"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

30 మార్చి, 2015

మార్చి 30 నాకొక మానని గాయం

నన్నూ మా నాన్నను
విడదీసిందా రోజు
అది 2009 మార్చి 30 
కాలం ఒక ప్రవాహం
దాన్నెవరూ ఆపలేరేమో
కాలం రకరకాల దృశ్యాల సంగమం
దాన్ని చూడాల్సిందేనేమో
నాన్న గురించి 2005లో అనుకుంటాను-ఒక కవిత రాసుకున్నాను.
అప్పటికి నాన్నున్నాడు
ఆ కవిత నాన్నకోసమే రాశానా?
నాలోనే నాన్నను చూసుకున్నానా?
దేన్నయినా చూపించి నీగురించే దీన్ని రాస్తున్నానంటే....
ఒక నవ్వు నవ్వి... ఊరుకునేవాడు.
దానిలో అదుంది... ఇదుందని చెప్పాలనుకోలేదు.
ఆ నవ్వు కోటి భావాల్ని పలికించేది
ఆ మౌనం కోటానుకోట్ల సంఘర్షణల్ని నా ముందు నిలిపేది
ఆ కాగితాన్నితన చేతిలోకి తీసుకొని
ఒక మృదవైన స్ఫర్శనేదో దానికందించేవాడు
తన ఫోటో ముఖచిత్రంగా వేసిన పుస్తకాన్ని చూసి
నన్ను చూసి కళ్ళలో ఏవో సుడులు తిరుగుతున్న కన్నీళ్ళనాపుకొనేవాడు.

ఆ పుస్తకంలో నాన్న గురించిన కవితలున్నాయి. ఈ కవితమాత్రం అప్పటికి ఆ పుస్తకంలో చేరలేదు. మాటల సందర్భంలో కాసుల ప్రతాపరెడ్డిగారు దాన్ని చదివారు. పత్రికలకెందుకు పంపలేదన్నారు. నాకప్పటికి ‘వార్త ఆదివారం అనుబంధం’లో రావాలనే ఆశుండేది. సాహిత్యం గురించి మంచి వ్యాసాలు, కవితలు వచ్చేవి. ఆ అనుబంధాన్ని గుడిపాటి గారు ఎడిట్ చేసేవారని తెలిసింది. ఆ కవితని కాసుల ప్రతాపరెడ్డిగారు తీసుకున్నారు. ఒక ఆదివారం ఆ కవిత వార్త అనుబంధంలో అచ్చయి నాక్కనిపించింది.
***
వలస పక్షికిప్పుడేదో విరిగిన చప్పుడు
చెట్టునిండా పండ్లు
కొమ్మల్నీ, రెమ్మల్నీ అలముకున్న ఏకాకులు!

పండిన వెలితి
ఎంత తీయని బంధం
నోట్లో ఊరుతున్న కాకరకాయ రసం!

పొద్దున్నే భుజాన్నెక్కుతున్న సూర్యుడు
రైలు దిగినప్పుడు
వెన్నెలవుతాడు!

పాదలేపనాలు, అగ్నిహోత్రాలు మంత్ర మహిమలు
యంత్రభూతాలు, హిమాలయాలు, స్వర్గనరకాలు
ఏకదాటిగా కురిపించిన రసం
ఉక్కిరి బిక్కిరై చందమామ కౌగిళ్ళలో రసాభాసం!
తట్టుకోలేకపోతున్నాను
కాసేపు మట్టివాసనల్నీ, పైరుగాలినీ పీల్చాలి!
ఆవిగో నీటికయ్యల్లో ఎగిరిపడే చేదిపరిగలు

నాన్న విసిరిన పువ్వుల్లాంటి వలలో  పడే నీటిదండలు

ఆకాశమంత ఎత్తునుండే నాన్న అందించే ముంజికాయలు
పొలాల్లో పలకరిస్తున్న కందికాయలు..
" నమో వేంకటేశానమోతిరుమలేశా…"
టూరింగు టాకీసులో సినిమా మొదలవుతుంది
నాన్న భుజమ్మీద చంటిపిల్లాడినైపోవాలి
కానీ..అదిగో నాన్న వంట్లో మూలుగులన్నీ పీల్చేసి
చిన్నన్నయ్య జీవితాన్నంతా తాగేసి
కుమ్మనరాజు కొబ్బరితో ట దారికడ్డంగా రక్తం తాగే రాక్షసిలా
                                                                     
***
 ఆ ఇద్దరికీ ధన్యవాదాలు చెప్పుకున్నాను.నాకిష్టమైన కవిత.నాకిష్టమైన పత్రికలో వచ్చింది.అన్వర్ గారి సంపాదకత్వంలో సృజనలోకం- వరంగల్ వారి ‘నాయిన’ కవితా సంకలనంలోనూ పునర్ముద్రణ పొందింది!
***

నాన్నా... నువ్వు నా బాల్యాన్నంతా తీపిగుర్తులతో నింపావు
నన్నుా నీతో పాటే పొలాలకు తీసుకెళ్ళేవాడివి
నువ్వు పొలంలో వరికోత కోస్తుంటే
నీచేతిలో కొడవలి వణికిపోయేది
 పోటీపడి మరీ వరికంకులన్నీ నీచేతిలో ఒదిగిపోయేవి
నాకూ చాలా సరదా అనిపించేది
నేనూ అలా  కోయాలనుకునేవాణ్ణి
ప్రయత్నించి వరితో పాటు చేయినీ కోసుకున్నప్పుడు
నువ్వు పడిన హడావిడిలో నాకా బాధే తెలిసేదికాదు

నాన్నా... నువ్వు పొలం దున్నుతుంటే
అలుపూ సొలుపూ లేకుండా నీతో పోటీపడి మరీ
ఆ ఎద్దులు పరిగెట్టాలనుకునేవి
నీ వెనకాలో
నీ ముందో
ఎవరొకరు నాగళ్ళు దున్నతుంటే నిన్ను చూసి వాళ్ళు
వాళ్ళని చూసి నువ్వూ పోటీ పడుతుంటే
పనిలోనే పసందుంటుందనిపించేది
నాన్నా మన పొలం దున్నడానికి
నీతో పాటు రాజుగారు, పెద్దకాపు, చిన్నకాపు అంతా వాచ్చేవాళ్ళేమిటి?
వాళ్ళకేమీ కూలిచ్చేవాడివి కాదు కదా
వాళ్ళకేమీ మనదగ్గర 
కూలితీసుకోవాల్సిన అవసరం లేదనేవాడివి కదా
మరెందుకొచ్చేవారు నాన్నా?
నాన్నా నిన్ను అడగాల్సినవి చాలా ఉన్నాయి
నువ్వు నాకు చెప్పాల్సినవీ చాలా ఉన్నాయి
నీకన్ని పనల్నెవరు నేర్పారు నాన్నా
తెల్లవారితే ఒకరోజు పొలం పనికెళ్ళేవాడివి
ఇంకోరోజు కొబ్బరికాయలు దింపుతీసేవాడివి
మరోరోజు తాటాకులు కొట్టడానికెళ్ళేవాడివి
రోజు రోజుకీ కొత్తకొత్త పనుల్ని చేసేవాడివి
నాగలి దున్నేవాడివి
మూటలు మోసేవాడివి
చేపలు పట్టేవాడివి
చేపల వలనల్లేవాడివి
చేపల బుట్టలల్నేవాడివి
నాన్నానువ్వు నాకెప్పటికీ
యుద్ధాలు చేసిన రాజులకంటే గొప్పోడివే నాన్నా...
కత్తి పదును తెలియడానికి
కత్తిని నూరి 
నీకు నువ్వే 
ఇతరుల గాయం చేయకుండా
దాని పదున్ని చేత్తో చూసేవాడివే
చాలా గమ్మత్తుగా ఉండిది నాన్నా...
రోజూ చేసేవాడివలా...రోజులో చాలాసార్లు చేసేవాడివలా...
రాజులైతే ఒకసారో రెండుసార్లూ యుద్ధం చేసి
కత్తి పదును చూస్తారేమో
నువ్వు మాత్రం
రోజూ కొబ్బరికాయలు కొట్టినప్పుడూ
రోజూ తాటాకుల కోసేటప్పుడూ
ఆ కత్తికి పదనెట్టి చూస్తుండాల్సిందేగా.
నాన్నా...నువ్వు ఒక తాటాకు చెట్టుమీదుండే
ఆ చుట్టూ ఉండే రెండుమూడు చెట్లకున్న ఆకులన్నీ కొట్టేవాడివి
కాసేపు భూమ్మీదే నిలబడలేకపోతున్నామిప్పుడు
నువ్వేంటి నాన్నా
తాడికి కాళ్ళు తన్నిబెట్టి కత్తిన స్వారీ తిప్పినట్లు
అక్కడే మాక్కావాల్సిన ముంజికాయల్ని కోసిచ్చేవాడివి
కాయకొట్టడంలోను, దాన్ని కిందున్నమాకు అందించడంలోను
నీకున్న లాఘవమేంటో నిన్నడిగి తెలుసుకోవాలనుంది నాన్నా
నాన్నా...
తెగుళ్ళుసోకి చచ్చిపోతూ
మందుపెట్టమని బతికించడానికి
కోనసీమలోనే కాదు, ఉభయగోదావరిలోని
కొబ్బరిచెట్లన్నీ నిన్నే పిలుస్తున్నాయి-
వాటినెలా పునర్జీవితమిచ్చేవాడివో చెప్పు నాన్నా

నాన్నా...
సాయంత్రం చేపల బుట్ట పట్టుకొని నీవెనకాలే వచ్చేవాణ్ణి
నువ్వు గబగబా నడుస్తుంటే
నువ్వు గమనించేవాడివో లేదో గానీ
ఆ రంగరాజుకోడు కాల్వంతా నీఅడుగుల్తో పరవశించేది
ఆ కాల్వలో ప్రవహించే నీరూ నీ స్పర్శతో పవిత్రమయ్యేది
ఆగట్టునుండే ముళ్లన్నీ నీ అడుగుల కింద మెత్తని పువ్వుల్లా మారిపోయేవి
నువ్వేమీ వాటిని గమనించేవాడివి కాదు
ఆ తెల్లని పువ్వుల బుగ్గలప్పుడప్పుడూ సిగ్గుతో ఎర్రబడేవి
చేదిపరిగలు, కొర్రమేనులు, కట్టిచేపలు, మీసం మెలేసే పెద్దరొయ్యలు...
విషం ముళ్ళతో గుచ్చాలనుకునే ఇంగిలాలు
నీ చేతుల్లోపడేసరికే దొందుల్లాగో, బొమ్మిడాల్లోగో మారిపోయేవి.
నాన్నా ఆ గుర్రపుడెక్కవెనకాలే కట్లపాములు, జెర్రికట్లు కాసుక్కుర్చున్నా
నీ ముందన్నీ బురదపాములయ్యేవి కదా...
నీ వల్లో పడీ బయటకరాక చేతిని కాటేయాలని చూసే గొరకలు, జెల్లలూ
ఇన్నిరకాలు... ఎన్నెన్ని రకాలు... ఇవన్నీ ఒక్కటీ కనిపించడం లేదు నాన్నా
అన్నీ చేల్లో మందులు కొట్టడం వల్ల హరించిపోయాయి.
నాన్నా...
వరదలు, తుఫానులు వస్తుంటే టీ.వీ.దగ్గరుండి భయపడుతున్న నేనేనా
నీ దగ్గర కేరింతలు కొడుతూ
నీ వల్లో పడిన శిలావతుల్ని, 
బొచ్చుల్ని ఏరింది నేనేనా అన్పిందు నాన్నా...
కొద్దిపాటి వర్షానికే మాకిప్పుడు గొడుగులు...
నాన్నా నీమీద వర్షం పడినా ఏమనిపించేది కాదా
గోనెసంచినో, ప్లాస్టిక్ కవర్నో తలకి చుట్టుకుని...
అవున్నాయో లేదో తెలియకుండానే
రంగరాజు వంతెన కాల్వ దగ్గర ఎగిసిపడే కెరటాల్లోకి
ఒక సవాలు విసిరినట్లు వలవిసిరేవాడివి?
నాన్నా నాకిప్పుడు నువ్వు వలేసి పట్టిన ఆ తాజా చేపని
అమ్మ ఆ వర్షంలోనే అమ్మేది కదా 
 దాన్నిప్పుడు వండి నీకే మనసారా తినిపించాలనుంది నాన్నా
నాన్నా... మనూర్నుండి వెళ్ళినా
మనింటికి రాకుండానే  పోటాపోటీగా వెళ్ళిపోయే ప్రభల తీర్థానికి
నన్ను చేతులు పట్టుకొని నువ్వుతీసుకెళ్ళినట్లే
నిన్నూ నాతో తీసుకెళ్లాలనుంది నాన్నా...
ఆ తీర్థంలో కూడా ప్రభలకడ్డం వచ్చే చెట్లెక్కి



ఆ కొమ్మల్ని నిన్నిప్పుడు కొట్టమనెవడంటాడో చూడాలనుంది నాన్నా...

1 కామెంట్‌:

vaithalika చెప్పారు...

సార్ మీ హృదయాన్ని మీ నాన్న ప్రేమను ఒకే త్రాసు లో వేసినంత బరువుగా ఉంది కవిత. ఎన్నో అనుభూతుల సమాహారాన్ని అల్లికగా అల్లి అందించిన కవిత.చాల తక్కువ మంది తండ్రి ప్రేమను గుర్తిస్తారు .మీరు ప్రతీ క్షణం అనుభవించారు కనుకే అంత బాగా ఆవిష్కరించారు.