‘రెక్కలు’ కవిత్వం-సాహిత్య స్థాయి
-ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
డిప్యూటి డీన్, స్టూడెంట్స్ వెల్ఫేర్,
ఫ్రొఫెసర్, తెలుగుశాఖ, యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్
హైదరాబాద్-500 046,
సుగమ్ బాబు గారు ప్రఖ్యాత కవి. తెలుగు సాహిత్యంలో అభ్యదయ, విప్లవ, దిగంబర
కవులకు ఒక విశిష్ట స్థానం ఉన్నట్లే పైగంబర కవులు కూడా అటువంటి స్థానమే ఉంది. ఆ
పైగంబర కవుల్లో సుగమ్ బాబు గారు కూడా ఒకరుగా ఉండేవారు. తర్వాత కాలంలో ఆయన సాహిత్యాన్ని పాఠకులకు మరింత
దగ్గరగా చేర్చాలనుకున్నారేమో, రెక్కలు ప్రక్రియతో
ముందుకొచ్చారు. తెలుగు సాహిత్యం అనేక ప్రయోగాల కూడలి. ప్రాచీన తెలుగు సాహిత్యంలో
చాటువులు, పంచరత్నాలు, నవరత్నాలు,
ఖండకావ్యం, ఉదాహరణ కావ్యం, చక్రవాళం, బిరుదావళి, మంజరి,
పంచాననావళి మొదలైనవెన్నో కనిపిస్తాయి. వాటిలో కొన్నింటిని
కావ్యశాస్త్ర పరిభాషలో లఘు కావ్యాలని,
క్షుద్రకావ్యాలని పిలుస్తారు. క్షుద్ర కావ్యాలంటే చిన్న
కావ్యాలనే అర్థం. లఘు కావ్యాలు సాధారణంగా దైవస్తుతిని గానీ, కృతి
స్వీకర్తను గానీ, సందర్భోచితంగా వాళ్ళని కీర్తించడానికి
రాసుకున్నవి.
ప్రాచీన తెలుగు సాహిత్యంలో వచ్చిన ఇటువంటి లఘుకావ్యాలు సామాజిక పరిస్థితుల
వల్ల తర్వాత కాలంలో విచిత్రమైన ప్రయోగాలకు దారితీసాయి. సాహిత్యాన్ని గణితంలా
చేశాయి. కవి వర్ణించిందేమిటో తెలుసుకోవడం ఒక పజిల్ విప్పినట్లైపోయింది. కవుల ప్రతిభా
ప్రదర్శనలకు వాహికలయ్యాయి. వాటి వల్ల క్రమేపీ
అవి ప్రజాదరణ కోల్పోయాయి.
సాహిత్యంలో ప్రయోగాలు జరగాలన్నా, కొత్త ప్రక్రియలు రావాలన్నా ఆ సామాజిక అవసరాలు, ఆ
చారిత్రక పరిస్థితులే ప్రధాన కారణాలవుతాయి. ఆ ప్రయోగాలు వచ్చినా, పోయినా ఆ సాహిత్యాన్ని పోషించేవాళ్లు, ఆదరించేవాళ్లను
బట్టే నిర్ణయమవుతుంది. ఈ స్థితిలోనే ‘వాక్యమ్ రసాత్మకమ్
కావ్యమ్’ అనే లక్షణం వచ్చింది. రసాత్మకం కాని వాక్యాలెన్ని
రాస్తేమాత్రం ఉపయోగమేమిటి? ఒక్క వాక్యం రాసినా అది
రసాత్మకంగా ఉండాలనే ఆలోచన మొదలైంది. మళ్ళీ సంపూర్ణమైన అనుభూతిని కల్గించే కావ్యాలు,
ప్రబంధాలవైపు సాహిత్య ప్రక్రియా రచన ప్రారంభమైంది. కొన్నాళ్ళు
అవిచ్ఛన్నంగా కొనసాగిన కావ్య, ప్రబంధ, మహాకావ్య
సంప్రదాయం ఆధునిక కాలంలో మరలా ప్రశ్నార్థకమైంది.
గజల్, రుబాయిత్ వంటి
గానయోగ్యమైన ప్రక్రియలు కూడా వచ్చినా, వాటికున్న నియమాల వల్ల
అవీ ప్రాచుర్యం పొందలేకపోయాయి. మరొకవైపు
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో వచ్చిన విప్లవాత్మక మార్పుల వల్ల
ప్రపంచవ్యాప్తంగా వస్తున్న వివిధ సాహిత్య ధోరణులను అవగాహన చేసుకోవడానికి
వీలుకలిగింది. ఛందోబద్ధ పద్యం స్థానాన్ని వచనం ఆక్రమించింది. వచనం కథ, నవల, వచన కవిత్వం, మినీకవిత్వం
వంటి రూప పరిణామాలకు దారితీసింది. సాహిత్యం సమకాలీన జీవన పరిస్థితుల్నీ, వారి సమయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరాన్ని చాటిచెప్పింది. ప్రజాభిరుచిని
గమనించిన పత్రికలే ప్రధానంగా ఈ రకమైన ప్రోత్సాహానికి కారణమైయ్యాయి. ఈ పరిణామాలన్నీ
తెలుగు కవిత్వంలో హైకూ, రెక్కలు వంటి ప్రక్రియలను ద్వారాలు
తెరిచాయి. రెక్కల
కవితా నిర్మాణాన్ని ఒక పక్షి కింది నుండి పైకి గానీ, తనిష్టమొచ్చినట్లు ఏగరగలుగుతుంది.
ఎటు ఎగిరినా పక్షికి బలమైన ఆధారం రెక్కలే. ఆ రెక్కలు ఈ కవితారూపంలో కూడా అవే బలమైన
కవితాపంక్తులుగా నిలుస్తున్నాయి. ఒక కవితా ఖండికలో ఆరు పాదాలుంటాయి.తొలి నాలుగు
పాదాలు ఒక భావాంశాన్ని ప్రతిపాదిస్తాయి.చివరి రెండు పాదాలు పై రెండు భావాంశాల్ని
సమన్వయం చేస్తూ కవిత్వమై పాఠకుల హృదయాల్లో విహరిస్తాయి. ‘‘శిథిలమైన గతం నుంచి
వర్తమానంలోకి ఉబికి వచ్చిన చైతన్యంగా ఆధునికతను గుర్తించా’’రు ఆచార్య కొలకలూరి
ఇనాక్. (పుటః 5, ఆధునిక సాహిత్య విమర్శ సూత్రం) రెక్కలు
కవితా రూపం కూడా ఆధునిక సమాజానికి అవసరమైన కవిత్వ ప్రక్రియగా నే వచ్చింది. హైకూ,
రెక్కల్లో ఉన్న ఒక విశిష్ట గుణమేమిటంటే, చెప్పాల్సినదాన్ని
సూటిగా, సంక్షిప్తంగా చెప్పొచ్చు. చక్కని భావుకతను, తాత్త్వికతలను అందించవచ్చు.
సాహిత్యానికి ప్రధానంగా నాలుగు మూల స్తంభాలుంటాయనుకుంటున్నాను.
1. సాహిత్యానికి తగిన వస్తువుని తీసుకోవాలి.
2. ఆ వస్తువుని తగిన ప్రక్రియలో అందించాలి.
3. వర్ణనలో అభివ్యక్తి వైవిధ్యాన్ని ప్రదర్శించాలి.
4. అనుభూతి రమ్యతను కలిగించగలగాలి.
మొదటి రెండూ సాహిత్య ప్రయోజనానికి కి సంబంధించినవి. మిగతా రెండు అంశాలు
సాహిత్యాన్ని కళాత్మకంగా మార్చేది. వీటిని మనం చర్చించుకునే ముందు సాహిత్య
సంప్రదాయాలను కూడా మనం ప్రస్తావించుకోవాలి.
ప్రాచీన
భారతీయ లాక్షణికులు సాహిత్యానికి శరీరం, ఆత్మ అనేవి ఉంటాయన్నారు. అది రసం, అలంకారం, గుణం, రీతి, ధ్వని, వక్రోక్తి,వక్రత, ఔచిత్యం
మొదలైనవి ఉంటాయన్నారు. జీవితానుభవాన్ని కళాత్మకంగా మార్చగలిగినప్పుడే పాఠకుడు/శ్రోతలకు
సౌందర్యానుభూతి కలుగుతుంది. దీనికి లోకానుభవంతోపాటు సాహిత్య సృజనానుభవం కావాలి. సమాజంలోని అనేక జీవితానుభవాలను వాస్తవిక
దృష్టితో పరిశీలించటం వలన జీవితానుభవం కలుగుతుంది. తాను అనుభవించిన జీవితమే
జీవితానుభవం కాదు. ఇతరుల సుఖదుఃఖాలను తనవిగా భావించే సత్వ గుణమే జీవితానుభవం.
అలాగే సృజనానుభవం అంటే కూడా రాయగలిగే కళాత్మక నైపుణ్యం తనకు ఉండడం మాత్రమే కాదు;
అంతవరకూ వచ్చిన సాహిత్యాన్ని లోతైన దృష్టితో అధ్యయనం చేయడంవల్ల
వచ్చే అనుభవమే సృజనానుభమవుతుంది. దీన్నే మన ఆలంకారికులు ‘ప్రజ్ఞా
నవనవోన్మేష శాలినీ ప్రతిభామతా’ అన్నారు. 'నవనవోన్మేషంగా అంటే కొత్తగా చెప్పడం. వస్తువులో కొత్తదనం, నిర్మాణంలో కొత్తదనం, దాన్ని అభివ్యక్తీకరించడంలో
కొత్తగా ఉండటం... ఈ మూడు కొత్తగా ఉంటేనే అది నవనవోన్మేషనం అవుతుంది. అప్పుడే అది
అనుభవ రమ్యతను కలిగిస్తుంది.
ప్రేమ, పుట్టుక,
వ్యాధుల బారిని పడ్డం, మరణం వంటి వస్తువులన్నీ
కాలాతీతమైనవి. అయినప్పటికీ అవి చెప్పే విధానాన్ని బట్టి సాహిత్యంలో నిత్య
నూతనత్వాన్ని కలిగిస్తాయి. అలాంటి వస్తువులు కూడా సుగమ్ బాబు గారి 'రెక్కలు' కవిత్వంలో కొన్ని ఉన్నాయి. లోకంలో కొన్ని
సామాన్యంగా ఉన్న కొన్ని అంశాలు కవికి అసాధారణంగా కనిపిస్తాయి. వాటిని వర్ణించటంలో
అపూర్వమైన ప్రతిభను ప్రదర్శిస్తాడు. అప్పుడు పాఠకులకు అవి చమత్కారాన్ని, ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయి.
కొన్ని శాశ్వతమైన సత్యాలుంటాయి. స్థలకాలాలకు అవి అతీతంగా ఉంటాయి. వాటిని
సృజనీకరించడంలో కవి ప్రతిభను బట్టి వాటికి సాహిత్య గౌరవం లభిస్తుంది. రెక్కలు కవితా ప్రక్రియలో దాని స్వభావరీత్యా తాత్విక
సత్యాలకే ప్రాధాన్యం ఉంటుంది. సుగమ్ బాబు
గారి కవిత్వం లోనూ అలాంటి తాత్విక సత్యాలే
ప్రతిఫలిస్తున్నాయి. ఇప్పటికే సుగమ్ బాబు గారు రెక్కలు ప్రక్రియలో విశేషమైన
కృషి చేశారు. తనతోపాటు ఇతరులు కూడా ప్రభావితులై రెక్కలు ప్రక్రియలో గీతాంజలి, భగవద్గీత వంటి వాటిని కూడా రాశారు.
తనలో తలెత్తిన/ప్రశ్నలే/సిద్ధార్ధుని బుద్ధుణ్ణి చేశాయి-/ప్రశ్నే/ప్రభాతం! (పుటః15)
ఇది
వినడానికి సాదాసీదా వాక్యంలా అనిపిస్తుంది. దుఃఖానికి కారణం ఏమిటి అనే ప్రశ్న
బుద్ధుణ్ణి జ్ఞానం వైపు నడిపించింది. జ్ఞానాన్వేషణకు కావలసింది ప్రశ్నించే తత్వం.
ప్రశ్నించాలంటే ఆలోచించాలి. ఈ లోకమంతా మనకొచ్చిన సందేహాలకు సమాధానాల్ని అన్వేషించడం
వల్ల ఏర్పడిందే ఈ జీవితం. బౌద్ధం జ్ఞానాన్వేషణకు
సంబంధించిన తత్వం. రెక్కలు ప్రక్రియకు కూడా తాత్త్వికతే దాని ప్రాణం. మానవ జీవన
తాత్త్వికతను అక్షర రూపమే తన రెక్కల కవిత్వం అని చెప్పకనే చెప్పినట్లయింది కవి.
మురికి దుప్పటిని /లాగి పడెయ్/ ముఖం బయట పెడితే
/ఊపిరాడుతుంది-/ప్రవాహంలో/జతకట్టేదేచేప.'' చేపలకున్న లక్షణం అవసరమైతే నీటికి కూడా
అవి ఎదురు తిరుగుతాయి. నీటిలో తమ ఇష్టం వచ్చినట్లు తాము తిరిగుతాయి. నీటికీ బురదను
కడిగేసే గుణం ఉంటుంది. చేప ఎప్పుడూ నీటిలోనే ఉండటం వల్ల దాని శరీరానికి ఎలాంటి
మురికి అంటదు. ఈ ఖండికను అనుభూతిలో తెచ్చుకోడానికి ఇదే కీలకం. ముఖానికి దుప్పటి
కప్పుకుని, అదీ చాన్నాళ్లుగా అలాగే ఉండటం వల్ల దానికి మురికి
పట్టేసిందట. అంతవరకూ దీనిలో వాచ్యార్థమే వినిపిస్తుంది. ముఖం బయటపెడితేనే
ఊపిరాడుతుందనడం ద్వారా వ్యంగ్యార్థాన్ని తెలుసుకోవాలనే సూచన కనిపిస్తుంది. త్రికరణ శుద్ధిగా జీవించడంలోని నిజమైన జీవితం
ఉందంటున్నాడు కవి. ఇక్కడ స్వచ్ఛమైన జీవితం కవిత్వమైంది. దీనిలో చక్కని వస్తువుంది.
దీనిలో చక్కని అభివ్యక్తి ఉంది. దీనిలో చక్కని అనుభూతి రమ్యత ఉంది.
రెండు మూడు సార్లు చదివితే గానీ దీనిలో వ్యంగ్యం పాఠకుడికి అర్థం కాదు. అలా వెంటనే అర్థం
కాకపోవడమే కవిత్వానికి అనుభూతినిచ్చే చక్కని గుణం. అది పాఠకుడికి శాశ్వత అనుభవ
సత్యమవుతుంది. ఇది జీవితాన్ని వ్యాఖ్యానిస్తుంది. తాను ప్రతిపాదించిన సత్యం లేదా
జీవితానుభవాన్ని కింది పాదాలతో ఉపమించి ప్రకృతి గత సత్యాన్నే ప్రత్యామ్నాయంగా
దృశ్యానుభవాన్ని కలిగిస్తున్నాడు కవి.
తనను తాను/గౌరవించుకోలేనివాణ్ణి/ ఎవరు/ అవమానించలేరు /నక్షత్ర కిరీటం/ ఆత్మగౌరవం ( పుటః 20)భారతీయ ఆలంకారికుల్లో భోజుడు చేసిన శృంగారరస
ప్రతిపాదన గుర్తుకొస్తుంది. ఆత్మాభిమానమే శృంగార రసం అంటాడు భోజుడు. ఆత్మాభిమానం
ఎక్కడి నుండి వస్తుంది? మన
హృదయం నుండి వస్తుంది. ప్రతి మనిషి ముందు తనను తాను గౌరవించుకోవాలి. తనను తాను
గౌరవించుకోవడమంటే ఏమిటీ?తానేంటో తనకు తెలుసు. తన గురించి
తాను తెలుసుకున్నప్పుడు ఇతరుల గౌరవాభిమానాలతో పనిలేకుండానే తనను తాను
గౌరవించుకోగలుగుతాడు. నిజానికి ప్రతి వ్యక్తికి తనేంటో తనకు తెలుసు. ఇక్కడ తాను
అంటే ఎవరు? తాను అంటే బయటకు కనిపించే స్వరూపమా? తాను అంటే బయటకి కనిపించని మన స్వభావమా? ఈ రెండూ
తెలిసినవాడే నిజంగా తనను తాను గౌరవించుకోగలుగుతాడు. తాను తాను నిజంగా
గౌరవించుకోగలిగినప్పుడు తానెంతో ఎంతో ప్రశాంతంగా ఉండగలుగుతాడు. అప్పుడే ఆ మనిషి
తనను తాను గౌరవించుకోగలుతాడు. తాను ఆత్మాభిమానంతో నిలబడగలుగుతాడు. అప్పుడే తనని
ఇతరులు కూడా గౌరవిస్తారు. నిజమైన ఆత్మ గౌరవం తాను స్వచ్ఛంగా జీవించటంలోనే
ఉంటుందంటున్నాడు కవి. తనను తాను గౌరవించుకోలేనివాణ్ణీ ఎవరో అవమానించనవసరం లేదనీ, ముందుగానే తానే తనని అవమానించుకుంటాడని కవి చక్కని అభివ్యక్తితో
వర్ణించారు.
ఎన్నో చూస్తూ/ వెళ్ళిపోవాలి /ఇష్టమైనవి/ ఇష్టంలేనివి/
ఇది/ వన్ వే!(89) సమాజంలో అన్నీ మన ఇష్టప్రకారమే జరగాలనుకోవడం సరికాదు. అది ఇతరుల
అభిరుచులను, అభిప్రాయాలను నిరోధించడం కూడా అవుతుంది. అలా జరిగిపోతున్న వాటిలో
కొన్ని తప్పులుండొచ్చు. పొరపాట్లుండోచ్చు. కానీ, వాటిని సరిచేసే ప్రయత్నమెప్పుడూ
పెద్దవాళ్లు చెయ్యాలనుకుంటారు. ఆ పరిస్థితులనుబట్టి కొన్ని సూచనలైనా
చేయాలనుకుంటారు. వాటిని కూడా సహించలేనివాళ్ళుంటారు. అలాంటప్పుడే మనలోని విజ్ఞత
బయటపడుతుంది. కొన్ని మన ఇష్టాయిష్టాలతో పనిలేదని అనుభవంలోకి వస్తుంది. అందుకనే
ఇదంతా అనుభవంతో చెప్తున్న కవిత్వంగా కనిపిస్తుంది.
ఎప్పుడైనా వెళితే/ వాటేసుకుని/ కంటతడి పెడుతుంది/ మా
ఊరు- నాఏడుపే/ దానిఏడుపు
(98)అమ్మ గురించి రాయని కవిలేనట్లే, బహుశా కవి కూడా గ్రామీణ ప్రాంతం నుండి వచ్చిన
వాడైతే, తన ఊరిగురించెప్పుడో ఒకప్పుడు తప్పకుండా రాస్తాడు. ఊరంటే జ్ఞాపకం కావచ్చు;
ఊరంటే మమతల పొదరిల్లు కావచ్చు. అరమరికలు లేని మమతానురాగాలు కావచ్చు. ఒకప్పుడు
‘ఊరు’లో ఇవన్నీ ఉండేవి. నేటికీ చాలా ఊళ్ళలో ఉండొచ్చుకూడా!
ఆప్యాయంగా/ వాళ్లడిగారు/ మీరు కవులా?/ అని-/ఆత్మల కలయిక/ కవిత్వం. (105) ఒక మృదువైన మాట మాట్లాడితే పోయేదేముంది? ఎదుటివాళ్ళలోని మంచితనాన్ని చెప్తే మనకి
నష్టమేంటి? కవి ఇతరుల్ని బాధ పెట్టడు. సున్నితమైన మనస్తత్వం
కవికుండాలి. అదే ఇక్కడ వర్ణించాడు కవి. కొంతమంది కవిత్వం గానీ, సాహిత్యం గానీ రాసేదొక రీతిలో ఉంటుంది. ప్రవర్తించేది మరొకరీతిలో ఉంటుంది.
ప్రపంచంలోని అందాన్నంతా కవి పట్టుకోగలడు. మనిషి అంతరంగాన్ని శోధించగలడు. మరి ఆ మనిషితో
అదేవిధంగా ఎందుకు ప్రవర్తించలేకపోతున్నాడు? ఊహకూ జీవితానికీ
తేడా ఉందా? ఉండకూడదనేది కవి భావన.
చూడగానే /నచ్చేది అందం/కొత్తగా అన్పించేది/మరింత
అందం/అందానికి అందం/కవితాంతరంగం (107) సౌందర్యం అంటే ఏమిటని ప్రశ్నించుకున్నవాళ్లలో అత్యంత ఎక్కువమంది
చెప్పిన మాటొకటే. దేన్నైతే మరలా మరలా చూడాలనుకుంటామో అదే సౌందర్యం. సౌందర్యం
జీవితంలో ఉండొచ్చు. సౌందర్యం కవిత్వంలో ఉండొచ్చు.
‘శనై: శనై యన్నవతా తాముపైతి
పూల చెట్టుకైనా/ఎంత వేదన/తొలి పువ్వు /పూచే వేళ/వేదనా
జనితం / సృజన’’ అనడం
ద్వారా కవిత్వ సృజనానుభవాన్ని వర్ణిస్తున్నాడు కవి. కవిత్వాను సృజన గురించి కవి
చాలా రెక్కలు రాశారు. అవన్నీ కావ్యశాస్త్రాధ్యయనానికి లక్షణాల్ని
సమకూరుస్తాయనుకుంటున్నాను. లోకంలో కవి చూసిన వాటిని తన అనుభవంగా వర్ణించేటప్పుడు
పొందే రసానుభవస్థితిని గుర్తించే ప్రయత్నానికి అవెంతగానో ఉపయోగిస్తాయి.
గొంగళిపురుగు /దశ దాటాక/సీతాకోకచిలకదే/చిద్విలాసం /మనిషి
మహర్దశ/మౌనం (పుటః 21) మనిషి
తెలిసీ తెలియనప్పుడు మాట్లాడినట్లుగాఅన్నీ తెలిసి మాట్లాడలేడు.ఎగరగలిగే రెక్కలు
వచ్చిన సీతాకోకచిలుకలు ఎగరకుండా నిరోదించుకోవడమే జీవితం. పరిపక్వత చెందిన
మానవుణ్ణి సీతాకోక చిలుకలతో పోలుస్తున్నాడు కవి. ఎగరగలిగి అంటే ఏదైనా చేయగలిగే
అవకాశం ఉండికూడా దేన్ని చేయాలో దాన్నిమాత్రమే చేయగలిగే సంయమనం చాలా అవసరం. దీన్ని
అద్భుతంగా కవిత్వీకరించాడు కవి.
‘‘ఎంత జాగ్రత్తగా/తొడిగినా /చిరిగిపోతుంది/బట్ట –/మృత్యు ఛాయా/వృద్ధాప్యం’’
ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు తెలుగు సాహిత్యంలో ఉండాల్సిన నిబద్ధత(Commitment)తో పాటు నిమగ్నత(Involvement),
నిబిడత (Inclusiveness) ల గురించి చర్చించారు.
నిబద్ధత- తాను రాసిన సాహిత్యానికున్న భావజాలాన్ని ప్రశ్నిస్తుంది. నిమగ్నత తాను
రాసిన సాహిత్యానికి కవీ ఎంతవరకు కట్టుబడి ఉన్నాడో లేదో పరీక్షిస్తుంది. నిబిడిత (Inclusiveness) ఏమో తాను రాసిన దానికి తన జీవితానికీ ఉండాల్సిన అవినాభావ సంబంధాన్ని
ప్రదర్శిస్తుంది.
సుగమ్ బాబు గారు రాసిన కవిత్వం
మానవ జీవితం లోని అనేక పార్శ్వాల్ని మనకు చూపిస్తుంది. మానవ శరీరం పొందే
వివిధానుభవాల్ని వర్ణించిన తీరు అద్భుతం. శరీరమే కాదు మనసుకు సంబంధించిన విషయాలని
కూడా రకరకాలుగా దృశ్యం చేశాడు కవి. సాధారణంగా వయస్సు మీద పడుతున్నప్పుడు వచ్చే
వివిధ వ్యాధులు, బాధలు,
బాధ్యతలు, సుఖదుఃఖాలన్నో ఈ రెక్కల కవిత్వంలో
వర్ణించాడు కవి. మన చుట్టూ కనిపించే చెట్టూ-చేమా ప్రకృతి అంతా కవిత్వమైంది.
ఒకదానిలో పుట్టుకను చూశాడు. మరొక దానిలో చైతన్యాన్ని చూశాడు. ఇంకొక దానిలో మానసిక
సంఘర్షణ చూశాడు. మానవ జీవితంలోని ఆటుపోట్లెన్నింటినో కవిత్వం గా మార్చాడు. పూల
మొక్కలు, గంధపు చెక్కలు, బూడిద,
సముద్రం, మనిషి, జంతువులు,
పాలు, నీళ్ళు, మరణం,
సుఖదుఃఖాలన్నీ కవితా వస్తువులే. ఈ కవిత్వంలో మన చుట్టూ ఉన్న ప్రకృతే మనకి కవిత్వమై మనోహరంగా
అనుభూతినిస్తుంది.
(విమల
సాహితీ సమితి మరియు శ్రీ త్యాగరాయ గానసభ ఆధ్వర్యంలో ది 18 నవంబర్ 2017 సాయంత్రం
హైదరాబాదులో జరిగిన ‘‘శ్రీ సుగమ్ బాబు సాహిత్యం - ఒక సమూలోచన’’ లో
సమర్పించిన ప్రసంగ పత్రం)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి