సూర్య దినపత్రికలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్న శ్రీ హరనాథ్ గారు ఈ రోజు ఉదయం గుండెపోటుతో మరణించారని తెలిసింది. హరనాథ్ గారి కుటుంబసభ్యులకు నా హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతికలగాలని కోరుకుంటున్నాను.
శ్రీ హరినాథ్ గారు సూర్య దినపత్రికలో చేరక ముందు నాకు పరిచయం లేదు. నేను రచనలు పంపుతున్న నేపథ్యంలో ఆయన నాకు పరిచయం అయ్యారు. నా రచనలకు ఎంతగానో ప్రాధాన్యాన్నిచ్చి ప్రోత్సహించారు. ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడేవారు. ఆయన బ్రాహ్మణుడైనప్పటికీ అన్ని భావజాలాలకు ప్రాధాన్యాన్నిచ్చేవారు. ఆయనతో నాకున్న సంభాషణను బట్టి ఆయన ప్రగతిశీలవాదిగా అనిపించేవారు. మార్క్సిజం పట్ల చాలా నమ్మకం, ఆసక్తి వ్యక్తపరిచేవారు. యువతరాన్ని సాహిత్యంలో బాగా ప్రోత్సహించాలనేవారు. అందువల్లనే యువకులకు ఎక్కువ ప్రాధాన్యాన్నిస్తున్నట్లు చెప్పేవారు. వ్యక్తిగతంగా కూడా ఆయన్ని కలిశాను. మంచి మనిషి. కొంచెం ‘అలవాటు’ ఉంది. అందువల్ల రాత్రి పదితర్వాత ఆయనతో మాట్లాడేవాణ్ణి కాదు. మానలేకపోతున్నాననేవారు. ఆరోగ్యం పాడవుతుందని తెలిసినా దానికి కొంచెబాగానే అలవాటయ్యారనిపించేది. ఆయన వ్యక్తిగత విషయాలను పంచుకోవడానికి ఇష్టపడేవారు కాదు. విప్లవరచనలను, సోవియట్ సాహిత్యాన్ని బాగా చదువుకున్న వ్యక్తిలా నాకు అనిపించేవారు. అలాగే గురజాడ అంటే మహాప్రాణంగా మాట్లేడేవారు. మొన్న నా పుస్తకం ‘ సాహితీమూర్తులు-స్ఫూర్తులు’కవర్ పేజీపై గురజాడవారిని వేసినందుకు పొంగిపోయారు. కింద నాపేరు చదివి గురజాడ అని రాయకుండా మీపేరు రాసుకున్నారేమిటని ఆటపట్టించారు కూడా. సాహిత్య విమర్శలో రారా అంటే మహా ఇష్టపడే వ్యక్తి. ఆయన చనిపోయారని తెలిసి మనసంతా చాలా బాధగా ఉంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి