"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

20 October, 2014

సర్వమానవ సమానత్వ పరిమళం .....కువెంపు సాహిత్యం

ప్రముఖ కన్నడ రచయిత, కవి, అధ్యాపకుడు, జ్ఞానపీఠ్‌ పురస్కార గ్రహీత `కువెంపు'కి భారతీయ సాహిత్యంలో ఒక ప్రత్యేకస్థానముంది. కర్ణాటక రాష్ర్ట గీతమైన `జయ భారత జననియ తనుజతే' ను ఆయనే రాశారు. జ్ఞానపీఠ్‌ పురస్కార గ్రహీత కువెంపు (కుప్పళ్ళి వెంకటయ్యగౌడ పుట్టప్ప) సాహిత్యాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొని రావడంలో భాగంగా ఆయన రచనలపై వివిధ విశ్వవిద్యాలయాల్లో జాతీయ సదస్సులు నిర్వహిస్తున్నారు. ఆయన సాహిత్యాన్ని తెలుగుతో సహా వివిధ భారతీయ భాషల్లోకి అనువదిస్తున్నారు. ఈ నెల (అక్టోబర్‌)18, 19 తేదీల్లో హైదరాబాదులోని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో కువెంపు సాహిత్యంపై సదస్సు ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆయన జీవితాన్ని, సాహిత్య కృషిని గుర్తుచేసుకోవడంలో భాగమే ఈ వ్యాసం. 


కన్నడ సాహిత్యంతో పరిచయం ఉన్నవాళ్ళకు `కువెంపు' పేరు తెలియకుండా ఉండదు. ఆయన పూర్తిపేరు కుప్పళ్ళి వెంకటయ్యగౌడ పుట్టప్ప అయినప్పటికీ `కువెంపు' కలంపేరుతోనే ప్రసిద్ధి చెందారు. ప్రముఖ కన్నడ రచయిత, కవి, అధ్యాపకుడు, జ్ఞానపీఠ్‌ పురస్కార గ్రహీత `కువెంపు'కి భారతీయ సాహిత్యంలో ఒక ప్రత్యేకస్థానముంది. తెలుగులో త్రిపురనేని రామస్వామి చౌదరి రాసిన `శంబుక వధ' నాటకం హేతువాదదృష్టి కలిగి ఉంటే, `కువెంపు' `శూద్ర తపస్వి' నాటిక మానవత్వాన్ని తట్టిలేపేలా ఉంటుంది. కువెంపు రాసిన `రామాయణం' (శ్రీ రామాయణ దర్శనం-1949,1957) కూడా వాల్మీకి రామాయణం కంటే భిన్నంగా ఉంటుంది. వాల్మీకి రామాయణంలో కేవలం సీత మాత్రమే అగ్ని ప్రవేశం చేసినట్లుంటే, కువెంపు రామాయణంలో శ్రీరాముడు కూడా అగ్నిప్రవేశం చేసినట్లు వర్ణించడం ఒక విశేషం. హేతువాద దృష్టి కనిపిస్తూనే, దాన్ని మించిన సర్వమానవ సమానత్వకాంక్ష ప్రతిపాత్రలోనూ వ్యక్తం కావడం ఆయన సాహిత్యంలో కనిపిస్తుంది. కర్ణాటక రాష్ర్ట గీతమైన `జయ భారత జననియ తనుజతే' ను ఆయనే రాశారు. 


1904 డిసెంబరు 29 న సీతమ్మ, వెంకటప్పగౌడ దంపతులకు కర్ణాటకలోని కొప్ప తాలూక, చికమగులూర్‌ జిల్లా హిరెకొడిగె అనే కుగ్రామంలో కువెంపు జన్మించారు. తన 12 యేండ్ల చిన్న వయసులోనే తండ్రి చనిపోయాడు. చిన్ననాటి నుండీ కన్నడ, ఆంగ్లభాషల్లో చదువుకున్న కువెంపు 1929లో మైసూరులోని మహారాజా కళాశాలలో కన్నడ భాషలో అధ్యాపకుడిగా చేరారు. తర్వాత అదే కళాశాలకు 1955లో ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. 1956 మైసూరు విశ్వవిద్యాలయానికి వైస్‌ ఛాన్సలర్‌గా పనిచేశారు. 1994 నవంబర్‌ 11 ఆయన మరణించారు.కువెంపు- మాతృభాషలో విద్యాబోధన అవసరాన్ని గుర్తించి మైసూర్‌ విశ్వవిద్యాలయంలో కన్నడ అధ్యయన సంస్థ (కన్నడ అధ్యయనాల సంస్థ)ను స్థాపించారు. తర్వాత కాలంలో దానికి `కువెంపు ఇనిస్టిట్యూట్‌ అఫ్‌ కన్నడా స్టడీస్‌' అనే పేరు పెట్టారు. బేసిక్‌ సైన్సెస్‌ అండ్‌ లాంగ్వేజెస్‌ అధ్యయనానికి దారిచూపిన విద్యావేత్తగా ఖ్యాతిగాంచారు. కర్ణాటకలోని షిమోగా జిల్లాలో కువెంపు పేరుతో 1987లో ఒక నూతన విశ్వవిద్యాలయం స్థాపించడం ఆయన కృషిని గుర్తించడంగానే భావించవచ్చు. 


అధ్యాపకుడిగా, విద్యావేత్తగా, పరిపాలనా దక్షుడిగా బహుముఖసేవ …లందించినప్పటికీ ఆయన చేసిన సాహిత్య సేవ ఆయన్ని చిరస్మరణీయుణ్ణి చేస్తుంది. ఆయనకు సమాజం పట్ల ఉన్న దృక్పథాన్ని, ఆయన తాత్తి్వక ఆలోచనను పట్టిస్తుంది. కువెంపు తన సాహిత్య రచనను మొదట ఆంగ్ల భాషలో ఆ్ఛజ్ఛీట*ట ఠట్ఛ అనే పద్య సంకలనంతో ప్రారంభించినా తరువాత అత్యధికంగా కన్నడ భాషలోనే కొనసాగించారు. ఆయన కన్నడంలో వివిధ పద్యకావ్యాలను, నాటికలను రాశారు. కొలలు (1930), పాంచజన్య (1936), నవిలు (1937), కిందరిజోగి మట్టు ఇతర కవనగళు (1938), కొగిలె మట్టు సోవియట్‌ రష్యా (1944), శూద్ర తపస్వి (1946), కావ్య విహార (1946), కింకిణి (1946), అగ్నిహంస (1946), ప్రేమ కాశ్మీర (1946), చంద్రమంచకే బా చకోరి (1954), ఇక్షు గంగోత్రి (1957) మొదలైనవాటిని ప్రసిద్ధాలుగా కన్నడ సాహితీవేత్తలు భావిస్తుంటారు. ఆయన రాసిన నాటకాల్లో బిరుగాలి (1930), మహారాత్రి (1931), స్మశాన కురుక్షేత్రం (1931), జలగార (1931), రక్తాక్షి (1932), బెరల్గే కోరల్‌ (1947) మొదలైనవాటిని ప్రముఖంగా పేర్కొంటారు. ఆయన కథాసంకలనాల్లో మలేనదిన చిత్రగళు (1933), సన్యాసి మట్టు ఇతరే కతేగళు (1937), నన్న దేవరు మట్టు ఇతర కతేగళు (1940) పేర్కొనదగినవి. అత్మశ్రీగగి నిరంకుశమతిగలగి (1944), కావ్యవిహార (1946), తపోనందన (1951), విభూతి పూజె (1953), ద్రౌపదీయ శ్రీముడి (1960), విచార క్రాంతిగే ఆహ్వాన (1976) పేరుతో ప్రచురించిన గ్రంథాలు ఆయనలో గల సాహిత్య విమర్శ దృక్పథాన్ని తెలియజేస్తాయి. కానూరు హెగ్గదటి (1936), మాలెగలల్లి మదుమగలు (1967) పేరుతో నవలల్ని కూడా రాశారు. ఆయన చేసిన కృషికి గాను భారత, కర్ణాటక ప్రభుత్వాలు సాహిత్య అకాడెమీ పురస్కారం1955, జ్ఞానపీఠ్‌ పురస్కారం- 1967, పంపా పురస్కారం - 1988, కర్ణాటక రత్న- 1992, పద్మ భూషణ్‌ (2005), పద్మ విభూషణ్‌-1989 లతో సత్కరించాయి. ఇదంతా ఆయన సాహిత్య కృషిని పరిచయం చేసుకోవ డానికి ఉపయోగపడొచ్చు. కానీ ఆయన రాసిన ఏదైనా ఒక రచనను వివరించుకుంటేనే ఆయన సాహిత్య దృక్పథం తెలిసే అవకాశం ఉంటుంది. 


అందువల్ల ఆయన రాసిన `శూద్ర తపస్వి' పద్య నాటికను పరిచయాత్మకంగా విశ్లేషించే ప్రయత్నం చేస్తాను. `కువెంపు' కన్నడంలో రాసిన పద్యనాటిక `శూద్ర తపస్వి' (1944)ని శంకరగంటి రంగాచార్యులు తెలుగులో అనువదించారు. అది ఆగస్టు,1985 భారతి మాసపత్రికలో ప్రచురితమైంది. శంబుకాశ్రమ ద్వారం దగ్గర ఒక పెద్ద వృక్షం ఉంటుంది. హఠాత్తుగా పెనుగాలి వీస్తుంది. పక్షలు అరుస్తుంటాయి. జంతువులన్నీ అటూ ఇటూ పరుగుపెడుతుంటాయి. ఎక్కడనుండో ఆర్తధ్వనులు వినిపిస్తుంటాయి. ప్రశాంతమైన ఆ వనప్రాంతమంతా చిందరవందరగా మారిపోతుంది- ఇలా నాటకం ప్రారంభమవుతుంది. ఆ ఆశ్రమంలో జరక్కూడనిదేదో జరుగుతోందని ఆ దృశ్యం సూచిస్తుంది. నాటకంలో సాధారణంగా నాందీ గీతంలో ప్రార్థనతో పాటు నాటకంలో జరగబోయేదాని సూచ్యార్థాన్ని వర్ణిస్తుంటారు. అది ఈ దృశ్యవర్ణన ద్వారా ఆ ఆశ్రమంలో సంభవించబోయేదేమిటో సూచించాడు కవి. నాటక ప్రదర్శనలో ఈ దృశ్యం చాలా బాగుంటుంది. వృక్షాన్ని మానవరూపంలో వర్ణించి, ఆ ఆశ్రమాన్ని ఆ వృక్షం కాపాడుతున్నట్లు, ఆ ఆశ్రమం దగ్గరకు మృత్యువు రావడం వల్లనే వాతావరణమంతా బీభత్సంగా మారిపోయిందని పాఠకుడు గ్రహిస్తాడు. మృత్యువుని కూడా మానవీకరించారు కవి. వృక్షాన్ని, మృత్యువునీ ్ఛటటౌజీజజీఛ్చి్టజీౌ చేయడం కవి భావుకతకు నిదర్శనం. మొదటి దృశ్యంలో భైరవుడు (వృక్షం రూపంలో ఆశ్రమాన్ని రక్షించే రక్షకుడు) కీ, మృత్యువుకీ దీర్ఘమైన సంభాషణ జరుగుతుంది. శంబుక మహర్షికి అధర్మాన్ని తలపెట్టి, ఆశ్రమంలో ఒకడు ప్రవేశించాడనీ, అందుకే తాను వచ్చాననీ మృత్యువు వివరిస్తాడు. రెండవ దృశ్యంలో శ్రీరాముడు నివాసం ఉండే ఉద్యానవనం దగ్గర్లో, ఒక బ్రాహ్మణుడు తన పుత్రుడు చనిపోయాడని ఏడుస్తుంటాడు. శూద్రుడైన శంబుకుని తపస్సువల్లనే తన పసివాడు చనిపోయాడనేది అతని ఆరోపణ. 


ఈ రాజ్యాన్ని రామరాజ్యమంటారనీ, కానీ అధర్మంగా తన కుమారుడు చనిపోయాడనీ నిందిస్తూ, తాను కూడా ఈ రాజభవనం దగ్గరే చనిపోతాననీ, అప్పుడు శ్రీరామునికి బ్రహ్మహత్యా దోషం సంక్రమిస్తుందనీ శపిస్తుంటాడు. ఆ ఏడుపు విని శ్రీరాముడు, ఆ వృద్ధబ్రాహ్మణుని దగ్గరకు వస్తాడు. శ్రీరాముణ్ణి అనేకవిధాలుగా స్తుతించి శిష్టరక్షణ, దుష్టశిక్షణా చేస్తే తనకుమారుడు బతికి వస్తాడని ప్రార్థిస్తాడు. మూడవ దృశ్యంలో- శంబుకాశ్రమానికి చేరుకున్న శ్రీరాముడు ఆ ప్రశాంతమైన పరిసరాలను చూసి ఆనందిస్తాడు. శూద్రడు తపస్సు చేయడం తప్పుకాదనీ, అయినప్పటికీ తమరు వేదమూర్తులు, శాస్త్రానుసారులు కనుక, తమ అభీష్ఠానుసారంగానే ధర్మాన్ని రక్షిస్తానని హామీ ఇస్తాడు శ్రీరాముడు. ఆశ్రమంలో శ్రీరాముడికి మాత్రమే కనిపించిన మృత్యువుతో మాట్లాడతాడు. ధర్మాన్ని కాపాడ్డానికే వచ్చానని మృత్యువు చెప్తుంది. అక్కడున్న శంబుకుణ్ణి చూసి శ్రీరాముడు- తన విల్లుని ఎక్కుపెట్టేనెపంతో నమస్కరిస్తాడు. బ్రాహ్మణుని కోరిక మేరకు బ్రహ్మాస్త్రాన్ని సంధించి `అధర్మ ద్రోహిని దగ్ధం చేయి' అని బాణాన్ని వదులుతాడు. ఆ బాణం తపస్సు చేసుకుంటున్న శంబుకుని దగ్గరకు వెళుతుంది. దాన్నే మృత్యువుకూడా అనుసరిస్తుంది. విచిత్రంగా- బాణం, మృత్యువు రెండూ శంబుకుడికి నమస్కరించి వెనక్కి తిరిగి వస్తుంటాయి. ఆ దృశ్యాన్ని చూసి శ్రీరాముడు, కారణమేమిటని బ్రాహ్మణుణ్ణి అడుగుతాడు. శూద్రుని తపః ఫలం వల్ల బ్రహ్మాస్త్రం కూడా నిష్ఫలమైపోయిందని బ్రాహ్మణుడు అంగీకరిస్తాడు. బ్రహ్మాస్త్రం మాత్రం నిష్ఫలం కాదనీ, అది అధర్మపరుల్ని నాశనం చేస్తుందనీ శ్రీరాముడు వెల్లడిస్తాడు. 


దాంతో ఆ బ్రాహ్మణుడు భయపడి పూజ్యనీయుడైన శంబుక మహర్షిని అవజ్ఞ చేసానని, తనని రక్షించమనీ శ్రీరాముణ్ణి వేడుకుంటాడు. ఉత్తమ క్రియలకు, ఉత్తమ హృదయానికి కేవలం శాస్త్రాదేశాలు సరిపోవు. యుక్తాయుక్త వివేచన లేకపోతే శాస్త్రవిజ్ఞానం కూడా హానిచేస్తుందని గ్రహించమని బోధిస్తాడు శ్రీరాముడు. బ్రాహ్మణుడు శంబుక మహర్షికి సాష్టాంగ దండప్రమాణం చేస్తాడు. పూలవాన కురుస్తుంది. పిల్లవాడు బతికి వస్తాడు. శ్రీరాముడు ఆ బాలుణ్ణి ఎత్తుకుని ముద్దాడి, తపస్సులో నిమగ్నమై ఉన్న శంబూకుణ్ణి చూపించి మొక్కమంటాడు. ఆ బ్రాహ్మణబాలుడితో పాటు బ్రాహ్మణుడు కూడా శంబుకమహర్షిని మొక్కుతారు. శంబుకుడు అందర్నీ ఆశీర్వదించడంతో నాటకం ముగుస్తుంది.కువెంపు- నాటకంలో శంబుకమహర్షి పాత్ర కేంద్రంగానే రచనంతా నడుస్తుంది. కానీ, నాటకంలో శంబుకునికి ఒక్క సంభాషణ కూడా లేకుండా దాన్ని కొనసాగించడం నాటకరచనలో ఒకవిశేషం. నాటకంలో శ్రీరాముడు ధర్మాన్ని కాపాడే రాజుగానే చిత్రితమ య్యాడు. నాటకం చదువుతున్న పాఠకుడికి ఆద్యంతం ఆ పాత్రలు కళ్లెదుటే కదులుతున్నట్లుంటాయి. ఆశ్రమాన్ని రక్షిస్తున్న వృక్షం `భైరవుడు'గా మారడం, ఆశ్రమంలోకి ప్రవేశించిన మృత్యువుతో సంభాషించడం వంటివి పాఠకునికి మససులో చక్కని దృశ్యాల్ని ఆవిష్కరిస్తాయి. వృక్షానికీ, మృత్యువుకీ మానవరూప మివ్వడం ప్రదర్శన యోగ్యంగా ఉండే చక్కని ప్రయోగం. అలాగే చివరిలో శంబుకమహర్షిని పొదలన్నీ చుట్టుముట్టడం వంటివి, ఆ పొదల్లో నుండి శంబుకుని హస్తాలు మాత్రమే ఆశీస్సులు అందించడం వంటివన్నీ నేడు చలనచిత్రాల్లో గ్రాఫిక్‌‌స లాంటి అనుభూతిని కలిగిస్తుంటాయి. 


తెలుగులో హేతువాదరచయితగా పేరుప్రఖ్యాతులు పొందిన త్రిపురనేని రామస్వామచౌదరి `శంబుకవధ' నాటకాన్ని 1922లో ప్రచురించారు. ఆర్యులతో పోరాడి ఓడినవాళ్ళు ద్రావిడులనీ, శంబుకుడు ద్రావిడుడనీ వర్ణించారు. శంబుకుడు తపస్సు చేస్తూ శిష్యగణాన్ని ఏర్పరుచుకొని మతబోధ చేస్తూ హిందూమతం పట్ల వ్యతిరేకతను పెంపొందిస్తున్నాడని బ్రాహ్మణ వర్గం ఆరోపణ. ఆ ఆరోపణను రుజువుచేయడానికి అశ్వనీదేవతలతో మాట్లాడి బ్రాహ్మణ బాలుణ్ణి తాత్కాలికంగా చనిపోయినట్లు ఆ రాజ్యానికి రాజైన శ్రీరాముణ్ణి నమ్మిస్తారు. అలా నమ్మించడానికి బ్రాహ్మణులు నారదుడు, వసిష్ఠుడు ఒక ప్రణాళిక ప్రకారం శ్రీరాముణ్ణి ప్రేరేపిస్తారు. శ్రీరాముడు స్వయంగా శంబుకుని చిదానందాశ్రమానికి వెళ్ళి ఆ ప్రశాంత వాతావరణాన్ని, శిష్యగణాన్ని చూసి ఆనందపరవశుడవుతాడు. తర్వాత శంబుకుడితో మాట్లాడతాడు. స్మృతుల ప్రకారం శూద్రులు తపస్సు చేయకూడదని చెప్పడానికి వచ్చిన శ్రీరాముడికి, శంబుకుడు కాలానుగుణంగా అనేక స్మృతులు వచ్చిన విషయాన్ని విశదీకరిస్తాడు. శ్రీరాముడు ఆ వాదనకు సంతోషించినా, తన నిర్ణయాన్ని ప్రకటించకుండా అందరితోను ఆలోచిస్తానంటాడు. ఈలోగా తన కులగురువు వసిష్ఠుడు వచ్చి బ్రాహ్మణ- క్షత్రియవర్ణాల వారి ఆధిక్యత నిలబడాలంటే, స్మృతుల్ని రాజు కాపాడవలసిందేనంటాడు. మనసు అంగీకరించకపోయినా శ్రీరాముడితో- బలవంతంగా చిన్నపిల్లవాడిని తీసుకెళ్ళి చేతికి ఖడ్గాన్నిచ్చినట్లు- శంబుకుణ్ణి చంపిస్తాడు.


నాటకంలో పద్యాలు చాలా బాగున్నాయి. జాతి, వృత్తపద్యాలు సందర్భానుగుణంగా రసోచితంగా వర్ణించారు త్రిపురనేని. నాటకం చదువుతున్న పాఠకుడికి శ్రీరాముడొక అవతారపురుషుడుగా కాకుండా రాజ్యాధికారాన్ని నిర్వహించే రాజుగానే కనిపిస్తాడు. అలాంటి రాజుని బ్రాహ్మణులు తమ శాస్త్రపాండిత్యంతో అవతారపురుషుణ్ణి చేశారనే అవగాహన కలుగుతుంది. శంబుకుణ్ణి చంపితేనే అలా అవతారపురు„ షుడుగా పిలుపించుకొనేలా రుషులు చేయగలరని ఒక సందర్భంలో వసిష్ఠుడు చెప్తాడు. బహుశా ఆ బలహీనత వల్లనే శ్రీరాముడు తనకు ఇష్టం లేకపోయినా శంబుకుణ్ణి వధించాడని నాటకం చదివేవారికి అనిపిస్తుంది. శ్రీరాముడికి అవతారపురుషు డిగా ప్రఖ్యాతి పొందాలనే తపన ఉండబట్టే, వాల్మీకి కంటే ముందే హనుమంతుడు రామాయణాన్ని రాసినా దానిలో శ్రీరాముణ్ణి సామాన్యమానవుడిగా వర్ణించడం వల్ల ఆ కావ్యాన్ని ప్రచారం చేయించకుండా సముద్రం లో కలిపేసినట్లు నాటకంలో వివరించారు కవి. త్రిపురనేని ఆర్య-ద్రావిడ సిద్ధాంతాన్ని వివరించడానికి, శూద్రులకు బ్రాహ్మణ వర్ణం చేసిన కుట్రలను హేతుబద్ధంగా వివరించడానికి ఈ నాటకాన్ని రాశారనే అభిప్రాయం కలుగుతుంది. 


మూలంలో వాల్మీకి వర్ణాశ్రమధర్మరక్షణలో భాగంగా శంబుకుని శిరస్సు ఖండించినట్లు వర్ణించాడు. త్రిపురనేని తన నాటకంలో కూడా నాటకానుగుణంగా కొన్ని మార్పులు చేసినప్పటికీ శంబుకుణ్ణి శ్రీరాముడు వధించినట్లే వర్ణించారు. కువెంపు నాటకంలో శంబుకవధ జరగలేదు. కువెంపు ప్రధానమైన ఇతివృత్తాన్నెందుకలా మార్పు చేశారనిపిస్తుంది. చారిత్రకేతివృత్తాన్ని అలా మార్పు చేయడం సమం జసమేనా అనికూడా అనిపిస్తుంది. పురాణేతిహాసాల్ని కావ్యాలు, నాటకాలుగా రాసేట ప్పుడు కొన్ని మార్పులు చేయడం సహజంగానే జరుగు తుంది. ఈ మార్పు చేయడం అనేది రచయిత దృక్పథాన్ని బట్టి ఉంటుంది. వీటిలో కువెంపు రాసిన `శూద్రతపస్వి' పాఠకుల్ని/ ప్రేక్షకుల్ని రసపిపాసుల్ని చేస్తూనే మానవత్వ పరిమళాల్ని గుబాళించేటట్లు చేస్తుంది. మనుషుల పట్ల శుత్రత్వం పోయి మానవులంతా కలిసి మెలసి ఉండాలనే సోదరభావాన్ని పెంపొందిస్తుంది. రాజు వివేకవంతుడైతే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటారనే ప్రబోధం కలుగుతుంది. శిక్షించడం కంటే మనిషిలో పరివర్తన తీసుకురావడానికి క్షమాగుణమనేది గొప్పఆయుధగా పనిచేస్తుందని నిరూపించినట్లనిపిస్తుంది. కులాలనేవన్నీ కాలానుగుణంగా శ్రమవిభజన ఫలితంగా వచ్చినా, అవి కాలానుగుణంగా నశించకతప్పదని, మానవత్వమే నిలుస్తుందనే సందేశాన్నిస్తున్నట్లనిపిస్తుంది.

No comments: