నెమలి కన్నులు కవితా శీర్షికన కవితా సంపుటిని పాఠకలోకం ముందుకు తెచ్చాడు డాక్టర్ దార్ల వెంకటేశ్వరరావు. దీనికిగాను డాక్టర్ జె.భీమయ్య ముందుమాట రాయడం జరిగింది. నెమలి కన్నులు కవితా సంపుటిని తాను ఈ లోకంలో అమితంగా ప్రేమించిన అమ్మకు నాన్నకు అంకితమిచ్చాడు. ఆ దేవుడే దిగివచ్చినా మొదటి ప్రాధాన్యత తల్లిదండ్రులకే అన్నాడు కనుక కవి ధన్యజీవి. ఈ కవితా సంపుటికి కొంతమంది మేధావి వర్గం కూడా తమ విలువైన అభిప్రాయాలు రాయడం జరిగింది. గోదావరి జిల్లా కోనసీమ నుడికారం బాగా ప్రయోగించారు. ఉండ చుట్టుకుపోయినట్లు, తెల్లవారగట్ల, ఆయ్, కొరమేను, నెమలి కన్నులులో వస్తు వైవిధ్యముంది. వస్తు విస్తృతివుంది. తన కవితా వస్తువు ఎంపికలో ఒక భిన్నమైన కోణాన్ని ఎంచుకున్నారు. వచన సాహిత్యంలోనే విలువైన వ్యాకరణం ఉంటుంది అంటారు మహాకవి శ్రీశ్రీ వచనం రాయడమే బహుకష్టమంటారాయన.
భాషలో డాక్టరేట్ పొందిన వ్యక్తి తన సాహిత్యానికి ఎక్కువగా తను పుట్టి పెరిగిన గ్రామాన్ని తన తల్లిదండ్రులను తన బాల్యంలోని తన చుట్టూ తిరిగాడిన జనాల భాషని, గోషని పట్టుకున్నాడు. దానిని కవిత్వీకరించాడు కవి. ఇది కదా కవిత్వమంటే ప్రజాయుద్ధ నౌక గద్దర్ ఒక మాటంటారు. ప్రజల నాల్కలమీద నుడికారాన్ని తిరిగి ప్రజలకు కవిత్వీకరించి అందించడం కవి చేస్తున్నపని అందుకే కవులు కళాకారులు, పాఠకులు ప్రజలకు బుుణపడి వుంటారు అంటాడాయన. దార్ల విద్యార్థి దశ నుండే కవిత్వం రాయడం ప్రారంభించాడు. ఈయనకు కవిత్వం కొత్తకాదు. కవిత్వంతో పాతికేళ్ళ అనుబంధం ఉంది. పరిచయాలు అక్కరలేని వ్యక్తి. వస్తువు, శిల్పము, ఎత్తుగడ, ముగింపులలో ఎక్కడా రాజీపడడు రచయిత. మావూరు నవ్వింది కవితలో తనవేదనని పాఠకులతో పంచుకుంటాడు. మా అమ్మపడిన బాధంతా గుర్తొచ్చి/ అన్నం తినడం అమాంతం ఆపేస్తుంటాను/ నిస్సహాయంగా నాలోకి నేను ఉండగట్టుకు పోతుంటాను. కవి నిశ్చేస్టుడై ఘనీభవించిపోతుంటాడు.
అంతర్జాతీయ మార్కెట్లో పవిత్రప్రేమ గురించి చెబుతూ లఘు సమాసాలతో అలంకారం తొడిగిన పదబంధాలు వాక్యాలని కావ్యం వాటేసుకుంటుంది. రెండు దేహాలు కలిసినట్టు ఇదికదా? కవిత్వమంటే చందమామని వదిలి ఉండలేనని / ఒట్టేసుకున్న వెన్నెల/ ఏ సూర్యకిరణ స్నానం లోనో వెలిసిపోయి/ మార్కెట్ మాయాజాలంలో పవిత్రప్రేమలు మాయమై మనిషితనము మంటగలిసి కేవలం ఆర్థిక సంబంధాలే మనుష్యుల మధ్య మిగులుతున్నాయని కవి ఆవేదన చెందాడు. హాస్టల్లో అమ్మ కవిత ఆకలి మంటలతో పెనుగులాడి ఉన్నత విద్యనభ్యసించిన ప్రతీ హృదయాన్ని మెలిపెడుతుంది. కాకి మాధవరావు కావచ్చు, కత్తి చంద్రయ్య కావచ్చు, ప్రదీప్ చంద్రకావచ్చు. ఈ రోజు హాస్టల్లలో చదువుకుంటున్న ప్రతీ పేద విద్యార్థిని ఆ సన్నివేశం ఓమారు అమాంతం తన వెనకటి జీవితంలోకి లాక్కెళ్ళుతుంది.
మా ఊరి పెళ్ళి పందిళ్ళలో/ ఆకలిపాత్రనై/ అమ్మచేతిలో ఒదిగినప్పుడు/ చెత్తకుప్పలో పడేసే భోజనం అప్పుడప్పుడూ మా హాస్టల్లో చూస్తుంటాను. కవి నిస్సహాయుడై చూస్తుంటాను అంటాడు.
కోస్తా మాదిగోళ్ళు తెలంగాణా బాటలోనే అనే కవితలో కవి మేము కూడా మీలానే మాకు రావాల్సినవన్నీ మాకివ్వమని మా సోదరులతో పోరాడుతున్నాం. ఈ హైదరాబాద్‌కు ఈ తెలంగాణాకు మీమీద పెత్తనం చేయడానికి రాలే. మీ అధికారాన్ని గుంజుకోవడానికో, మీ బంజరు భూముల్ని కబ్జాచేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికో కాదు సుమా, మేమూ పేదవారమే అంటూ గోదావరి కోనసీమ మాండలికంలో తన వేదనను వినయంగా, గౌరవంగా సుతిమెత్తగా చురకలేసాడు కవి.
వర్గీకరణ వాదం కోసం తనను తాను నిలువునా దహించుకున్న పొన్నాల సురేంద్ర మాదిగ కోసం ఒక పెట్రోల్ సంతకం అంటూ కవి స్వరం గంభీరమయ్యింది. నిలబడ్డా, ఆవేశంతో ప్రశ్నించాడు. కొంగవాలు కత్తి ఎత్తి జాంబవుడిలా న్యాయమైన పోరాటం గురించి సమాజానికి, ప్రశ్నవేశాడు. మీరింకా ఉమ్మడి బావుల్ని/ మూకుమ్మడిగానే తోడుకోండి/ మీరింకా సినిమా నటీమణుల త్యాగాల్ని / విదేశీరాణుల ప్రణయాల్ని పరవశించిరాసుకోండి/ అంటూ సురేందర్‌లా మా ప్రాణాన్ని కూడా జెండాను చేసి ఎగరేస్తాం. మా కలాల నిండా మానెత్తురును సిరాగా నింపుకుంటాం/ అంటూ తన కవితలో ఓ ధిక్కార స్వరాన్ని వినిపించాడు దార్ల.
మాదిగ మ్యానిఫెస్టో కవితలో ఒక అంటరానివాడు ఇంకొకరిని అంటరానివారిగా చూడటం ఎంత విడ్డూరం/ అంటరానితనంలో/ మళ్ళీ అంటరాని తనం పెంచే/ ఇంటర్ సుపీరియారిటీ భరించలేక/ అంతరాంతరాల్లోని అగ్నిపర్వతం పగిలిందిప్పుడే. వామపక్షాలు, స్త్రీవాదం, మావోయిజం, మార్క్సిజం, ట్రాన్స్‌జండర్, పాలస్తీనా, అన్నీ వాదాల్లో ముందుండి ప్రపంచ రాజకీయాలదాకా మాసోదరులు మాట్లాడుతుంటారు. వర్గీకరణ వాదం వచ్చేసరికి మాట దాటవేస్తారు. అందితే స్వజాతినే తినేస్తున్న అవకాశవాద కొరమీనుల సమూహం పాడిన/ సమైక్యతా గీతాలనూ విన్నాను. మాదిగ మానిఫెస్టోలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్‌లా ధవళ వస్త్ర జిలుగుల్ని మెరిపించడం దళితులంతా బాబు జగజ్జీవన్‌రామ్‌లా అధికారంతో పోటీపడటం, మహాకవి గుర్రం జాషువాలా కమ్మని కావ్యాన్నాలపించండి అంటూ ఓ మంచి సందేశాన్నిచ్చాడు. దార్ల వెంకటేశ్వరరావు కవిత్వం వేరు. జీవితం వేరు కాదు జీవితమే కవిత్వమైనవాడు. జీవితాన్నే కవిత్వీకరించినవాడు. పేదవారే నిజమైన ప్రేమికులు. దళితులే దయగలవారు. ఎందుకంటే కష్టం, దుఃఖం తెలిసినవారు కనుక ఎదుటివారి కష్టాన్ని ఎరుగుదురు కనుక. తనలాగే తన పొరుగు వారిని కూడా ప్రేమించాలనే మనస్తత్వం ఉండాలని దార్ల తన నెమలి కన్నుల కవిత్వం చదివిన తర్వాత మనకు విశదమౌతుంది. నెమలి కన్నులులో 91 కవితలున్నవి. ఇది ఓ మంచి కావ్యం. అందరూ చదవాల్సిన కవిత్వం.
-
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి