నువ్వు త్వరగా రావాలి!
నువ్వు
త్వరగా రావాలి
నువ్వు
మళ్ళీ నవ్వూతూ రావాలి
నువ్వు
కనిపించక
లేగదూడ
పాలుతాగడం లేదు
నువ్వు
కనిపించక
కొబ్బరిచెట్లు
విలవిల్లాడుతున్నాయి!
పొద్దున్నే
పలకరించే నీ నవ్వు లేక
పొలమంతా
ఎండిన గొంతుతో నెర్రలుబారుతోంది!
నీ
చేతి స్పర్శ తగల్లేదని
రొయ్యలు
మేత తినడం లేదు!
కిళ్ళీకొట్టులో
వాసన కోల్పోతున్న ఖైనీ...
ఎంతకీ
నిషాను అంటనంటున్న సారా...
వినిపించని
‘ ఆ రామాయణం’ వినాలనీ
నీకోసం
గ్రామం గ్రామమంతా
వెయ్యికళ్ళతో
ఎదురుచూస్తోంది.
ఈ
పేగుబంధాలు బాధతో
మెలితిరిగిపోతున్నాయి
నువ్వు
రావాలి
నువ్వు
మళ్ళీ మామూలుగా రావాలి!
-దార్ల
13-9-2016
(అన్నయ్య
త్వరగా కోలుకొని క్షేమంగా ఇంటికి రావాలని కోరుకుంటూ...)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి