"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

31 July, 2015

ప్రతిధ్వనించిన ప్రపంచీకరణ నిరసన ధ్వని


‘ప్రతి ఋతువు  నన్నెక్కిరిస్తోంది పేరుతో మిత్రుడు  ఉడుముల ఈరన్నగారు ఒక కవితాసంపుటిని ప్రచురిస్తూ నా అభిప్రాయాన్ని రాసి పంపించమన్నాడు. దీనిలో 25 కవితలున్నాయి. ప్రతి కవితా ఏదొక సామాజిక సమస్యను స్పృశిస్తూనే ఉంది. సాధారణంగా కవి తన చుట్టూ జరుగుతున్న సంఘటనల్ని తనదైన దృష్టితో పరిశీలిస్తాడు. కవి సామాజిక చైతన్య శీలం కలిగినవాడైతే సమాజసమస్యలు ఆ ప్రతిస్పందనల్లో కనిపిస్తాయి. కవి సామాజిక సమస్యలకు దూరంగా జీవిస్తున్నవాడైతే సాధారణంగా ఆ కవి తీసుకునే వస్తువులన్నీ అంతర్ముఖత్వానికి చెందినవై ఉంటాయి. వాటిలో భావవాద ఛాయలు ఎక్కువై, భౌతిక వాస్తవికతకు దూరంగా జరిగిపోతుంటాడు. చెప్పేదేదైనా కళాత్మకంగా ఉండాలంటూ సౌందర్యవాదాన్ని సమర్థిస్తుంటాడు. ఉడుముల ఈరన్నగారు సామాజిక వాస్తవికతను తన కవితల్లో ప్రతిఫలించాడు. తన పుట్టి పెరిగిన కులం, ప్రాంతం తనకిచ్చిన జీవిత వాస్తవం నుండి సమాజాన్ని పరిశీలించడంలో జీవితానుభవకవిత్వం వ్యక్తమయేలా జాగ్రత్తపడ్డాడు. ఈ కవిత్వంలో భావచిత్రాలు, ప్రతీకలు, ధ్వని వంటి ఆలంకారిక ధోరణుల ప్రదర్శన లేదు. కవిత్వమంతా జీవితంలాగా, జీవితమంతా కవిత్వంలాగ కొనసాగింది.
          సమకాలీన జీవితాన్ని పరిశీలిస్తే పుట్టిన కులం  కొంత మందికి గౌరవాన్నిస్తే, మరి కొందరికి అవమానాల్ని, ఆకల్ని ఇస్తోంది. తాను పుట్టిన కులాన్ని దాచుకోలేదు. మాదిగ అని చెప్పుకుంటూనే
            ‘‘నాకులం పురిటి వాసన     
            నన్నెంటాడుతూనే ఉంది’’ (తప్పెట శబ్ధ తరంగాలు) అంటూనే తానీ కులంలో పుట్టడం వల్ల అన్ని కులాల్ని నిందించాలనే స్వభావం కవికి లేకపోవడం కవులకుండాల్సిన విశాల దృష్టిని ప్రదర్శించేలా ఉంది. పునాదిలోని ఆర్థిక విషయాలే ఉపరితలంలోని అన్ని అంశాల్ని ప్రభావితం చేస్తాయని చెప్తున్న మేధావులు కూడా కులాన్ని వదల్లేకపోతున్నారు. వ్యక్తిగత ఆస్తులుండకూడదని చెప్పే సిద్ధాంతకర్తలే మేడలు మీద మేడలు కట్టుకుంటున్నారు.
            ‘‘ఉపరితలం నుండి
            మొదలైన మార్పులు
            పునాదిని పెకలించవచ్చు
            పునాది పగల కొట్టిన
            ఉపరితలం
            ఉవ్వెత్తున ఎగసి పడుతుంది’’ (జీవన వేదం) కాబట్టి సిద్ధాంతాలు చెప్పడం ఎంత ముఖ్యమో, దాన్ని ఆచరించి చూపడం కూడా అత్యంతముఖ్యమనేది ధ్వనిపంపజేస్తున్నాడు కవి. కులం మరొకులంపై దాడులు చేయడమనేది లక్ష్మింపేట సంఘటన నిరూపించింది. ఈ కవి నాగప్పగారి సుందర్‌ రాజు కవిత్వాన్ని, సాహిత్యాన్ని అభిమానిస్తాడు. స్థానిక సమస్యల్ని కవిత్వీకరించాడు. ఈ కవితా సంపుటి శీర్షికలో వాచ్యంగా చూసినప్పుడు ఋతువులు మాత్రమే కనిపిస్తాయి. కానీ, అన్ని కాలాల్లోను, అన్నిచోట్లా మోసపోతున్న మానవుడిని దీనిలో స్ఫురింపజేశాడు కవి. అందుకే దీనిలోని కవితా వస్తువు విశ్వవ్యాప్తమయ్యింది. కవి కేవలం తన కులంతో ఆగిపోలేదు. సామాజిక రుగ్మతలపై పోరాడేవాళ్లందరినీ కులాతీతంగా తనవర్గంగానే ఆత్మీకరించుకున్నాడు. ఇప్పుడు అందరి సమస్య ప్రపంచీకరణగా గుర్తించాడు.
            ‘‘తిండి గింజెలు పండే
            సారవంతమైన సాగు భూమి
            సెజ్‌ల మయమౌతున్నా...
            వ్యవసాయ రైతు
            సేద్యానికి చారెడు  భూమిలేక
            వలసల బాట పడుతున్నా...
            రియల్‌ ఎస్టేట్‌ భూదందా
            బంగారు భూమిని
            బజారులో పెడుతున్నా
            కంచాలను సిద్దం చేసుకోండి
            వడ్డిస్తా నంటోంది రాజ్యం’’ (సదా  సిద్దమే) ప్రపంచీకరణ వల్ల వస్తున్న విపత్తులను ఎన్నింటినో ఈ కవిత్వంలో వర్ణించాడు కవి. వాతావరణం నుండి ఆర్థిక పరిస్థితుల వరకు అనేక విషయాలపై స్పందించాడు. మావోయిస్టులను లొంగిపొమ్మని చెప్పినంత సులువుగా వారిని జీవన స్రవంతిలోకి తీసుకోని ద్వంద్వ నీతిని ఎండగడుతున్నాడు. వర్గీకరణను సమర్థిస్తున్నాడు. మొత్తం మీదు మానవుడ్ని అదీ పీడితుడైన మానవుడి పక్షాన నిలబడి వాదిస్తున్నాడు అందుకే ఈ కవిత్వం చదవదగిందని ఆహ్వానిస్తున్నాను. చక్కని కవిత్వాన్ని రాసిన ఉడుముల ఈరన్నగార్ని అభినందిస్తున్నాను. ఈయన కలం నుండి మరిన్ని కవితలు వెలువడాలని ఆకాంక్షిస్నున్నాను.

                                                             -డా॥దార్ల వెంకటేశ్వరరావు
                                                                 అసోసియేట్ ప్రొఫెసరు, తెలుగుశాఖ,
                                                                   సెంట్రల్‌ యూనివర్సిటి, హైదరాబాదు-46
                                                              

No comments: