరోజు పొలం
దగ్గరే మా పిన్ని కొడుకు దేవదానం నేనూ ధాన్యం రాసులు కాపలా కాస్తూ రాత్రులు మా తాత
వచ్చేలోగానే నిద్రపోయేవాళ్లం. పైన వెన్నెల, దూరంగా చుక్కల్లా కదిలే విమానాల్ని
చూస్తూ, రకరకాల కథల్ని చెప్పుకుంటూ కునుకువేసేసేవాళ్లం. ‘‘నేనొచ్చిందే తెలీదు
మీకు...మీరేమి దొంగల్ని పట్టుకుంటార్రా?’’ అనేవాడు మా తాత ముసిముసి నవ్వులతో
తెల్లారిన తర్వాత. ఏమి చెప్పాలో తెలియక తెల్లబోయిన మొహాలు పెట్టుకునేవాళ్ళం.
మెల్లగా జారుకునేవాళ్ళం.
అమ్మమ్మ ఎంతో
అమాయకురాలు. కానీ, తన దగ్గరే ఉన్న పిన్ని పిల్లలంటే నాకంటే కొంచెం ప్రేమాభిమానాలు
ఎక్కువగా చూపించేది. ఈ ఊళ్ళో శనివారం పెద్దసంత జరుగుతుంది. నేను అక్కడే చదవడం వల్ల
ఆ సంతను చూసేవాణ్ణి. ఆ సంతపక్కనే రోడ్డుకానుకొని ఒక లైబ్రరీ ఉండేది. అది నాకు
ప్రియనేస్తమయ్యేది.
అమ్మమ్మ సంత నుండి ఒకరోజు
ఏవో బాగా తియ్యగా ఉండే మామిడి రసాలపండ్లు తెచ్చింది. అమ్మమ్మకి అప్పటికే కొంచెం
కళ్ళు మసకలొచ్చేశాయి. ఆ మామిడి పండ్లు చూసి మాట్లాడకుండా అమ్మమ్మ దగ్గర
నిలబడ్డాను. గబగబా ఒక మంచి పండు తీసిచ్చి, ‘‘తొందరగా తినేయ్... వెంకటేశ్వరరావు
వచ్చేస్తాడు...’’ అంది. నాకు నవ్వొచ్చింది. అమ్మమ్మ తన దగ్గరుండేవాళ్ళపట్ల
చూపే ప్రత్యేకతకు సంతోషమనిపించినా, ఎక్కడో మనసులో కొంచెం బాధ కూడా అనిపించినట్లయ్యింది.
‘‘నేనే మామ్మా...’’ (అమ్మమ్మని
‘మామ్మా’ అనిపిలుస్తాం) అన్నాను ఎలా స్పందిస్తుందో చూస్తూ. గొంతు గుర్తు
పట్టేసింది. ఒక్కసారిగా తానేదో తప్పేదో చేసినట్లు ఉలిక్కిపడింది. హడావిడి
పడిపోయింది. ‘‘నేను వాడికిస్తానులే...కాకపోతే కొంచెం తినేసిస్తా...’’ అంటూ
ఆటపట్టించాను.
నాకిప్పటికీ అమ్మమ్మగారి ఊరన్నా, వెళ్ళినా నాకు
ఆ సంఘటనే గుర్తొస్తుంది. అమ్మమ్మ వేడివేడిగా వండిపెట్టిన మినపరొట్టెల కమ్మదనం
నోటిలో రుచులూరిస్తుంది.
మా అమ్మంటే అమ్మమ్మకి
చాలా ఇష్ణం. ఆ ఇంటి దగ్గర నాలుగువైపులా నాలుగు, ఇంటివెనుక కొన్ని కొబ్బరి చెట్లున్నాయి.
ఆ వెనుకనే కొంచెం దూరంగా ఒక చింతచెట్టు
ఉండేవది. అందులో ఇంటి ముందున్న ఒక కొబ్బరిచెట్టు మాత్రం ‘‘మా నాగమ్మదే. దీన్నెవరూ
కాలుతో తన్నొద్దు’’ అనేది. ఆ మాటన్నప్పుడల్లా మా అమ్మమ్మ అనురాగం, ఆ ప్రేమలను
అంచెనా కట్టలేమనిపించేది.
ఇప్పుడు అమ్మమ్మలేదు. ఇప్పుడు తాతయ్య లేడు.
ఇప్పుడు పిన్ని వాళ్ళ పెద్దమ్మాయి లేదు. కానీ... వాళ్ళ మమతానురాగాలు,
ప్రేమానుబంధాలు నాకు అలాగే ఉన్నాయి. ఆ ఊరివెళితే ‘అమ్మచెట్టు’ చూడాలనిపిస్తుంది.
అమ్మచెట్టుతో ముడిపడిన అమ్మమ్మని చూడాలనిపిస్తుంది. ఆ ఊరితో, ఆ ఇంటితో ముడిపడిన తియ్యని నా బాల్య జ్ఞాపకాలున్నాయి.
ఆ ఇంటి వెనుకున్న చింతచెట్టు చిగురుతో అమ్మమ్మ వండిపెట్టిన కమ్మని రుచులు
గుర్తుకొస్తుంటాయి.
-ఆచార్య
దార్ల వెంకటేశ్వరరావు
ఫ్రొఫెసర్,
తెలుగుశాఖ, డిప్యూటి డీన్, స్టూడెంట్స్ వెల్ఫేర్, యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్,
హైదరాబాదు
9182685231
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి