అభినందన మందారాలు
-ఆచార్య.కె. కుసుమా రెడ్డి
అధ్యక్షులు, తెలుగుశాఖ
ఉస్మానియా విశ్వ విద్యాలయం
హైదరాబాదు.
చిరంజీవి
దార్ల వెంకటేశ్వరరావు రచించిన ‘‘వీచిక’’అనే గ్రంథం అత్యున్నత ప్రమాణాలతో
ఈ తరం పరిశోధకులకు మార్గ దర్శకంగా ఉంది. ఈ పుస్తకంలోని ఒక్కొక్క వ్యాసం ఒక్కొక్క దృక్పథంతో
సాహితీ విలువలను ఆవిష్కరిస్తున్నది. ఇందులోని వ్యాసాలన్నీ ఆణిముత్యాలవంటివి. ఈ వ్యాసాల్లోని
విశ్లేషణ, వివరణ, విమర్శ, వివేచన, పరిశీలన, అనుశీలన, సమీక్షా విధానాలు విశిష్టంగా ఉన్నాయి.
‘‘వీచిక’’లోని వ్యాసాలన్నీ వివిధ సందర్భాల్లో
రచింపబడినవి కావడం వల్ల వైవిధ్యం అనే లక్షణం ఈ పుస్తకానికి సహజంగానే అబ్బింది. విశ్లేషణలో
శాస్త్ర సమన్వయం, వివరణలో
సమగ్రత, విమర్శలో నిజాయితీ, వివేచనలో ఆలోచనాశక్తి, పరిశీలనలో నిశిత దృష్టి, అనుశీలనలో క్రమ వికాసం, సమీక్షలో స్పష్టత దార్ల ప్రత్యేక లక్షణాలని
ఈ వ్యాస సంకలనం వల్ల తెలుస్తుంది.
ఇక
దార్ల వెంకటేశ్వరరావు వ్యక్తిత్వాన్ని గురించి చెప్పాలంటే ఇతను పరిశోధనలో దిట్ట. భాషలో
పట్టు ఉన్న ఉపాధ్యాయుడని నా అభిప్రాయం. విమర్శ గ్రంథమైనా, సిద్ధాంత గ్రంథమైనా ఇతను సాహిత్య పరిమళంతో
గుబాళించే శైలితో రచించగలడు. భవిష్యత్తులో ఇతను మంచి విమర్శకుడుగా పేరు తెచ్చుకొనే
అవకాశముంది.
ఉత్తమ
విమర్శకుడి లక్షణాల్లో ముఖ్యమైంది నిర్మొహమాటంగా ఏ విషయాన్నైనా ధైర్యంగా చెప్పటం. ఈ
లక్షణం దార్ల వెంకటేశ్వరరావులో పుష్కలంగా ఉంది. ఆరుద్ర సాహిత్య యుగ విభజనలో కొంత వెలితి
కనిపిస్తుందనీ,
దాన్ని సమర్థించుకోవడానికి
ఆయన చాలా ప్రయత్నం చేశాడు కాని ఎర్రన యుగం ఆధునిక యుగం వంటి వాటిలో ఆయన సమర్థనలు అందరికీ
ఆమోద యోగ్యం అనుకోవటానికి వీల్లేదని దార్ల నిర్మొహమాటంగా చెప్పాడు.
"మనసున
మనసై' అనే నవలలో రచయిత్రి ప్రయోగించిన
పలుకుబడులను. జాతీయాలను ప్రస్తావిస్తూ వాటిని సహజత్వం కోసం ప్రయోగించినా అలాంటి వాటిని
ప్రయోగించటానికి సమయం సందర్భం కూడ ముఖ్యం కదా! అని ప్రశ్నించటంలోను దార్ల ధైర్యం స్పష్టమవుతుంది.
రచయిత
ఆత్మను, అతని రచనలోని ఆంతర్యాన్ని అర్థం
చేసుకొనే సహృదయత విమర్శకునికి ఉండాలి. అలాంటి సహృదయం కలిగిన వాడు దార్ల వెంకటేశ్వరరావు.
వ్యాకరణ దీపం కంటే విమర్శ దీపం చిన్నదనీ ఆ దీపాన్ని పెద్దది చేసే ప్రయత్నానికి తనవంతు
కృషి చేస్తానని వల్లంపాటి వారు చేసిన ప్రకటనలోని వినమ్రతను గుర్తించి విమర్శ దీపం కాంతివంతంగా
వెలగటానికి ఆయన చేసిన కృషిని వివరించిన దార్ల అభినందనీయుడు.
భాషలో
విలక్షణత దార్ల ప్రత్యేకత. స్పర్శించడం, కవిత్వీకరించటం, దళిత వేదన, తియ్యని బాధ వంటి పద ప్రయోగాలు దార్ల వెంకటేశ్వరరావు భాషా ప్రయోగ వైశిష్ట్యాన్ని
స్పష్టం చేస్తున్నాయి.
విమర్శకుల
అభిప్రాయాలను గౌరవించడంలోను పరిధులను గుర్తించడంలోను దార్ల నేర్పరని తెలుస్తుంది. ‘‘ముస్లిం స్త్రీవాద కవిత్వం అంటే
ముస్లిం స్త్రీలు రాసిందే అవుతుంద’’ న్న ప్రముఖ విమర్శకుడు ఎండ్లూరి సుధాకర్ గారి అభిప్రాయాన్ని
గౌరవించి, ముస్లిం స్త్రీల కవితా విశ్లేషణ
వరకే తన పరిధిని దార్ల నిర్ణయించుకొన్నాడు. ఇలాంటి వివేచన, విచక్షణ అతని సునిశిత బుద్ధికి నిదర్శనం.
సాహిత్య
వికాసానికి దోహదం చేసేవి ప్రక్రియలు. సాహితీ విలువలను పెంచేవీ ప్రక్రియలే. ఆధునిక యుగంలో
అత్యాధునికంగా అడుగుపెట్టిన సాహితీ ప్రక్రియ ‘‘నానీలు''. ద్వానా శాస్త్రి గారి నానీలను సమీక్షించటంలో
దార్ల పరిశీలనా పటిమ స్పష్టమవుతుంది. చమత్కార రచనా శిల్పం వెల్లడి అవుతుంది. ఛందో బందోబస్తులను
ఛట్ ఫట్‌మనిపించి, చమక్కులను, చమత్కారాలను, రస గుళికలను మెరిపించే కవిత్వాన్ని నానీలలో
పండించి ఆహా అనిపించేటట్లు రాయగలిగే ప్రయత్నం మాత్రం నానీలలో కనిపిస్తుందని దార్ల పేర్కొనడంలో
అతని శైలీ శిల్పం తెలుస్తుంది.
ప్రతి
రచయితా తాను చేపట్టిన ప్రక్రియకు గౌరవాన్ని తెచ్చే నైపుణ్యం కలిగి ఉంటాడని ఒక్కొక్కసారి
ఆ నైపుణ్యం కొరవడినా వస్తువుని బట్టి ఆ ప్రక్రియ ఆదరణకు పాత్రమవుతుందని, గోర్కి రాసిన ‘‘అమ్మ’’ నవలలో ఆ రెండూ
ఉన్నాయని చెప్పటంలో దార్ల సునిశిత పరిశీలనా దృష్టి స్పష్టమవుతుంది.
మొత్తం
మీద దార్ల వెంకటేశ్వరరావు ఈ వ్యాసాల్లో వివిధ ప్రక్రియలను తీసుకొని విమర్శ చేశాడు.
దీన్ని లోతుగా గమనిస్తే అది ఒక ప్రణాళికా బద్దంగా కనిపిస్తుంది. ఆ విమర్శ వ్యాసాల్లోని ప్రత్యేకతలను ఇలా విశ్లేషించవచ్చు.
1) సర్వ సాధారణంగా ప్రతి వ్యాసంలో ఒక విషయాన్ని ప్రతిపాదిస్తాడు.
ఆ ప్రతిపాదనకు అవసరమైన ఆధారాలను అన్వేషిస్తాడు. కేవలం దొరికిన ఆధారాలతోనే తాను ప్రతిపాదించే
అంశమే కరక్ట్ అనే ధోరణిలో కాకుండా, ఈ పద్ధతిలో కూడా ఆలోచించవచ్చనే విమర్శనాత్మక దృష్టి దార్ల వెంకటేశ్వరరావు
రాసిన వ్యాసాల్లో కనిపించే మౌలికాంశాల్లో ఒకటి.
2)
విమర్శలో అనువర్తన కత్తి మీద సాము లాంటిది. ప్రక్రియను అనుసరించి అనువర్తిత మార్గాలు
వేర్వేరుగా ఉంటాయి. ఈ వ్యాసాలన్నీ ఇంచు మించు అనువర్తిత విమర్శ పద్ధతిలోనే సాగాయి.
ఒక్కొక్క ప్రక్రియకు ఒక్కొక్క పద్ధతిని అనుసరించాడు.
3)
వ్యాసంలో ముందుగా తన పరిధిని స్పష్టంగా గుర్తిస్తాడు. దాన్ని వివరించటంలో స్పష్టంగా
వ్యవహరిస్తాడు.
4)
భారతీయ ఆలంకారికులు సహృదయతకు ఎక్కువ ప్రాధాన్యాన్నిచ్చారు. అనౌచిత్యాలను లేదా దోషాలను
పేర్కొంటూనే,
కవి/రచయిత ఆత్మను
దర్శించి, దాన్ని పాఠకులకు చూపటంలో విమర్శకుని
సహృదయత వెల్లడవుతుంది. సహృదయ విమర్శకుడుగా దార్ల ఈ వ్యాసాల్లో కనిపిస్తాడు.
5)
నవలపై రెండు వ్యాసాలు ఉన్నాయి. ఒకటి తెలుగు నవల. మరొకటి తెలుగులోకి అనువాదమైన నవల.
విమర్శకుడు మూల రచనను విమర్శించడంలో అనుసరించిన పద్ధతినే తీసుకుంటే అనువాద రచనకు కుదరదు.
మూల రచనను కూడా చూసి, రెండింటినీ
పోల్చి రచయిత ఆత్మను ఆవిష్కరించగలగటం ఉత్తమ విమర్శగా పేర్కొనవచ్చు.
6)
పరిశోధనను పింగళి లక్ష్మీకాంతం గారి పరిశోధనతో అనువర్తించి, సమకాలీకులైన, రాబోయే పరిశోధక విద్యార్థులకు మార్గ
దర్శనం చేసే పద్ధతి కనిపిస్తుంది.
7)
తన విశ్లేషణలో వస్తు, రూపాల్ని
సమన్వయిస్తున్నట్లు కనిపించినా, సామాజిక, సాంస్కృతిక
అంశాల పైనే అధికంగా దృష్టిని కేంద్రీకరించేలా చేశాడు.
8)
నిర్ణయాలను ప్రకటించేటప్పుడు సమన్వయాన్ని చేసి, సంయమనంతో వ్యవహరించడం ఒక మంచి లక్షణం.
అలా
రెండు భాషల్లోని రచనలను పరిశీలించడం కుదరనప్పుడు, ఆ పరిధిని నిర్ణయించుకొని విమర్శ చేయాలి.
కనుక, ఇవన్నీ విమర్శలో ఎదురయ్యే సమస్యలు.
వీటిని దార్ల సునిశితమైన పరిశీలనతో విమర్శ చేశాడు. ఇలా రెండు నవలలను ఎన్నుకోవడంలోనే
విమర్శకుడిలో విలక్షణత, ప్రత్యేకతలు స్పష్టమవుతున్నాయి.
9)
ప్రాంతీయతలో విశ్వజనీనతను చూడగల విశాల దృక్పథం దార్లలో కనిపించే మరో ప్రత్యేకత. వెనుక
బాటుతనం అన్ని చోట్లా ఉంటుందని దానిపై పాలకులు దృష్టి సారించాలని ఆయన చేసిన సూచనలో
సర్వమానవ సౌభ్రాతృత్వం అవగతమవుతుంది.
మొత్తం మీద‘‘సాహిత్యం’’ హితంతో కూడిందనే నిర్వచనాన్ని
సార్థకం చేస్తూ విమర్శ రచనలోనూ దాన్ని పాటించిన దార్ల వెంకటేశ్వరరావు అభినందనీయుడు.
ఉత్తమ విలువలతో రచింపబడిన ‘‘వీచిక’’సాహిత్య లోకంలో అత్యుత్తమంగా
ఆదరణకు పాత్రమవుతుందని భావిస్తున్నాను.
- ప్రొ.కె. కుసుమా రెడ్డి
30-07-2008
హైదరాబాదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి