Important Contact Numbers of The University of Hyderabad link https://www.uohyd.ac.in/index.php/administration/contact

తెలుగు మాతృభాషగా అమలుకిది మంచి ప్రయత్నమే కానీ...?

తెలంగాణ ప్రభుత్వం అంకితభావంతో తెలుగు భాషను ఇంటర్మీడియట్ వరకు అమలు చేయాలని ముందుకు రావడాన్ని ఆహ్వానిస్తున్నాం. దీనికి వ్యక్తిగతంగా నా సంపూర్ణ మద్దతును కూడా ప్రకటిస్తున్నాను. అయితే దీన్ని అమలు చేయడం అంత సులభమైన పని కాదని అనుకుంటున్నాను. అందరి మాతృ భాష ఒకటి కాకపోవడం దీన్ని అమలుచేయడంలో అది ఒక ప్రధానమైన ప్రతిబంధకం కావచ్చు. దీంతో పాటు మన మాతృభాషను కంపల్సరీ చేసేటప్పుడు ఎలాంటి భాషను మాతృ భాషగా అమలు చేస్తామనేది కూడా చర్చించుకోవాలి. 


 భారతదేశంలో ఇప్పటికే త్రిభాషా సూత్రం అమలు కోసం చట్టం ఉంది. త్రిభాషా సూత్రం అమలు కోసం అనేక సంవత్సరాలుగా చేసిన పోరాట చరిత్ర ఉంది. స్థానిక ప్రాంత సంస్కృతిని నిలబెట్టుకోవడానికి మాతృభాష ఉపయోగపడుతుంది. భారత జాతీయ సమైక్యతకు, సమగ్రతకు అనుసంధానంగా తోడ్పడుతుంది. ప్రపంచవ్యాప్త విజ్ఞానాన్ని వాహికగా చేసుకోవడానికి ఇంగ్లీష్ ఉపయోగపడుతుంది. ఈ ఆలోచనతోనే భారతదేశంలో 1968లోనే త్రిభాషా సూత్రాన్ని అమలు చేయాలని పార్లమెంట్ ఒక చట్టం కూడా చేసింది. ఈ చట్టాన్ని అమలుచేయడంలో కార్యాచరణలు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆ ఇబ్బందులను తొలగించడానికి రాజకీయ కారణాలు ఒక ప్రధానమైన ఆటంకంగా నిలుస్తున్నాయి. వీటితో పాటు ఆర్థిక కారణాల కూడా వాటికి దోహదపడుతున్నాయి.

భారతదేశవ్యాప్తంగా ఆయా ప్రభుత్వాలు భాషను కూడా రాజకీయం చేస్తున్నాయి.  
 మాతృభాషలో అధ్యయనం చేసేటప్పుడు సృజనాత్మక శక్తి పెరుగుతుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న విజ్ఞానాన్ని అందుకోవడానికి తగిన అనువాద సాధనాలు కూడా మనకు అవసరం. మనం సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కొన్ని ఒక భాష నుండి మరొక భాషకు సత్వరమే అనువాదం చేస్తే పరికరాల గురించి వింటున్నాం. అటువంటివన్నీ మాతృభాష ద్వారా విద్యాభ్యాసాన్ని కొనసాగించినప్పటికీ మన విజ్ఞానానికి ఎలాంటి ఇబ్బంది ఉండదనే ఆత్మ  విశ్వాసాన్ని కలిగి స్తాయి. అటువంటి కృషి మన భాషా శాస్త్రవేత్తలు చేయాలి. అటువంటి పరికరాల్ని లేదా సాధనాల్ని మనకు అందిస్తామని హామీ ఇవ్వగలగాలి. ఇటువంటి నూతన ఆవిష్కరణలకు విశ్వవిద్యాలయాలు, వివిధ సంస్థలు ఎంతో పరిశోధనలు చేయాలి. వాటిని అందరికీ అందుబాటులోకి వచ్చేలా ప్రయత్నించాలి. ఇవన్నీ మాతృ భాష అమలుకు సంబంధించి ఎన్నో చర్చోపచర్చలు చేయాల్సిన ఎన్నో అంశాల్ని తెలియచేస్తున్నాయి. ఈ చర్చకు మొదలుపెట్టి వివిధ విశ్వవిద్యాలయాల్లోను, సంస్థల్లోనూ చైతన్యాన్ని తీసుకొస్తున్న కేశబోయిన రవికుమార్, శంకర్ మొదలైన వాళ్ళందర్నీ అభినందిస్తున్నాను.

భాషలో ఉన్న ఆదాన ప్రదానాలను మనం ఎంతవరకూ స్వీకరించాలి? మన మాతృభాష అంటే సంస్కృతీకరణకు గురైన తెలుగు భాషనా? మన నిత్య వ్యవహార భాషనా? దేశాన్ని మనం మాతృభాషగా అమలు చేయాలనికోరుకొంటున్నాం? ఇప్పటికే కొంత మంది కోస్తా వారి భాష ప్రామాణికమని, కొంతమంది కాదని ఇలా వాదోపవాదాలు చేసుకుంటూనే ఉన్నారు. మరొకవైపు కొంతమంది భాషను మాండలికం అంటున్నారు. అది మాండలికం కాదనీ, అదే మా భాష అనీ మరికొంతమంది అంటున్నారు. ఇవన్నీ మాతృభాషను కంపల్సరీ చేసేటప్పుడు ఎదురయ్యే సమస్యలు. వీటన్నింటిని లోతుగా చర్చించాల్సిన అవసరం ఉంది. 

 (ఇంటర్మీడియట్ వరకూ మాతృ భాష అమలు అనే అంశంపై తెలుగు శాఖ హైదరాబాద్ విశ్వవిద్యాలయం వారి ఆధ్వర్యంలో ది 13 నవంబర్ 2017 సాయంత్రం చర్చాగోష్టి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ నందిని సిధారెడ్డి విచ్చేసారు. సభకు తెలుగుశాఖ అధ్యక్షులు ఆచార్య తుమ్మల రామకృష్ణ అధ్యక్షత వహించారు. చర్చాగోష్ఠిలో ఆచార్య జి. ఉమామహేశ్వరరావు, ఆచార్య జి అరుణకుమారి, ఆచార్య పిల్లలమర్రి రాములు, డా.భుజంగరెడ్డి, కేశబోయిన రవికుమార్, డాక్టర్ పసునూరి రవీందర్ పరిశోధకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాల్గొని వ్యక్తంచేసిన నా అభిప్రాయాలను పైన వివరించాను.)
ఫోటోల సౌజన్యం: అల్లూరు మస్తాన్, సునీల్, రీసెర్చ్ స్కాలర్స్, యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్

No comments: