ఆంగ్లభాష
అనేదొక వ్యామోహమనీ, అది నేర్చుకోవడం వల్లనే
ఉద్యోగావకాశాలు వస్తాయనేది కూడా ఒక భ్రమ అని ప్రముఖభాషాశాస్త్రవేత్త ఆచార్య గారపాటి
ఉమామహేశ్వరరావు అన్నారు. ఆంగ్లభాష ద్వారా ప్రపంచవ్యాప్తంగా సామ్రాజ్యవాదాన్ని
విస్తరించుకొనేే ఒక రహస్యవ్యూహం దాగుందని, దాన్ని పసిగట్టి
స్థానిక మాతృభాషలను పరిరక్షించుకోవడం నేటి అవసరమని ఆయన సోదాహరణంగా వివరించారు.
నిన్న (27-10-2016) హైదరాబాదు విశ్వవిద్యాలయంలో పరిశోధక
విద్యార్ధులు ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేకసమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
స్థానిక భాషలను అభ్యసించిన వారివల్లనే భారతదేశ స్థూల జాతీయోత్పత్తిలో అత్యధికశాతంలభిస్తోందనీ, కానీ, ఈ గణాంకాలను గుర్తించకుండా
ఆంగ్లభాషాధ్యయనం వల్లనే ఉపాధి లభిస్తున్నట్లు చాలామంది భ్రమపడుతున్నారని, దాన్ని ప్రజలు గుర్తించి చైతన్యవంతులవ్వాలని ఉద్భోధించారు. మాతృభాషలను
విస్మరించి ఆంగ్లమాధ్యమాన్నే నమ్ముకొంటే కొన్ని సంవత్సరాల తర్వాత తరాల మధ్య
అంతరాలతో పాటు మాతృభాషలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.
విద్యాభ్యాసాన్ని మాతృభాషలో
చదువుకోకపోవడం వల్ల అటు ఇంగ్లీషు, ఇటు మాతృభాషలూ రాకపోవడంతో రెంటికీ చెడ్డ రేవడులయ్యే
అయోమయస్థితిలో జాతి కూరుకుపోయే ప్రమాదం పొంచిఉందన్నారు. ప్రజలు సృజనాత్మకంగా
ఆలోచించలేక, కృత్రిమజీవితాలకు అలవాటు పడాల్సి వస్తుందన్నారు.
మొదట ముద్రణావ్యవస్థ నశిస్తుందనీ, తర్వాత ఆలోచనాశక్తి క్షీణిస్తుందనీ, క్రమేపీ ప్రజలు నిర్వీర్యమవుతారని, అటువంటప్పుడు అత్యధిక ప్రజలు విద్యకు, ఉపాధికి
దూరమైపోయే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే వచ్చీరాని ఇంగ్లీషుతో ప్రతి సంవత్సరం వేలాది
ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఉపాధిలేక రోడ్డున పడుతున్నారని ఆయన అన్నారు. స్థానిక
భాషలు ఎప్పుడైతే నశించిపోతాయో, ఆంగ్లభాషాధిపత్యం మరింత
ఎక్కువై నైపుణ్యం పేరుతో లక్షలాదిమందిని ఉద్యోగాలకు అనర్హులుగా చేసే
ప్రమాదం ఉందన్నారు. నిజానికి మాతృభాషలో విద్యాబోధన వల్లనే సృజనాత్మకంగా
ఆలోచించగలుగుతారని, అవసరమైనంతవరకు ఆంగ్లభాషను నేర్చుకున్నా, మాతృభాషల
వల్లనే దేశాభివృద్ధి కలగడంతో పాటు, జాతి ఆత్మవిశ్వాసంతో
మనగలుగుతుందని, దానికి ప్రజలు, మేధావులు
ఉద్యమించాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు.
ఈ సందర్భంగా ఛాన్సలర్ అవార్డులు పొందిన తెలుగు
శాఖ అధ్యాపకులు డా.దార్ల వెంకటేశ్వరరావు, డా.పమ్మి పవన్ కుమార్ లను పరిశోధకులు, విద్యార్థినీ
విద్యార్థుల తరపున ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావుగారు అభినందించి, సత్కరించారు.
ఇటీవలే ఆచార్య గారపాటి
ఉమామహేశ్వరరావుగారు పదవీవిరమణ పొందినప్పటికీ, మరలా వారి పదవిని మరికొంతకాలం పెంచిన సందర్భంగా పరిశోధకులు, విద్యార్థులు, అధ్యాపకులు ఆయన్ని ఘనంగా సత్కరించారు.
ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావుగార్ని సత్కరిస్తున్న డా.దార్ల వెంకటేశ్వరరావు, డా.పమ్మి పవన్ కుమార్ లు చిత్రంలో ఉన్నారు.
తెలుగుశాఖ ఆధ్వర్యంలో 28 అక్టోబరు 2016 న డా.దార్ల వెంకటేశ్వరరావుని సత్కరిస్తున్న శాఖాధ్యక్షులు ఆచార్య తుమ్మల రామకృష్ణ, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది చిత్రంలో ఉన్నారు. చిత్రంలో ఆచార్య తుమ్మల రామకృష్ణ, డా.భుజంగరెడ్డి, డా.పమ్మి పవన్ కుమార్, డా.డి.విజయలక్ష్మి. డా.డి.విజయకుమారి తదితరులున్నారు.
నిన్న జరిగిన ఆచార్య ఉమామహేశ్వరరావుగారు ప్రసంగించిన సభలో పాల్గొన్నపరిశోధకులు, విద్యార్ధినీ విద్యార్థులు
డా.దార్ల వెంకటేశ్వరరావుని సత్కరిస్తున్న తెలుగుశాఖ అధ్యాపకేతర సిబ్బంది కొడాలి భవానీ శంకర్, గణేష్ లతో పాటు తెలుగుశాఖాధ్యక్షులు చిత్రంలో ఉన్నారు.
1 కామెంట్:
సార్ మీరింక ఎన్నెన్నో పురస్కారాలు రావాలని కోరుతూ జై భీమ్
కామెంట్‌ను పోస్ట్ చేయండి