-డా//దార్ల వెంకటేశ్వరరావు,
ప్రొఫెసరు, తెలుగు శాఖ,
సెంట్రల్
యూనివర్సిటి, హైదరాబాదు -500 046.
కత్తిపద్మారావుగారు నాకు ఫోను చేసి ఆయన షష్టిపూర్తి
సందర్భంగా మన దళితసాహితీ మిత్రులు ఒక సంచిక వేస్తున్నారనీ, సంపాదకవర్గ సభ్యులుగా
మీరు కూడా ఉండాలని, మీ అభిప్రాయం తెలుసుకుందామని ఫోను చేశానని అన్నారు. అలాగే ఆ
సందర్భంగా గుంటూరులో సభ జరుగుతుందనీ,
దానిలో మీరూ మాట్లాడాలనీ, అది ఏప్రిల్
నెలలో గానీ జూలై నెల్లో గానీ ఉంటుందనీ చెప్పారు. నేను దేనిగురించి మాట్లాడాలని
అడిగాను.
‘‘కత్తి పద్మారావుగారి సాహిత్యం, వ్యక్తిత్త్వం
గురించి’’
అన్నారు. ‘‘మనం కలిసి పనిచేద్దాం. నా ఆరోగ్యరీత్యా మీదగ్గరకు రాలేకపోతున్నాను.
మీరే ఒకసారి మన ఆఫీసుకి వస్తే ఎవరే టాపిక్ గురించి రాయాలో, ఎవరేమి మాట్లాడితే
బాగుంటుందో మీరే నిర్ణయిస్తే బాగుంటుంది’’ అన్నారు. కాసేపు మౌనంగా ఉండిపోయాను.
ఆయనతో ప్రత్యక్షంగా నాకున్న పరిచయం చాలా తక్కువ. కానీ, పరోక్షంగా ఆయన సుమారు రెండు
దశాబ్దాలుగాను, ప్రత్యక్షంగా ఒక దశాబ్ది కాలంగా తెలుసు. ‘తెలుసు’ అనేదానికి కూడా
అనేకపరిమితులుంటాయి.
దళిత సామాజిక, సాహిత్యోద్యమాలకు ఆయన చేసిన సేవ ఎంతో
విలువైంది. దళిత ఉద్యమకారుడిగా, రచయితగా, కవిగా, అంబేడ్కరిస్టుగా ఆయనకెంతో
పేరుంది. ఆయన్ని చూడ్డానికే ఎంతో మంది ఆయన సభలకు వెళతారు. చాలా మంది ప్రముఖ సాహితీవేత్తలు
ఆయన ప్రసంగాలకు ఉత్తేజితులమైయ్యామనీ, ఆయన పక్కన కూర్చొని సభలో మాట్లాడటంగానీ, ఆయన
రాసిన సాహిత్యం గురించిగానీ మాట్లాడటమనేది గానీ మరిచిపోలేని ఒక గొప్ప సంఘటనగా, ఒక అనుభూతిగా ప్రకటించిన
వాళ్ళను నేను ఏంతో మందిని గమనించాను.
అటువంటి కత్తిపద్మారావుగారి షష్ఠిపూర్తి సంచికకు
సంపాదకవర్గ సభ్యులుగా నా పేరు వేసుకోవడానికీ; నా అభిప్రాయం తెలుసుకోవడానికి
ఫోనుచేయడం నాకు కొంత ఆశ్చర్యానికీ, మరికొంత ఆనందానికీ గురైయ్యాను. అంతలోనే ఆయన
గురించి మాట్లాడాలని కూడా అన్నారు. అందుకే ఏమి మాట్లాడాలో నాకు వెంటనే తోచలేదు.
ఆయన ఎప్పుడు మాట్లాడినా అంతకు ముందునుండే బాగా పరిచయం ఉన్న వ్యక్తిలా మాట్లాడతారు.
సెంట్రల్ యూనివర్సిటీలో ఎం.ఏ., స్థాయిలో దళితసాహిత్యాన్ని ఒక పాఠ్యాంశంగా
పెట్టినందుకు, దళిత సాహిత్యాన్ని విస్తృతపరిచే రచనలు చేస్తున్నందుకూ నన్ను ఆయన
గుర్తుపట్టగలుగుతున్నారని ఆయన సంభాషణల్లో గమనించాను. నిజానికి ఆయనకి నేను ఫోను
చేయడం కంటే ఆయనే నాకు రెండుమూడు సార్లు ఫోను చేశారనడం వాస్తవం. పత్రికల్లో ఏదైనా మంచి
వ్యాసం రాశాననిపిస్తే ఆ స్పందనను ఒకోసారి ఫోను చేసి మరీ చెప్పేవారు.
ఆయనకు ఫోను చేస్తే ఏ మీటింగ్ లో ఉంటారో... గుర్తుపడతారో
లేదో అనిపించి ఆయనకు నేనెక్కువగా ఫోను చేసేవాడిని కాదు. కానీ, ఎప్పుడైనా ఫోను
చేస్తే చాలా ఆత్మీయంగా, వివరంగా మాట్లాడడం మాత్రం ఆయన మృదు స్వభావానికి
నిదర్శనమనిపిస్తుంది. సాధారణంగా నేను
ఎవరికైనా ఫోను చేసినప్పుడు వాళ్ళు ఒకటి, రెండుసార్లు రింగ్ అయినప్పుడు తీయకపోతే
మళ్ళీ వెంట వెంటనే రింగు చేయను. ఏదైనా
మీటింగ్ లో ఉన్నారో... మరో అర్జెంటు పనిలో ఉన్నారో అని ఊరుకుని తర్వాత చేద్దామనుకుంటాను.
అటువంటప్పుడు తర్వాత ఆయనే ఫోను చేసేవారు. ఆ ఫోను కట్ చేసి నేను చేస్తానని చెప్పినా
ఫర్లేదు. మాట్లాడుకుందామనేవారు.
కత్తిపద్మారావుగారి గురించి నాకేమితెలుసు?ఆయన గురించి నేనేమి రాయాలి? ఆయన గురించి
నేనేమి మాట్లాడాలి?తెలియనిదాని గురించి రాయలేను, మాట్లాడలేను. తెలిసిందాని దాచలేను.
***
కత్తిపద్మారావు గారు నాకు ముందుగా పత్రికల ద్వారానే తెలుసు.హైస్కూలు చదువుకొంటున్నప్పటి
నుండీ నాకు ప్రతిరోజూ గ్రంథాలయానికి వెళ్ళడమంటే ఇష్టం. ఈ ఇష్టం కలగడానికి మా
హైస్కూలులో కులానికి బ్రాహ్మణులైనా, మంచి సామాజిక స్పృహ ఉన్న ఉపాధ్యాయులే కారణం. సోషల్
టీచర్ ఆతుకూరిలక్ష్మణరావు, శ్రీకంఠంలక్ష్మణమూర్తి, డా.ద్వా.నా.శాస్త్రి
గార్లే దీనికి నాకెంతో ప్రేరణ.
నేను రోజూ ఆరు కిలోమీటర్లు స్కూలుకి నడిచి వెళ్తుంటే
దారిలో కనిపించినప్పుడల్లా ఆతుకూరి లక్ష్మణరావు గారు గానీ, శ్రీకంఠం లక్ష్మణమూర్తి
గారు గానీ వాళ్ళ సైకిలెక్కించుకొని నన్ను
కూడా తీసుకువెళ్తుండేవారు. అప్పటికే వాళ్ళమ్మాయిలు సైకిల్ పై ఉన్నా, నడిచొచ్చే
నన్ను చూసి, సైకిల్ ఆపి వాళ్ళమ్మాయిల్ని ముందు కూర్చోబెట్టుకొని, నన్ను వెనకాల
కూర్చోమనేవారు. ఆతుకూరి లక్ష్మణరావుగారు ఆ మాటా ఈ మాటా చెప్తూ స్కూలుకి
తీసుకెళ్ళేవారు. మధ్యలో రోడ్డు బాగుండకపోతే దాని గురించి కాసేపు మాట్లాడేవారు.
రోడ్డు బాగోలేదని మనం కూడా అప్పుడప్పుడూ అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలని అంటుండేవారు.
ఆవిషయాన్ని అవసరమైతే పత్రికలకు రాస్తుండేవారు. దాన్ని మర్నాడో, తర్వాతో మాకు
చూపించేవారు. మాష్టరేమైనా రాసారమోనని ఉత్తరాల శీర్షికను బాగా చూసేవాణ్ణి. ఆ
ఉత్తరాల్లో అప్పుడప్పుడూ కత్తిపద్మారావుగారి పేరు కూడా చదువుతుండేవాణ్ణి.
ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ ప్రధాన కార్యదర్శిగా ఆయన అనేక సమస్యలపై పత్రికలకు
ఉత్తరాలు రాస్తుండేవారు. అలా నాకు పత్రికల ఉత్తరాల్లోనే ఆయన పేరు మొట్టమొదటిసారిగా
చూశాను. కారంచేడు సంఘటన తర్వాతనే అంటే, 1986లో ఆంధ్రప్రదేశ్ దళితమహాసభ
ఆవిర్భవించింది. ( చూడు: దేవరపల్లి మస్తాన్ రావు, దళితదశాబ్దం, పుట: 95)
అవి నేను హైస్కూలు విడిచి కళాశాలలో ప్రవేశించిన
తొలిరోజులవి. అంటే, 1985ల తర్వాత మాత్రమే నాకు కత్తిపద్మారావుగారు పత్రికల ద్వారా
పరిచయం. ఆతర్వాత పత్రికల్లో, రేడియోలో, టీవీలో గమనిస్తుండేవాణ్ణి. అప్పటికే
దళితులపై కారంచేడు సంఘటన జరిగిపోయింది. కారంచేడు ప్రకాశం జిల్లాలో ఉంది. 1985
జూలై 16 వతేదీన కారంచేడు మాదిగల మంచినీటి చెరువులో కమ్మకులానికి చెందిన ఇద్దరు
యువకులు కుడితి నీళ్ళ బకెట్లు కడుగుతుంటే, దాన్ని ఒక దళితయువకుడు అభ్యంతరం
చెప్పడం, దానితో కమ్మయువకుడు గొడవకు దిగడంతో ప్రారంభమందీ సంఘటన. ఆ రాత్రే
కమ్మకులానికి చెందిన వాళ్ళు సామూహికంగా దళితులపై దాడి చేసి చంపేస్తే, అది జూలై 17న
వార్తలుగా రావడంతో కారంచేడు సంఘటన జూలై 17గా మారిపోయింది. ఆ సంఘటనలో అగ్రవర్ణానికి
చెందిన భూస్వామ్య దురహంకారులు ఎనిమిది మంది మాదిగలను చంపేసి, సుమారు అరవైమంది
దళితులను గాయపరిచారు. (చూడు: పుటలు: 2, 95, 120. దేవరపల్లి మస్తాన్ రావు, దళితదశాబ్దం,
లోకాయత ప్రచురణలు, పొన్నూరు, గుంటూరు జిల్లా, ప్రథమ ముద్రణ: 1997.) కారంచేడు సంఘటన
తర్వాతనే కత్తిపద్మారావు రాష్ర్టనాయకుడుగా ప్రాచుర్యం పొందారని చెప్పొచ్చు.
నేను కాలేజీలో ప్రవేశించే నాటికి బొజ్జా తారకం
కోనసీమలో వివిధ సభల్లో కారంచేడు గురించి మాట్లాడేవారు. ఆ సభల్లో పొలమూరి బాలకృష్ణ,
డి.బి.లోక్ మొదలైనవాళ్ళు పాల్గొనేవారు. ఆ సందర్భంలో కత్తి పద్మారావుగారి పేరు వాళ్ళనోటి నుండి
విన్నట్లు గుర్తొకొస్తుంది. నేను పదవతరగతి చదివేరోజుల్లో హాస్టలులో ఉన్నాను. ఆ
యేడాది హాస్టలు లీడరుగా ఎన్నికైయ్యాను. ఆరోజుల్లోన కోనసీమ ప్రాంతంలో డా.బి.ఆర్.
అంబేద్కర్ చైతన్యం ఎక్కువగా కనిపించేది. నేను అప్పటికే యెండ్లూరి చిన్నయ్యగారు
రాసిన అంబేద్కర్ చరిత్ర చదివాను. మా హాస్టలు మిత్రులతో మాట్లడాను. దానితో
డా.బి.ఆర్. అంబేద్కర్ జయంతి జరిపాలనుకున్నాం. మొదట్లో వార్డెన్ ఒప్పుకోలేదు. కానీ,
మా మిత్రులంతా పట్టుపట్టి జరపాలని పట్టుపట్టాం. ఆ సభకి అప్పటి మంత్రి మోకా విష్ణు
వరప్రసాదరావుగారు ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. వారితోపాటు నేను కూడా వేదికపై
కూర్చున్నాను. ఆ వేదికపై కూడా కత్తి పద్మారావుగారు గొప్ప ఉద్యమం చేస్తున్నారని
వక్తలు ప్రస్తావించినట్లు గుర్తు. నాకు అప్పటి నుండీ ఆయన గురించి బాగా
తెలుసుకోవాలనిపించేది.
తొలిసారిగా సెంట్రల్ యూనివర్సిటీలో
సెంట్రల్ యూనివర్సిటీలో
నేను ఎం.ఏ., చదువుకోవడానికి చేరిన తర్వాత మొట్టమొదటిసారిగా 1995లో కత్తిపద్మారావుగారిని
ప్రత్యక్షంగా చూశాను. అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ ( ఎ.ఎస్.ఏ)వారి ఆధ్వర్యంలో
జరిగిన సమావేశాలకు ఆయన రెండు మూడుసార్లు సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చారు. ఆ సభలు
ప్రధానంగా సాహిత్యానికి సంబంధించినవి. ఆయన పద్యాలు, శ్లోకాలు చదువుతుంటే ఒక ప్రవాహంలా
ఉంటుంది. ఆయన జాషువా పద్యాలు ఆయన నోటినుండి వింటే ఆ సాహిత్యాన్నంతా
చదవాలనిపిస్తుంది. ఆముక్తమాల్యదలో మాలదాసరి గురించి పద్యాన్ని చదివి దాన్ని ఆయన
వివరిస్తుంటే ఆ సాహిత్యంలో అంత సౌందర్యముందా అనిపిస్తుంది. ఆయన్ని దూరం నుండే
చూసేవాణ్ణి. ఆయనతో ఆటో గ్రాఫ్ తీసుకోవడానికి పోటీపడేవాళ్ళం.
ప్రెస్ క్లబ్బు కవిసమ్మేళనంలో...
హైదరాబాదులోని బషీర్
బాగ్ ప్రెస్ క్లబ్బులో 28జూలై1996 వతేదీన పెద్ద ఎత్తున దళిత రచనల ఆవిష్కరణలతో పాటు
కవి సమ్మేళనం కూడా నిర్వహించారు. దీనికి కత్తి పద్మారావుగారు అధ్యక్షత వహించారు. ఈ
సభ ప్రధానంగా దళితసాహిత్యానికి సంబంధించింది. ఇంకా లోతుగా చెప్పాలంటే
కత్తిపద్మారావు గారు రాసిన రచనల ఆవిష్కరణసభ. ఈసభలో దళితరాజ్యం పత్రిక సంపాదకుడు
దేవరపల్లిమస్తాన్ రావు, ప్రముఖకవులు ఎండ్లూరి సుధాకర్, శిఖామణి, అప్సర్, కలేకూరి
ప్రసాద్, పైడితెరేష్ బాబు తదితర సాహితీవేత్తలు ఎంతోమంది పాల్గొన్నారు. సెంట్రల్ యూనివర్సిటీ నుండి చాలా మంది
విద్యార్థులం కూడా పాల్గొన్నాం. కవితలు చదవాలని నాగప్పగారిసుందర్ రాజు,
జి.వి.రత్నాకర్ చెప్పడంతో నేను కూడా ఒక కవితను పట్టికెళ్ళి చదివాను. ఆ సమావేశంలో
అనుకోకుండా నేను మంద కృష్ణ మాదిగ సీటు ప్రక్కనే కూర్చున్నాను. నేను ‘మాదిగమ్యానిఫెస్టో’
అనే కవితను చదివాను. అది కూడా కత్తి పద్మారావుగారి అధ్యక్షతనే చదవడం నాకెంతగానో
సంతోషం అనిపించింది. నా కవిత చదివిన తర్వాత మాల మాదిగల్లో ఉండే వివక్షను కూడా
ప్రశ్నించాల్సిందేనని ఆయన ఆ సభలో ప్రకటించారు. కారణాలేమైనా గానీ ఆయన ఆధ్యర్యంలో
వెలువడిన పత్రిక ‘దళితరాజ్యం’ లో మాదిగ కవుల వివరాలను మాత్రం కొద్దిగానే
ప్రస్తావించారు. దీనిలో వివక్ష ఉందని తర్వాత నాగప్పగారి సుందర్ రాజు, నేనూ వివిధ
వ్యాసాల్లో విమర్శంచడం జరిగింది.
బహుజన కెరటాలు దశాబ్ది ఉత్సవాల్లో...
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాదులోని
పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో భాగంగా ఒక చర్చా
కార్యక్రమం జరిగింది. నిర్వాహకులు ఆ చర్చాకార్యక్రమానికి నన్ను అధ్యక్షత
వహించమన్నారు. చర్చలో కత్తిపద్మారావు, కంచె ఐలయ్య, బి.ఎస్.రాములు, జూపాక సుభద్ర
తదితరులు పాల్గొన్నారు. అది సుమారు నాలుగు గంటలపాటు జరిగింది. దానిలో నేను
కత్తిపద్మారావుగారిని పరిచయం చేస్తూ దశాబ్ది కాలంగా రాష్ర్టంలో జరుగుతున్న దళిత
ఉద్యమాలతో ప్రత్యక్ష సంబంధాలున్న కత్తిపద్మారావుగారు అదే కాలంలో జరుగుతున్న వర్గీకరణ ఉద్యమం గురించి ఆయన వైఖరి ఏమిటో దాన్ని
కూడా ఆయన గొంతు నుండే వినాలనుకుంటున్నానని ఆయన్ని ప్రసంగించమన్నాను. సభంతా
ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. దీనికి కత్తిపద్మారావుగారెలా
ప్రతిస్పందిస్తుంటారని అందరిలోను ఒకటే ఉత్కంఠ. నాకు మాత్రం అదెందుకో పెద్ద
ఉద్వేగపూరితమైన విషయమనిపించలేదు. పదిసంవత్సరాల దళిత, బహుజన ఉద్యమం ఎలా ఉండాలి? ఆ
ఉద్యమ నాయకులనేవాళ్ళెలా వ్యవహరించాలనే అంశాల్ని నిష్ఫక్షపాతంగా వివరించేందుకు ప్రయత్నించే
ఒక సమన్వయకర్తగానే ఆ అభిప్రాయన్ని వెల్లడించాలననిపించింది. కత్తిపద్మారావు
మాట్లాడుతూ వర్గీకరణోద్యమానికి మొట్టమొదట మద్ధతు పలికింది తానేననీ, దానికి
సంబంధించి కాగితాలపై సంతకాలు కూడా చేశామని ఆయనతో పాటు మరికొంతమంది పేర్లను
వివరించారు. కత్తిపద్మారావులాంటి గొప్పనాయకుడు, దార్శినికుడు మాదిగలు, దళిత
ఉపకులాలు కోరుకుంటున్న వర్గీరణను సమర్ధించారని మరోసారి ఆయన నోటిద్వారానే
ప్రజలందరికీ తెలియజేసినందుకు చాలా సంతోషమనిపించింది. ఆ సభ ఆయనలోని సామాజికబాధ్యతను
మరింతగా స్పష్టంగా గుర్తించడానికి వేదికగా మారిందనుకుంటున్నాను. ఆ సందర్భం నాకు
కలిగినందుకు నా మనసులో ఎక్కడో కొంచెం ఆనందంగానూ అనిపించింది.
కత్తిపద్మారావుగారు
గొంతు సహజంగా గంభీరంగా ఉంటుంది. ఆయన మాట్లాడిన తర్వాత ఒక మాదిరివ్యక్తి అయితే
వెంటనే ఏమిమాట్లాడాలో అర్థం కాని అయోమయంలో పడిపోవడం ఖాయం. ఆయన వాక్ప్రవాహం, వాదనా
పటిమా అలా సాగిపోతుంది. ఒక విధంగా చెప్పాలంటే ఆయన తన ప్రసంగంతో అందరినీ తన్మయీకరించుకుంటారు.
చాలా సేపు ఆ ప్రసంగప్రభావం నుండి బయట పడలేరు. టి.వి.ల్లో ఈ మధ్య ఆయన
జ్యోతిష్యంలోని మూఢత్వం, ఝాన్సీలక్ష్మీబాయిగా చరిత్రకారులు చెప్తున్న నిజమైన
చారిత్రక యోధురాలు ఝల్ కారీబాయి గురించీ, ప్రత్యేక తెలంగాణా ఉద్యమం మొదలైన
వాటిగురించి జరిగిన చర్చల్లో ఆయన విశ్వరూపం కనిపించింది. దళితాభ్యున్నతి కోసం ఆయన
తన జీవితాన్నెలా అంకితం చేసుకున్నారో అర్థమవుతుంది. శాస్ర్తీయమైన అంశాలపట్ల
ఆయనకున్న హేతువాద, శాస్ర్తీయదృక్పథం ప్రదర్శితమవుతుంది.
ఎన్నెలనవ్వు నవల వర్క్ షాఫులో...
University of
Hyderabad, Centre for the Study of Social Exclusion and Inclusive Policy వారు ది 24 ఫిబ్రవరి 2012 న ‘‘ ఎన్నెల నవ్వు’’ నవలపై Ennela Navvu: Exploring Dimensions of
Exclusion పేరుతో ఒకరోజు
వర్క్ షాష్ నిర్వహించారు. ‘బహుజనకెరటాలు’ మాసపత్రిక కూడా ఈ నిర్వహణలో
భాగస్వామిగా సహకరించింది. అందులో పనిచేసే ఫ్యాకల్టీ మెంబర్ డా. శ్రీపతి రాముడు
నన్ను ఆ వర్క్ షాష్ కి ఆహ్వానించారు. ఎన్నెల నవ్వు నవలపై మాట్లాడాలని
అన్నారు. ఆ సభలో కత్తి పద్మారావుగారు కీలకోపన్యాసం చేశారు. ఆ విధంగా మేము
ఒకవేదికపై ఒకే అంశంపై మాట్లాడే అవకాశం కలిగింది. ఆయన ప్రసంగాన్ని నేను, నా
ప్రసంగాన్ని ఆయన చివరి వరకూ వినగలిగాం. కత్తిపద్మారావుగారు ఈ సభలో ఒక పరిశోధన
పత్రాన్ని రాసుకొచ్చినట్లు యానాదుల జీవితాల్లోని అనేకపార్శ్వాలను రాసుకొచ్చారు.
గిరిజనులు ఈ సమాజానికి చేస్తున్న సేవను అద్భుతంగా ఆవిష్కరించారు. ఆ వర్క్ షాపు
అయిన తర్వాత ఆ రాత్రి ఆయనకు ఫోను చేసి మాట్లాడాను. సుమారు ఒక గంటసేపు నాతో ఫోనులో మాట్లాడారు. ఆయన
మాట్లాడిన తర్వాత నా అవగాహన మరింతగా పెరిగింది. ఆయనతో మాట్లాడిన తర్వాత
ఎన్నెలనవ్వు నవల గురించి నాకు మరింత అవగాహన కలిగిందని నా ‘బహుజనసాహిత్యదృక్పథం’
(2011: 55) పుస్తకంలో కూడా ఆయనకు కృతజ్ఞతలు
చెప్తూ రికార్డు చేశాను.
నాకున్న ఈ
కొద్దిపరిచయంతో ఆయన్ని ఒక అంచెనా వేయడం అంతసామాన్యమైన విషయం కాదు. కానీ, ఆయన
సాహిత్యాన్ని చదువుతుంటే దళితులకెంతగానో మార్గదర్శనం చేయగలిగారనిపిస్తుంది. ఆయన
రాసిన పరిశోధన, విమర్శ వ్యాసాలు కొన్ని డాక్టరేట్స్ ఇవ్వదగినస్థాయిలో ఉంటాయి.
ముఖ్యంగా దళితులు అనుసరించవలసిన ప్రత్యామ్నాయ సంస్కృతి గురించి ఆయన రాసిన ‘కులం-ప్రత్యామ్నాయ
సంస్కృతి’ ((1992) గ్రంథం డా. అంబేద్కర్ హృదయాన్ని ఆవిష్కరించేలా ఉంది. దీన్ని
ప్రతి దళితుడూ నిత్యపారాయణం చేయదగిన గ్రంథమని చెప్పినా ఆశ్చర్యపోనవసరం లేదు.
అలాగే, మాతృస్వామ్యం గురించి రాసిన ‘భారతీయ సంస్కృతిలో స్ర్తీ’ (1992), ‘పితృస్వామ్య
వ్యవస్థలో స్ర్తీ’ అనే గ్రంథాలు స్ర్తీమూర్తిమత్వాన్ని సైద్ధాంతికంగా మనముందునిలుపుతాయి.
దళిత. బహుజన దృక్పథంతో స్ర్తీవాదాన్ని అవగాహన చేసుకోవడానికీ, అన్వయించుకోవడానికీ ‘దళితుల చరిత్ర’ నాలుగు భాగాలు (1991,
1996, 1998, 2009), ‘దళిత సాహిత్య వాదం -జాషువ’(1995), పుస్తకాలు దారిచూపుతాయి. ఇవన్నీ ఇప్పటికే వివిధ
విశ్వవిద్యాలయాల్లో చరిత్ర, సామాజికశాస్ర్తం, సాహిత్యం విభాగాల్లో రిఫరెన్సు
పుస్తకాలుగా గౌరవింపబడుతున్నాయి. హేతువాదిగా, దళిత ఉద్యమకారుడిగా, పరిశోధకుడుగా,
గొప్పవక్తగా వివిధ పార్వ్వాల్లో కనిపించే కత్తిపద్మారావుగారు నేడు కవిత్వం ద్వారా
మానవతావాదిగా నిలిచారు. ఆయన సభలో పాల్గనాలని ఉన్నా, నా ఆరోగ్య కారణాల రీత్యా ఆ
సభల్లో పాల్గొనలేకపోవడం వల్ల ఒకగొప్ప చారిత్రకసంఘటనను ప్రత్యక్షంగా
వీక్షించలేకపోతున్నాను.
ఈ వ్యాసాన్ని కొంత
రాసిన తర్వాత పక్కన పట్టేశాను. ఒక రోజు విల్సన్ సుధాకర్ గారు ఫోను చేసి రోజూ
మాట్లాడుకున్నట్లే, వివిధ దళితసమస్యల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు,
కత్తిపద్మారావుగారి గురించి మీరేమి రాశారని అడిగారు. ‘‘ఆయన సాహిత్యాన్ని
చాలామంది రాస్తుంటారు కదండీ. కాబట్టి ఆయనతో నాకున్న పరిచయాన్ని రాయాలని మొదలు
పెట్టాను. కొంతరాసిన తర్వాత మానేశాను’’ అన్నాను. అయ్యో మీరు రాసేదో మంచి
మరోకోణం. ‘‘నిజానికి కత్తిపద్మారావుగారిలాంటి గొప్పనాయకుడు, దళితదార్శినికుడు,
మేధామి మనకు దొరకడం మన అదృష్టం. ఆయన గురించి మనదళితులు సరిగ్గా పట్టించుకోవాల్సిన
అవసరమెంతో ఉంది. మనం మాట్లాడుకున్నప్పుడల్లా, ఆయన వాక్చాతుర్యం, ఇంటులెక్చ్యవాలిటీ
గురించి చర్చించుకుంటాం. టీ.వీ. చానల్స్ లో ఆయన చేసే వాదనలు లక్షలాది మన దళిత
గొంతులకు ప్రాతినిధ్యమేకదా...దీన్ని మనలాంటి వాళ్ళు రాయాల్సిందే. మీరు రాయండి...’’
అంటూ మరింత ఉత్సాహ పరిచారు. నిజమే, తన ఉద్యోగాన్ని వదిలేసి, దళితుల కోసమే తన
జీవితాన్ని అంతటినీ త్యాగం చేసి, అంబేద్కర్ నీ, ఆయన రచనలనీ, దళితుల అభ్యున్నతికి
ఉపయోగపడే ప్రతి అంశాన్నీ అన్వేషించే క్రమంలో తన ఆరోగ్యాన్ని సహితం లెక్కచేయని
మహోన్నత వ్యక్తిత్వం
కత్తిపద్మారావుగారిది. ఈయనే మరో అగ్రకులంలో పుట్టి ఉంటే, ప్రపంచమేధావిగా
ప్రచారం చేసుకునేవాళ్ళు. అలా మన దళితులు ప్రచారం చేసుకోగలిగిన అవకాశాలు మనకీ ఉంటే
కత్తిపద్మారావుగారు, అలాంటి వాళ్ళెంతోమందిని మనం లోకానికి చూపించేవాళ్ళం.
ప్రతివ్యక్తిలోను కొన్ని అంశాలు మనకి వ్యక్తిగతంగా నచ్చకపోవచ్చు. కానీ,
వ్యవస్థమొత్తానికి చూసినప్పుడు ఆవ్యక్తి చేసిన మేలు మనం మరిచిపోకూడదు. అందుకనే మన
ఆలోచనలను సంకుచితం చేసుకోకుండా చీలికలతో ఒక్కొక్కర్నీ దూరం చేసుకోకుండా మన
మేధావుల్ని మనం గౌరవించుకోవాలి. వారి జీవితాలను, వారి రచనలను, వారి ఆదర్శాలను
ఆచరణలో పెట్టగలగడమే వారికి మనమిచ్చే నిజమైన గౌరవమనుకుంటున్నాను.
-0-
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి