ప్రముఖ సంస్కృత పండితుడు, పరిశోధకుడు ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడు గారు అనారోగ్యంతో మరణించారని పత్రికల్లో చదివాను. ఆయన మరణానికి చింతిస్తున్నాను. గొప్పపండితుడైనప్పటికీ యువకులను ప్రోత్సహించే గుణం ఆయనలో ఉంది. హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో నాకు లెక్చరర్ నుండి సీనియర్ లెక్చరర్ పదోన్నతి కల్పించడానికి ఉద్దేశించిన ఇంటర్వ్యూ కమిటీలో ఆయన కూడా ఒకరు. ఆయనతో పాటు ఆ కమిటీలో ఆచార్య శలాకరఘునాథశర్మ మరికొంతమంది ఉన్నారు. వాళ్ళను ఇంటర్వ్యూలో చూసి ఒకరకమైన వణుకు వచ్చింది. ఎందుకంటే అందరూ హేమాహేమీలు. ఆనందవర్ధనుని ధ్వన్యాలోకం, మమ్ముటుని కావ్యప్రకాశం, దండి కావ్యాదర్శం, భామహుని కావ్యాలంకారం, క్షేమేంద్రుని ఔచిత్య విచారచర్చ మొదలైన సంస్కృత లక్షణ గ్రంథాలను ఆయన తెలుగు వ్యాఖ్యానంతో అందించారు. వీటితో పాటు ఆయన రాసిన రామాయణం గొప్పగా ఉంటుంది.
సంస్కృతసాహిత్య చరిత్ర కూడా రాశారు. అంత పండితుడైన వ్యక్తి నాకు పదోన్నతి కలిగించినందుకు అప్పుడు పొంగిపోయాను. ఆయన మరణించారని తెలిసి చాలా బాధ అనిపిస్తోంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢసానుభూతిని తెలియజేస్తున్నాను.
- డా.దార్ల వెంకటేశ్వరరావు,
అసోసియేటు ప్రొఫెసరు,
సెంట్రల్ యూనివర్సిటి, హైదరాబాదు
|
అనారోగ్యంతో కన్నుమూత
గురువు, కవి, విమర్శకుడు, వ్యాసకర్త, అనువాదకుడిగా అసమాన ప్రతిభ
ఓయూ సాంస్కృతిక విభాగానికి విస్తృత సేవ 2011లో పద్మశ్రీతో గౌరవించిన భారత ప్రభుత్వం నేడు ఉదయం 11 గంటలకు అంత్యక్రియలు హైదరాబాద్ సిటీ, జూన్ 24 (ఆంధ్రజ్యోతి):బహుముఖ ప్రజ్ఞాశాలి, సంస్కృత పండితుడు.. మహామహోపాధ్యాయ పుల్లెల శ్రీరామచంద్రుడు (88) ఇక లేరు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. బుధవారం సాయంత్రం 4గంటలకు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. 1927 అక్టోబర్ 24న తూర్పు గోదావరి జిల్లా అమలాపురం సమీపంలోని ఇందుపల్లి గ్రామంలో జన్మించిన శ్రీరామచంద్రుడు సంస్కృతంలో మూడు మాస్టర్ డిగ్రీలు చేశారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుంచి హిందీ, ఇంగ్లి్‌షలో మాస్టర్ డిగ్రీని పొందిన ఆయన.. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి సంస్కృతంలో పీహెచ్‌డీ చేశారు. తెలుగు, సంస్కృత భాషల్లో 175కు పైగా రచనలు చేశారు. 10 వేల పేజీలతో 7 భాగాలుగా వాల్మీకి రామాయణాన్ని తెలుగులోకి అనువదించారు. అలంకార శాస్త్ర చరిత్ర, కౌటిలీయం అర్థశాస్త్రమ్, భరతముని ప్రణీతం నాట్య శాస్త్రమ్, బ్రహ్మసూత్ర శాఙ్కర భాష్యమ్, ధమ్మపదం, హిందూమతం, కాళిదాస కవితా విలాసము, కౌణ్డిన్యస్మతిః, లఘుసిద్ధాన్తకౌముదీ.. తదితర రచనలను తెలుగువారికి అందించారు. ఓయూ సాంస్కృతిక విభాగానికి దాదాపుగా 11 ఏళ్లపాటు డైరెక్టర్‌గా వ్యవహరించారు. గురువుగా, కవిగా, విమర్శకుడిగా, వ్యంగ్య వ్యాసకర్తగా, అనువాదకుడిగా భిన్న పాత్రల్ని విజయవంతంగా పోషించారు. సాహిత్య రంగానికి ఆయన చేసిన సేవల్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2011లో పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. తెలుగు యూనివర్సిటీ ఆయనకు గౌరవ డాక్డరేట్‌ను ప్రదానం చేసింది. కాగా.. గురువారం ఉదయం 11 గంలకు ఈఎ్‌సఐ శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ప్రముఖుల నివాళి.. మహామహోపాధ్యాయ పుల్లెల శ్రీరామచంద్రుడు మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సంస్కృత భాషలో, సాహిత్య రంగంలో అపారమైన నిబద్ధత కలిగిన పండితుడిని కోల్పోవడం బాధాకరమని జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత సి.నారాయణరెడ్డి అన్నారు. వాల్మీకి రామాయణాన్ని అత్యంత సాధికారికంగా తెలుగులోకి అనువదించి తెలుగు ప్రజలకు గొప్ప సంపదను అందించిన మహనీయులని కొనియాడారు. ఆయన సంస్కృత సాహిత్య సముద్రాన్ని మధించి తెలుగువారికి అమృతాన్ని పంచారని తెలుగు యూనివర్సిటీ వీసీ ఎల్లూరి శివారెడ్డి అన్నారు. సంస్కృత సాహిత్యానికి, తెలుగు ప్రజలకు ఆయన మరణం తీరనిలోటు అని ఆంధ్రసారస్వత పరిషత్తు విశ్రాంత అధ్యాపకులు డా.కేఏ సింగరాచార్యులు అన్నారు. ఇంకా.. పలువురు సాహితీ, అధికార, న్యాయ ప్రముఖులు పుల్లెల శ్రీరామచంద్రుడు మృతి పట్ల సంతాపం తెలిపారు. దేశం గర్వించదగ్గ ఆ పండితుడు లేని లోటు తీర్చలేనిదని ఆవేదన వెలిబుచ్చారు.
http://www.andhrajyothy.com/Artical.aspx?SID=122805&SupID=20 25 జూలై 2015 సౌజన్యంతో
|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి