Wednesday, July 27, 2016

మనకాలపు మహా అస్తిత్వ ఉద్యమం ( నమస్తే తెలంగాణ , 7/26/2016 సౌజన్యంతో...)

నా అవగాహన ప్రకారం జీవితం గురించి నాకు ప్రస్తుతం తేలిన విషయం ఒకటుంది.జీవితం సూత్రబద్ధం కాదు, నీతిబద్ధం కాదు, అది అవసరబద్ధం. అవకాశబద్ధం. హృదయాకాంక్షల బద్ధం. ఎవరో బోధించారనో, ఏ నీతో కదిలించిందనో, ఏ సూత్రా లు ఆక్రమించాయనో మనుషులు వాటికగుణంగా నడుచుకోరు. జీవించే క్రమంలో ఎదురైన అవసరాలకు అనుగుణంగా, అవకాశాలకనుగుణంగా, వాటి నుం చి ఆయా వ్యక్తుల్లో కలిగిన ప్రత్యేకమైన తమవి మాత్రమే అయిన హృదయ స్పందనలకనుగుణంగా మనుషులు ప్రవర్తిస్తారు. అందులో భాగంగానే ఆశ లూ, నిరాశలూ,కోపాలూ, తిరుగుబాట్లూ, రాజీలూ, తర్కాలూ, వివేచనలూ, ఉద్యమాలూ, ఘర్షణలూ పుట్టకొస్తాయి. ఇవే తర్వాత కాలంలో సిద్ధాంతాలు గా, సూత్రాలుగా, మతతత్వాలుగా, తాత్విక అవగాహనలుగా, వాదాలుగా రూపొందుతాయి. వాటికి కొన్ని పేర్లూ, కొంతమంది కర్తలూ, నాయకులూ సమకూరటం సాధారణం.
ఆర్థిక అవసరాలకీ ఆ అవసరాలను పరిపూర్తి చేసుకోవడానికీ ఆ క్రమంలో తలెత్తిన న్యాయాన్యా య ప్రశ్నలనీ దోపిడీ, ఆధిపత్య సమస్యలనీ పరిష్కరించుకునే మానవ ప్రయత్నానికీ అందులో పాల్గొనే సమూహాల, వ్యక్తుల మానసికస్థాయికీ అనుగుణం గా వర్గపోరాటం బద్దలు కావటం, కొన్ని విజయా ల్నీ, కొన్ని అపజయాల్నీ చవిచూసి ఆ క్రమం ఒకానొక జనజీవన స్రవంతిగా స్థిరపడిపోవటం చూశాం. చూస్తున్నాం. దీంట్లో భాగంగానే ఆయా దశల్లో సందర్భాల్లో తారసపడిన అవకాశాలు మనుషుల ప్రయత్నాన్ని ప్రభావితం చేయటమే కాకుండా ఆ ప్రయత్నాల జయాపజయాల సాధ్యాసాధ్యాలను కూడా నిర్ణయించటంలో నియంత్రించటంలో తమ పాత్ర నిర్వర్తిస్తూ వచ్చాయి.


ఆత్మగౌరవ అవసరాల నుంచీ, అవమానాల ఇక్కట్ల నుంచి బయటపడాలనే తపన నుంచీ అం దుకు సహకరించిన, అందుబాట్లోకి వచ్చిన అవకాశాల నుంచీ కుల నిర్మూలనోద్యమాలు పెల్లుబికాయి. ఒక కులంలో పుట్టిన కారణంగా, ఒక స్త్రీగా పుట్టిన కారణంగా, ఒక పీడిత కుల స్త్రీగా పుట్టిన కారణంగా, లేదా ఒక ప్రాంతంలో, ఒక మతంలో పుట్టిన కారణంగా వంగి నంగి బతుకాల్సిన పరిస్థితి నుంచీ, ఇతరుల పెత్తనాన్నీ, ఆధిపత్యాన్నీ, హక్కుల రాహిత్యా న్నీ భరిస్తూ నిత్యం తక్కువతనానికీ, అభద్రతకూ, అనిశ్చితికీ గురవుతూ ప్రతిదాన్నీ తుడిచేసుకుపోవాల్సిన పరిస్థితి నుంచీ బయటపడాల్సిన అవసరం నుంచీ ఆకాంక్షల నుంచి పుట్టకొచ్చిన ఉద్యమాలు అస్తిత్వ ఉద్యమాలుగా వ్యవహరించబడుతున్నాయి. ఇప్పుడు వీస్తున్న గాలులు అస్తిత్వ ఉద్యమాలే. ఆయా ప్రజా సమూహాలు తమ అవసరాలకనుగుణంగా కదులుతూ అవకాశాలను వాడుకొంటూ-వ్యక్తులగా తమ యూనిక్ తమో జ్వరాలను ఆవిష్కరించుకుంటూ సాగిన సాగుగుతున్న ఉద్యమాలు.
ఈ ఉద్యమాలలో దళిత బహుజన ఉద్యమాలు అత్యధిక భాగాన్ని ఆక్రమించడమే కాకుండా అత్యం త ప్రభావాన్ని సమకాలీన సమాజం మీద వేశాయి. ఈ ఉద్యమాలు మొత్తం భారత చరిత్రను పునర్నిర్మించాయి. అబద్ధాలకీ, నిజాలకీ మధ్య ఉన్న సన్నని తేడానీ అబద్ధాలే నిజాలుగా చెలామణి అవుతున్న అఖిల భారతి ముసుగును విప్పి అసలు రూపం ఎరుకలోకి వచ్చేటట్లు చేశాయి.దళిత బహుజన భార తి అవసరాలకీ, ఆకాంక్షలకీ మానసికతకీ ఆలోచనోద్వేగాలకూ కాంక్రీట్ రూపాన్నిచ్చినయ్. పశువుల చర్మాల నుంచీ, చేపల వలల్నుంచీ సాకిరేవు బండల నుంచీ మాలమాదిగ వాడల కదుములు గట్టిన ఆక్రోశాల నుంచి కొండమంగలి కత్తుల్నుంచీ కల్లుగీతల్నించీ గొర్రెల మందల అరుపుల్నుంచీ నూలువడికే చేతుల్నుంచీ, కంసాలి,మేదర ఎరుకల యానాది బతుకుల కలుగుల్నుంచీ సాయిబుల అభద్ర, అదృ శ్య భయాల గాయల్నుంచి చిమ్ముతున్న సామూహిక లావానికి దళితబహుజన ఉద్యమం వ్యక్తీకరించింది. దళిత బహుజన రాజ్యాధికారాన్ని అసలు విముక్తిగా గుర్తిస్తూనే బుద్ధిస్టు పంథాలో మానసిక విముక్తిని అంతిమ లక్ష్యంగా చాటిచెప్పింది.


laxminarasaiah
ఆత్మగౌరవాన్ని లేకుండా చేసి అధిక సంఖ్యాకుల్ని ఆర్థికలేమికీ అమానవీకరణకూ గురిచేసిన కులవ్యవస్థ లో ఆత్మగౌరవ సంరక్షణ ద్వారానే ఆర్థిక బాగు అనే నినాదంనుంచి పుట్టుకొచ్చిందే రిజర్వేషన్ సిద్ధాంతం. ఈ రీత్యా రిజర్వేషన్ పరిరక్షణ దళిత బహుజన ఉద్యమంలో విలువను సంతరించుకుం ది. సరిగ్గా ఇక్కడే మాదిగల అస్తిత్వ ప్రత్యేకత ముం దుకొచ్చింది. ఎస్సీల్లో భాగంగా ఉంటూ ఉమ్మడి రిజర్వేషన్ల ద్వారా తమ కుల ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్నీ, దక్కని రిజర్వేషన్ ఫలాల్నీ చూసి చలించిపోయి, తమ ఇక్కట్లను అధిగమించాల్సిన అవసరాల నుంచీ, తమ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాల్సిన ఆవశ్యకత నుంచి మాదిగ దండోరా రంగం మీదికొచ్చింది. వర్గీకరణఅనే సింగిల్ పాయింట్‌తో మాదిగలు అణచిపెట్టుకున్న ఆక్రందనలనీ ఈ ఉద్యమం అడ్రస్ చేసింది. మూల మూలల్నుంచి మాదిగలు ముక్తకంఠంతో నినదించారు. డబ్బులిచ్చి, మందుపోపిస్తే తప్ప జనాన్ని రోడ్లమీదికి తీసుకురాలేని ఉద్యమాల దుస్థితుల నేపథ్యంలో తిండిలేని మాదిగలు తలాకాస్త తమ చేతి డబ్బులేసుకొని లక్షలసంఖ్యలో నగరాల్నీ, పట్టణాల్నీ, ముట్ట డి చేసిన వాస్తవం ఈ ఉద్యమాన్ని మన కాలపు మహా అస్తిత్వ ఉద్యమంలా అందరూ కొనియాడేటట్లు చేసింది. ఒక్కసారిగా మాదిగ సంస్కృతిక ఔన్నత్యం లోకం దృష్టికి వచ్చింది. మాదిగ సెన్స్, మాదిగ పరికరాలూ, మాదిగ వృత్తీ, మాదిగ చరిత్ర, ప్రతీకలూ, పురాణాలూ, ప్రతిమలూ, విలువల్తో మాదిగ సాహిత్యం విరుచుకుపడింది. 
దండోరా ఉద్యమం మాదిగల కింద ఉన్న ఎస్సీ కులాల మరింత దీనావస్థ మీద వెలుగును ప్రసరించింది. వారి తొక్కిపెట్టబడిన ఆత్మల ఆక్రందనలకూ, హృదయ రోదనలకూ ఊపిరి పోసింది. కులం పేరు చెప్పుకోటానికి భయపడే, సిగ్గుపడే బీసీ కులాలకు ధైర్యాన్నీ తెగువనూ మాదిగ అస్తిత్వ ఉద్యమం ప్రసాదించింది. అన్నికంటే మఖ్య విషయం మాదిగ ఉద్య మం మాత్రమే తెరమీదికి తెచ్చిన అంశం ఒకటుం ది. ఎస్సీ కులాల మధ్యకానీ, మొత్తం పీడిత కులాల మధ్య కానీ ఐక్యత అనేది ఆకాశం నుంచీ, అంతరాల నుంచీ ఊడిపడదనీ ఆయా కులాల మధ్య ఆర్థి క, సాంస్కృతిక సమఉజ్జీతనం సాధించటం ద్వారా నే అది సాధ్యపడుతుందనీ ఒక తాత్విక ఎరుకని అస్తిత్వ ఉద్యమాల అవగాహనకు సమకూర్చింది. విభజన ద్వారా ఐక్యత చెడుతుందనే మాల సోదర సోదరీమణులకు విభజన వల్లే ఐక్యత గట్టిపడుతుందనే భరోసాను ఈ ఉద్యమం ఇచ్చింది. ఇద్దరు సమ ఉజ్జీల మధ్యే ఐక్యత కలుగుతుందనీ, ఇద్దరు అసమానుల మధ్య అధికార సంబంధాలే ఉంటాయనీ అందరూ అంగీకరించే స్థితిని తెచ్చిందీ దండోరాయే. ఒక్కొక్క సామాజిక అస్తిత్వం ఒక్కొక్క ప్రత్యేక సాంఘిక అనుభవం నుంచి ఆవిర్భవించింది. సామాజిక అస్తిత్వాలన్నీ, అవి ఏ కులాలకీ, జెండ ర్స్‌కీ, ప్రాంతాలకీ చెందినవైనప్పటికీ, భౌతికమైనవే. నిర్దిష్ట సామాజిక అస్తిత్వాలు నిర్దిష్ట సామాజిక మానసిక అవసరాల ద్వారా, సంబంధాల ద్వారా, అవకాశాల ద్వారా ఉనికిలో ఉంటాయి. Joseph Butler అన్నట్లు Every thing is what it is and not another thing భావనను ప్రతిదీ దాని విలక్షణత ద్వారానే అది అదవుతుందని అర్థం చేసుకుంటూ వివిధ పీడిత కులాల అస్తిత్వ స్వభావం స్పష్టమవుతుంది. కులం,జెండర్, ప్రాంతం, తమను తాము అర్థం చేసుకున్న తీరులనూ, సమాజంలోని ఇతరులు తమతో వ్యవహరిస్తున్న తీరులోనూ అస్తిత్వం లేదా స్వీయత్వం ఎరుకలోకి వస్తాయని ఎరిక్‌సన్ అంటాడు. తనను గుర్తించని వ్యవస్థ మీదా, తనను తొక్కిపెడుతున్న వ్యవస్థ మీదా తిరుగబటం అంటే ముందు ఆ వ్యస్థని అది దానికాపాదించుకున్న ఉన్నతినీ గుర్తించకుండా నిరాకరించటమే అని దండరా నిరూపించింది. అందుకే మాదిగ దండోరా ఉద్య మం అన్ని అస్తిత్వ ఉద్యమాలకూ చుక్కానిగా మిగిలింది.
ఎన్నో అస్తిత్వాల సమాహారంగా ఉన్న మన దేశం లో ఆయా అస్తిత్వాల అవసరాల, అవకాశాల, హక్కుల సంరక్షణ కోసం జరిగే సంప్రదింపులూ, పోరాటాలూ సహృదయంతో అర్థం చేసుకోవటాలూ ప్రాముఖ్యాన్ని కలిగి ఉంటాయి. మాదిగలూ, మాల లూ ఈ స్ఫూర్తితో ముందుకెళ్లాల్సి ఉంటుంది. ప్రభుత్వాలు ఆయా అస్తిత్వ సమూహాల సమస్యల అవసరాల ప్రత్యేకతల్ని ప్రజాస్వామికతల్నీ దృష్టిలో ఉంచుకుని ప్రతి విలక్షణ సమూహానికి న్యాయం జరిగేట్లు చూసే నిష్ఫక్షపాత మధ్యవర్తిగా ఉండాలి. కానీ ఏ సమూహం నుంచి ఎన్ని ఓట్లు రావచ్చనే దృష్టి నుంచి నిర్ణయాలు ఉండరాదు.
అస్తిత్వ ఉద్యమాలలో సాధారణంగా నేను, మేము అనే అవగాహనే ప్రముఖంగా ఉంటుంది. ప్రతి కులం దాని చుట్టూనో దానికి చెందిన కొన్ని కులాల చుట్టూనో తిరుగుతంది. ఏ ప్రయోజనాల కోసం అస్తిత్వ ఉద్యమాలు ఆవిర్భవించాయో ఆ ప్రయోజనాల సాధన అనంతరం, నేను, మేము అనే స్పృహ నుంచి మనం అనే స్పృహలోకి రావా ల్సి ఉంది. ఫూలే అన్నట్టు మన కోసం మనం నిలబడుతూ అందరి కోసం నడుం కట్టాలి. అస్తిత్వ ఉద్యమాల ఆది గురువు ఫూలే.. సంకుచితత్వాన్నీ, ఆత్మపరత్వాన్నీ, స్వార్థాన్ని వ్యతిరేకించాడు. దళిత బహుజన రాజ్యాధికార ఆవశ్యకతను నొక్కి చెప్పిన అంబేద్కర్.. మానసిక విముక్తే అంతిమ విముక్తి అంటాడు. భారత సమాజం ప్రజాస్వామ్యీకరించబడాలంటే మనుషుల మనసుల్ని వికసింపజేసే బుద్ధిజమే సరియైనదని అంబేద్కర్, బోధనల ద్వారా, ఆచరణ ద్వారా విపులీకరించాడు
.

No comments: